సామాజిక, సాహిత్య వికాస స్ఫూర్తి, మహిళా కల్పతరువు, బహుముఖీన సాహిత్య ప్రజ్ఞాశీలి, బాలబంధు - ఇల్లిందల సరస్వతీదేవి
ఇల్లిందల సరస్వతీదేవి (1918-1998) – శతజయంతి ప్రారంభం – 15 జూన్
ఇల్లిందల సరస్వతీదేవి గారి శతజయంతి సంవత్సరం (2017-18) 15 జూన్ 2017 నుంచి ప్రారంభమై, రాబోయే 15 జూన్ 2018 వరకూ కొనసాగుతుంది.
సేవాపరంగా ఈ సరస్వతికి – సమాజం, సాహిత్యం – రెండు విశాల నేత్రాలు. ఎల్లలూ, పరిధులు, పరిమితులూ లేకుండా ఎక్కడ నివసించినా, తనదైన విశాల దృక్పథాన్ని, సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకొన్నారు. ఆనాటి ఆంధ్రప్రాంతంపుట్టినిల్లైతే, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తెలంగాణా ప్రాంతం మెట్టినిల్లు చేసుకుని, రెంటికీ నిండు గౌరవాన్ని సంపాదించిన ఘనత ఈ నారీమణిదే. ఇల్లిందల సరస్వతీదేవి మంచి రచయిత్రి మాత్రమే కాక, సంఘసేవలోనూ ముందడుగే. ఒక మహిళగా, మహిళా చైతన్యం కోసం హైదరాబాద్ లో ఆవిర్భవించిన మహత్తర సంస్థగా “ఆంధ్ర యువతీ మండలి” ప్రస్తావనకు వచ్చిన వెంటనే మనకు గుర్తుకువచ్చే మహిళామూర్తి పేరు నిర్ద్వంద్వంగా ‘ఇల్లిందల సరస్వతీదేవి”గారిదే.తెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు.
“తెలంగాణా కోడలిగా తెలుగు దేశానికిదే నా భక్త్యాంజలి” – ఇల్లిందల సరస్వతీదేవి
పెదతల్లి ప్రోత్సాహం
నేటి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరిజిల్లా, నర్సాపురం లో 15 జూన్ 1918న కామరాజు రత్నమ్మ – వెంకటప్పయ్య దంపతులకు జన్మించగా, చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుని, పెదతల్లి రమణమ్మ గారి పెంపకం, ప్రోత్సాహంతో – శ్లోకాలు, కథలపట్ల ఆసక్తి కలగడమే కాక, రామాయణ, భారత, జానపద కథలను ఆపోశనం పట్టి, స్త్రీల పాటలను చదవడం, పాడడం చేసే పెదతల్లి ప్రేరణలు సరస్వతీదేవి పై ప్రభావం చూపించాయి. తండ్రితోపాటు ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు వెళ్ళడంతో, ఈమెకు ఆయా ప్రాంతాల సదాచార, సంప్రదాయ, సంస్కృతీ సంపదని ఆకళింపు చేసుకోవడం వ్యక్తిత్వంలో దర్శనీయమైంది. ఈ ప్రస్థానంలో సురభి నాటకాలు, పుస్తకాలు చదవడం బాల్యంలోనే భాగమయ్యాయి. రచయిత్రిగా రూపకల్పన చేసుకోవడంలో ఈ నేపథ్యం చాలా అక్కరకు వచ్చిందనే చెప్పాలి. భర్త సీతారామారావు గారు సంస్కారవంతుడు, సాహిత్యాభిలాషి అవడం, బాల్యవివాహం జరిగినా, వివాహంతోనే సాధారణంగా చదువుకు భరతవాక్యం చుట్టే పరిస్థితినుంచి వైవిధ్యంతో భర్తే, హైదరాబాద్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో తొమ్మిదవ శ్రేణిలో చేర్పించడం, చదువుపట్ల అబిలాషను గమనించి, సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం గ్రంథాలయం నుంచి పుస్తకాలను ఆయనే స్వయంగా తీసుకువచ్చి చదివింపజేసిన నేపథ్యం – సరస్వతీదేవి వ్యక్తిత్వంలోని సృజనాత్మకతకు పునాదులు వేసిందన్నది నిజం.
సరస్వతీదేవి మొదటి రచనకూ ‘గోలకొండ పత్రిక’ ప్రోద్బలమే!
కందుకూరి, గురజాడ, శ్రీపాద, మల్లాది వారల సాహిత్యాన్ని కూలంకషంగా చదవడం పట్ల ఆసక్తి పెంచుకున్న సరస్వతీదేవి – శరత్, ప్రేమచంద్ ల సాహిత్యాన్ని కూడా చదివారు. సార్వజనీన సిద్ధాంతాలపట్ల మక్కువ, మానవీయ విలులువలను ఆకళింపు చేసుకోవడం, కుటుంబ వ్యవస్థ, సామాజిక సమస్యలు, మానవ మనస్తత్వ ధోరణుల నేపథ్యంలో తన సాహితీసృష్టిని విస్తృతపరచుకున్న సరస్వతీదేవి, యితర సాహిత్య ప్రక్రియలతోపాటు, ప్రథానంగా ‘కథ’ ప్రక్రియను ఎన్నుకోవడం సమంజసమే కాక, వీరి సాహిత్యసేవా వ్యక్తిత్వానికి వన్నెతెచ్చింది.ఈమె మొదటి కథ, వ్యాసాల్ని ‘గోలకొండ’పత్రిక లో 1933 లో ప్రచురితమవడంతో – తెలంగాణలో కవులు లేరు అన్న అపవాదుతో, త్రోసిరాజని తనదైన సంకల్పంతో ‘గోల్కొండ పత్రిక’కు వ్యవస్థ చేకూర్చి తొట్టతొలి సంచికలోనే వందలకొద్దీ కవులను, రచయితలను – తెలంగాణా వైతాళికుడుగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డిగారి ద్వారా పరిచయం చేసిన ఘనతలో భాగంగా – ఇల్లిందల సరస్వతీదేవి గారికీ దొరకిన ఆ అవకాశం ఒక సువర్ణావకాశంగానే భావించక తప్పదు. యిలా లభించిన తొలి అవకాశంతో జీవితం చివరివరకూ ఈమె తన రచనా వ్యాసంగాన్ని నిరంతరధారగా కొనసాగించారు.
భావి దార్శనికత
కవి స్వాప్నికుడు; దార్శికుడు అన్న సిద్ధాంతం సుస్పష్టంగా సరస్వతీదేవి గారి సాహిత్య, సామాజిక సేవారంగాల్లో చేసిన కృషిలో వెల్లడవుతుంది. సంఘసేవలో భాగంగా కనుపర్తి వరలక్ష్మమ్మ గారి “స్త్రీహితైషు మండలి” స్ఫూర్తిమంతం, జైలులో నిత్య సందర్శక సేవలను అందించడం, మహిళా ఖైదీలతో సన్నిహిత సపర్య సంభాషణలతో, ప్రేమ సానుభూతులతో ఆదరణకు గురిచేయడం, వారి మానసిక పరివర్తనకు తోడ్పడడం వారి సంఘసేవలో ప్రముఖ పర్వంగా భావించాలి. ఆనాడే అనాధ, వృద్ధాశ్రమాలను గమనించి, అసలు భారతదేశంలో ఈ ఆశ్రమాల అవసరం ఏమిటని తనలో తాను ఆవేదన పడేవారు. అవే ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా వెలసిల్లడం – తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధుల పట్ల కుటుంబాల్లో చోటుచేసుకున్న నిరాదరణలపట్ల ఆనాడే తనదైన భావి దార్శనికతను ప్రకటించాడంలోనే వీరి ప్రతిభ ద్యోతకమవుతోంది.
ఇల్లిందల సరస్వతీదేవి 31 ఆగష్ట్ 1998 న కీర్తిశేషులైనారు.
రచనలు:
కథలు
స్వర్ణ కమలాలు (నూరు కథల సంపుటి) – ఆంధ్రప్రదేశ్ & కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు; తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలోకి కూడా జరిగన ప్రచురణ పట్ల, ఈ రచన చాలా విస్తృతిని పొందింది.
తులసి దళాలు (108 కథల సంపుటి)
రాజహంసలు (5 పెద్ద కథల సంపుటి)
నవలలు:
దరిజేరిన ప్రాణులు, జీవిత వలయాలు, నీ బాంచన్ కాల్మొక్కుతా, అనుపమ, జీవిత పాఠం, చీకటి వెలుగులు;
నవలికలు:
కొండంత మబ్బు, మంచివాడు
వ్యాస సంకలనాలు
నారీ జగత్తు, జీవన సామరస్యం, వెలుగు బాటలు, కళ్యాణ కల్పవల్లి, వ్యాసతరంగినణి, తేజోమూర్తులు
స్త్రీల పాటలు – జాతి రత్నాలు
(లక్ష్మణ దేవర నవ్వు, సత్యభామ సరసము, ధర్మాంగద చరిత్ర, ధర్మరాజు జూదం, ఊర్మిళాదేవి నిద్ర)
జీవిత చరిత్ర – ఇందిరా ప్రియదర్శిని (ఇందిరాగాంధీ జీవిత చరిత్ర)
రేడియో నాటికలు – రాగంలో రంగులు
కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీ, ఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. కథాసంకలనాలు వెలువరించారు. మనము - మన ఆహారము (అనువాదము) అన్న రచన కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది.
పదవులు, సత్కారాలు – సన్మానాలు
1958-66 : ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యురాలు
1964 : గృహలక్ష్మి స్వర్ణకంకణం సత్కారం
1974: ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఉత్తమ రచయిత్రి పురస్కారం
1978: ఆంధప్రదేశ్ బాలల అకాడమీ– బాలబందు పురస్కారం
1982: స్వర్ణకమలాలు - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
సామాజిక, సాహిత్య వికాస స్ఫూర్తి, మహిళా కల్పతరువు, బహుముఖీన సాహిత్య ప్రజ్ఞాశీలి - ఇల్లిందల సరస్వతీదేవి గారి ప్రతిభా జీవన వ్యక్తిత్వ వికాసం – ఆమె రచనల ద్వారా అందజేసిన భావాలే చెబుతాయి:
రచనలకు వనరులు, నేపథ్యాలు – ఆమె మాటల్లోనే
దేశ కాల పరిస్థితుల ప్రభావం మానవాళిపై ఎంత పడ్డదో, దేశాభివృద్ధి కి తోడ్పడుతుందని ఆశించిన శాస్త్ర విజ్ఞానం దేశ వినాశానికి ఏవిధంగా చోటు చేసుకుంటున్నదో, అన్ని రంగాల్లో నూతనంగా ఆవరించుకుంటున్న నాగరికత మేఘాలు మానవాళిని సత్య గుణం నుంచి ఏ విధంగా దూరం చేస్తున్నాయో నా శక్తి మేరకు చూపించాను. (తులసి దళాలు)
కంటితో చూసిన దృశ్యాలే ముడిసరుకులుగా వాడుకున్నా. (రాజహంసలు)
స్త్రీ మన:ప్రవృత్తిని వివిధ కోణాల్లో దర్శనీయం చేయగలిగాను (నవలలు)
స్త్రీల జీవితాల్లోని పలు అంశాలను ఆలోచనా స్ఫోరకంగా విశ్లేషించడం పట్ల – వ్యాసంలో –
“పెత్తనాలకి రాకపోయినా, పేరంటానికి బయలుదేరితే ఏ ఒక్కరి దగ్గరైనా ఆకర్షణీయమైన ఆభరణం కంటబడక మానదు; తళతళ మెరిసే చంద్రహారం ఎంతో బాగున్నట్టు అనిపిస్తుంది; పక్క వీధిలో ఉన్న ఇల్లాలి కాఫీ గింజల హారం కంటికి నచ్చినట్లుంటుంది. ఈ రెండూ కంటికి నచ్చినవే. సమయానుకూలంగా అలంకరించుకోవడమూ ఒక కళ.”
***
No comments:
Post a Comment