కూచిపూడి మేటిగురువు 'నాట్య విశారద' - వేదాంతం నరసింహశాస్త్రి గారు - అచ్చంగా తెలుగు

కూచిపూడి మేటిగురువు 'నాట్య విశారద' - వేదాంతం నరసింహశాస్త్రి గారు

Share This
 కూచిపూడి మేటిగురువు 'నాట్య విశారద' - వేదాంతం నరసింహశాస్త్రి గారు 
భావరాజు పద్మిని 


సంప్రదాయ కూచిపూడి భాగవతుల కుటుంబంలో పుట్టి, తమకు దైవదత్తమైన ఈ పవిత్రమైన వృత్తినే స్వీకరించి, తెలుగు వారు గర్వించదగ్గ ఒక కళాకారుడిగానే కాదు, తన శిష్యులను మెరికల్లా తయారుచేసే మేటి గురువుగా కూడా పేరు తెచ్చుకున్నారు వేదాంతం నరసింహ శాస్త్రి గారు. వారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల శింజారవంలో మీకోసం...
బాల్యంలో మీ నాట్యాభ్యాసం ఏ విధంగా సాగింది ?
మాది సంప్రదాయ కూచిపూడి భాగవతుల వంశం. నాన్నగారు వేదాంతం రాధేశ్యాం గారు అందరికీ నాట్యం నేర్పుతూ ఉండగా, ఆ గురుకులంలోని వారితో కలిసి, నేను కూడా నాట్యం చెయ్యడం ఆరంభించాను. నా నాలుగొవ ఏటి నుంచి నా నాట్యాభ్యాసం మొదలైంది.
మీరు వేసిన మొట్టమొదటి వేషం ఏమిటి?
మొదట్లో నేను జానపద నృత్యం చేసేవాడిని. ‘ఏరువాక సాగాలాన్నా’ అన్న పాట అది. మామూలు కూచిపూడిలో నేను చేసిన మొదటి ప్రోగ్రాం రామలింగేశ్వర స్వామి గుళ్ళో చేసాను. ఆ తర్వాత మచిలీపట్నంలో వేంకటేశ్వర స్వామి గుళ్ళో చేసాను. ఏడో ఏట నుంచే ప్రహ్లాదుడి వేషం వేసే వాడిని. పదేళ్ళ పాటు ‘భక్త ప్రహ్లాద’ యక్ష గానంలో ఈ వేషం వేసాను. వేదాంతం నరసయ్య శర్మ గారు హిరణ్యకశిపుడి వేషం వేసేవారు. పసుమర్తి రత్తయ్య శర్మ గారు లీలావతిగా చేసేవారు. మా బాబాయ్ వేదాంతం పాండురంగ శర్మ గారు కూడా హిరణ్యకశిపుడి వేషం వేసేవారు. దాదాపు ఒక
200 ల ప్రదర్శనలలో  ఈ ప్రహ్లాదుడి వేషం వేసాను నేను. మొదట్లో పెద్దవాళ్ళంతా శాస్త్రీయ నృత్యాలు చేసేవారు. ఇదివరకు పల్లెటూళ్ళలో ఎక్కువ కార్యక్రమాలు జరిగేవి కనుక, మధ్యలో పల్లె జనాన్ని అలరించేందుకు జానపద నృత్యాలు చేయించేవారు.
మీ నాట్య గురువులు ఎవరు?
 కూచిపూడి కళాక్షేత్రంలో నాన్నగారు అలాగే వేదాంతం నరసయ్య శర్మ గారు, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ గారు (అప్పట్లో ఆయన అక్కడ ప్రిన్సిపాల్ గా ఉండేవారు) వీరు ముగ్గురి దగ్గర నేర్చుకోవడం మొదలయ్యింది.
తర్వాత నెమ్మదిగా 12,13 వరకు అక్కడే నేర్చుకున్నాను. తర్వాత నాట్యంలో పలు కోర్సులు చేసాను. ఆ తర్వాత ఒక ఏడాది వెంపటి చినసత్యం మాష్టారు గారి దగ్గర ఉన్నాను. ఆయన దగ్గర కంపోసింగ్ నేర్చుకున్నాను. యక్ష గానాలు, కలాపాలు ఇటువంటి వాటిలో శిక్షణ తీసుకున్నాను. పార్వతీ పరిణయం అనే యక్ష గానంలో శివుడి వేషం, భ్రుంగి, శృంగి పాత్రలు ఇలా వెయ్యటం జరిగింది.
మీరు ఒక టీచర్ గా నాట్యాన్ని బోధించడం ఎప్పుడు మొదలుపెట్టారు? మీ విద్యాభ్యాసం ఎంతవరకు సాగింది?
చిన్నప్పటి నుంచి ఇంట్లోనే నాట్యం ఉండడం వల్ల గురువులు చెప్పినా సరే, చూసి నేర్చుకోడమే ఎక్కువ.పదో తరగతి నుంచి నేను నాట్యాన్ని బోధించడం కూడా మొదలుపెట్టాను. నాన్నగారు నన్ను పిలిచి, పిల్లలకు నేర్పమంటూ ఉండేవారు. అలా టీచింగ్ కూడా వచ్చేసింది నాకు. ఇక నా 14 వ ఏట మచిలీపట్నం వెళ్లి, చదువుకుంటూ భాషాప్రవీణ(తెలుగు పండిట్) కోర్స్ చేసాను.అది చేస్తూ పక్కన డాన్స్ క్లాస్సులు చెప్తూ ఉండేవాడిని. అలాగే అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలకు నేను స్వంతగా కొరియోగ్రఫీ చెయ్యటం కూడా జరిగింది.
వంశపారంపర్యంగా వస్తున్న ఈ వృత్తిని స్వీకరించాకా మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?
జీవితంలో ఇబ్బందులూ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను కూచిపూడి లో ఉన్నది 14 ఏళ్ళ వరకే. అంటే నా పదవ తరగతి వరకు అనుకోండి. ఆ తర్వాత నేను మచిలీపట్నం వచ్చాకా నా సంపాదనతో చదువుకోవడం, డాన్స్ కొనసాగించడం, అలాగే ఒక ప్రక్క ప్రభాకరశాస్త్రి గారనే వారివద్ద సంగీతం నేర్చుకోవడం,
అలాగే మృదంగం సత్యనారాయణ గారి వద్ద నేర్చుకున్నాను.
కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కాని కష్టపడాలి, కష్టపడితేనే గుర్తింపు వస్తుంది కదా.
అయితే మీకు సంగీతం, నాట్యం, మృదంగం, సాహిత్యం అన్నింట్లో అభినివేశం ఉందన్నమాట ! చాలా గొప్ప సంగతండి.
వీటన్నింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది కదా. డాన్స్ చక్కగా రావాలంటే, భావం పలకాలి, భావం పలకాలంటే తెలియాలంటే భాష రావాలి అప్పుడే ఎదుటివారికి చక్కగా అవగతం అయ్యేలా చెప్పగలం కదా !. ఇలా అన్నీ అనుసంధానమై ఉంటాయి. మా నాన్నగారు, బాబాయిలు కూడా భాషా ప్రవీణ వంటివే చదివారు.
మీ స్వంతగా నాట్యం కోసం ఏవైనా పాటలు కాని, బాలే లు కాని రాసారా?
రాయటం ఏమీ లేదు. కానీ టీచింగ్ సరిపోతుంది నాకు. కాకపొతే నృత్య రూపకల్పన మటుకు చేస్తాను.
మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు?
నేను ఒక 8 సం. ల క్రితం 2007 లో హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ‘వేదాంతం కూచిపూడి ఆర్ట్ అకాడెమి’ అని గాంధీనగర్ లో స్థాపించాను.
ఇన్నాళ్ళ మీ కళా జీవితంలో మీరు మర్చిపోలేని ప్రశంస ఏమిటి?   
చాలా మంది పొగుడుతూ ఉంటారు కాని, ఒక గురువు పొగడడం అనేది గొప్ప విషయం. అంటే మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన నాకు గురువే, కాని ఆయన నన్ను నేరుగా పొగడరు. పక్కవాళ్ళ దగ్గర ‘వీడొక మంచి కళాకారుడు ‘ అనేవారు. అలా మా బాబాయ్ కూడా పొగిడేవారు. అవి తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగేది. ఎవరైనా పొగడడం వేరు, గురువు పొగడడం వేరు కదా. అలా గురువుల ప్రశంస ఎక్కువ ఆనందం కలిగిస్తుంది.
ఈ వంశంలో జన్మించాను కాబట్టి, ఈ కళను కాపాడుతున్నాను అన్న పేరు చాలు. నా స్టూడెంట్స్ నలుగురికి ‘బాలశ్రీ’ వచ్చింది. కూచిపూడి నాట్యంలో మొదటి బాలశ్రీ నా విద్యార్థులకే దక్కింది. 
ప్రస్తుతం నాట్యం నేర్చుకోవడం మొదలవగానే, ఇంకా పరిపక్వం కాకుండానే  తమ పిల్లలు ప్రదర్శనలు ఇవ్వాలని
తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు. ఈ ఒరవడి మంచిదేనంటారా?
ఇది చాలా తప్పండి. ఉదాహరణకు నా వద్దకు ఒక 30 మంది పిల్లలు వచ్చారనుకోండి. అందరూ సరిగ్గా చెయ్యలేరు కదా. ‘ఈ పిల్ల బాగా పనికివస్తుంది, ఈమెను బాగా తయారుచెయ్యాలి ’ అని గురువుగా నాకు అనిపిస్తుంది. కాని నెల రోజుల్లో ఏమౌతుంది? యేవో వేసవి తరగతులు, వర్క్ షాప్స్ అంటున్నారు. వీటితో ఏమీ అవదు. నిజానికి వీటిలో డాన్స్ చెప్పకూడదు, డాన్స్ గురించి చెప్పాలి. అలా చెబితే వారికి అభిరుచి కలిగి తర్వాత కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాలుగు స్టెప్స్, నాలుగు జతులు, రెండు డాన్సులు, ప్రోగ్రాంలు... ఇలా ఉంటుంది పరిస్థితి. మళ్ళీ వచ్చే వేసవి వరకు వారేమీ చెయ్యరు. మేము 7,8 ఏళ్ళ పాటు ఎందుకు నేర్చుకున్నాము? అనంతమైన నాట్య కళను నెల రోజుల్లో ఒడిసి పట్టుకోవడం సాధ్యమేనా?నేర్చుకున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. అందుకే పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా మన సంప్రదాయ నాట్యకళ మీద అవగాహన, మక్కువ పెంచుకోవాలి.
కానీ ఇప్పటి కాలాన్ని బట్టి, చదువుల ఒత్తిడిని బట్టి, పిల్లలు పూర్తి సమయం నాట్యానికి కేటాయించలేక పోతున్నారు. అది అర్ధం చేసుకుని నడవాలి.
మీరు పొందిన అవార్డులు/ప్ర్రశంసల వివరాలు చెప్తారా?
మూడేళ్ళ క్రితం నాకు సంగీత నాటక అకాడెమి వారు ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత నాట్య విశారద, అభినయ నృత్య భారతి వంటి ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రశంసలు, అవార్డులు వస్తూ ఉంటాయి, కాని అవన్నీ పట్టించుకుంటే ఎదగలేము కదా. ఇంకా చిన్న వాళ్ళమే, బాగా ఎదగాలి, ఎన్నో చెయ్యాలి. కనుక ఆ గురువుల ఆశీస్సులు ఉంటే అన్నీ అవుతూ ఉంటాయి.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
ప్రస్తుతం నేను వేంకటేశ్వర స్వామి మహత్యం అని ఒక బాలే తయారు చేస్తున్నాను. నేను చాలా ఈ కళ లోనే పది మంది విద్యార్ధులను తయారుచెయ్యాలని సంకల్పం. పొట్టిగా ఉంటాను, పెర్ఫోర్మేర్ గా నేను పనికిరాను, గురువుగా పనికి వస్తాను. ఒకసారి HRD స్కాలర్షిప్ కు వెళ్లాను. జడ్జేస్ గా వెంపటి చినసత్యం గారు, వేదాంతం సత్యనారాయణశర్మ గారు మొదలైన వారు వచ్చారు. అప్పుడు ఒక ఐటెం చేసాకా, మాష్టారు గారు నన్ను లోపలి వచ్చి ‘పెర్ఫోర్మేర్ అవుదామని అనుకుంటున్నావా, లేక టీచర్ అవుదామని అనుకుంటున్నాను’ అని అడిగారు. ‘టీచర్ అవుతాను పెదనాన్నా’ అన్నాను. ఆయన పకపకా నవ్వారు. అంటే ఆ వయసుకే నాకు క్లారిటీ ఉందన్నమాట.
కళను ఏదో గొప్ప స్థాయికి తీసుకుని వెళ్లకపోయినా, నాకు తోచిన రీతిలో దీన్ని నలుగురికీ పంచి, వాళ్ళను మంచి పైకి తీసుకురావాలని కోరిక. శిల్పం లేకపోతే శిల్పి లేడు, శిల్పి లేకపోతే శిల్పం లేదు అన్నట్లు. విద్యార్ధుల ద్వారానే గురువుకి పేరు వస్తుంది. కూచిపూడి యక్షగానాలను, సంప్రదాయాలను కూడా బాగా పైకి తేవాలన్న సంకల్పం ఉంది. దీనికి అందరూ తగిన ప్రోత్సాహం అందిస్తే బాగుంటుంది.
'వేదాంతం కూచిపూడి ఆర్ట్ అకాడమీ' వారిని క్రింది నంబెరరు, ఈమెయిలు id లో సంప్రదించవచ్చు.
+91-09949446144. - వేదాంతం నరసింహ శాస్త్రి గారు.
***

No comments:

Post a Comment

Pages