తామరాకు - అచ్చంగా తెలుగు
 తామరాకు
అయ్యగారి నాగేంద్రకుమార్ (శంకరకింకర)
            
"అదిగో నదిలో ఆ చివరనుండీ రెండు కఱ్ఱలు కొట్టుకొస్తున్నాయి చూశారా.. అరే ఇప్పుడు చూడండి మధ్యలో ఒక ఒకదానితో ఒకటి చేరి ఇక్కడిదాకా వచ్చాయి... కనపడిందా.." "ఎక్కడ తాతయ్యా" "అదిగో అదిగో... సీ దేర్... ఆ రెండిటిలో ఒకటి ఏదో అడ్డొచ్చి ఆగిపోయింది, ఇంకోటి తన ప్రయాణం సాగిస్తూనే ఉంది." అంటూ తన చుట్టూ ఉన్న ఎనిమిది మంది మనవళ్ళకీ గంగా ప్రవాహం అందులో సుడులూ, పక్షులూ, అవతలి తీరం, ఆ ఘాట్లు అవీ చూపిస్తున్నాడు "జానకీ రఘురామ్"
            రఘు అచ్చమైన భారతీయ కుటుంబంలో పుట్టి ఆప్యాయతలు అనురాగాలమధ్య పెరిగినవాడు. వయసుతోపాటు మంచి రూపమూ, చదువూ, సంస్కారమూ పెరిగాయి. యూనివర్సిటీలో పీజీచేసాడు. దానితో పాటు భారతీయులకే సొంతమైన వాఙ్మయం పరిశీలించడం, అలాంటి విషయ చర్చలలో పాల్గొనడం తనకి హాబీ. రోజుకో గ్రంథం కొంతైనా చదవందే తన దిన చర్య పూర్తవదు. రఘుకి ఒక అక్క, ఒక తమ్ముడూ తోబుట్టువులు ఓ చిన్నపాటి ఉమ్మడి కుటుంబం. అక్కపెళ్ళైంది బావగారు బెంగుళూర్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం. రఘుకి హైదరాబాదులోనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తమ్ముడు MBA చేస్తున్నాడు. నాన్నగారు అక్కపెళ్ళికోసం VRS తీసుకున్నాక ఇంటిపట్టునే ఉంటూ నిత్య కర్మలూ, రామాయణ భారతాదులూ చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. రఘు వాళ్లది చెప్పుకునేంత ఏ ఇబ్బందీ, చీకూచింతా లేని మధ్యతరగతి కన్నా మోస్తరు ఉమ్మడి  కుటుంబం. 
***
1982 దుందుభి నామ సంవత్సరం
            "ఏవండీ, మనవాడికి మొన్న మాఘ పౌర్ణమికి పాతికేళ్ళొచ్చాయ్ చదువూ అయ్యింది, మంచి ఉద్యోగం వచ్చి రెండేళ్ళయ్యింది, అన్నయ్య సంబంధాలు తీసుకొచ్చాడు ఏం చెప్దాం." అని రఘు వాళ్ళమ్మ అడిగింది వాళ్ళాయన్ని. రామాయణ గ్రంథంలోచి మొహం పైకెత్తి చూసి. "శుభస్య శీఘ్రం, కానీ.... వాణ్ణీ ఓ మాట అడగాలిగా. శుభలేఖ సినిమాలో సుధాకర్ లాగా ఏవన్నా ట్విష్ట్ ఇస్తాడేమో! యూనివర్సిటీ చదువులు, మోడ్రన్ సినిమాలు అవీ చూసి అభ్యుదయం , తోటకూర కట్టా అదీ అంటే మన మర్యాదాకూడా చూసుకోవాలిగా మీ అన్నయ్య దగ్గర. ఏవంటావ్ మరి" అన్నారు వాళ్ళాయన. "వాడు మనకొడుకండీ, మీకు తలవంపువచ్చే పని చేయడు వాడు ’రఘురాముడు’" అని అనగానే ఇద్దరూ మురిసిపోయి నవ్వేసుకున్నారు.
            సాయంత్రం ఆఫీసునుంచి రఘు వచ్చి స్నానం-సంధ్య అయ్యాక, "అమ్మా! ఏమిటి వంట ఇవాళ ఆకలేసేస్తోంది బాగా.." అని తన గదిలో బట్టలు మార్చుకుంటూ కేకేశాడు రఘు. "వంకాయ కొత్తిమీర కారం, పచ్చొడియాలురా, ఉల్లి సాంబార్ చేసాను.. సగ్గుబియ్యం వడియాలు వేయించనా... సరేగానీ, నాన్న నీతో ఏదో మాట్లాడాల్ట త్వరగా రాఁ...." అని అమ్మ సమాధానం వంటింట్లోంచి.
అమ్మ వడ్డన చేస్తుంటే నాన్న "ఊఁ ఏంట్రా ఏంటి విశేషాలు... కాలేజీ ఫ్రెండ్సూ అంతా బాగున్నారా ఏం చేస్తున్నారందరూ.."
"అంతా బానే ఉన్నారు నాన్నా, ఆ రాజుగాడు లేడూ.. వాడి పెళ్ళి, వచ్చే నెల.."
"మరి నీసంగతేంటీ?"... పచ్చొడియం అన్నంలో నంజుకు తింటున్న రఘుకి ఒక్కసారి గొంతులో అడ్డుపడ్డట్టయ్యింది. దగ్గడంతో మొహం ఎర్రగా అయ్యింది, సిగ్గు కూడా కొంచెం కలిసింది. "ఏం...ఖళ్ ఖళ్.. ఏం లేహు నాన్నా".
" ముందు నీళ్ళు తాగు, సరే మావయ్య సంబంధాలు తెచ్చాడు మరి ఏం చెప్పమంటావ్. మీ అమ్మకీ నాకూ, నీ పెళ్ళి చేసేస్తే వచ్చే కోడలితో ఆపైన మనవలతో గడుపుదామని ఉంది. వెనక తమ్ముడి బాధ్యతా ఉంది కదా. ఏవయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి కదా నాన్నా... ఓపికున్నప్పుడే అచ్చటా ముచ్చటా బావుంటాయి. లేకపోతే చిరంజీవి, కమల్ హాసన్, బాలచందర్ సినిమాలు చూసి నువ్వూ ఏవైనా కథలు రచించావేంటి కొంపదీసి"
"లేదు నాన్నా, మీ ఇద్దరూ ఎలా నిర్ణయిస్తే అలా నాన్నా, ఎలాంటి అమ్మాయి ఐతే బాగుంటుందో మీరే చూడండి."
"చూడు రఘూ మనది మధ్యతరగతి కుటుంబం ఐనా చీకూ చింతాలేవు. చదువుకుని తనకాళ్ళమీద తను నిలబడగలిగే శక్తి ఉన్న అమ్మాయి ఐతే బావుంటుంది, ఉద్యోగం చేసినా చేయకపోయినా పరవాలేదు, అవకాశాన్ని అవసరాన్ని బట్టి నీకు చేదోడువాదోడుగా ఉండాలి. ఇంటికి పెద్దకోడలు కదా, మా తరవాత అక్కనీ, తమ్ముణ్ణీ కూడా ఆదరించాలి కదా!"
"ఔను నాన్నా, ఈ విషయంలో నాకెటువంటి రిజర్వేషన్స్ లేవు, నాన్నా ఇన్ఫాక్ట్ మీకూ మావయ్యకీ తెలీదా నా స్వభావం, మన కుటుంబ పరిస్థితీ, మీరేది నిర్ణయిస్తే అదే" అని నేలచూపులు కంచంలోకి చూస్తూ అన్నాడు రఘు.
"సరే, ఒక్క విషయం.. ముందు వాళ్ళవివరాలు, ఫోటోలు పంపమంటాను. అంతా సరి అనుకున్నాక, పెళ్ళి చూపులకెళ్ళేముందే మానసికంగా సిద్ధపడితేనే వెళ్దాం, తీరా పెళ్ళి చూపులకెళ్ళాక నచ్చలేదని ఆడపిల్లవాళ్ళని ఏడిపించడం, ఎక్కేగుమ్మం దిగేగుమ్మం చందం మంచిదికాదు" అంది రఘువాళ్ళ అమ్మ. "తప్పకుండా అమ్మా" అని అమ్మ కేసి చూసి చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు.
***
            మావయ్య కుదిర్చిన చక్కని సంబంధంతో ఇంట్లో ఆనందాలు రెట్టింపయ్యాయి.  సరదాగా కలిసిపోయే కోడలొచ్చింది. అత్తగారు మావగారు, మరిదిగారు వదినగార్లన్న బెరుకులేకుండా చిన్నప్పట్నుంచీ ఇక్కడే పెరిగిన దానిలా కలిసిపోయింది రఘు భార్య. కొత్తగా వచ్చిన తోడికోడలూ చెల్లెల్లా కలిసిపోయింది. పెద్దకోడల్లాగే మరింత సరదా మనిషి. రఘుకీ, తమ్ముడికీ పెద్ద పెద్ద ఉద్యోగాలూ వచ్చాయి. అత్తగారు మామగారు ఎప్పుడైనా తినమనో, సహించలేదనో అంటే తన పిల్లలకి ప్రేమగా నోట్లో కుక్కిన చందాన అత్తామామల్నీ బలవంతంగా తినిపిస్తారిద్దరు తోడికోడళ్ళూ. సంప్రదాయ వంటలతోపాటు కొత్త కొత్త వంటలూ అవీ చేసి పెడుతుంది చక్కగా. అన్నట్లు రఘు వాళ్ళకి ఇద్దరు, తమ్ముడికి ఒకరు పిల్లలిప్పుడు మనవడితో నానమ్మ బాబాయిలు ఆడుతుంటారు మనవరాళ్ళతో తాతగారు ఆడుతూంటారు.
***
            సాయంత్రం రఘు ఇంటికి వచ్చి సంధ్యావందనం అయ్యాక భోజనాలదగ్గర "అమ్మా! అక్కఫోన్ చేసింది వాళ్ళ ఆడపడుచు చిట్టికి తాంబూలాలుట, మంచి సంబంధంట ఫాల్గుణంలో పెళ్ళనుకుంటున్నారు. బెంగుళూరు కదా మనవాళ్ళెవరూలేరు నిన్నూ, నీతోపాటు తనని కానీ మరదల్నికానీ పంపమంది. ఇక్కడా ఇల్లూపిల్లలూ చూసుకోవాలికదా! మరదలు కొత్తపిల్ల, అమ్మనుపంపుతా అన్నా. ఏమంటావ్" అన్నాడు.
"నా వల్లకాదురా బాబూ ఈ ప్రయాణాలు ఓపికలేనిదాన్ని నేవెళ్ళినా కార్యక్రమంలో ఉత్సవ విగ్రహంలా కూర్చోడం తప్ప నేన్జేయగలిగిందేముందీ... దాన్ని పంపు, ఆ రెండ్రోజులూ పిల్లలని చిన్నది, మేమూ చూసుకుంటాం " అంది రఘువాళ్ళమ్మ. సరే, చేసేదిలేక రఘు తన భార్యకి విషయం చెప్పాడు బెంగుళూరుకి ప్రయాణం అవమన్నాడు. ఈ విషయం అక్కకీ కాల్ చేసి చెప్పాడు. "ఔనా చిట్టికి ఎంగేజ్మెంటా శుభం, ఔను పాపం అక్కడ వదిన ఒక్కత్తే ఉంటారు. అలాగే. కానీ, మీరు లేకుండా ఈ ఎనిమిదేళ్ళలో ఏ ఫంక్షన్ కైనా వెళ్ళానా ఇంటిపక్క పేరంటాలకి తప్ప. వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం కానీ అలా ఒక్కదాన్నీ మీరు లేకుండా వెళ్ళడం నాకు బెంగండీ” అంది కళ్ళలో నీటిపొర అడ్డొస్తుంటే.
“ఓయ్ఁ… ఏవిటదీ చిన్నపిల్లలా నువ్వే ఇలా ఐతే… కొత్తపిల్ల మరదలు వెళ్ళగలదా చెప్పు. బావగారు ట్రైన్ టికెట్స్ లేవని వాళ్ళ ఆఫీస్ ద్వారా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసారు, ట్రావెల్స్ వాడి దగ్గరకెళ్ళి తీసుకొస్తాను అలాగే ట్యాక్సీ కూడా చెపుతాను రేపుదయం బేగంపేటలో, వయా బొంబాయి బెంగుళూరె ళ్ళాలి, హోప్ యు కెన్ మేనేజ్. లాస్ట్ మూమెంట్ కదా డైరెక్ట్ టికెట్స్ లేవుట”. అని బండేసుకుని ట్రావెల్ ఏజెంట్ ఆఫీస్కెళ్ళాడు.
***
14 ఫిబ్రవరి 1990,
            "బెంగుళూరులో అది దిగిందో లేదో ఇంకా ఫోన్ చేయలేదు, దానికి వదిన్ని చూస్తే లోకం మర్చిపోతుంది. ఆడపడచూ వదినగార్లిద్దరూ కలిసారంటే ఒళ్లూ పోయా గుర్తుండదు"  అని రఘువాళ్ళ అమ్మ సన్నగా అంటోంది పాలు కాస్తూ. "ఎవరు నానమ్మా" అని అడిగిన ప్రశ్నకు సన్నగా నవ్వుతూ ఇంకెవరూ "మీ అమ్మ ’జానకి’కే..." అంటూ..." చేరిందోలేదో అది చేయకపోతే మీరైనా చేయచ్చుగా ఆ ఫోను నొక్కి" అంటూండగా... ఫోన్ రింగైంది అవతల నుంచి ఆడగొంతుక " నమస్తే, కాలింగ్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ లైన్స్, కెన్ వియ్ టాక్ టు మిష్టర్ రఘురామ్".. ఎవరో అమ్మాయి ఇంగ్లీషులో.. చూడండీ అని వంటింట్లోకెళ్ళింది... రిసీవర్ తీస్కున్న రఘువాళ్ళ నాన్న అవతలి విషయం విని స్థాణువైపోయాడు. అవతల అమ్మాయి చెప్పిన మాటలు చెవుల్లోనే మార్మోగుతున్నాయి మెదడులోకి వెళ్ళట్లేదు. "We are very sorry to inform you that Indian Airlines Flight 605 flying from Chhatrapati Shivaji International Airport, Bombay to Hindustan Airport, Bangalore is crashed while landing causing a loss of 92 lives......"  "ఏమైందండీ అలా ఉన్నారు ఏమైందీ... చెప్పండీ" అని ఆదుర్దాతో అరుస్తోంది వంటింట్లోంచి తొంగిచూసి పరిగెత్తుకొచ్చిన రఘువాళ్ళమ్మ. " మన కోడలు బెంగుళూరు చేరలేదే.." అంటూ వల వలా ఎడుస్తూ... "విమా... నం బెంగుళూరులో కూలిపోయిందిట" అని ఆయనా నిట్టనిలువునా కూలిపోయాడు.
***
            జానకి ఈ కుటుంబాన్ని వదిలి రెండేళ్ళు, తమ్ముడికి పిల్లలు పుట్టినా ఏ శుభకార్యమూ ఇక్కడ జరగలేదని శుభం కోరుతూ దగ్గరవాళ్ళని మాత్రమే పిలిచి రఘు తమ్ముడు దంపతులతో వ్రతం చేయించారు రఘు నాన్నగారు. మధ్యాహ్నం భోజనాలలో అందరూ కూడబలుక్కుని రఘుకి నచ్చ చెప్పాలని ప్లాన్ వేసారు.
"రఘూ! నామాట విను, పిల్లలా చిన్నవాళ్ళు, వాళ్ళనీ చూడడానికి ఓ మనిషి కావాలి, నీకా ఏమీ వయసవ్వలేదు ఇంకా ఎన్ని రోజులిలా చెప్పు, మీ అమ్మ, నాన్న, అక్క, పిల్లలు, తమ్ముడు వాడి కుటుంబం కూడా చూడాలి కదా!, మాటవిని పెళ్ళి చేసుకో, జీవితంలో తోడెప్పటికీ అవసరం" అని రఘు వాళ్ళ బావ చెప్తున్నాడు. "అంతా నావల్లే" అంటూ కొంగు నోటికడ్డం పెట్టుకుని గోడమీద జానకి ఫోటో చూస్తూ కన్నీరు కారుస్తోంది అక్క.
"అమ్మాయ్ ఇదిగో అలా జరగాల్సింది జరిగింది. నువ్వలా ఇదైపోకు.... వురేయ్ రఘూ! అవున్రా, ద్వితీయం తప్పేం లేదురా! కావాలని కాదుగా అలా జరగాల్సింది జరిగింది, జానకిలేని బాధ అందరికీ ఉంది, కానీ పిల్లలకి తల్లి కావాలి, నీకు తోడు కావాలి" అక్కా, మరదలు అందరికీ వడ్డిస్తున్నారు. "నీ పక్కన భార్య లేకపోతే రేపొద్దున్న నీ పిల్లలకి అచ్చటా ముచ్చటా ఎలా?” అంటోంది అక్క. “కుర్రాడికి ఉపనయనం చేయాలా! పిల్లకి అచ్చటాముచ్చటా తీర్చి కనీసం కన్యాదానం చేయడానికి నీ పక్కన ఒకరుండాలా. పెద్దమావయ్య వాళ్ళ వియ్యంకుడి తమ్ముడు పెళ్ళాంపోయాక, యాభయ్యో పడిలో ఒకావిణ్ణి చేరదీసి జీవితమిచ్చాడు. యూ షుడ్ నాట్ స్టాప్.. లైఫ్ మస్ట్ గో ఆన్ మై బోయ్" అని చెప్తున్నాడు మావయ్య.
"ఏం పర్లేదు బాబూ, మంచి అమ్మాయినే చూద్దాం, మా అమ్మాయినే తలుస్తూ ఎన్ని రోజులిలా ఉంటారు. మాకే కడుపు తరుక్కు పోతోంది. ఎప్పుడో తక్కువ పూలతో పూజ చేసుంటాను, నా కూతుర్ని తీస్కెళ్ళి మీకన్యాయం చేశాడా దేవుడు" అంటూ గుడ్ల నీరు నింపుకున్నారు జానకి నాన్నగారు.
            రఘు ప్రశాంతంగా భోంచేస్తూ, వాళ్ళమాటలు విని చిన్నగా నవ్వి. ఏ తొట్రుపాటూలేకుండా  మరదలి వేపు చూసి. "ఏమ్మా, నా పిల్లలని పెంచడానికి నీకేమైనా ఇబ్బందా?" అని అడిగాడు. "అదేంటి బావగారు అలా అన్నారు, పిల్లలంటే ప్రాణం అని తెలుసుగా అంది కళ్ళొత్తుకుంటూ. "ఏరా, నువ్వేమైనా ఇబ్బందనుక్కుంటున్నావా " అనడిగాడు తమ్ముణ్ణి చూస్తూ. "ఏంటన్నయ్యా. ఏం మాట్లాడుతున్నావు.... ఎప్పుడైనా అలా అనిపించిందా మా ప్రవర్తన?" అని అడిగాడు తమ్ముడు.
            అమ్మానాన్నల్ని చూస్తూ "చూడండి పిల్లలకి ఆలనా పాలనా చూడడానికి జానకితో సమానంగా పెంచడానికీ, ప్రేమ పంచడానికీ మరదలుంది, తమ్ముడికీ ఇబ్బంది లేదు. మంచీ చెడూ చెప్పడానికి మీరూ  నేనూ ఉన్నాము. ఇంకెందుకమ్మా ఇవన్నీ" అన్నాడు రఘు. "అదేవిట్రా! నీకూ ముద్దూ ముచ్చటా తీరనైనా తీరలేదు, అర్థాంతరంగా అది వెళ్ళిపోయింది నీజీవితం ఇలా ఐపోయింది తల్లిదండ్రులుగా నువ్వు సుఖంగా ఉండాలని మాకుండదా.. నువ్వు కన్న పిల్లకి నువ్వే కన్యాదానం చేసుకోలేని స్థితి ఎందుకురా, వయసూ ఉంది స్తోమతా ఉన్నాయిగా... అన్నయ్యా మీరే ఒప్పించాలి వీణ్ణి " అని ఏడుస్తూ చెప్తోంది రఘూ వాళ్ళమ్మ. " మళ్లీ ఓ సారి ఆలోచించరా " అని నాన్నకూడా అన్నారు.
            నాన్నా! మీరు ఎప్పుడూ చదివే రామాయణంలో రాముడికి తెలియని ధర్మమా ఇది, సీత లేకపోతే లవకుశులకు కళ్యాణం చేయడానికి ఇంట్లో శుభకార్యాలు, యజ్ఞయాగాలు చేయడానికీ ద్వితీయాన్ని ఎందుకు తెచ్చుకోలేదు? తెచ్చుకోలేకనా? కాదు! అది తన ధర్మం, సీతమ్మ మీద తనకున్న ప్రేమ... తన ధర్మపత్ని మీద ప్రేమే తనని ధర్మం వదలకుండా ఉండేలా చేసింది ..... కాదంటావా అమ్మా!? జానకి ఉన్నది కొన్ని నాళ్ళే ఐనా, ఉన్నప్పుడు ఎప్పుడూ విడిచి ఉండలేదు పురిటిక్కూడా పుట్టింటికి వెళ్ళనని నీ దగ్గరే ఉండిపోయింది కదామ్మా... వెళ్ళనంటున్నా ఒక్కదాన్నే పంపాను, ఇక తిరిగి రాలేదు. కానీ తన జ్ఞాపకాలు అందరిలోనూ పదిలంగా ఉన్నాయి. జానకి పంచిన జ్ఞాపకాలు, చేసిన సందడి జీవితానికి సరిపడా ఉన్నాయి మీరంతా భవిష్యత్తేదో భయంకరంగా ఉంటుందని ఊహించుకుని నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు."
            "మావయ్యగారూ,!.. ఆఁ మావయ్యా నువ్వూ, మీరందరూ కూడా వినండి. ధర్మ ప్రజాపత్యర్థం కదా పెళ్ళి చేసుకున్నది, జానకి మాకుటుంబానికి చక్కగా ఇద్దరు పండంటి బిడ్డల్ని బహుమతిగా ఇచ్చింది ఇంక దేనికోసం పెళ్ళి మావయ్యా? నేను పీటలమీద ఇంకెవరితోనో కూర్చుని కార్యక్రమాలు చేయకపోతే నాకు కలిగే నష్టం ఏమీలేదు. నాతమ్ముడు కూతురులాంటి మరదలూ చూస్కుంటారు , అది అధర్మమూ కాదు. వచ్చే వయసు పెరిగేదే కానీ తరిగేది కాదు. జానకి లేదన్న బాధ ఉంటుంది. ఐతే నేనుకానీ, కుటుంబంకానీ చింతతో ఉండడం దానికి ఇష్టం ఉండదు. నేనిప్పుడు ప్రశాంతంగానే ఉన్నాను, చింతేం లేదు మీరు ఈ విషయంపై చింత వదిలేయండి. నేనేమీ నా జీవితాన్ని త్యాగం చేయట్లేదు. నా పిల్లలకి తమ్ముడి పిల్లలకీ మా కుటుంబానికీ కావలసినది చక్కగా అమరుస్తున్నాను. వాళ్ళ అచ్చటాముచ్చటా చూడ్డానికి మరదలూ, తమ్ముడూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ ఎలా జరగాలో అలా జరుగుతాయ్" అని చెప్పి రఘు అందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. 
***
2017 హేమలంబ నామ సంవత్సరం వసంత నవరాత్రులు (ప్రస్తుతం)
            కేదారేశ్వర్ ఘాట్ వద్ద నెరిసిన జుట్టూ గడ్డంతో వీభూతి పుండ్రాలు కుంకుమ బొట్టూ పెట్టుకుని చేతిలో సంధ్యావందనం కిట్ పట్టుకుని " అదిగో నదిలో ఆ చివరనుండీ రెండు కఱ్ఱలు కొట్టుకొస్తున్నాయి చూశారా.. అరే… ఇప్పుడు చూడండి మధ్యలో ఒక ఒకదానితో ఒకటి చేరి ఇక్కడిదాకా వచ్చాయి... కనపడిందా.." "ఎక్కడ తాతయ్యా" "అదిగో అదిగో... సీ దేర్... ఆ రెండిటిలో ఒకటి ఏదో అడ్డొచ్చి ఆగిపోయింది, ఇంకోటి తన ప్రయాణం సాగిస్తూనే ఉంది." అంటూ తన చుట్టూ ఉన్న ఎనిమిది మంది మనవళ్ళకీ గంగా ప్రవాహం అందులో సుడులూ, పక్షులూ, అవతలి తీరం, ఆ ఘాట్లు అవీ చూపిస్తున్నాడు "జానకీ రఘురామ్". గంగపూజ చేస్తున్న రఘు తమ్ముడూ, మరదలూ ఆమాటలు విని వెనక్కి తిరిగి ముకుళిత హస్తాలతో తననే చూస్తున్నారు. సంసారంలో ఉన్నా అది అంటని యోగిని చూస్తున్నట్లు, నీళ్ళలోనే ఉన్నా తడి అంటని ఒక తామరాకుని చూస్తున్నట్లు.
***

3 comments:

  1. చాలా బాగుంది.....

    ReplyDelete
  2. చదివిన, నమ్మిన అంశాన్ని కధ రూపంగా అందరికీ తెలియజేశారు. బాగుంది.

    ReplyDelete

Pages