శ్రీ మద్భగవద్గీత - 9
నాల్గవ అధ్యాయము
జ్ఞానయోగము
అపానే జుహ్వతి ప్రాణం
ప్రాణే పానం తధాపరే ప్రాణా పాన గతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణా --29 వ శ్లోకం
రెడ్లం రాజగోపాలరావు
అపానే జుహ్వతి ప్రాణం
ప్రాణే పానం తధాపరే ప్రాణా పాన గతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణా --29 వ శ్లోకం
భారతీయుడిగా పుట్టినందుకు , భారతీయ సంస్కృతిలో జీవిస్తున్నందులకు మనమంతా ఆ తల్లికి కృతజ్ఞులమై ఉందాము.ఈ శ్లోకానికి అర్థాన్ని చెప్పి పూర్ణత్వాన్నివ్వగలిగిన వాడు యోగాచార్యుడైన శ్రీ కృష్ణ పరమాత్మ ఒక్కడే !
జ్ఞానానికి నిజమైన అర్థం ఈ శ్లోకమే. బాహ్యమైన చదువులు చదివి దండిగా డబ్బు సంపాదించే చదువులు మనిషికి నిజగమ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి దేవుని అనుగ్రహంతో ప్రసాదించబడినదే మానవజన్మ. భగవంతుని దివ్య లక్షణాలన్నీమనిషికి ప్రసాదించాడు. పదునైన కత్తి చెడిన శరీర భాగాన్ని తొలగించి ప్రాణాన్ని రక్షించగలదు. అదే కత్తి కుత్తుక కోసి ప్రాణాన్ని హరించనూగలదు.
మానవుడు జన్నించినప్పటి నుండీ భగవంతుడు బలమైన ప్రకృతి ఆకర్షణ కల్పించాడు. యోచించే కొద్ది నేనెవరు...? నా జన్మకు పరమార్థమేమిటి...? భగవంతుని చేరుకోవటానికి ఉపయోగపడే సాధనా సంపత్తి ఏమిటి...? ఈ విధమైన ఆలోచనలతో చింతనతో యోచన చేసే జిజ్ఞాసువులకు పరమాత్ముడు తప్పక తన దివ్య విభూదులను అందజేసి వారికి నిత్యానందాన్ని కలుగజేస్తాడు.తమాషా ఏమిటంటే ప్రకృతి ఆకర్షణ చాలా బలీయంగా పెట్టాడు. పురుషుడైన ఆ పరమాత్మను తెలుకోవడమే నిజమైన జ్ఞానం.
వేదాలు అపౌరుషేయాలు పరిణామ క్రమంలో మానవజాతి వికసించినప్పటికే వేద విజ్ఞానం అందుబాటులో వుంది ఈ గీతా విజ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే సూర్యునికి, మనువుకు చెప్పానని గత అధ్యాయంలో అర్జనునికి చెప్పాడు సనాతనమైన ఈ ప్రాణాయామ సాధన శాస్రోక్తమై భగవంతుని అపార కరుణ వలన మానవాళికి బహూకరించబడింది. పట్టుదలగా సాధన చేసిన వారికి మాత్రమే మంచి ఫలితము పట్టుబడుతుంది.
ప్రాణాన్ని దీర్ఘించడమే ప్రాణాయామం . మానవుడు కోపంగా వున్నప్పుడు, మైధున క్రియలోనూ తొందర తొందరగా శ్వాస తీసుకోవలసివస్తుంది. తద్వారా మన ఆయుష్షు తగ్గిపోతుంది.ప్రతి దినము క్రమం తప్పకుండా చేసిన ప్రాణాయామ సాధన వలన ప్రాణశక్తిని అధికంగా శరీరంలో నిలువచేసి , ప్రతి దినము ఖర్చయ్యే ప్రాణశక్తిని మరలా ప్రాణాయామ సాధనలో భర్తీ చేసుకుంటూ ఇంకా మిగిలిన శక్తిని వెన్నుపాములోను, మెదడులోనూ నిల్వ చేయవచ్చు. జ్ఞాన సంపన్నులను మనం గమనించినట్లైతే వారి ముఖ మండలంలో దివ్య తేజస్సు గోచరిస్తుంది.అది వారి సాధన ద్వారా సాధించిన ఆధ్యాత్మిక సంపద.
సృష్టిలోని జీవుల్లో రాకాసి తాబేలు, ఏనుగు మొదలగు జీవులు శ్వాస చాలా నెమ్మదిగా తీసుకుంటాయి. ఏనుగు ఆయుష్షు 150 సంవత్సరములు.రాకాసి తాబేలు ఆయుష్షు 300 సంవత్సరములు నెమ్మదిగా ప్రశాంతంగా శ్వాస తీసుకున్నందు వలన ఆరోగ్యంగా ఉంటూ ఆయుష్షును పెంచుకోవచ్చని ఋజువవుతున్నది. ఇప్పుడు ప్రాణాయామ సాధన విషయం తెలుసుకుందాం.
ఎంత ప్రయత్నం చేసినా మనస్సు స్థిరంగా ఒకచోట నిలవదు. అట్టి మనసును స్థిరపరచాలంటే శాస్త్రీయ పద్దతి ఇచట తెలియజేయబడింది. శ్వాసను ధీర్ఘిస్తూ, ఏకాగ్రతగా గమనించినట్లైతే మనసు స్థిరమైపోతుంది. దీర్ఘ శ్వాసల ద్వారా ప్రాణశక్తిని వెన్నుపాము మరియు మెదడులో స్థిరీకరించిన యోగి శరీరానికి, శ్వాసకు ఉన్న చిక్కుముడిని విప్పి దైవ సామ్రాజ్యములోనికి ప్రవేశించగలుగుతున్నాడు. అజరామరమైన ఈ అమరసాధన ద్వారా యుగ యుగాలుగా మోక్షాన్ని పొందిన మహనీయులెందరో.!
మానవ నాడీ మండలము బ్రహ్మదండి(వెన్నుపాము) మరియు మెదడుపై ఆధారపడి యున్నది.72 వేల నాడులు బ్రహ్మదండికి అనుసంధానించబడి శరీర విధులన్నియు సక్రమముగా నడిపించుచున్నవి. ఇందు అతి ప్రాముఖ్యమైన నాడి సుషుమ్న(బ్రహ్మనాడి). ఇడ , పింగళ , సుషుమ్న అను మూడు నాడులు వెన్నుపామును చుట్టుకుంటూ క్రింది మూలాధార చక్రం నుండీ శిరస్సుపైనున్న సహస్రారం వరకు ప్రయాణిస్తున్నాయి.
క్రమశిక్షణగా చేస్తున్న ఈ ప్రాణాయామ సాధన వలన శరీర కణజాలమంతా ప్రాణశక్తితో పునర్ణవం చెంది ఉత్పత్తి, విచ్ఛిత్తి లేకుండా స్థిరంగా ఉంటాయి. ఉన్నత స్థితులు పొందిన యోగుల శరీర కణజాలము నేరుగా ప్రాణశక్తిని గ్రహించి ఆకలి, దప్పిక తగ్గించుకోగలుగుతారు. కొంమంది ఆహారాన్ని విడిచి కూడా బ్రతకగలరు. ప్రస్తుత మన సమాజంలో కూడా ఇటువంటి మహనీయులున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అటువంటి పూర్ణయోగులు సంకల్ప మాత్రంతో శరీరాన్నిత్యజించగలరు, శతాబ్దులుగా నిలుపనూగలరు.
పంచవాయువుల చలనము(పంచ ప్రాణములు)వలననే శరీరంలో విధులన్నియు క్రమబద్దీకరించబడి ఆరోగ్యం సమతుల్య పడుతుంది.
ప్రాణవాయువు - తల
వ్యానవాయువు - ఛాతి (రొమ్ము)
ఉదానవాయువు - ఉదరము(కడుపు)
సమానవాయువు - నాభి(బొడ్డు)
అపానవాయువు - గుదము(మల ద్వారము)
ఉదానవాయువు - ఉదరము(కడుపు)
సమానవాయువు - నాభి(బొడ్డు)
అపానవాయువు - గుదము(మల ద్వారము)
సహస్రాబ్దులుగా ఎంతో మంది మహాయోగులు అచ్చంగా ఈ సాధన ద్వారా లేదంటే ఇంచు మించుగా ఇలాంటి సాధన ద్వారా భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలిగారు. ప్రపంచంలో ఏ గ్రంధమైనా ఇంత గొప్ప సాధనను తెలియ జేయలేదు. పరిణామ క్రమంలో జీవుడు భగవంతుని చేరుకోవటానికి 15కోట్ల జన్మలు అవసరమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఈ శ్లోకంలో వివరించిన ప్రాణాయామ సాధన వలన జీవుడు ఈ జన్మలోనే మోక్షాన్ని(దైవ సాక్షాత్కారాన్ని) పొందగలుగుతాడు. పరమ గురువుల శాస్త్ర నియమాల వలన సామాన్యులందరికి చెప్పుట నిషేదించబడినది. దీక్ష ఇవ్వడానికి నియమితులైన గురువులు మాత్రమే ఇందుకు అర్హులు.
యధాతదంగా శ్లోకన్ని అర్థం చేసుకోవాలంటే అపానవాయువును క్రింది నుండీ పైకి నడిపించి ప్రాణవాయువుతో మిళితం చేసి ప్రాణవాయువును పైనుండీ క్రిందినున్న అపానవాయువుతో సంధానం చేసి , మధ్యనున్న సమాన, ఉదాన, వ్యాన వాయువుల ద్వారా క్రింది నుంచీ పైకి, పై నుండి క్రిందికి నడిపించే క్రియ ఏదైతే ఉందో అదే శాస్రోేక్తమైన ప్రాణాయామ సాధనయని గీతాచార్యుని వాక్కు.
కారణ జన్ముడైన పతంజలి మహర్షి వ్రాసిన అష్టాంగ యోగాల్లో ప్రాణాయామము నాల్గవమెట్టు. 1.యమ 2.నియమ 3.ఆసన 4.ప్రాణాయామ 5.ప్రత్యాహార 6.ధారణ 7.ధ్యానం 8.సమాధి.
****
యోగి సాధారణంగా తీసుకున్న శావాస కాకుండా ఎదురు శ్వాస ద్వారా అనగా బ్రహ్మదండిలో ఆరు చక్రాలు (మూలాధారం , స్వాధిష్టానం, మణిపూరకం, అనాహాతం, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారం) క్రింది నుంచి పైకి ఆరోహణ, పైనుంచీ క్రిందికి అవరోహణ చేస్తూ - సామాన్య మానవుడు ఒక సంవత్సర కాలంలో సంపాదించగలిగిన ఆధ్యాత్మిక సంపద ఒక ప్రాణాయామం ద్వారా సంపాదించగలిగి త్వరితగతిని కైవల్యానికి చేరుకోగలుగుతాడు.ఆరు చక్రాల ద్వారా ఆరోహణ (6నెలలు) మరియు అవరోహణ (6నెలలు) చేస్తూ తన గమ్యమైన భగవత్ సాయుజ్యాన్ని పొందగలుగుతున్నాడు.
****
No comments:
Post a Comment