పంచ మాధవ క్షేత్రాలు -5 - అచ్చంగా తెలుగు
పంచ మాధవ క్షేత్రాలు -5
శ్రీరామభట్ల ఆదిత్య 
కుంతీ మాధవస్వామి ఆలయం,పిఠాపురం:

పంచ మాధవ క్షేత్రాలలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక మాధవ ఆలయం శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆలయం చాలా ప్రసిద్ధమైనది. పిఠాపుర క్షేత్రానికి క్షేత్రపాలకుడు కుంతీమాధవుడు. ఇక్కడ మనకు శివకేశవ అబేధం కనిపిస్తుంది. పిఠాపురం ఎన్నో ప్రసిద్ధ ఆలయాలకు పేరుపొందింది. కుక్కుటేశ్వర స్వామి ఆలయం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా దేవి ఆలయం మరియు పాదగయ ఆలయమైన శ్రీ దత్తుడి ఆలయం ఆలయాలన్ని క్షేత్రంలోనే ఉండడం విశేషం. పూర్వం పిఠాపురం ను పీఠికాపురం గా పిలిచేవారు. పురాణాలలో, తంత్రాలలో క్షేత్రాన్ని పుష్కర క్షేత్రంగా వర్ణించాడు. పురుహూతికా అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి గుడిలో ఈశాన్యభాగంలో ఉంది. కుక్కుటేశ్వర స్వామి గుడి ఊరి బయట కాకినాడ వెళ్ళేమార్గంలో ఉంది. ఇది చాలా పెద్ద గుడి. గుడిలోకి ప్రవేశించిన వెంటనే మనకు ఒక పెద్ద సరోవరం కనిపిస్తుంది. దానిని పాదగయ సరోవరం అని పిలుస్తారు. పర్యాటకులు పాదగయ లో స్నానాలు చేస్తారు. కుక్కుటేశ్వర స్వామి గుడి పాదగయ సరోవరానికి కుడి వైపు ఉంది. అమ్మవారి గుడి దక్షిణ దిక్కుకు తిరిగి ఉంటుంది. పురుహూతికా అమ్మవారి గుడి చిన్నదైననూ అష్టాదశ శక్తిపీఠాల శిల్పాలు చెక్కపడి చాలా అందంగా ఉంటుంది.పురుహూతికా విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉంటుంది. నాలుగు చేతులలో విత్తనాల సంచి , గొడ్డలి, కమలం, మధుపాత్ర ఉంటాయి. పూర్వకాలంలో అమ్మవారిని రెండు రకాల ఉపాసకులు పూజించేవారు. మొదటి వారు అమ్మవారిని పురుహూత లక్ష్మి గా భావించి కమలాన్ని మరియు మధుపాత్రను ధ్యానించేవారు. వీరు సమయాచరం లో పూజలు జరిపేవారు. రెండో వర్గంవారు పురుహూతాంబ గా భావించి బీజాలు మరియు పరశువుని ధ్యానించే వారు. వీరు వామాచారంలో పూజలు చేసేవారు. కొంతమంది చెప్పేదాని ప్రకారం పూర్వం పూజలు జరిగిన విగ్రహాన్ని భూమిలో పాతి దానిపై కొత్త గుడి కట్టారు.
పురుహూతికా దేవి పూర్వం ఇంద్రునిచే పూజింపబడింది. ఒకప్పుడు ఇంద్రుడు గౌతమమహర్షి భార్య అయిన అహల్యాదేవిని గౌతమమహర్షి రూపం ధరించి మోసగిస్తాడు. దానికి ప్రతిఫలంగా మహర్షి శాపం వల్ల ఇంద్రుడు తన బీజాలను కోల్పోయి శరీరం అంతా యోని ముద్రలు పొందుతాడు. దానికి బాధపడిన ఇంద్రుడు గౌతమ మహర్షిని ప్రార్ధిస్తాడు. ప్రార్ధనల వలన గౌతమమహర్షి కనికరించి యోనిముద్రలు కన్నులు లాగ కనిపిస్తాయని చెపుతాడు. అప్పటినుంచి ఇంద్రుడు సహస్రాక్షుడు అని పేరు పొందుతాడు. కాని ఇంద్రుడుకి బీజాలు పోయినాయి. వాటిని తిరిగిపొందటానికి ఇంద్రుడు స్వర్గాన్ని వదిలి జగన్మాత కోసం తపస్సు చేస్తాడు. చాలాకాలం తపస్సు చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమై ఇంద్రుడుకి సంపదను, బీజాలను ప్రసాదిస్తుంది. అప్పటినుంచి ఇంద్రుడుచే పూజింపబడుటవలన అమ్మవారిని పురుహూతికా అని పిలుస్తున్నారు.చాలా కాలం తర్వాత పిఠాపురంలో దత్తత్రేయుడు శ్రీపాద వల్లభునిగా అవతరించి పురుహూతికా అమ్మవారిని పూజచేసి జ్ఞానాన్ని పొందాడు

 ఒకసారి శ్రీకుక్కుటేశ్వర స్వామిని దర్శించటానికి వచ్చిన శ్రీ వేదవ్యాస మహర్షి కుంతీమాధవ స్వామి దేవాలయానికి కూడా వచ్చారట. అప్పడు తన దివ్యదృష్టితో చాలా విషయాలు తెలుసుకొన్నారట. త్రేతా యుగంలో ఆలయాన్ని శ్రీరామచంద్రుల వారు సీతాసమేతంగా తమ వనవాస సమయంలో వచ్చి పూజాదికాలు నిర్వహించారట. ద్వాపర యుగంలో పాండవులతో పాటు కుంతీ దేవి ఆలయాన్ని సందర్శించారట. సమయంలో స్వామికి కుంతీదేవి ఎన్నో రకాల విశిష్టమైన పూజలు నిర్వహించిందట. రోజు నుండి ఆలయాన్ని కుంతీ మాధవస్వామి ఆలయంగా పిలవడం ప్రారంభం అయిందట. ఇక్కడి కుంతీ మాధవస్వామి వారి పట్టపురాణి శ్రీ రాజ్యలక్ష్మీదేవి. ముఖ్యంగా స్త్రీలు శుక్రవారాల్లో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తూంటారు. ప్రతి రోజు సాయంత్రాల్లో మహిళలు లలిత, విష్ణు మరియు లక్ష్మీ సహస్రనామ పారాయణలు చేస్తుంటారు. ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి గోదాదేవి మరియు శ్రీ రామానుజుల వారి ఉపాలయాలను కూడా మనం దర్శించవచ్చు ఆలయంలోని మాధవస్వామి విగ్రహాన్ని కుంతీదేవి ప్రతిష్ఠించినందువలన స్వామికి కుంతీ మాధవుడని పేరు. శ్రీ కుంతీమాధవ స్వామిని దర్శించనిదే పిఠాపుర క్షేత్రం యొక్క యాత్ర పూర్తికాదని అంటారు. పిఠాపురం కాకినాడ నుండి 22 కీమీ మరియు విశాఖపట్నం నుండి 137 కీమీ దూరంలో ఉంది. పిఠాపురానికి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
***

No comments:

Post a Comment

Pages