విశ్వ నట చక్రవర్తి - శ్రీ ఎస్.వి.ఆర్. - అచ్చంగా తెలుగు

విశ్వ నట చక్రవర్తి - శ్రీ ఎస్.వి.ఆర్.

Share This
విశ్వ నట చక్రవర్తి  - శ్రీ ఎస్.వి.ఆర్.
పోడూరి శ్రీనివాసరావు 


అంతర్జాతీయ పురస్కారం పొందిన తొలి దక్షిణ భారత నటుడు – మన తెలుగునటుడు – శ్రీ ఎస్.వి.రంగారావు. అది కూడా పౌరాణిక సినిమా – నర్తనశాల – సినిమాలో కీచకపాత్రకు. ఒక ప్రతినాయక పాత్రలో అంతర్జాతీయ ప్రేక్షకుల, విమర్శకుల, విశ్లేషకుల హృదయాలను గెలుచుకున్నారంటే – ఆ సినిమాలో ఆయన, నటన ఎంతో గొప్పగా, హిమవద్నగాలను తాకేతంత స్థాయిలో ఉందంటే అతిశయోక్తి కాదు.
          ‘విశ్వనటచక్రవర్తి’ బిరుదు పొందిన శ్రీ ఎస్.వి.రంగారావు పూర్తి పేరు – సామర్ల వెంకటరంగారావు. 03-07-1918 వ తేదీనాడు కృష్ణాజిల్లాలోని ‘నూజివీడు’లో శ్రీ కోటేశ్వరరావు,శ్రీమతి లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు జన్మించారు శ్రీ ఎస్.వి.రంగారావు. బి.యస్.సి. చదివిన శ్రీ ఎస్.వి.రంగారావు అగ్నిమాపకశాఖలో ఉన్నతోద్యోగంలో చేరారు. షేక్స్పియర్ ఇంగ్లీషు నాటకాలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి, ప్రముఖ రంగస్థల కళాకారుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారు.
          శ్రీ బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన ‘వరూధిని’ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు సినీచిత్రరంగ ప్రవేశం చేశారు.
మనదేశం, పల్లెటూరిపిల్ల, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, బాలభారటం, మాయాబజారు, తాతామనవడు, చంద్రహారం, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, నర్తనశాల, సంతానం, సతీసావిత్రి, భక్తప్రహ్లాద, శ్రీకృష్ణలీలలు, యశోదకృష్ణ, పాండవవనవాసం, శ్రీకృష్ణాంజనేయయుద్ధం, సంపూర్ణరామాయణం, దీపావళి, అనార్కలి,మహాకవి కాళిదాసు, భట్టివిక్రమార్క, బొబ్బిలియుద్ధం, భూకైలాస్, అందరూదొంగలే, అలాఉద్దీన్ –అద్భుతదీపం, చరణదాసి ,మొనగాళ్ళకు మొనగాడు, లక్ష్మీనివాసం, బంగారుకలలు, అప్పుచేసి పప్పుకూడు, జయభేరి, ఆడబ్రతుకు, దసరాబుల్లోడు, చరరంగం,........ఇలా చెప్పుకుంటూ పొతే ఎస్.వి.రంగారావు నట విశ్వరూపం చూపించిన చిత్రాలు కో...కొల్లలు.
          శ్రీ యస్.వి.రంగారవు సతీమణి శ్రీమతి లీలావతి వీరి వివాహం 27-12-1947 న జరిగింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు.యస్వీఆర్ వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు.  చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు.
నర్తనశాలలోని శ్రీ ఎస్.వి. రంగారావు పోషించిన కీచకపాత్రకు- ఇండోనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు.
 కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం   చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.యస్.వి. రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. యస్.వి.రంగారావు దర్శకత్వం వహించిన రెండు తెలుగుచిత్రాలు కూడా ఉత్తమ చలన చిత్రాలుగా నది అవార్డులను కైవసం చేసుకున్నాయి.
          తన చలనచిత్రకాలంలో 25 సంవత్సరాలలో సుమారు 162  చిత్రాలో వివిధ జనరంజక పాత్రలను ఎస్.వి రంగారావు పోషించారు.
          ఇటువంటి నటనాచక్రవర్తి, సహజనటుడు, 18 – 07 – 1974  న చెన్నైలో తన 57 వ పుట్టినరోజు పూర్తి చేసుకున్న పదిహేను రోజులకి, గుండెపోటుతో ఆకస్మిక మరణం పొందారు. ఏ సిన్మాలో చూసినా, ఒక నటుకిగా కాక, మన ప్రక్కింట్లోనో , మన స్వంత ఇంట్లోనో , మన మధ్య తిరిగే మనిషిగా, ఏపాత్ర లో నైన పరకాయ ప్రవేశం చేసే శ్రీ ఎస్.వి.రంగారావు మనమధ్య లేరంటే.... చలనచిత్ర పరిశ్రమే కాదు, యావత్ ప్రేక్షకలోకం నివ్వెరపోయింది. ఆయన హఠాత్ మరణానికి దిగ్బ్రాంది చెందింది. కేరెక్టర్ నటుడిగానే కాదు, హాస్యపాత్రాల లోనూ,ప్రతినాయకుడు (విలన్)గా కూడా  ఎస్.వి.రంగారావు తనదైన ముద్ర వేశారు. తెలుగు చిత్రాలలోనే గాక, తమిళచిత్రాలలో సైతం ఎంతోమంది ప్రేక్షకాభిమానులను సంపాదించు కున్నారు. ప్రేక్షకులు ఎస్.వి.రంగారావును ముద్దుగా ఎస్.వి.ఆర్. అనీ యశస్వీ రంగారావు అనీ పిలుచుకునేవారు.

2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.
****

No comments:

Post a Comment

Pages