నాకు నచ్చిన కధ- శ్రీ అడవి బాపిరాజు గారి కధ "వాన" - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కధ- శ్రీ అడవి బాపిరాజు గారి కధ "వాన"

Share This
నాకు నచ్చిన కధ- శ్రీ అడవి బాపిరాజు గారి కధ "వాన"
అంబడిపూడి శ్యామసుందర రావు

తెలుగు సాహిత్యములో అడవిబాపిరాజుగారికి ప్రత్యేకమైన స్థానము ఉంది. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈయన నారాయణ రావు,హిమబిందు,గోన గన్నారెడ్డి ,జాజిమల్లి,శాంతిశ్రీ వంటి ,అనేక గేయాలను ,రేడియోనాటికలను కదా సంకలనాలు తెలుగు పాఠకులకు అందించిన మహోన్నత వ్యక్తి. వీటన్నటికి తోడు ఈయన మంచి చిత్రకారుడు. ఈయన చిత్రాలకు విదేశ బహుమానాలు లభించాయి రాజమండ్రిలో 1915లో బి.ఏ చదువుతున్నప్పుడు ప్రిన్సిపాల్ కౌల్డ్రే ప్రభావంతో చిత్ర కళలో
ప్రవేశాన్ని పొంది క్రమముగా ప్రావీణ్యతను సంపాదించారు. 1895లోపశ్చిమ
గోదావరిజిల్లాలోని భీమవరానికి సమీపానగల సరిపల్లె అనే గ్రామములో
జన్మించారు 1922లో గాంధీ ఉద్యమములో పాల్గొని ఒక ఏడాది జైలు శిక్ష
అనుభవించారు. 1929లో బి.ఎల్ చేసి బందరు జాతీయ కళాశాల అధ్యక్షుడిగా నాలుగేండ్లు పనిచేశారు చలన చిత్ర దర్శకుడిగాకూడా పనిచేశారు ఈయన మంచి ఈతగాడుకూడా. సాహితి ప్రపంచములో, చిత్రకళలో అనేక ప్రయోగాలు చేసి అందరి మన్ననలు పొంది 1952లో మృతి చెందారు.
ఆయన కధలలో "వాన"అనే కధ గురించి ముచ్చటించుకుందాము. ఈ కధచదువుతున్నప్పుడు జానపద సాహిత్యాన్ని కూడా చదువుకొని అందిస్తాము ఎందుకంటే ఈ కధ లో మంచి జానపదుల పాటలు ఉంటాయి కధే ఒక మంచి జానపదుల పాటతో ప్రారంభమవుతుంది. ఈ కధలోని కధానాయకుడు,కథానాయకి ఉప్పరి కులస్తులు(అంటే మట్టి పని చేసుకొని
బ్రతికే శ్రామీకజీవులు). ఆ కులములో వాళ్లిద్దరూ ఉత్తుంగ శిఖరాలు. అతడు
మదించిన యవ్వన సింహము ,ఆమె నూత్న లావణ్య శోభావతి అయిన అడ సింహము.

కథానాయకి పేరు నీలాలు. ఒక పెద్ద జట్టుకు నాయకుడై ,అయిదు ఎకరాల
మాగాణి,అరెకరాల మెరకకు యజమాని గా సాలుకు రెండు వందల యాభై రూపాయల ఆదాయమే కాకుండా ఇతరత్రా మట్టిపనుల వల్ల మరో వంద దాకాఆదాయము సంపాదిస్తున్న హనుమన్న ఏకైక కుమార్తె నీలాలు .తనఏకైక కుమార్తె నీలాలుకు తగిన మంచి సంబంధము కోసము గాలిస్తూ జిల్లా దాటి వేరే జిల్లాలకు కూడా వెళ్ళాడు.చివరకు పొరుగు జిల్లాలో ఒక జట్టు నాయకుడు,నాలుగు ఎకరాల మాగాణి భూమి మీద బాగా ఆదాయము ఉండి,మట్టి పనులు చేస్తూ సంపాదించే నాగన్నను అల్లుడుగా తెచ్చుకున్నాడు హనుమన్న.తన పెళ్లినాటి సంగతులనుజ్ఞాపకము చేసుకుంటూ వాన పడుతున్నప్పుడు తన గుడిసె గుమ్మములో దీనంగా కూర్చుని పాట పాడుకుంటుంది
'ఎల్లీ జగ్గాయిపేట యెన్నంగ నేను పొతే
ఎగరేసి వలపులు జల్లే దూడమ్మా దూడ
దూడా సిగ తీసి కొప్పు బెట్టి సింధూరం బొట్టు పెట్టి
నా అందము నవ్విపోను దూడమ్మ దూడ దూడా
రంగు రంగుల దూడ గంతూ చెంగుల దూడ
దూడమ్మా దూడ దూడ చూడమ్మ దూడ దూడా !" అంటూ పాడే పాట వాన చినుకుల శ్రుతిలో కలిసి పోతుంది. జుట్టు అయినా దువ్వుకోకుండా గుడిసె గుమ్మములో నవ్వు లేని కళ్ళతో అతి దీనత్వము అలుముకున్న ముఖముతో నుదిటిపై బుక్కా రంగయ్య దగ్గర కొన్న కుంకుమ బొట్టు సూర్య బింబములా,కంటికి పెట్టిన కాటుక కన్నీటితో కలిసి నున్ననైన ,నల్లనైన చెక్కిళ్ళపై కారుతుండగా గుండెల్లోని భాధను అణుచుకుంటూ తీయని తన మధుర కంఠము జీర పోవ పాట సాగించింది.

అద్ద రూపాయి పెట్టి అద్దాల రవిక కొంటె,
రవికన్నా చిరగలేదే దూడమ్మ,దూడ,దూడా
కోటప్ప తిరణా లెల్లి కోరిన సవరం తెస్తే
కొప్పన్నమాయ లేదే దూడమ్మా,దూడ దూడా
మూడు రూపాయ లెట్టి ముత్యాలపాపిట బొట్టు
బొట్టన్నా చెరగలేదే దూడమ్మా దుడా!
అని పాట పాడుకుంటూ తన జీవితమంతా నిండిపోయిన భర్త ఉప్పరి నాగన్న తనకు మొదటిసారిగా ప్రత్యక్షమైన నాగన్న రూపము నీలాల కళ్ళలో మెరుపు మెరిసింది.

ఆనాడు అతగాడు పాడిన పాట ను గుర్తుకు తెచ్చుకుంది
"బెజవాడ చిన్నదాన ,బాజుబందులదానా
బాజుబందుల మీద మన సెల లేదే ఓ చిన్నదానా
ఆ పాట విన్న తనలో కలిగిన మధుర అనుభూతులు రహస్య భావాలు ఆమెలో ఎక్కడో పెద్ద ఏరులా బయలుదేరినాయి.
పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకు వచ్చిన నాగన్న భార్య ను చూచి
ఉప్పొంగిపోయాడు వారి సంసారజీవితము చాలా హాయిగా సంతోషముగా చక్కటి జాన పదాల పాటలతో సరస సల్లాపాలతో చక్కగా సాగిపోతుంది.
అటువంటి తన దొర తనరాజు అయినా నాగన్నను ఆ ఊరి పెద్దరైతు (భూ
కామందు)అన్యాయముగా ఖైదులో ఏయించాడు అంతటితో ఆగకుండా పెద్ద రైతు నాగన్న పొలాన్ని ఆక్రమించుకోవటానికి వాన లో పదిమంది పాలేళ్ళతో వస్తున్నాడని ఉప్పరి చలమయ్య ద్వారా కబురు తెలిసిన నీలాలు అడ వేట కుక్కలా లేచింది ఆ వానలోనే గూడెం అంతటిని పోగుచేసి దుడ్డు కఱ్ఱ పుచ్చుకొని సివంగిలా ముందుకు నడిచిందింరో వైపు పెద్ద రైతు పాలేర్లు వచ్చారు నీలాల కళ్ళలోని ఎరుపులుచూసిన పెద్ద రైతు గుండెల్లో చీకటి పొగలు కమ్మాయి.
"నా పొలములో ఏ ఎదవ అడుగెడతాడో ఆణ్ణి సంపేసి ఇక్కడే పాతేస్తాను," అని ఆడపులిలా గర్జించింది. పెద్ద రైతు మీసాలు రెండూ కోపముతో వణికి పోయాయి.
దీని మొగుడి పొగరు అణిచినట్లు దీని పొగరు అణచాలి అని మనస్సులో అనుకోని పైకి బింకంగా ,"ఈయాల్టికి ఊరుకుంటున్నాను రేపు అడ్డము వచ్చావో పదిమందిలో నీ సీర వొలిచి వాత లెయిస్తాను ",అని అరిచాడు
"ఓరి చచ్చు నాయనా! దౌపదమ్మ గారి సీర వొలిచిన యదవ రక్తం ఆమె మొగుడు భీముడు తాగాడు గాని,నీ రక్తాన్ని నేను పుడిసిళ్ల తాగనుట్రా " అని నీలాలు పెద్ద రైతును హెచ్చరించేటప్పటికీ నీలాలూను పెద్దరైతు కన్నెత్తి చూడలేకపోయాడు.
పెద్ద రైతు పాలేర్లు వెళ్ళిపోయినా పొలం గట్టున ఉన్న ఉప్పరి నాగన్నఇంట్లోనే ఉప్పర్లందరూ ఆరాత్రంతా కునికి పాట్లు పడుతూ కూర్చున్నారు. జడివాన కురుస్తూనే ఉంది. రకరకాల నేలలు అవి వానలో తడిసినప్పుడు వచ్చేసువాసనలు నేలను త్రవ్వుకుంటూ బ్రతికే ఉప్పర్లకు చిరపరిచితము వాళ్ళు ఆ వాసనలను బట్టి నేల స్వభావాన్ని చెపుతారు. ఈ పరిమాళాలన్నీ ఉప్పర్ల జీవితాలలో నిండి ఉంటాయి. ఉదయము కాకుండానే ఉప్పర్లు
దున్నలు కట్టి పొలం దున్నేశారు వాన వారి చుట్టము,మబ్బులు వారి
చుట్టాలేకదా ఇంకా ఎవరయ్యా నీలాల పొలము లో అడుగు పెట్టేది .
పెద్ద రైతుకు నాగన్నకు గొడవకు కారణము తెలుసుకుందాము.
నాగన్న వాళ్ళ ఉప్పర పల్లె ఒక పెద్ద గ్రామానికి శివారు ఆ గ్రామములో నూరు ఎకరాల ఒక పెద్దరైతు పొలము అనుకోని నాగన్న మూడెకరాల పొలము ఉంది. నాగన్న పొలము కాలవ గట్టు పొడుగునా ఉంది కాబట్టి నాగన్న పొలము తడిసినాకే పెద్ద రైతు నూరెకరాలకు నీరు అందుతుంది. పెద్దరైతుకు ఇతర గ్రామాలకుడా భారీగా పొలాలు ఉన్నాయి.
పెద్దరైతు నాగన్నను ఆ మూడు ఎకరాలు అమ్మమని అడిగినంత ధర ఇస్తానని ,ఎంతమంది చేతో చెప్పించాడు నాగన్న," రక్తపు బొట్లు ధారపోసి కోన్న పొలము నా ప్రాణాలు ఆ భూమిలో ఉన్నాయి నేను అమ్మను గాక అమ్మను, నా పెద్దభార్య భూమి సిన్నదే నీలా "అని ఖచ్చితముగా చెప్పాడు. పెద్దరైతుకు పంతము పట్టుదల పెరిగింది."అయితే నీకు భూమి దక్కదు నీలాలు దక్కదు ",అని నాగన్నను బెదిరించాడు.
మర్నాడుపెద్దవాన మొదలైంది ఆ వానలో పోలీసులు వచ్చి నాగన్నను దొంగతనమునేరము మీద అరెస్టు చేసి జైలుకు తరలించారు పెద్దరైతు వల్ల భాధలు పడ్డ ఒకడు పెద్ద వకీలు మంచివాడు అయినా వీరాస్వామి నాయుడిగారికి నాగన్న విషయము చెప్పి అయన నాగన్న తరుఫున కేస్ వాదించేందుకు ఒప్పిస్తాడు ఆ వకీలు గారు కూడా మంచి హ్రదయముతో నాగన్న విషయము అర్ధము చేసుకొని నాగన్న పొలము దగ్గర
అల్లరి జరగకుండా చూడ మని పోలీస్ ఇనస్పెక్టర్ తో చెబుతాడు.
పుట్టింటికి పోకుండా నీలాలు భర్త కోసము అతని ఇంట్లోనే ఎదురుచూస్తూ
ఉంటుంది నీలాలుకు తోడుగా ఉప్పరి పెద్ద పెళ్ళాము వచ్చి నీలాలు కు ఆసరాగా ఉంది.
"చలమయ్య అన్నను ప్లీడర్ గారి దగ్గరకు పంపినాను కదా ఇంకా అన్న బావ ఉసెట్టు కు రాలేదింటి",అని ఆలోచిస్తున్నది. ఇంతలో వెనకాల ఎవరో వచ్చి
కళ్ళు మూశారు "చంపేత్తాను చేతులు తీయరా"అని ఎక్కడా లేని బలముతో చేతులు లాగి పారేసి వెనక్కు తిరిగి చుస్తే నాగన్న ఉన్నాడు. నాగన్న నవ్వుతూ ,"ఎంత బలము ఉందే పిల్లా నీకు చూడు నాయేళ్లు రగతము వస్తున్నాయి "అని అంటాడు.
"నాభావే "అని ఆనందముతో నాగన్నమీద వాలిపోతుంది.
"ప్లీడరయ్యగారు బేలు మీద ఇడిపించారు ఆర్ని నువ్వే పెట్టించావంటగా నీమెడలో బంగారు గుళ్ల పేరు తాకట్టు పెట్టావంటా నువ్వు మాలచ్చివే పిల్లా "అని నాగన్ననీలాల్ని గుండె కదిమేశాడు.
వాన తగ్గింది సాయంకాలము ఎండ బంగారు రంగులు చల్లిందా కౌగింతలో ఉన్న దంపతులమీద
" ఇద్దారి మనసూ లేకమైపోతే
పొద్దున్న సూరీడు ముద్దెట్టు పూలు
ఇద్దారి బతుకులు ఏకమైపోతే
సందేల సూర్యుడు సెంద్రుణ్ణి ఇచ్చు"
ఆ దంపతుల ప్రేమానురాగాలు చూసి భూమి మూసి మూసి నవ్వులు నవ్వుకుంది .
***

No comments:

Post a Comment

Pages