పిల్లలకి పిల్లలే కావాలి కదా!
ఆండ్ర లలిత
సావిట్లోకి చూస్తూ మురళిని ఉద్దేశించి, “ఆ వార్తా పత్రిక పక్కన పెట్టండి, మీతో మాట్లాడాలి” అంది పద్మజ హడావిడిగా వంటగదిలో కాఫీ కలుపుతూ. కాఫీ కప్పు తీసుకువస్తూ, కప్పు కింద ఉన్న తడి తన చీర చెంగుతో తుడుస్తూ, ప్రేమతో తీసుకోండి అని అందించింది కాఫీ!! నవ్వుతూ మురళికి.
పద్మజ తన చీర చెంగు నడుములో దోపుకుంటూ, గడియారం కేసి చూస్తూ టిఫిన్ చేయాలి...బాబుని నిద్ర లేపాలి, చదివించాలి ...మళ్ళీ ఆ పనులలో పడిపోతే మీతో మాట్లాడటం కుదరదు. అప్పుడే పొద్దెక్కి పోతోంది... అని మురళి చదివే వార్తా పత్రికను పక్కకి తోసి, “అబ్బా! నాతో మాట్లాడండి” అంది పద్మజ వీరభద్రపళ్ళెంలాంటి మోహంతో..
“ఆగవే బాబు! కంగారు పడకు” అన్నాడు చిరునవ్వుతో..
“కాఫీ నెమ్మదిగా త్రాగనీయమ్మా. వారమంతా ఎదురు చూసేది ఈ శని ఆదివారాల కోసమేగా. ఇంత మంచి ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ ప్రేమతో ఇచ్చావు. చాలాసంతోషం. మరి ఏమోయ్, ఇవాళ మన మనసుకి తోచింది చేద్దాం. మన పూలతోటనీ, ఆ పక్షులనీ చూడు కాసేపు! ఆ రామచిలకలను చూడు. ఏదో గుసగుసలు చెప్పుకుంటున్నాయి”
పద్మజ మాత్రం మురళి మాట్లాడేవన్నీ పెడచెవిన పెట్తోంది. ఏదో దీర్ఘాలోచనలో ఉందని గమనించి, తన మనసును మళ్ళిద్దామని ప్రయత్నంలో వేదాంతం మాట్లాడాడు మురళి.
“పనులు ఉంటూనే ఉంటాయి పద్మజా!” అంటూ భుజము మీద చేయివేస్తూ.
మళ్ళీ అందుకుంటూ మురళి తన చేతులతో, పద్మజ ముఖం తన కేసి తిప్పుకుని చిరునవ్వుతో.. “నా మాట విను, నెత్తిమీద పనులు పెట్టుకోవద్దు... హాయిగా ఆనందంగా గడుపుదాం. ఈ రెండు రోజులూ నీ ముందే ఉంటాను లేవోయ్” అన్నాడు.
“నాకు ఏవేవో గారడీ కబుర్లు చెప్పద్దు. నేనేమీ చెవులో పూవు పెట్టుకుని కూర్చో లేదు. నేను వినను” అంటూ అక్కడనుంచి వెళ్ళిపోతూ, బుంగ మూతితో, మళ్ళీ ఆగి మురళికేసి తిరిగి “లేదండీ, ఇప్పుడే మాట్లాడు కుందాం..మళ్ళీ సమయం కుదరదు” అని అడిగింది.
మురళి సందిగ్దంలో పడ్డాడు. ఇంత ‘మాట్లాడాలి మాట్లాడాలి’ అన్నమాట మీదే పద్మజ ఉందంటే, చాలా పెద్ద సమస్యే. ఇవాళ నా నడక సంగతి మరచిపోవలసిందే అనుకుంటా...ఏం చేస్తాను తను అలా ఉంటే చూడలేనే.. అని తన మనసులో అనుకుని, “కొంపలు మునిగాయా? దేని గురించేమిటి?” అంటూ కుర్చీ చూపిస్తూ, “రా! ముందు కుర్చీలో సరిగ్గా కూర్చో. ఆ...ఇప్పుడు చెప్పు” అన్నాడు మురళి చిరాకుగా. తన నడక పోతోందని ఆవేదనలో.
పద్మజ తన గొంతు సవరించుకుంటూ,” చాలా ముఖ్యమైన మార్పు మన కుటుంబంలో తేవాలని అనుకుంటుంన్నాను” అంది ఆతృతతో .
మురళి కాస్త విసుగుతో “సరే..ఏం మన సంసార నావ సరిగ్గా సాగటం లేదా. సరే మాట్లాడు. కథలు చెప్పకు, సాగదీసి మాట్లాడకు. ముక్కుకు సూటిగా ఐదు నిమిషాలలో మాట్లాడు. లేకపోతే కాస్త అలా ఒక గంట సేపు నడిచి వస్తా, తరువాత తాపిగా మాట్లాడు కుందాము” అన్నాడు. దానికి పద్మజ అంగీకరించినట్లు అనిపించలేదు.
మరొకసారి పద్మజ మొహంలోకి చూస్తూ, ఎక్కడా తనలో ప్రశాంతత కనబడనప్పడు, మురళి పద్మజని అలా చూడలేక, తన చేయి పట్టుకుని, ప్రేమతో దగ్గరకి తీసుకుని “అసలు దేని గురించి నీ ఆందోళన, టూకీగా చెప్పు ముందు. నేను ఉద్యానవనంలో నడిచి వచ్చాక తీరికగా మాట్లాడుకుందాం. ఎండ తీక్షణత ఎక్కువ అయితే నాకు నడవటం కష్టం.”
“ఆహా! కుదరదు. తరువాత వెళ్ళండి, ఇప్పుడే మట్లాడుకోవాలి. మీ సమయం ఎంతోసేపు తీసుకోనులేండి. మళ్ళీ బాబు లేస్తే మాట్లాడడం కుదరదు” అంది పద్మజ మురళి కేసి చూస్తూ మొండి పట్టుదలతో.
మురళి ఒకసారి పద్మజ కేసి దీర్ఘంగా చూస్తూ తనలో తాను అనుకున్నాడు. రాత్రి బానే ఉందికదా పడుకునే ముందు...రాత్రికి రాత్రి హఠాత్తుగా ఏమైంది చెప్మా... బాబోయ్..పొద్దున్నే ఏ అణుబాంబు పేలుస్తుందో ...సరే కానీ, ఆ భగవంతుడే రక్షించాలి..అనుకున్నాడు.
ఇంతలో మురళిని పద్మజ తట్టి “ఏమిటీ ఆ పరధ్యానం, కాఫీ ఒలికిపోతుంది” అంది.
“ఆ! ఏమీలేదు. ఏమిటో శనివారం కూడా పరుగులేనా! శనివారం కూడా అంత తొందరైతే ఎలాగమ్మా, పనుల జాబితా చదువుతావేంటి? ఇవాళ కూడా విశ్రాంతి లేకుండా ఉరకలు పరుగులేనా... ఎప్పుడో గుండె పోటొచ్చి నేపోతా అంతే.”
“అయ్యో ఎంత మాట. అశుభాలు పలకొద్దు తథాస్తు దేవతలు ఉంటారు” అని దేవుడి కేసి తిరిగి, ఒక నమస్కారం చేసింది .
“అందరు బావున్నారు. ఏమీ లేదు, బయటికి వెళ్దాము. ఎక్కడో అక్కడికి. సాయంత్రం అలా బయలుదేరి.”
“చంపేసావు దీనికేనా అంత సన్నాహము”
ఒక్కసారి రాజధాని ఎక్సప్రెస్లా పరుగెట్టే మురళి మనసు కుదుటపడి పాసింజర్ రైలు అయింది. “ సరే అంతేగా ఏ గుడికో...బజార్కో, రెస్టరెంట్కో వెళ్దాములే...దీనికి కూడా ఎదురు ఎదురుగా కూర్చుని ఏదో పెద్ద సమస్యలా చర్చించాలా? అయినా పద్మజా! నాకు చాలా కఛేరి పనుంది. మన బాబు కూడా ఆటకాయగా తయారౌతున్నాడు. చదువు మీద ధ్యాస తగ్గుతోంది. ఒకవేళ మన పనులయిపోతే అలాగే చేద్దాము. మరి తమరు ఇప్పుడైనా నన్ను వెళ్ళనిస్తారా, మహాతల్లీ?”అన్నాడు మురళి, వంటింట్లో సింన్కులో కప్పు పెట్టటానికి వెళ్తున్న పద్మజతో.
“ఒద్దండీ... మాట్లాడుకున్నాకే” అని దిగాలు మొహం పెట్టింది పద్మజ.
“సరే ఫర్వాలేదు. నువ్వు ఏమంటే అదే... ఇవాళ శనివారం కదా.”
మురళి కళ్లలోకి చూస్తూ.... “ఏమండీ శని ఆదివారాలు వారాంత శెలవులు కదా బయటకి వెళ్దాము” అంది పద్మజ
“సరే! వెళ్దామన్నానుగా. “
“మన బాబుకి తోడు తన వయస్సు పిల్లలు లేరు.. అందరు పెద్దవాళ్ళే. అందుకని, కలిసి పనులు చేసుకుందాం. కలిసి ఆడుకుందాం. మన బాబుకి నలుగురిలో ఎలా జీవించాలో తెలపాలి మనం. బాబుకి జీవిత ఆటుపోటులు ఎలా ఎదురుకోవాలో చెప్పాలి. ఈ రంగస్థలములో సర్వ పాత్రలు మనమే పోషించి చూపించాలి. స్నేహితులు మనమే! అమ్మా నాన్నా మనమే! సర్వం మనమే కదా, ప్రస్తుతానికి.”
“ఇదేమిటి కొత్త పురమాయింపు. అలా అంటే నన్ను పనులు చేసుకోనీయవా?” అన్నాడు మురళి.
“అలా కాదు..అందరికీ, అంటే మన ముగ్గురికి సమ్మతమైన పనులే చేయాలి..మనసున్న మనుషులతో సంఘంలో గడపాలి. చాలా సార్లు మనం పార్టీల్లో కలుస్తూ ఉంటాం. మనసులు హత్తుకునే, బంధాలు పటిష్ఠపడే మాటలుండవు. వాళ్శు మనతో ఉన్నా వాళ్ళ మనసు మటుకు యాంత్రిక లోకంలో మాత్రమే. అప్పుడు మనం కలిసి ఉన్నా ఏకాకులమే...
అందుకని మనం మనయందు మనసున్న మనుషులతో గడపాలి. బాబుకి రుచి చూపాలి. మనం శాస్వతం కాదు. మనసున్న కుటుంబాలలో మసిలి, బాబుకి మానవత్వం చూపిద్దాం.”
“సరే కాని, ఈ ఉపోధ్గాతం అంతా ఎందుకూ! కొంప తీసి, నా ఆఫీసు పని నువ్వూ బాబు చేస్తారా ఏమిటి? పద్మజా! ఏమిటీ ఈ పిచ్చి పేచీ, అల్లరి పెట్టకు, చాలా ....పీకల వరకు పనుంది... నన్ను మధ్యలోకి లాగకండి. నువ్వూ బాబు ఆడుకోండి...తిరగండి...తినండి.. చదువుకోండి.”
“అయినా పద్మజా! బాబు చదువుకోవాలి.. నాకు తెలుసు ఏదో బాంబ్ పేలుస్తావని. చాలు చాలు, నా మనసంతా పాడుచేసావు. పాశ్చాత్య ప్రభావం ఆవహిస్తోంది నీకు. మనము ఏలా పెరిగాము. మర్చిపోయావా? నిన్న బాబుని ఆడుకోమంటే నాకు స్నేహితులు లేరు..అని టీవీ చూడటం. అస్సలు మాట వినటం లేదు. పొద్దున్నే లేస్తూనే టీవీ ... మెల్లిగా ఎపుడో అపుడు చదవటం. ‘విశ్రాంతి, ఆనందాలు ముందు; తరువాత చదువు’ అనే భావనలో పెరుగుతున్నాడు బాబు. నీకు అనిపించటం లేదా, పద్మజా! మనం ఎలా చదువుకునే వాళ్ళం, ఆడుకునేవాళ్లం, ఏది చేసినా క్రమశిక్షణతో. ఇప్పుడు ఏది! ఆ క్రమశిక్షణ. ఎంత సేపు తోచటం లేదు, తోచటం లేదు అంతే.. నేను ఏమన్నా అంటే, నువ్వు, మీరు పక్కన కూర్చొని వాడితో చదవండి ఆడండి అంటావు. ఎంతసేపు నన్ను ఆడమంటావు... మనం ఎలా ఉండేవాళ్లం, పెట్టిందేదో తిని హాయిగా చదువుకునేవాళ్ళం. ఆడుకునేవాళ్ళం. ఆదమరిచి పడుకునే వాళ్ళం తృప్తిగా....ఇప్పుడు ఏమీ లేదు. మనం డబ్బులు ఖర్చుపెడుతున్నాము.... కోరిందల్లా ఇస్తున్నాం. కాని, తృప్తి ఏదీ? అందరిలో అసంతృప్తి... పాడైపోయింది లోకం....పద్మజా మన సంసారాన్ని తగలేస్తున్నావు వాడిని సమర్థించి...మానుకో నీ పాశ్చాత్యపు ఆలోచనలు...వొళ్ళు జలదరిస్తోంది..పొద్దున్నే నా మనసు పాడుచేసావు...ఇంకేం మాట్లాడక్కర్లేదు... నన్ను వెళ్ళనీయ్ వాక్కి. చాలు మాట్లాడింది....”
అని లేచి మురళి వెళుతుంటే “ఆగండి....ఒక సారి నన్ను మాట్లాడనీయండీ. తరువాత వాక్కి వెళ్ళండి” అంది పద్మజ. అష్టవంకర్ల మోహంతో “సరే మాట్లాడు” అన్నాడు మురళి.
పద్మజ, మురళి మాటలకి మనసు నొచ్చుకున్నా, తన దుఃఖం మనసులోనే అణిచి పెట్టుకుని పద్మజ తన భావాలు వ్యక్త పరిచింది.
“పూర్వ మనం పెరిగింది పెద్ద సంసారాలలో. అక్కడ ప్రతీ వారికీ ఏదో పాత్ర ఉండేది. పెద్దవాళ్లు అమమ్మా-తాత, బామ్మా-తాత, పిన్నులు బాబయ్యలు, పెద్దనాన్నలు పెద్దమ్మలు, అత్తయ్యలు మావయ్యలు, అక్కాచెళ్ళెళ్ళు,అన్నయ్యలు తముళ్ళూ, వదినలు మరదళ్ళు, బావలు, మరుదులు అలా ఎంతో మంది కుటుంబములో. అమ్మా నాన్నా తిట్టినప్పుడు మనని మన చదువు ఒత్తిళ్ళు నుంచి ఉపసమనం కోసం, బామ్మ దగ్గరకు మనుమడు పరుగున వెళితే, ఏం బాబు అలా ఉన్నావు. ఒంట్లో నలతగా ఉందా. అని మన నుదురు వ్రాశేది. అసలు వాళ్ళ మాట చాలు. అమృతంలా ఉండేది. నాన్న తిట్టాడా, పోనీలే, మీ నాన్నకి నీ మీద బెంగ వచ్చి ఉంటుంది....మనసు కష్ట పెట్టుకోకు..వాళ్ళు నీ మంచి కోసమే చెప్తారు అని చెప్తూ, మనవడిని దగ్గరకు పిలిచి చెవిలో ఊదేది. మీ నాన్న కూడా చిన్నపుడు నీలాగే చేసేవాడు. అప్పుడు నేను, పెద్దైయాక ఏలా బతుకుతాడా! ఎల్లకాలం అమ్మా నాన్నా తోడు ఉండరుగా అని చింత వచ్చి ఇలాగే తిట్టేదాన్ని. కాని మీ నాన్న తప్పు సరిదిద్దుకుని చెప్పిన మాట విన్నపుడు సంతోషం వేసేది. ఇప్పుడు వాడు పెద్ద ఆఫీసరూ, అని బామ్మ చెప్పినప్పుడు మనకు ఎంత బావుండేది. ఊరట కలిగేది.”
“మళ్ళీ మనం అందరితో కలిసి ఒక చోట ఆడుకునేప్పుడు ఒకళ్ళ భావాలు మరొకరం, సహనం, సర్దుబాటు, ప్రేమతో పంచుకుంటూ అర్థం చేసుకుంటూ కలసిమెలసి ఉండేవాళ్ళం. అప్పుడు అసలు కుటుంబం మనకు ఒక శిక్షణా మరియు ప్రదర్శనా వేదికగా ఉండేది, బయట ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు. అంత మందిలో ఉన్నపుడు తల్లి తండ్రుల మీదే ప్రతీదానికి ఆధారపడనవసరము లేదు”
“తత్వ బోధనకి పెద్దవాళ్ల కేసి చూసేవాళ్ళం. వారు వారి అనుభావాలు జతచేర్చి, ఓపికగా కధలుగా చెబుతూ చిన్నవాళ్ళని తీర్చిదిద్దేవారు. మరి తోటి వయసు వాళ్ళు ఒకరికి ఒకరు భరోసా ఇచ్చుకుంటూ, అనుకున్నమాటలు మర్చిపోయి కలిసి అల్లరిలోకి దిగిపోయే వాళ్ళం. ఎంతైనా చిన్నపిల్లల మనస్తత్వం మనలో తొంగి చూసేది కాదా... అలా ఆటలలో ఊహాలోకాలలో తేలిపోయే వాళ్ళం కదూ. మరి మనము పెరిగింది మనుషులలో. ఎన్ని యంత్రాలతో పరిగెత్తినా చివరకు మనకు మానవ సంబంధాలు కావాలి. ఒంటరితనము పోవాలంటే మనుషులు అవసరము. మనము చిన్నపుడు చదువుకున్నాం కదా మానవుడు సంఘజీవని. అప్పుడు కుటుంబాలు ఒక నాటకరంగం. ఎంతో మంది ఉండేవారు వేరు వేరు పాత్రలు పోషించేటందుకు... ఇప్పుడు అవి ఏవి? మనుషులు లేరు!! యంత్రాలున్నాయి. కాని మానవ సంబంధాలు కనుమెరుగు అవుతున్నాయి..ఇవి పెంపొందించే బాధ్యత కూడా మనదే. అప్పుడే మన బాబు తన తోటి వాళ్ళతో కలసి పని చేయగలడు. ఆడుకోగలడు. ఇలా ఈ కాలంలో తల్లీతండ్రీ ఆలోచించటం లేదనిపిస్తోంది. సమాజంలో ఎలా జీవించాలో పిల్లలికి రుచి చూపటంలేదు. వాళ్ళకి ఖాళీ లేదు. ఇదీ యంత్రాలకీ మరియు సంస్థలకి వదిలేస్తున్నారు. అవి చెప్పవని కాదు, కాని మనము కాస్త వాత్సల్యంతో, మన అనుభవాలు జత చేర్చి కథల రూపంలో చెప్పినప్పుడు, పిల్లలికి మన మీద ఆత్మీయత మరియు అనురాగాలు పెరుగుతాయి. మానవ సంబంధాల మీద ఇష్టం పెంచినవాళ్ళమౌతాము. ఇవే తక్కువ అయ్యి కలసికట్టుగా ఉండలేక పోతున్నారు. మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. పొత్తు కుదరటం లేదు. మరి మనదే తీసుకోండి అణు కుటుంబం. మన బాబునే తీసుకోండి ఒంటి పిల్లి రాకాసిలా ఇంకొకళ్ళతో పడదు. ఎంతసేపు యాంత్రిక యుగంలో ఓలలాడుతాడు. అదే నా బెంగ. మనం బాబుకి రుచి చూపించాలి మానవ సంబంధాలు ఆత్మీయతలు అనురాగాలు.”
“అవి రుచి చూడకే, సద్దుకు పోవటం రాక సతమతమౌతున్నాడు. స్నేహితులు మరియు తన ఆత్మీయులతో ఎలా వ్యహ్వరించాలో తెలియదు బాబుకి. అందుకే ! స్నేహితులు ఉండరు... ఎంతసేపు కుర్చోవటం. వ్యాయాయం అసలు ఉండదు. మెదడు చురుకుగా ఎలా ఉంటుంది?
ఆటలు శిక్షణా సన్నివేశాలు. ఒకళ్ళ భావనలు, నడవడికలు మరొకరికి శూలాలాగ గ్రుచ్చుకోవచ్చు ఒక్కొక్కసారి. గెలుపు ఓటమిలు ఆటలలో సహజం. అవి చావు బ్రతుకుల వరకు ఎప్పుడూ వెళ్ళకూడదని, ప్రతీసారీ మనమే గెలవాల్సిన అవసరం కూడా లేదనీ, గెలిచినంత మాత్రాన్న మనమే గొప్పవాళ్ళు కాదని, నిలతొక్కుకోగలగాలి సంతులనంతో. మొక్కైవంగనిదే మానైవంగుతుందా. కొంచం పెద్దయ్యాక అక్కచెల్లళ్ళకీ అన్నదమ్ముల మధ్య, అదే తరహా సమకాలీన పిల్లల మధ్య; అనుబంధాలు, బాధ్యతలు కూడా అర్ధమౌతాయి. ఆడ మగ మధ్య అనురాగాలు, సహజ శారీరక మానసిక విషయాలపై సరైన అవగాహన మరియు గౌరవము ఏర్పడతాయి. వీటన్నికీ సహజంగా అవకాశం లేనప్పుడు బాధ్యతగల తల్లీ తండ్రిగా మనము తోడ్పడాలికదా. ఏమంటారండీ.”
“మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నామా! చెప్పండి. మనం మంచి మార్పులు స్వీకరిస్తూ పాత అనుచరణలలో వున్న పరమార్ధాలను మర్చిపోకూడదు కదండీ. అవును, ఈ కాల పరిస్థితులలో నాటకరంగ వేదికపై పాత్రలన్నీ మనమే ప్రదర్శించాలి. అది మనకు ఒత్తిడే. నేను ఒప్పు కుంటాను. కానీ అణు కుటుంబాలలో తల్లిదండ్రులకు ఇది కనీస బాధ్యత. తప్పదు. ఏమంటారు? తరువాత అన్ని పాత్రలు మురళీ, మనమే వహించాలి కాబట్టి మీరు తప్పనిసరి పనులు ముందు చేసేసుకుని వాడికి వాడి భాషలో ‘Role model' కావాలండీ. బాబుకి మనం ఏదన్నా పని చేసే ముందు లంచము కన్నా...బాబు పని చేశాక సంతోషముతో బహుమతి ఇవ్వటం అలవాటు చేయాలి. మరి ఇలాంటి మార్పులు తేవాలంటే శని ఆదివారాలే కదా ఉన్నాయండి. మనము ఒక విధముగా చూస్తే ఒత్తిళ్ళూ బాధ్యతలు మనకు ఎక్కువయ్యాయి. మరి ఆడుతు పాడుతూ పని చేసుకుంటూ, అలుపూ సలుపు లేకుండా ఒడ్డున చేరుదామా”. అమ్మయ్య అంటూ, ఒకసారి తన గుండె బరువు తగ్గి పద్మజ మురళి కేసి చూసి “ఏమంటారు?” అంది మురళితో.
“అబ్బో, పద్మజా! నువ్వేనా, అలా ఏక ధాటిగా మాట్లాడేసావు.. రాత్రి ఏమన్నా జ్ఞానోదయం కలిగిందా ఏమిటి! ఇంకా నేను ఏమనను? నీతో వాదించటమే తప్పంటాను అని నవ్వుతూ, చాలా బాగా చెప్పావు అలాగే చేద్దాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్ని భోగభాగ్యాలున్నా ఎంత మనము యాంత్రిక జీవనశైలి అవలంబించినా, వాటితోపాటు కాస్త మానవ సంబంధాలు జతచేస్తే దాని ఫలితమే వేరు. షడృచభరితం. ఎవరికి వారు అనుభవించాల్సిందే. ఎంత బాగా చెప్పావు.. బావుందోయ్ అంటూ... కుర్చిలోంచి లేస్తూ ఒక అరగంట నడచి వస్తా...కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి...ఫలహారము తయారు చెయ్యి. ఇలా వెళ్ళి అలా వస్తాను” అని వాక్కి బయలుదేరాడు మురళి.
******
మురళి ఆలోచనలో పడ్డాడు. మురళి మనసు కలవరమయ్యింది బాబు గురించి ఆలోచిస్తోంటే.. సరైన పెంపకము చేస్తున్నామా అని మళ్ళీ మళ్ళీ ఆలోచనలు రాసాగాయి. మన బాబుకి అసలు తోటి వయస్సు పిల్లలు అందుబాటులో ఎవరులేరు దగ్గర బంధువులలో. అందరూ ఇతర దేశాలలో ఉన్నారు. పద్మజ మాటల్లో మానవ సంబంధాలు అనే మాట మరీ మరీ గుర్తుకి రాసాగింది. రఘు వాళ్ళింటికి వెళితే వాడి కొడుకు కూడా బాబు వయసు వాడే కదా. పుణ్యం పురుషార్ధం కలిసి వస్తాయి. మనకీ బావుంటుంది పిల్లలకీ బావుంటుంది. పద్మజ ఏమంటుందో. ఈ ఆలోచనలతో తిరిగి ఇల్లు చేరుకున్నాడు మురళి.
******
“పద్మజా నువ్వన్నవన్నీ బావున్నాయి. మానవసంబంధాలు చాలా అవసరము. బాబుకి మంచి అవకాశాలు కలిపిద్దాము. ఆ ప్రణాళికలో మొదటి భాగంగా ఈరోజు రఘు వాళ్ళంటికి వెళదాము. నువ్వట్లుగానే బాబు మానసిక అభివృధ్ధికికూడా కృషి చేద్దాం. నలుగురిలో బ్రతకడం నేర్పుదాం.”
పద్మజా, “రఘు, మనలాంటి మనస్తత్వం కలిగిన వాడు. మనం రఘు ఇంటికి వెళ్ళి రెండు సంవత్సరాలు దాటిపోతోంది. వాడూ నేను ఎంత బాగా ఆడుకునేవాళ్ళమో. అభిమానవంతుడు. అప్పుడు ఏమిటో వాసు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్తూ కార్లో మధ్యలో వాడున్న ఊరు మీదగా వెళ్తుంటే, వాడిని చూడాలనిపించి భోజనాల వేళ అయినా చెప్పాపెట్టకుండా వెళ్ళాము. అప్పుడు నువ్వు కూడా వచ్చావు గుర్తు వుందా? అప్పుడు బాబుకి మూడేళ్ళు కదా. వాళ్ళ అబ్బాయి కృష్ణ వీడికన్నా ఏడాది పెద్ద. చాలా చురుకుగా వుంటాడు. బాబూ కృష్ణ ఎంత బాగా ఆడుకున్నారో. ఆరోజు రఘు, రఘు భార్య సరళ భేషజాలు లేకుండా చాలా ఆత్మీయులు వచ్చినట్లు ఎంతో సంబరపడ్డారు. భోజనం చేస్తేకాని వెళ్ళకూడదని పట్టుపట్టారు. రుచికరమైన భోజనం తన చేతులతో కొసరు కొసరుగా వడ్డిస్తూ, నవ్వుతూ, అన్నయ్యా వదినా అని వరుసలు కలుపుతూ ఎంత చక్కగా చూసారో. అసలు వాళ్ళిద్దరు అత్మీయతలు అనురాగాలకు మారు పేరనుకోవచ్చు. మరి వాళ్ళ అబ్బాయి కృష్ణ తల్లి తండ్రుల ప్రతి రూపమేగా! అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది? బావుంటుందేమో కదా!”
ఇక్కడికి ఎన్ని గంటల ప్రయాణం అని వంటగదిలో ఉన్న పద్మజ అడిగింది.
ఒక రెండు గంటల ప్రయాణము. వెళ్ళచ్చు. పనులు తొందరగా తెవుల్చుకుని వెళ్దాము.
పద్మజ ముఖం వికసించి పోయింది. మురళికేసి తిరిగి ఏవండీ...
వాళ్ళిద్దరిలో గొప్పతనం తెలుసా! సరళ చేతిలో ఉన్నదేదో జారవిడువకుండా అందంగా మలుస్తుంది. మీ స్నేహితుడు, అదే మా అన్నయ్య! నీతి నియమాలు కలిగిన వ్యక్తి. మరి వాళ్ళిద్దరిని కలిపే ఒకే పదం సంతృప్తి. మరి ఇంకేమీ, తప్పకుండా కలుద్దాము.
మీకు వాళ్ళు ఎలా గుర్తొచ్చారండీ? అని మురళిని ప్రశ్నించింది.
మురళి చిరునవ్వుతో అందుకున్నాడు...
మొన్న నూతన వర్ష శుభాకాంక్షలు చెప్పటానికి ఫోన్ చేస్తే, రారా మా ఇంటికి, అని ఆప్యాయంగా పిలిచాడు. మా కృష్ణ మీ బాబుతో సమయం గడుపుతాడు. వాడికి పిల్లలు కావాలిరా. మనలాగే!, వాడికీ ఎవరూ లేరు, అటుపక్కా ఇటుపక్కా అని మొర పెట్టుకున్నాడు. అదీ కాకుండా నేనంటే వాడికి చాలా ఇష్టం. స్థితిగతులు ఒక్కటి కాకపోయినా మా మధ్యలో ప్రేమానురాగాలు మిన్న.
మురళి సమయం చూస్తూ, అనట్టు పద్మజా, బాబు లేచాడా!
లేదండి.
ఆగు ఒక్క క్షణం లేపి వస్తా అని మురళి బాబుగది లోకి వెళ్ళి హాయిగా నిశ్చింతగా మెత్తటి పట్టులాంటి పరుపు మీద పడుకున్న బాబుని చూసి, ప్రక్కన కూర్చొని, అతి సున్నితంగా తల నిమురుతూ, లేవరా బాబూ అని ముద్దుగా లేపేటప్పటికి, సుపుత్రుడు ముద్దులు ఒలకపోస్తూ, నాన్నని పట్టుకుని 'one minute' అన్నాడు ..కళ్ళు కూడా తెరవకుండా. ఒక్కక్షణంమంటే, మరి ఒక్క క్షణంలో లేవాలి అని మురళి తలనిమురుతూ బాబుకి చెప్పి, పద్మజ దగ్గరకు వంటగదిలోకి వెళ్ళి, తన ఆందోళన వ్యక్తం చేసాడు.
పద్మజా! మన బాబు రఘు వాళ్ళింట్లో ఆ మంచాల మీద పడుకోగలడా.
ఆ! ఎందుకు పడుకోలేడు. మనసుకు నచ్చితే కటికనేలే పట్టు పరుపులా అనిపిస్తుంది. అదేనండి మానవసంబంధాల గొప్పతనం. నచ్చితే, అమ్మ వడిలాగ, అని మురళికి ధైర్యం చెప్పి, మరేమయినా పిల్లలకి పిల్లలే ఉండాలి అంటూ, పద్మజ ఉప్పుడు పిండి తయారు చేయటంలో పడింది.
****
No comments:
Post a Comment