స్వగతం - నాన్న - అచ్చంగా తెలుగు
స్వగతం - నాన్న
బి.ఎన్.వి.పార్ధసారధి 

మా నాన్న గారు పరమపదించి దాదాపు ఇరవై రెండు ఏళ్ళు అవుతున్నాయి. నేను పెద్ద వాడిని అవుతున్నాను. మరో నాలుగేళ్ళలో నా వయస్సు ఆరు పదులు అవుతుంది. కానీ మా నాన్నగారు స్పురణకి వచ్చినప్పుడల్లా నా ఆలోచనలు నా బాల్యం లోకి వెళ్ళిపోతాయి. నా బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు కొన్ని నాలో శాశ్వత ముద్ర వేసాయి.
నా బాల్యానికి సంబంధించిన తొలి జ్ఞాపకం మా తాతగారి మరణం. అప్పుడు నాకు మూడేళ్ళు. మృతులైన మా తాతగారి శరీరం ఇప్పటికీ నా స్మృతి పధంలో మసులుతూ వుంటుంది. ఆ రోజుల్లోనే నాకు మూడేళ్ళు నిండగానే స్కూల్ లో వేసారు. నేను బాగా అల్లరి చేసేవాడినని వేసవి శలవల్లో కూడా నన్ను స్కూల్ కి పంపేవారు. ఆ స్కూల్ అప్పట్లో కొత్తగా ప్రారంభించటం వల్ల ( వేలంకన్ని స్కూల్ ) వేసవి శలవల్లో కూడా చిన్న పిల్లలకి  బేబీ కేర్ సెంటర్ నడిపేవారు. మా స్కూల్లో కొన్ని సాధు జంతువులు బోన్ లో ఉండేవి. వాటితో పాటు కొన్ని కోతులు కూడా విడిగా ఒక బోన్ లో ఉండేవి. పిల్లలు అల్లరి చేస్తే కోతులకి పట్ట్టిస్తామని భయపెట్టేవారు. బాగా అల్లరి చేసే పిల్లలకి తలమీద కోతి బొమ్మ పెట్టి అన్ని క్లాసులు తిప్పేవారు. మరీ విపరీతంగా అల్లరి చేసే పిల్లల నడుం చుట్టూ ఒక తోక తగిలింఛి స్కూల్ అంతా తిప్పేవారు. అల తరుచూ కోతి బొమ్మతో , తోకతో స్కూల్ అంతా తిరిగిన వాళ్ళలో నేను ప్రధముడిని.
మా నాన్నగారిదగ్గర కోడాక్ కెమెరా వుండేది. దానితో లెక్క లేనన్ని ఫోటోలు తీసేవారు. నేను నెలల పిల్లవాడిగా వున్నప్పటినుంచి నాకు దాదాపు ఐదు ఆరు ఏళ్ళు వచ్చేవరకు మద్రాసులోని టీ నగర్ లోని పానగల్ పార్క్, నటేసన్ పార్క్ లో ఆదివారాలు చాలా ఫోటోలు మా నాన్నగారు తీసారు. మా ఇంట్లో స్వామి వివేకానందుడి ఫోటో ఒకటి వుండేది. కాషాయ వస్త్రాలు ధరించి, తలకి పాగా చుట్టుకుని , చేతులు కట్టుకుని ఠీవి గా నిలబడిన వివేకానందుడి మూర్తి మూడేళ్ళ ప్రాయంలోనే నాలో చెరగని ముద్ర వేసింది. మా నాన్న గారు నాకు ఆ ఫోటో లోని వివేకానందుడిలా తలపాగా చుట్టి, నేను చేతులు కట్టుకుని ఠీవిగా నిలుచోనివుంటే ఫోటో తీసారు. మా నాన్నగారితో కలిసి నేను చూసిన తొలి తెలుగు చిత్రం ( నాకు గుర్తు వున్నతవరకు)యెన్. టీ. ఆర్. సావిత్రి కలిసి నటించిన  దేవత. ఈ సినిమా మేము మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కి దగ్గర లోని ఒకప్పటి అశోక్ థియేటర్ లో చూసాము. మద్రాస్ లోని చిల్ద్రెన్స్ థియేటర్ లో ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు ( టార్జాన్ సిరీస్ ) నేను మా నాన్న కలిసి చూసాము. ఒకసారి సరదాగా నేను మా నాన్న కలిసి చిల్డ్రన్స్ థియేటర్ లో ఇంగ్లీష్ సినిమా చూసి టీ నగర్ లోని మా ఇంటికి మౌంట్ రోడ్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాము. టీ నగర్ లోని శివా విష్ణు కోవెలకి, అగస్త్యుడి కోవెలకి , ట్రిప్లికెన్ లో ని పార్ధసారధి కోవెలకి, మైలాపూరు లోని కపాలేశ్వర స్వామి కోవెలకి తరచూ వెళ్ళేవాళ్ళము. ఇహ మరీనా బీచ్ అయితే బోల్డన్ని సార్లు వెళ్ళే వాళ్లము.
ఇంగ్లీష్ మీడియం లో చదువుతుండటం వల్ల నాకు తెలుగు సరిగ్గా రావటం లేదని గ్రహించి మా నాన్నగారు నేను మూడో క్లాస్ కి వచ్చే సరికి నన్ను శ్రీ రామకృష్ణ మిషన్ స్కూల్ లో తెలుగు మీడియం లో చేర్పించారు. ఇది నా బాల్యం లో, జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు. మూడో క్లాస్ నుంచి పదకొండో క్లాస్ వరకు ( ఎస్ ఎస్ ఎల్ సి ) రామ కృష్ణా స్కూల్ లో చదవటం వలన నాకు ఎందరో బాల్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు లభించారు. అదే విధంగా రామకృష్ణ స్కూల్ లోని భోదనలవలన నాకు వివేకాందుడి మీద అభిమానం, సనాతన ధర్మం పైన ప్రగాఢ మైన విశ్వాసం, నమ్మకం ఏర్పడింది.
మా నాన్న ఈల పాట బాగా పాడేవారు. చిన్నతనం లో మా నాన్న ఫ్లూట్ ( వేణువు) వాద్యం వారి బాబాయి గారి వద్ద నేర్చుకున్నారు. మా పెద్ద అత్త కర్నాటక సంగీత శాస్త్రీయ విద్వాంసురాలు. ఆవిడ మద్రాసు మ్యూజిక్ కాలేజీ లో డిప్లొమా చేసింది. మేము టీ నగర్ లో తంజావూరు రోడ్డు లో అద్దెకి ఉండేవారము. మా ఇంటి ఎదురుగా ప్రఖ్యాతి గాంచిన  శ్రీ కృష్ణ గాన సభ వుంది. ఈ సభ లో ప్రతి శని ,ఆదివారాలు నాట్య ప్రదర్శనలు, సంగీత కచేరీలు జరిగేవి. చిట్టిబాబు, బాల మురళి, సుబ్బలక్ష్మి, మాండొలిన్ శ్రీనివాస్, లాల్గుడి జయరామన్ వంటి హేమా హేమీలు, కూచిపూడి, భరత నాట్యం ప్రదర్శనలు ఈ సభలో జరిగేవి. పీసపాటి, షణ్ముఖి ఆంజనేయులు వంటి రంగ స్థల శ్రీ కృష్ణ పాత్రధారులు, సురభి వారి నాటక ప్రదర్శనలు కూడా ఈ సభలో జరిగేవి. మా ఇంటి కిటికీ లోంచి చూస్తే నాటక , నాట్య ప్రదర్శనలు సభ వేదికపైనుంచి బాగానే  కనిపించేవి. ఇహ సంగీత కచీరీలు అయితే వీనుల విందుగా వినిపించేవి. ఈ ప్రభావం వల్ల నాకు చిన్న నాటినుంచి లలిత కళల మీద మక్కువ ఎర్పడింది.
1977 లో నా ఎస్ ఎస్ ఎల్ సి పూర్తి అయింది. పీ యు సి నుంచి ఇంగ్లీష్ మీడియం లో చదవాలి. అందుకని ముందుగానే మా నాన్నగారు నాకు రోజూ హిందూ ఆంగ్ల దిన పత్రిక చదవమని ప్రోత్సహించే వారు. ఇంగ్లీష్ నవలలు కూడా చదవమని సలహా ఇచ్చేవారు. ఈ విధం గా నాకు ఆంగ్ల సాహిత్యం మీద  కూడా ఆసక్తి ఏర్పడింది. సోమర్సెట్ మాగం, థామస్ హార్డీ ల నవలలు ఎంతో ఇష్టపడే వాడిని. తత్పలితంగా పీ యు సి లో నాకు ఇంగ్లీష్ మీడియం లో చదివినప్పటికీ పెద్దగా కష్టం అనిపించలేదు.
మా నాన్నగారు మమ్మల్ని అతిగా ముద్దు చేయకపోయినా ఎంతో ప్రేమగా పెంచారు. మా నాన్న అంటే మాకు ప్రేమ తో పాటు గౌరవం కూడా. బ్యాంకు లో పని ఒత్తిడి వున్న రోజులలో మా నాన్న రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు. మా నాన్న ఇంటికి వచ్చాక కానీ నేను నా బాల్యం లో రాత్రి అన్నం తినేవాడిని కాను. తరచూ వీధి లోకి తొంగి చూసి వీధి చివర దూరంగా నడుచుకుని వస్తున్న మా నాన్నని గుర్తు పట్టి వెంటనే పరిగెత్తుకు వెళ్లి చేయి పట్టుకుని మా నాన్నతో ఇంటికి వచ్చే వాడిని. కాస్త పెద్ద అయ్యాక అలా పరిగెట్టడం మాని , మా నాన్న ఇంటికి వచ్చే సరికి నాకూ మా నాన్నకీ కంచాలు సిద్ధం చేసి పెట్టేవాడిని. నాకు 1986 లో బ్యాంకు లో ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చినపుడు మా నాన్న అన్న మాటలు నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు. “ నువ్వు చేసే పని నిజాయితీ గా చెయ్యి. నువ్వు పని చేస్తున్న సంస్థ పైన నీకు విశ్వాసం వుండాలి కానీ నీ పై అధికారుల పైన కాదు. నీ సంస్థ కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చెయ్యద్దు. నైతిక విలువలని పాటించి పని చెయ్యి. “ మా నాన్న మూడు దశాబ్దాలక్రితం అన్న ఈ నాలుగు మాటలు నాకు ఇప్పటికీ నాలుగు వేదాలతో సమానం.   1986 లో నాకు బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగం రావటానికి ఒకవిధంగా మా నాన్నే కారణం.  దరఖాస్తుకి ఆఖరి రోజున మా నాన్న స్వయంగా నాచేత సంతకాలు పెట్టించి ఆ మర్నాడు  నా దరఖాస్తుని తానే వెళ్లి బ్యాంకు పర్సనల్ డిపార్టుమెంటు లో ఇచ్చారు.  అక్కడ పర్సనల్ మేనేజర్ వెంకట రామన్ అనే ఆయన పెద్ద మనసుతో  ఒక పెద్దాయన ( మా నాన్న) స్వయంగా వచ్చారని గడువు దాటి ఒక రాజు అయినప్పటికీ నా దరఖాస్తుని స్వీకరించారు. 1986 నుంచి 1995 వరకు తొమ్మిది ఏళ్ళలో నేను ఐదు ఊళ్లలో పని చేసాను (ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, తిరుచ్చి, హైదరాబాద్). మా నాన్నగారికి 1993 లో కాన్సెర్ వ్యాధి వచ్చింది. కానీ ఆయనకి ఆ సంగతి తెలియ నివ్వకుండా మేము జాగ్రత్త పడ్డాము. 1993 లో నాకు తిరుచ్చీ కి బదిలీ చేసారు. శని, ఆదివారాలు తిరుచ్చీ నుంచి మద్రాసు వచ్చి మా నాన్నతో, నా కుటుంబంతో  గడిపి మళ్ళీ సోమవారానికి తిరుచ్చీ వెళ్ళేవాడిని. 1994 లో నాకు హైదరాబాద్ బదిలీ అయింది. మళ్ళీ 1995 లో పదోన్నతి మీద తిరిగి మద్రాసుకి బదిలీ చేస్తామని మా బ్యాంకు యాజమాన్యం సూచన ప్రాయంగా చెప్పింది. అదే సమయంలో నాకు ఒక ఫారిన్ బ్యాంకు లో హైదరాబాద్ లోనే ఉద్యోగం వచ్చింది. మా నాన్న పట్టుబట్టి నాచేత పదోన్నతిని తిరస్కరింప చేయించి  రాజీనామా చేయించారు. ఆ సమయం లో మా నాన్న ఆరోగ్యం చాలా ప్రమాదకర పరిస్థితి లో వుంది. దాదాపు కొన ఊపిరితో వున్నారు. నేను రాజీనామా చేసానన్నా మా నాన్న వినకుండా నా రాజీనామా అందినట్టు బ్యాంకు వారు ఇచ్చిన లేఖ ని తీసుకుని రమ్మన్నారు. ఆ సమయం లో హైదరాబాద్ లో నా మేనేజర్ స్వయం గా మా ఇంటికి వచ్చి మా నాన్న కి నా రాజీనామా అందినట్టు బ్యాంకు నుంచి ఇచ్చిన లేఖని చూపించారు. ఆ లేఖ చూసాక కొన ఊపిరి తో వున్న మా నాన్న తుది శ్వాశ వదిలారు. ఆ మేనేజర్ మరెవరో కాదు 1986 లో మా నాన్న స్వయం గా వెళ్లి ఇచ్చిన ఉద్యోగానికి నా దరఖాస్తు ని  స్వీకరించిన అప్పటి మా బ్యాంకు పర్సనల్ మేనేజర్ వెంకట రామన్ . ఆయనే హైదరాబాద్ లోని మా బ్యాంకు మేనేజర్ గా , ఆయన కింద సబ్ మేనేజర్ గా నేను కలిసి పని చేయటం, నా రాజీనామా ని మళ్ళీ ఆయనే స్వీకరించటం, ఈ రెండు సంఘటనలలో మా నాన్న ప్రధాన పాత్ర వహించటం అంతా కాకతాళీయమా ? లేక విధి రాతా? లేక భగవత్సంకల్పమా? ఏమో ఆ పరమేశ్వరుడికే తెలియాలి.
“నాన్నా , బీరువా లాకర్ లో పాత కోడాక్ కెమెరా ఉంది. ఇది ఇంక పనిరాదేమో కదా ! తీసేయనా ? “ అంది నా కూతురు స్మృతి. “ అది కేవలం కొడాక్ కెమెరా మాత్రం కాదు  తల్లీ. మా నాన్న స్మృతి చిహ్నం.  నాకు ఇద్దరు స్మృతులు తల్లీ , ఒకటి నువ్వు మరొకటి ఆ కోడాక్ కెమెరా . “ అన్నాను నేను మా నాన్న స్మృతి కి రాగా.       
*** 

1 comment:

Pages