నాకు నచ్చిన కథ---కోనేటి జన్మ --శ్రీ శ్రీ
శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి)
23/4/17
నేడు సుదినం.నేడు కోనేటి రావు జన్మదినం.మహారాజరాజశ్రీ జటావల్లభుల కోనేటిరావు పంతులుగారి నలభై ఐదో జన్మదినం.ఈ రోజు సమాచారం మహారాజశ్రీకే తెలియదు.కోనేటి జన్మదినం జాతీయ పర్వదినం కాదు.దీనికొక ప్రత్యేకత ఆపాదించుకొని పండుగ చేసుకొనే అవసరం కోనేటి రావుకే లేకపోయింది. తూర్పు ఆసియా దేశాలలో ప్రళయం,పశ్చిమ యూరప్ దేశాలలో ప్రణయం,మధ్య ప్రాచ్యంలో మంత్రసాని గండం మొదలైన ప్రపంచ వార్తల మధ్య,ఇదివరకెప్పుడో నలభై నాలుగేళ్ల క్రిందట కోనేటిరావు అనే ఆసామి ఒకానొక పల్లెటూళ్ళో జన్మించాడనే కబురు,ఈ రచయితని తప్ప ఇంకెవరినీ ఉత్సాహ పరచలేకపోయింది.అయినా ఈ దినం కోనేటి రావు పుట్టిన రోజని తెలిసినప్పటికీ ఈ రచయిత "డాండ డడాండ డాండ నినదంబు లజాండమునిండ మత్త వేదండంబు నెక్కి " ఈ సంతోష వార్తను చాటలేక పోతున్నాడు. దీన్ని ఎలా వర్ణించాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు."నేడు సుదినం" అని మాత్రం అని ఊరుకున్నాడు. ఇది ఎందుచేత సుదినమో రచయితకు కూడా తెలియదు. కిందటేడు కూడా నలభై నాలుగో కోనేటి మైలురాయి నామమాత్రావసిష్టమై పోయింది. మీదటికైనా ఇంతకన్నా ఉత్తమ పరిస్థితులలో కోనేటిరావు పుట్టిన రోజు పండుగ చేసుకోగల సూచనలు సుతరామూ కనిపించవు.ఈలోపున అమెరికాలో పెద్దల ఆశీర్వాదం వల్ల యుద్ధం వచ్చేస్తే సరి! మరి కోనేటి రావే కనిపించడు.కోనేటిరావు గారి నలభై ఐదో జన్మదినం నాడు వాళ్ళ ఆఫీసుకు సెలవు లేదన్న విషాద వార్త తప్పిస్తే,తతిమా విషయాలన్నీ కోనేటిరావుకి తెలియకుండా--సక్రమంగా జరిగినట్లు చెప్పవచ్చు. తెల్లవారుఝామున మలయానిలం మందమందంగా ప్రసరించింది.అదృష్టవశాత్తు ఇది వసంత కాలం కావడం వల్ల మామిడి చెట్లు చిగురించటం,ఆ చిగుళ్ళు మెసవి కొన్ని కోకిలలు పంచశ్రావ్యంగా వగర్చటం జరిగింది.తిరుచునాపల్లి రేడియో కేంద్రంలో ఎవరో ప్రసిద్ధ సోదరులు మంగళ వాద్యాలు మ్రోగించారు.చాలా రోజులనుండీ సాక్షాత్కరించని చాకలివాడు (చిరిగిపోయినవైతెనేమీ) బట్టలన్నిటినీ బాకీ పెట్టకుండా తెచ్చాడు.మరి ఆవిడకు తెలిసి చేసిందో,తెలియక చేసిందో తెలియదు. కానీ కోనేటిరావు భార్య బహు రుచికరమైన పిండివంటలు చేసి ,ఆఫీసు వేళకు ముందుగానే వడ్డించింది. మస్తుగా భోజనం చేసి అవిఘ్నమస్తుగా కోనేటి రావు ఆఫీసుకు చేరుకున్నాడు.కోనేటి రావు ఆఫీసు యాత్రను కొండకచోట ఈ రచయితా వర్ణించాడు కానీ పునరుక్తి అవుతుందని తెలిసికూడా మళ్ళీ వర్ణించటానకి ఇతడు ఉవ్విళ్ళు ఊరుతున్నాడు.అసలే కూర్మావతారం.అరమైలు ఆఫీసు దూరం రొప్పుతూ రోజుతూ కోనేటి రావు ఇంటినుండి ఆఫీసుకు బయలు వెడలెను."వెడలెను కోదండ పాణి"అని గాని,"రాజు వెడలె రవితేజముల తోడ" అని గాని ఈ వెళ్లడాన్ని ఎవరూ పాడటానికి సాహసించరు.ఒక గుమాస్తా తన పుట్టిన రోజున ఆఫీసుకి వెళ్ళాడన్న విషయంలో సంగీతాన్నీ ,కవిత్వాన్నీ ప్రోత్సహించే పరిద్రవం యత్కిన్చిత్తూ ఉండనేరదు. ఆపసోపాలు పడుతూ ఆఫీసుకి పోతున్న ఒక మానవుడి మహాప్రస్థానం సౌందర్యవంతమైన ఘటన కాదు.ఇదేమీ హైదరాబాదు ప్రతినిధుల పారిస్ ప్రయాణం కాదు.ప్రధాన మంత్రిగారి సరిహద్దు ప్రయాణమూ కాదు.కోనేటిరావు అరమైలు దూరాన్ని అవలీలగా లంఘించి శాశ్వతంగా ఒక కొత్త రికార్డు సృష్టించాడు అని అనడం సత్యానికి అనేక లక్షల మైళ్ళ దూరం.కోనేటిరావు రోజూమల్లే ఈ రోజు కూడా జీవిత సముద్రంలో ఈదుతున్నాడు. ఇదేమీ రసవంతమైన సన్నివేశం కాదని ఈ రచయిత ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాడు.కోనేటిరావు జీవితరంగంలో ఏ మూల నుంచీ కూడా ఏ మాత్రమూ కవిత్వమనేది ప్రసరించకుండా కట్టుదిట్టాలు జరిగిపోయాయి.ఎందుచేతనని ప్రశ్నిస్తే సరైన ఏ జవాబు రాదు సరికదా, ఎన్నో ప్రశ్నలు బయలు దేరుతాయి.ఏ శాపం వల్ల కోనేటి రావు తన నలభై ఐదో పుట్టిన రోజున హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఎండలో ఈదవలసి వచ్చింది? అతని పిల్లల చొక్కాలూ,లాగూలూ అతుకుల బొంతలు కావటానికి కారణం ఏమిటీ? దాక్షిణ్యంలేని ఏ దుర్విదిశాసనం వల్ల కోనేటి రావు తలమీద చాలామటుకు జుట్టు ఊడిపోయి బట్టతల ప్రాప్తించటమే కాక,మిగిలిన కాస్త జుట్టూ తెల్లబడిపోయిందీ ? అతని చెమటతో తడిసిన రూపాయలకు అర్ధం లేకపోవటం ఎందుచేత?ఏమీ ప్రయోజనం లేని ఇలాంటి ప్రశ్నలు వేస్తే,ఉపయోగమేమిటీ?కోనేటిరావు తన నలభైఐదో పుట్టిన రోజున ఆఫీసులో కుర్చీలో కూర్చొని పని చేసుకుంటున్నాడు.ఇదివరకు అతణ్ణి కనపడకుండా బంధించిన సంకెళ్ళు ఇంగ్లాండులో తయారయినవి. ఇప్పటి సంకెళ్ళు ఇండియా తయారు చేస్తుంది.ఇవి స్వదేశీ సంకెళ్ళు.ఏమైనా ఇది సుదినం. ఇది కోనేటి రావు జన్మదినం.
*****
ఈ కథకు వ్యాఖ్యానం,ఉపోద్ఘాతం చెప్పే సాహసం చేయలేను,క్షమించగలరు!అయితే ఒకటి మాత్రం చెప్పగలను. శ్రీ శ్రీ ఈ కధను చైతన్య స్రవంతి(Stream of Consciousness)ప్రయోగంలో రాసాడు. ఇదే ఫక్కీలో 'ఒసే తువ్వాలందుకో ' కధను కూడా రాసాడు . అంతే కాదు ఆయన రాసిన రేడియో నాటిక 'విదూషకుడి ఆత్మహత్య' కూడా ఈ కోవకే చెందుతుంది. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరే శ్రీ శ్రీ తన సాహితీప్రస్థానంలో ఇటువంటి ఫీట్స్ ఎప్పుడో ,ఎన్నో చేసాడు.
మహాకవి శ్రీశ్రీకి స్మృత్యంజలి...
పరాయి పాలన కి కష్ట బడి సాధించుకున్న స్వ పరిపాలన కి ప్రజల జీవితాల్లోవచ్చిన పెద్ద మార్పు ఏమీ లేదు..సగటు జీవి జీవనపోరాటం అంతకంతకు దుర్భరం గా పరిణమిస్తోంది...ఈ ప్రశ్న కు బదులేది..ఆ బదులు ఎవరు ఇవ్వాలి..ఎవరు ఇస్తారు..ఎప్పటికైనా జవ్వాబు దొరుకుతుందా...దిన దినం మసక బారుతున్న భవిష్యత్ చిత్రం చూస్తుంటే..అని ...మనకే తడతాయి ఎన్నో ప్రశ్నలు..చక్కని కధ గుర్తు చేశారు..అభివాదములు సర్
ReplyDelete