శ్రీశ్రీ ఒకవ్యంగ్య వైతాళికుడు –శ్రీశ్రీసాహితీప్రక్రియలో మరో పార్శ్వము - అచ్చంగా తెలుగు

శ్రీశ్రీ ఒకవ్యంగ్య వైతాళికుడు –శ్రీశ్రీసాహితీప్రక్రియలో మరో పార్శ్వము

Share This

శ్రీశ్రీ ఒకవ్యంగ్య వైతాళికుడు –శ్రీశ్రీసాహితీప్రక్రియలో మరో పార్శ్వము


శ్రీ రవి భూషణ్ శర్మ కొండూరు,
శ్రీమతి ఇందు కిరణ్ కొండూరు.

ఈ నెల (ఏప్రిల్) 30వ తేదీ శ్రీశ్రీ గారిజన్మదినము. దాన్ని పురస్కరించుకొని ఒక్కసారి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుందాము. శ్రీశ్రీఅంటేతెలియని తెలుగు వాడు ఉండడు. చాలా మంది శ్రీశ్రీ పాటలను, మాటలను తరచూ తమదైనందిన జీవితంలో వాడుతూ ఉంటారు.  వారు వ్రాసిన కవితలు, పాటలు, గేయాలు బహుళ ప్రజాదరణ పొందాయి.తెలుగుసాహిత్యంలో శ్రీశ్రీవ్రాయని సాహితీ ప్రక్రియ లేదు. ఐతే చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఏమిటంటే, ఆయన వ్యంగ్య సాహిత్యంతో అంటేపేరడీ సాహిత్యంతోకూడా ఎన్నో రచనలు చేసితెలుగు సాహితీ ప్రియులను ఆనందింప చేశారు. శ్రీశ్రీగారిపేరడీ రచనలలో భాగంగానే ‘సిప్రాలి’ అనే శీర్షిక క్రింద ఒకగ్రంధంప్రచురణ జరిగింది అది చాలాప్రాచుర్యం పొందింది. అందులో కొన్ని కవితలు, వాటి నేపధ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, అలాగే శ్రీశ్రీ సాహిత్యంమీద ఇతర కవులు చేసిన పేరడీ రచనలు కూడా ఈ వ్యాసంలో చూద్దాము.‘సిప్రాలి’లోరమారమి అన్ని పద్యాలకు “సిరిసిరి” అనే మకుటం వొచ్చేటట్టు రచన చేసారు. శ్రీ అనే పదం తెలుగులోప్రకృతి ఐతే సిరి అనే పదం వికృతి కాబట్టి దీనికి మకుటంశ్రీశ్రీకిబదులు సిరిసిరి అని పెట్టి ఉంటారు.అంటేతన గ్రంధం యొక్కపేరు పెట్టటంలో కూడా కవిపేరడీ చేశారు అన్నమాట. 
ఇంతకీపేరడీ నిర్వచనముఏంటి,“ఒక మూల రచనకు అధిక్షేపాణాత్మకమైన, హేళనాత్మకమైన, హాస్యాత్మకమైన రచనతో కూడిన అనుకరణను మాత్రమే పేరడీ అంటారు”. అంతేకానీ, ఒక కవి రచనాశైలినో, ఒక పద్యాన్నో, ఒక ఖండికనోమాత్రమేఅనుకరించినంత మాత్రాన అది పేరడీ అనిపించుకోదు. ఏ రచన ఐనా,హాస్యాన్నిగానీ, అధిక్షేపణని గానీ, పరిహాసం గానీచేయని పక్షంలో ఆ అనుకరణలనుపేరడీ క్రింద పరిగణించరు.పూర్వము వికటకవిగా పేరు పొందిన తెనాలి రామకృష్ణ కవిపేరడీకి ఆద్యుడనిభావన చేయవచ్చు.ఆధునిక యగంలోఅనేకమంది కవులు పేరడీకి వన్నె తెచ్చారు. ప్రాచీన కవుల నుంచి ఆధునిక కవులవరకు అన్ని రచనలకు పేరడీలు కట్టారు. ఆధునిక కవులలోజలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి (జరూక్ శాస్త్రి) గారు పేరడీకి కొత్త ఒరవడిని, ప్రజాదరణ తీసుకొచ్చారు. పోతన, తిక్కన, ఎర్రన్న,శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయరణ, దేవులపల్లి ఇలాఒకరేంటి దాదాపుప్రాచీన, ఆధునిక కవులందరి రచనలకు పేరడీకి గురి అయ్యాయి అవి విరివిగా లభ్యమౌతున్నాయి. ఆపేరడీ కవులకృషిఫలమే ఈనాడుపేరడీకవితలుప్రజల నాల్కులపైకి తెచ్చారు. మనం ఇప్పుడు శ్రీశ్రీ గారి కొన్ని పేరడీకవితలను పరిశీలన చేద్దాము. 
ఇతర కవుల పద్యాలకుశ్రీశ్రీపేరడీరచన:
 మొదటిపద్యం దానినేపధ్యం:
 అప్పట్లో చలన చిత్ర నిర్మాతలు, దర్శకులు ఎక్కువగా డబ్బింగు కధలకి, డబ్బింగు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి చిత్రాలు తీసేవారు కానీ అవి అంతగా తెలుగు నాట జనాదరణ పొందేవి కాదు, దాంతోనిర్మాతలకు పెద్ద మొత్తంలో నష్టాలు కలిగేవి.ఆయా నిర్మాతలు, వారి కుటుంబాలు వీధిన పడేవి. బహుశావారికి మద్దతుగా వ్రాసిన పద్యం, ఈక్రింద ఇస్తున్నాను, ఐతే, దీనికి ఆధారంగా, బద్దెన కవిరచించినసుమతీశతకం నుంచి మనందరికీ సుపరిచితమైన ప్రముఖ పద్యం తీసుకొని వానికి పేరడీ వ్రాసారు శ్రీశ్రీ.
మూల పద్యం. ఛందస్సు: కందం
ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ
దీని భావం:రాలిన పచ్చికాయలు ఏరి తినకుము, చుట్టములను ధూషింపకుము వారి తప్పులు ఎంచకుము, యుధ్ధమున శత్రువులకు వెన్ను చూపి పారిపోకుము, గురుతుల్యుల పెద్దల మాటను జవదాటకుము సుమా.ఇంత మంచి భావం అర్థం ఉన్న ఈ పద్యాన్ని, శ్రీశ్రీ తన వ్యంగ్య ధోరణిలో, ఛందో బద్ధంగా ఈ విధంగా సెలవిచ్చారు.
శ్రీశ్రీ రచన, ఛందస్సు: కందం
కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
డాయకుమీ అరవఫిలిం
చేయకుమీ చేబదుళ్లు సిరిసిరి మువ్వా
దీని భావం:కోతల రాయుడిలాకోయకు సుమా (పద్యంలోసొరకాయలు అనే పదం కూరగాయలుగా అనేఅర్థం లో తెసుకోకూడదు, కొన్నితెలుగు రాష్ట్రాల్లో సొరకాయలు కోయటం అంటే కోతలు కోయటంగా అర్థం చెప్పబడుతుంది), నవలలు వ్రాస్తున్నాను అనే పేరుతొ అవాకులు చెవాకులువ్రాయ కూడదు, తమిళ భాషా చిత్రాలను అనువదించవద్దు(అలా చేసి నష్ట పోకు, వీలు ఐతే తెలుగుకధలను సరాసరి తేయండి అని సూచన ప్రాయంగా చెప్పుతున్నారు), అందరి వద్ద అప్పు చేయకు అని నీతి బోధ చేస్తున్నారు.

మరో పద్యం దాని నేపధ్యం:
 మానవ సంబంధాలు రోజు రోజుకీ క్షీణించి పోతున్న ఈరోజుల్లో, కవి, మానవ సంబంధాలను ఎలా పెంపొందించు కోవాలో కొన్ని సూచనలు తమవ్యంగ్య ధోరణిలో ఇస్తూపదిమందికి నవ్వు తెప్పించారు.దీనికి ఆధారంగా, మళ్ళీ బద్దెన కవిరచించిన, సుమతీశతకం నుంచి మనందరికీ సుపరిచితమైనమరొకప్రముఖ పద్యం తీసుకొని దానికిపేరడీ వ్రాసారు.
మూల పద్యం. ఛందస్సు: కందం
అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ
దీని భావం:సమయానికి అప్పు ఇచ్చు వాడు, వైద్యుడు, ఎల్లప్పుడు ప్రవహించు నది, బ్రాహ్మణులు గల గ్రామమునందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమునందు ననివాస యోగ్యము కాదు.ఇంత మంచి పద్యాన్ని, వెటకారం, వ్యంగ్యము, హాస్య భరిత ధోరణిలో ఇలా రచన చేసారు.
శ్రీశ్రీ రచన, ఛందస్సు: కందం
ఎప్పుడు అడిగిన అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగగలిగెడు సుజనుల్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూర చొరకుము మువ్వా
దీని భావం:ఎప్పుడు అడిగితె అప్పుడు కాఫీ నీళ్ళు పోసే సజ్జనులు ఉన్న ఊరులో ఉండవచ్చు గానీ కాఫీ చుక్క కూడా దొరకని ఊరు వృధా అని అన్నారు కవి.

మరోపద్యం దానినేపధ్యం:
 ఇది ఇలా ఉంటె, సహజంగా కవులు వారు వ్రాసిన కృతులకి ఫలశ్రుతి జెప్పటం పరిపాటే, కొంతమంది ఈ పద్యం చదివిన వారికి, పారాయణము చేసినవారికి ఫలానా ఫలానా ఫలితాలు వస్తాయి అని వ్రాస్తూవుంటారు, అదే ధోరణిలో, శ్రీశ్రీ గారు తమ శతక పద్యాలకు ఫలశ్రుతి వ్రాసుకున్నారు. ఇందులో కూడా వ్యంగ్య ధోరణి కనబడుతుంది.
శ్రీశ్రీ రచన, ఛందస్సు: కందం
ఈ శతకం యెవరైనా
చూసి చదివి వ్రాసి పాడి సొగసిన సిగరెట్
వాసనలకు కొదవుండదు
శ్రీశు కరుణ బలిమి వలన సిరి సిరి మువ్వా
దీని భావం: ఈ శతక పద్యాలనూ ఎవరు చూసినా, చదివినా, వ్రాసినా, పాడినా, శ్రీ మహా విష్ణువు కరుణ వల్ల సిగరెట్ వాసనకు కొదవ ఉండదని రచన చేసారు.

శ్రీశ్రీపద్యానికిపేరడీ:
 శ్రీశ్రీ ఇలా ఎందరోకవుల యొక్కసాహితీ ప్రక్రియలను వ్యంగ్యధోరణిలో పేరడీ చేసిఅందరినీ అలరించారు, మరి ఇతర కవులు మేము మాత్రం ఏమైనా తక్కువా? అనుకున్నారో? లేక శ్రీశ్రీ ప్రయత్నానికి దీటైనసమాధానము చెప్పదలచు కున్నారో గానీ ఇతరకవులుకుడా శ్రీశ్రీ రచనల మీద ఎన్నో పేరడీసాహిత్యం వ్రాసి అందరినీ హాస్య సముద్రంలో వోలలాడించారు.  ఇక్కడ శ్రీశ్రీ రచనలు ఇతర కవులుపేరడీలు ఎలా చేసారో చూద్దాము.

శ్రీశ్రీగారు,అద్వైతము అనేశీర్షికక్రింద వ్రాసిన పద్యాలనుఆధునికపేరడీ వైతాళికుడు జరుక్ శాస్త్రి(జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి) గారు ఈ రకంగా పేరడీ చేసారు.
మూలరచన: శ్రీశ్రీ–అద్వైతం
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపుటంచుల చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం
పేరడీరచన: జరుక్ శాస్త్రి
ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం.

శ్రీశ్రీ వ్రాసినజయభేరి కవితా సంకలనంలో “నేను సైతం” అనేకవితకువచ్చిన పేరడీలు ఎన్నో లెక్క పెట్టటం కష్టం.ఐతేఇక్కడజరుక్ శాస్త్రి గారు పేరడీ ఎలా చేశారో చూద్దాము.
మూలరచన: శ్రీశ్రీ–జయభేరి
నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం విశ్వవ్రుష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
పేరడీరచన: జరుక్ శాస్త్రి
నేను సైతం కిళ్ళీకొట్లో
పాతబాకీ లెగర గొట్టాను
నేను సైతం జనాభాలో
సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను

జరూక్ శాస్త్రి గారు,శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన కొన్నిపంక్తులకు పేరడీలు ఈ క్రింద ఉదహరిస్తున్నను.
మూలరచన: శ్రీశ్రీ
·         ఏ దేశచరిత్ర చూచినాఏమున్నది గర్వకారణం
·         ప్రపంచమొక పద్మవ్యూహం
·         కవిత్వమొక తీరని దాహం
·         తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు
పేరడీరచన: జరుక్ శాస్త్రి
·         ఏ కాకి చరిత్ర చూచిన ఏమున్నది గర్వకారణం
·         ప్రపంచ మొక సర్కస్ డేరా
·         కవిత్వమొక వర్కర్ బూరా
·         ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడిలెన్నీ

మరొక సుప్రసిద్ధ కవి మాచిరాజు దేవీప్రసాద్ గారు,శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన కొన్నిపంక్తులకు పేరడీలు ఈ క్రింద ఉదహరిస్తున్నను.
మూలరచన: శ్రీశ్రీ
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి
పీడించే సాంఘిక ధర్మం, ఇంకానా? ఇకపై సాగదు
పేరడీరచన: మాచిరాజు దేవీప్రసాద్ (రహదార్లు)
ఒక కారును వేరొక కారూ, ఒక బస్సును వేరొక లారీ
చుంబించే ఆ క్షణమందున, రూల్సన్నీ దాగును యెచ్చట
మూలరచన: శ్రీశ్రీ – దేశ చరిత్రలు
ఏ దేశచరిత్ర చూచినాఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తంపరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తంపరస్పరాహరణోద్యోగం:
పేరడీరచన: మాచిరాజు దేవీప్రసాద్ (రహదార్లు)
ఏ రోడ్డు చరిత్ర చూచినా, ఏమున్నది గర్వకారణం
రహదార్ల చరిత్ర సమస్తం, దూళిధూసర పర్యంతం.
రహదారి చరిత్ర సమస్తం, యాతాయత జన సంయుక్తం

చివరిగా ప్రముఖ సినీ గేయ రచయిత, కవిఐనజొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు,శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన కొన్నికవితలకు పేరడీ చేసి పలువురిని అలరించారు. అందులో కొన్ని ఈ క్రింద ఉదహరిస్తున్నను.
మూలరచన: శ్రీశ్రీ –ప్రతిజ్ఞ
పొలాలనన్నీ,హలాలదున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామమెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలికావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికిధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌!
పేరడీరచన: జొన్నవిత్తుల
అవాకులన్నీ, చవాకులన్నీ
మహారచనలై మహిలో నిండగ,
ఎగబడి చదివే పాఠకులుండగ
విరామ మెరుగక పరిశ్రమిస్తూ,
అహోరాత్రులూ అవే రచిస్తూ
ప్రసిద్ధికెక్కె కవిపుంగవులకు,
వారికి జరిపే సమ్ మానాలకు
బిరుదల మాలకు, దుశ్శాలువలకు,
కరతాళలకు ఖరీదు లేదేయ్!
మూలరచన: శ్రీశ్రీ – జయభేరి
నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం విశ్వవ్రుష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
పేరడీరచన: జొన్నవిత్తుల
నేను సైతం తెల్లజుట్టుకు
నల్లరంగును కొనుక్కొచ్చాను
నేను సైతం నల్లరంగును
తెల్లజుట్టుకు రాసిదువ్వాను

ఇలా ఒకరికి మీద ఒకరు పేరడీలు వ్రాసితెలుగు సాహితీ ప్రియులకు, పేరడీ ప్రియులకు మంచి ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన, సునిసిత హాస్యాన్ని అందించి అశేష తెలుగు ప్రజలను అలరించారు. శ్రీశ్రీ జన్మదినము పురస్కరించుకొని, శ్రీశ్రీ కేవలం ఒక విప్లవ కవి కాదని, శ్రీశ్రీఒక వ్యంగ్య వైతాళికుడనిఆవిష్కరించిఆయనచేసినపేరడీసాహితీ ప్రక్రియను మీఅందరికీపరిచయంచేసే నాయి ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటాను. ఇకసెలవు.
***

1 comment:

  1. శ్రీశ్రీ ఒక వ్యంగ్య వైతాళికుడు - శ్రీశ్రీ పుట్టినరోజు పురస్కరించుకొని నేను వ్రాసిన ఒక వ్యాసము.

    ReplyDelete

Pages