దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత ‘కళాతపస్వి’ పద్మశ్రీ కె.విశ్వనాథ్ - అచ్చంగా తెలుగు

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత ‘కళాతపస్వి’ పద్మశ్రీ కె.విశ్వనాథ్

Share This
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత
‘కళాతపస్వి’ పద్మశ్రీ కె.విశ్వనాథ్
 పోడూరి శ్రీనివాసరావు.


9849422239

భారతదేశంలో అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ లాగే భారతీయ చలనచిత్రరంగంలో అత్యున్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్’ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ అత్యున్నత పురస్కారం భారతీయ సమాచారశాఖ ద్వారా ఈ పురస్కారం అందజేయబడుతుంది. భారతదేశంలో గల అన్ని భాషా చిత్రాలలో, చలనచిత్ర పరిశ్రమకు అత్యున్నత సేవలను అందించిన వ్యక్తికి, కమిటీ గుర్తించి, ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. పదిలక్షల రూపాయలతో కూడిన నగదు పురస్కారం,స్వర్ణకమలం, శాలువా, పతకం, ప్రశంసాపత్రం – ఈ పురస్కారంగా అందజేస్తారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా, ఢిల్లీ రాష్ట్రపతి భవనంలో జరిగే ఈ పురస్కార ప్రసారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తారు.
        1969 వ సంవత్సరం నుంచి ఈ పురస్కార ప్రదానం చేయడం ప్రారంభించారు. గత 48 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ పండుగలో ప్రథమ పురస్కార గ్రహీత సినీతార దేవికారాణి. 2016 వ సంవత్సరానికి గాను, ఈ పురస్కారానికి ప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు, శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారిని ఎంపికచేయడం జరిగింది.
        ఇన్ని సంవత్సరాల ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రదానోత్సవంలో 2016 వ సంవత్సరానికి గాను ఎంపికకాబడ్డ శ్రీ కె.విశ్వనాథ్ గారు ‘కళాతపస్వి’గా సుప్రసిద్ధులు. వారీ అత్యున్నత పురస్కారం అందుకున్నతెలుగు వారిలో ఏడవవారు. ఈ పురస్కారం స్వీకరించిన తెలుగు ప్రముఖులు –
1974 - బి.ఎన్.రెడ్డి  · 1980 - పైడి జైరాజ్, నటుడు, దర్శకుడు, నిర్మాత  · 1982 - ఎల్.వి.ప్రసాద్, దర్శకుడు, నిర్మాత, నటుడు  · 1986 - బి.నాగిరెడ్డి, నిర్మాత  · 1990 - ఎ.నాగేశ్వర రావు, నటుడు  · 2009 - డి.రామానాయుడు, నిర్మాత  · 2016 - కె.విశ్వనాథ్ - సినిమా దర్శకుడు
        శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారి జీవిత విషయాల్లోకి వస్తే... శ్రీ విశ్వనాథ్ 19 -02 -1930 వ తేదీన ‘రేపల్లె’ అనే గ్రామంలో శ్రీ కాశీనాధుని సుబ్రహ్మణ్యం-శ్రీమతి కాశీనాధుని సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు కృష్ణానదీ తీరానగల ‘పెదపులివర్రు’ అనే కుగ్రామానికి చెందినవారు. శ్రీ విశ్వనాథ్ గారు గుంటూర్ లోని హిందూకాలేజ్ లో ఇంటర్మీడియట్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లో బి.యస్.సి చదివారు.
        తరువాత ఉద్యోగాన్వేషణలో మద్రాసులోని వాహినీ స్టూడియోలో శబ్దగ్రాహకుడు (sound recordist) గా చేరారు. అప్పటికే వాహినీ స్టూడియోలో వాళ్ళ నాన్నగారు అసోసియేట్ గా పనిచేస్తూ ఉండేవారు. శ్రీ విశ్వనాథ్ తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలో శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారు, శ్రీ కె. రామనాథ్ గార్ల వద్ద దర్శకత్వశాఖలో చేరారు. శ్రీ విశ్వనాథ్ గారికి ప్రసిద్ద దర్శకులు శ్రీ కె. బాలచందర్, శ్రీ బాపు గార్ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేయాలని కోరికగా ఉండేది.
        ప్రారంభదశలో శ్రీ విశ్వనాథ్, ఆదుర్తి సుబ్బారావు గారితో 1964 లో మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి మొదలైన ప్రతిష్ఠాత్మకచిత్రాలకు పనిచేశారు. ఈ రెండు చిత్రాలూ కూడా ప్రశంసలు, బహుమతులూ పొందినవే! 1965 లో ఆత్మగౌరవం, 1974 లో ఓ సీత కథ, 1975 లో జీవనజ్యోతి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలన్నీ గొప్ప సందేశాత్మక విలువలున్న చిత్రాలుగా పేరు పొందడమే గాక నంది బహుమతులను గెలుచుకున్నాయి. పైగా తాష్కెంట్ లో జరిగిన ఆసియన్ ఆఫ్రికన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడ్డాయి. 1968 లో ‘సుడిగుండాలు ‘ చిత్రానికి రచనా సహకారం అందించారు.
1965 లో తన తొలి దర్శకత్వచిత్రం ‘ఆత్మగౌరవం’ తోనే ఉత్తమ చిత్రంగా నంది బహుమతి గెలుచుకున్నారు. తరువాత దర్శకత్వం వహించిన చెల్లెలి కాపురం ,శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి మొదలైన చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా నంది బహుమతులు, ఫిల్మ్ ఫేర్ బహుమతులు, జాతీయ బహుమతులు కూడా పొందాయి. శ్రీ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరిసిరిమువ్వ ; చిత్రంలో వారి కళాప్రతిభ ప్రేక్షకులకు తెలిసింది.
సామాజిక ఇతివృత్తాలను కథాంశంగా తీసుకుని దర్శకత్వం వహించిన - సప్తపది, శంకరాభరణం, శారద,ఆపద్భాందవుడు, శుభలేఖ, సిరి సిరి మువ్వ, సీతామాలక్ష్మి, శృతిలయలు, స్వాతికిరణం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, శుభోదయం, శుభ సంకల్పం, సిరివెన్నెల, సాగరసంగమం, స్వయంకృషి…… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీచిత్రం ఒక మచ్చుతునక. ఒక్కోచిత్రంలో ఒక్కో విభిన్నాంశం, విభిన్నకోణంలో ఆవిష్కరించబడింది. ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం. పైగా సంగీతానికీ, సాహిత్యానికి పెద్దపీట వేసిన ఈ సినిమాలనీ విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా, జాతీయ , అంతర్జాతీయ బహుమతులను గెలుచుకున్నాయి.
‘శంకరాభరణంచిత్రంలో పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునఃస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. కొన్ని థియేటర్ల లో ఏడాది పైగా ప్రదర్శించబడిన ఈ చిత్రం చరిత్రను సృష్టించింది. భాస్కరన్ అనే చలన చిత్ర పరిశోధకుడి కథనం ప్రకారం , శంకరాభరణం చిత్రం విడుదల తర్వాత దక్షిణ భారతదేశ సంగీతచరిత్రలో , కర్ణాటక శాస్త్రీయ సంగీతం మళ్ళీ జీవం పోసుకుంది.
జర్నల్ ఆఫ్ డాన్స్, మూవ్ మెంట్స్ స్పిరిట్యువాలిటీస్ అనే పుస్తకంలో వ్రాసిన వ్యాస పరంపరలో సి.ఎన్.హెచ్.ఎన్.మూర్తి అనే పరిశోధకుడు – శ్రీ విశ్వనాథ్ తను తీసే సినిమాల్లోని విభిన్న పాత్రల చిత్రీకరణ, ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఎదగని వ్యక్తులు జీవితాలు సమస్యలను చిత్రీకరించడంలో,వ్యక్తీకరించడంలో చూపిన ప్రతిభను వివరంగా తెలియజెప్పారు. ‘శారద’ చిత్రంలో మానసిక వ్యధతో బాధితురాలైన స్త్రీ పాత్ర ద్వారా, ‘స్వాతిముత్యం ‘ చిత్రంలో మానవత్వపు విలువలకు అద్దం పట్టిన పాత్రద్వారా, ‘సిరివెన్నెల’చిత్రంలో మూగ,చెవిటి పాత్రకు, గుడ్డివాని పాత్రకు అనుసంధానం కలిగేలా తెలియచేసేలా పాత్రల చిత్రీకరణ, ‘కాలంమారింది’ చిత్రం ద్వారా కులాధారిత సమాజాన్ని కుదిపేసిన సంఘటనలు –శ్రీ విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభను తెలియజెప్పాయి.
        శ్రీ మూర్తిగారే తన వ్యాసాల్లో కులమతాలకు, వైకల్యాలకు, మద్యపాన నిషేధం, సామాజిక సాంస్కృతిక విబేధాలు మొదలైన ఎన్నో సమస్యలకు శ్రీ విశ్వనాథ్ తీసిన సప్తపది, సిరివెన్నెల,స్వయంకృషి,శృతిలయలు, స్వర్ణకమలం సినిమాలు పరిష్కారం చూపించాయని తెలియచేసారు.
        ‘సప్తపది’ చిత్రంలో అస్పృస్యత,కుల ప్రాతిపదికను కథాంశంగా తీసుకోగా, శుభోదయం,స్వయంకృషి,చిత్రాల్లో వృత్తిధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం,మర్యాద; ‘శుభలేఖ’ చిత్రంలో వరకట్న దురాచారం; ‘స్వాతికిరణం’ చిత్రంలో మనిషిలో సాధారణంగా ఉండే ఈర్ష్యాద్వేషాలు , వాటి ఫలితాలు; అవి మనిషిని ఎంతలా దిగాజారుస్తాయో వివరంగా తెలియచేశాయి శ్రీ విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభలు.
        శ్రీ ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ స్థాపించి, శ్రీ విశ్వనాథ్గారి దర్శకత్వంలో మహత్తరమైన చిత్ర నిర్మాణం కొనసాగించడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక నూతనాధ్యాయం మొదలైంది. వీరిరువురి కలయికలో ఎన్నో కళాత్మక విలువలున్న, సామాజిక ధ్యేయం గల చిత్రాలు నిర్మితమైనాయి. శంకరాభరణం,స్వాతిముత్యం,సాగరసంగమం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు లాంటి చిత్రాలు రష్యన్ భాషలోకి అనువదింపబడి మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడ్డాయి.
        శ్రీ విశ్వనాథ్గారు కొన్ని బాలీవుడ్ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. 1979 లో స్వర్గం, 1982 లో కాం చోర్, 1983 లో శుబ్ కామ్నా , 1984 లో జాగ్ ఉఠ ఇన్సాన్.  1985 లో సుర్ సంగమ్ , 1989 లో  ఈశ్వర్, 1992 లో సంగీత, 1993లో ధన వాన్, ఇందులో కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ హిట్లు గా ప్రజాదరణ పొందాయి.
        నటుడిగా కూడా శ్రీ విశ్వనాథ్ తనదైన ముద్ర వేశారు. 1995 లో శుభసంకల్పం చిత్రంతో ప్రారంభమైన ఆయన నటజీవితం, తరువాతా 2001 లో నరసింహనాయుడు, 2002 లో సంతోషం, 2003 ఠాగూర్ .2004 లో లక్ష్మీనరసింహ, 2004 లోనే స్వరాభిషేకం,2007 లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,2005 లో అతడు, 2008 లో పాండురంగడు మరియు సీమసింహం లో కూడా కొనసాగింది.
        ఇవేకాక తమిళచిత్ర పరిశ్రమలో కూడా 1995 లో కురుత్తిపునాల్; 1999 లో ముగావారి; 2000 లో కక్కై సిరాగి నిలై ;2002 బాగావతి; 2003 లో పుదియగీతై; 2008 లో యారాది నీ మోహిని; 20 11 లో రాజపట్టె;2015 లో ఉత్తమ విలన్ – చిత్రాల్ కూడా వారు నటించారు.
        అంతేగాక SVBC  (శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్)వారు ప్రసారం చేసిన శివనారాయణ తీర్థ, సన్ టీవి ప్రసారం చేసిన చెల్లామై (తమిళ్); వెందార్ టివి ప్రసారం చేసిన సూర్యవంశం – వంటి టివి సీరియళ్లలో కూడా శ్రీ విశ్వనాథ్నటించారు. ఇంకా జి.ఆర్.టి జ్యూయలర్స్, సువర్ణభూమి ,ఇంకా అనేక వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు.
        శ్రీ విశ్వనాథ్ గారి ధర్మపత్ని శ్రీమతి జయలక్ష్మి గారు. వీరికి పద్మావతి, నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్ అని ముగ్గురు సంతానం. ఆరుగురు మనవలు, మనవరాళ్లు. తెలుగు, తమిళం,ఇంగ్లీషు భాషలలో అనర్గళంగా ప్రసంగించగల సత్తా ఉన్న వ్యక్తి శ్రీ విశ్వనాథ్. సుప్రసిద్ధ నటులు శ్రీ చంద్రమోహన్, ప్రసిద్ధ గాయకుడు శ్రీ యస్.పి.బాలసుబ్రమణ్యం గారు శ్రీ విశ్వనాథ్ గారికి సమీప బంధువులు. సోదర వరస అవుతారు.
        అవార్డుల విషయానికి వస్తే ఆ జాబితా చాలా పెద్దది.
1992లో భారతప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం
2016 లో  భారతప్రభుత్వంచే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
అంతర్జాతీయ పురస్కారం – 1981 లో శంకరాభరణం చిత్రంకుగాను ప్రైజ్ ఆఫ్ డి పబ్లిక్ ఎట్ ది బెసాన్ కాం ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్రాన్సు
1979 – శంకరాభరణంకు ఉత్తమ జాతీయ పురస్కారం
1982 – సప్తపది సినిమాకు జాతీయ సమైక్యతకై నర్గీస్ దత్ పురస్కారం
1986 లో – స్వాతిముత్యం – సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రం
1989 లో – సూత్రదారులు – సినిమాకు ఉత్తమ తెలుగుచిత్రం
2006 లో – స్వరాభిషేకం – సినిమాకు ఉత్తమ తెలుగుచిత్రం
1989 లో – ఈశ్వర్ చిత్రానికి ఉత్తమ కథకు రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు. (ఫిల్మ్ ఫేర్ అవార్డు – దక్షిణ భారతదేశ చలన చిత్రాలకు ఇచ్చే అవార్డులలో భాగంగా)
1974 లో – ఓ సీతకథ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం
1975 లో – జీవనజ్యోతి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం
1982 లో – శుభలేఖ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం
1983 లో – సాగరసంగమం  చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం
1986 లో – స్వాతిముత్యం చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం
1987 లో – శృతిలయలు చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం
1992 లో – ఆపద్భాందవుడు చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం
1994 లో –జీవనసాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య అవార్డు
1995 లో –శుభసంకల్పం  చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం

ఇవేకాక
1981 లో సప్తపది చిత్రానికి ఉత్త్తమ స్క్రీన్ ప్లే రచయితగా
1992 లో–జీవనసాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య అవార్డు
1995 లో శుభసంకల్పం సినిమాకు ఉత్తమ కేరెక్టర్ నటునిగా స
2000లో కలిసుందాం రా సినిమాకు ఉత్తమ సహాయ నటునిగా నంది పురస్కారాలు అందుకున్నారు.
అంతేగాక..
        విశ్వవిఖ్యాత దర్శక సార్వభౌమ బిరుదును, చిత్తూరు నాగయ్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
        సినీ జగత్తులోనూ ప్రేక్షక ప్రపంచంలోనూ ‘కళాతపస్వి’ గా పేరు పొందారు.
        ఎన్నో కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి, సంగీత సాహిత్యాలకు ప్రాధాన్యమిచ్చి, వెకిలి సంభాషణలు, అశ్లీన దృశ్యాలు లేకుండా, సామాజిక విలువలకు పెద్దపీట వేసి, సాంఘిక దురాచారాలకు ,సాంఘిక అన్యాయ శక్తులకు సంభందించిన విషయాలకు సముచిత రీతిలో న్యాయం జరిగేలా, కుటుంబ సమేతంగా చూడదగిన చక్కని చిత్రాలకు రూపకల్పన చేసిన శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ – మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం... 

ఆ మహనీయునికి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ లభించడం... తెలుగు వారమైన మనం అటువంటి చిత్రాలను వీక్షించే భాగ్యం పొందడం మనందరి అదృష్టం.
        శ్రీ విశ్వనాథ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ లభించిన సందర్భంగా ఈ వ్యాసాన్ని వ్రాయడం జరిగింది. ఆ మహనీయుని చేతుల మీదుగా నేను మార్వ్ లెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్వీకరించడం నేను పొందిన అదృష్టంగా, మహాద్భాగ్యంగా భావిస్తున్నాను.
***   

No comments:

Post a Comment

Pages