ప్రేమతో నీ ఋషి – 27 - అచ్చంగా తెలుగు
ప్రేమతో నీ ఋషి – 27
-      యనమండ్ర శ్రీనివాస్

( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో ఆ విషయం చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని, అది నిర్ధారించేందుకు స్నిగ్దను ఆఫీస్ కు వెళ్లి పెయింటింగ్ కు సంబంధించిన పత్రాలు చూడమంటాడు ఋషి. అక్కడ మృణాల్ శవాన్ని చూసిన స్నిగ్ధ బెదిరిపోయి, ఋషి సూచన ప్రకారం ఆ రాత్రి ఫ్రెండ్ ఇంట్లో గడుపుతుంది. ఉదయాన్నీ ఆమెను తీసుకువెళ్లేందుకు వస్తాడు ఋషి. ఇక చదవండి...)

“ఋషి, నన్నిక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో. నేను ఈ మానసిక వేదన భరించలేకుండా ఉన్నాను. నేను మృణాల్ ముఖం మర్చిపోలేక పోతున్నాను, అతన్ని హత్య చేసారన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఎవరిలా చేసి ఉంటారంటావు?” స్నిగ్ధ, వెక్కివెక్కి ఏడుస్తోంది, తనను తాను నియంత్రించుకోలేక పోతోంది.
వారిద్దరూ స్నిగ్ధ ఫ్రెండ్ ఇంటి నుంచి స్నిగ్ధ ఇంటికి వచ్చారు.
ఋషి ఆమెను కౌగలించుకుని, “స్నిగ్ధ, బాధ పడకు. నిజానికి, ఇది కేవలం ఆరంభమని నేను నమ్ముతున్నాను. దీని వెనుక మనకోసం మనల్ని అబ్బురపరిచే అనేక విషయాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను. నిరాశ పడకు. ఇప్పటినుంచి నిన్ను వదిలి వెళ్ళను, సరేనా?”
అతను కిచెన్ లోకి వెళ్లి, రెండు కప్పుల కాఫీ తయారుచేసాడు.
“హేయ్, నీకో సంగతి తెలుసా? ఇటాలియన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అక్కడ రెండోసారి ఎవరితోనైనా ప్రేమలో పడే అవకాశాన్ని నేను కోల్పోయానని నాకు అనిపిస్తోంది. ఇంకో సందర్భంలో అయితే, నిజంగా నేను అలాగే  చేసి ఉండేవాడిని.” స్నిగ్ధకు కాఫీ అందిస్తూ అన్నాడు ఋషి. ఆమె మనసు మళ్లించి, మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అతను.
స్నిగ్ధ అతని వంక అభ్యర్ధనగా చూస్తూ, “ఋషి, ప్లీజ్, నీ జోక్ లు ఎంజాయ్ చేసే స్థితిలో ప్రస్తుతం నేను లేను. నీకు తెలుసు కదా, ఈ గందరగోళపు వాతావరణంతో నేను విసిగిపోయి ఉన్నాను. ఇది ఏ పరిస్థితులకు దారి తీస్తుందో నాకు తెలియట్లేదు.”
ఋషి కాఫీ తాగుతూనే స్నిగ్ధతో ఇలా అన్నాడు,” కనీసం నేనిప్పుడు ఒక విషయం తలచుకుంటూ ఆనందంగా ఉన్నాను – నీకు మునుపు చెప్పినట్లుగా, నాకు  అప్సరతో ఏ సంబంధము లేదని, పెయింటింగ్ విషయం చాలా తీవ్రమైనదని నీకు తెలిసింది.”
స్నిగ్ధ వెంటనే కాఫీ తాగడం ఆపి, ఒక్క క్షణం పాటు ఆలోచించింది. ఒక గంభీరమైన ఆలోచన హఠాత్తుగా ఆమెకు తట్టినట్లుగా అనిపించింది.
ఆమె వెంటనే ఋషి వద్దకు వచ్చి, “ఋషి, ఒక విషయం చెప్పు. ఒకవేళ మృణాల్ కొన్నది గిల్సీ పెయింటింగ్ అయితే, డిజిటల్ గా దాన్ని రూపొందించేందుకు ఎక్కడో అసలు చిత్రం ఉండి ఉండాలి కదా ! కాబట్టి, మనకున్న గందరగోళానికి తోడుగా, ఈ పోర్ట్రైట్ వంటిదే మూడో పెయింటింగ్ ఉంది, దాన్ని మనం ఇంతవరకు చూడలేదు.” అంటూ ఆమె మాట్లాడడం ఆపి, మనసులో తన అంచనా సరైనదేనా అని ఆలోచించసాగింది.
ఋషికి వెంటనే విషయం అర్ధమయ్యింది. వారు గార్డెన్ హోటల్ లో చూసిన అసలు చిత్రం, భద్రంగా ఉంచబడింది, ఇన్నాళ్ళూ భారత హద్దులు దాటలేదు. మృణాల్ కొన్నది డిజిటల్ చిత్రమే అయితే, ఖచ్చితంగా అది తయారు చేసేందుకు వారి వద్ద మరొక కాపీ ఉండి ఉండాలి.
అతని మెదడు చురుగ్గా పనిచెయ్యసాగింది. ఇప్పుడు, మృణాల్ ను అడగడం అనేది జరగని పని. దీని గురించి అప్సరకు చెప్పడమూ అతనికి ఇష్టం లేదు. సోమవారం ఆఫీస్ తెరిచి, మృణాల్ హత్యను గురించి అందరూ తెలుసుకునే  లోపల దీన్ని అతను త్వరగా పరిష్కరించాలని, అతనికి బాగా తెలుసు.
అతనికి స్నిగ్ధను భయపెట్టడం ఇష్టం లేదు. పోలీస్ లకు మృణాల్ హత్యను గురించి తెలియగానే వారు సందేహించే వారి లిస్టు లో స్నిగ్ధ కూడా ఉంటుంది. అందుకే సోమవారం లోపల, అతను ఈ గుట్టును ఎలాగైనా చేధించాలి.తన భయాలను ఆమెకు వెల్లడించకుండా అతను కాఫీ తాగడం పూర్తి చేసాడు.
స్నిగ్ధ కిటికీ బయటకు చూస్తూ ఇలా అంది,”ఋషి, ఈ రోజున నువ్వు నాతో ఉన్నా, సోమవారం అటెండెంట్ ఆఫీస్ తెరిచి, మృణాల్ శవాన్ని చూసాకా, మొదట అనుమానించేది నన్నే కదా !అంటే, ఏమైనా చేసి ఈ రొచ్చు నుంచి బయటపడేందుకు నాకు కేవలం ఒక్కరోజే సమయం ఉంది, అవునా? గతంలో మృణాల్ తో నాకున్న విభేదాల దృష్ట్యా అప్సర కూడా నేనే అతన్ని చంపానని నమ్ముతుంది.” ఇలా అంటుండగానే ఆమె స్వరం గద్గదమై, ఆమె చెక్కిళ్ళ నుంచి కన్నీరు కారసాగింది.
ఋషి వెనువెంటనే ఇలా అన్నాడు,”స్నిగ్ధా, ఎక్కువ టెన్షన్ పడకు. నిజానికి, ఇందులో మృణాల్ పాత్ర ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. మనకు అనిపిస్తున్న విధంగా ఒక నకిలీ పెయింటింగ్ ను అమ్మడం ద్వారా అతను డబ్బులు సంపాదించాలని అనుకుని ఉంటాడు. జాగ్రత్తగా అతనొక నకిలీ పెయింటింగ్ ను తయారు చేయించి, ఆక్షన్ హౌస్ కు అమ్మి, మళ్ళీ మిష్టర్ బెనెడిట్టో ద్వారా దాన్ని అతనే కొనడం వెనుక ఏదో వృధా ప్రయాస ఉంది.”
ఋషి నెమ్మదిగా అన్నా, స్నిగ్ధ అతడు చెప్పింది ఏమిటో వెంటనే అర్ధం చేసుకుంది. హైదరాబాద్ కు పెయింటింగ్స్ ను ఎక్స్పోర్ట్ చెయ్యడంలో మృణాల్ చేసిన జాగును ఆమె గుర్తుచేసుకుంది. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. అది తుఫాను ముందు ప్రశాంతతలా అనిపించింది. ఆ విషయాన్ని గురించి వారు మరింత ఆలోచిస్తున్న కొద్దీ, వారి అనుమానాలు మరింత బలపడసాగాయి.
“అయితే పెయింటింగ్స్ ను డిజిటల్ కాపీలు చేసే మొత్తం సరంజామా ఎక్కడ ఉండి ఉంటుంది?” ఋషి ఇది ఎలా జరిగిందో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒక్కొక్క పోర్ట్రైట్ చాలా పెద్దది కనుక, దాన్ని డిజిటల్ రిప్రడక్షన్ కోసం ఆ ఆఫీస్ నుంచి బయటకు తరలించడం అన్నది చాలా కష్టమైన పని. కానీ, ఆ పని ఆఫీస్ లోనే చేస్తూ ఉంటే స్నిగ్ధకు అది తెలిసి ఉండాలి. కాబట్టి, ఇక్కడున్న ఒకేఒక్క అవకాశం, ఆ డిజిటల్ రిప్రడక్షన్ అనేది స్నిగ్ధ ఆఫీస్ బిల్డింగ్ లోనే జరగాలి.
“ఈ పని జరిగేందుకు మీ ఆఫీస్ లో ఏదైనా పెద్ద స్థలం అందుబాటులో ఉందా?” ఋషి స్నిగ్దను అడిగాడు.
“నాకు గుర్తున్నంతవరకు అటువంటిది లేదు,” స్నిగ్ధ బదులిచ్చింది, కాని మళ్ళీ ఆలోచించగానే, వెంటనే ఇలా అంది , “అక్కడ ఎప్పుడూ మూసే ఉండే ఒక గది ఉంది. అది కేవలం మహేంద్ర వాడతారని మృణాల్ చెబుతూ ఉండేవాడు. కాని, మహేంద్ర ఆ గదిలోకి వెళ్ళడం నేనెప్పుడూ చూడలేదు.”
“మనం ఇవాళ వెళ్లి, ఆ గదిలో ఏముందో చూద్దామా? ఈ రహస్యాన్ని చేదించేందుకు ఆ గదిలో మృణాల్ మనకోసం ఖచ్చితంగా ఏదో ఉంచే ఉంటాడు.” ఋషి ఇక రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు.
స్నిగ్ధ వెంటనే స్పందించి, “లేదు ఋషి, ఆ గదికి బయోమెట్రిక్ తాళం ఉంది. కేవలం మహేంద్ర మాత్రమే ఆ తాళాన్ని తియ్యగలడని మృణాల్ నాతో అన్నాడు. అతని వేలిముద్రలు ఉంటేనే మనం ఆ గదిలోకి వెళ్ళగలం.” అంది.
ఋషి వీలైనంత త్వరలో ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని ఆతృత పడుతున్నాడు. ఆధారాల కోసం అతను మరింత సమయాన్ని వృధా చెయ్యలేడు, లేక అవకాశాల కోసం ఎదురు చూడలేడు. ముఖ్యంగా, వేచి ఉండే కంటే, తమ అనుమానాలను నిర్ధారించుకునేందుకు ఉన్న ఒకేఒక్క అవకాశాన్ని వినియోగించడం ఎలాగా అని అతను ఆలోచిస్తున్నాడు.
“స్నిగ్ధా, నువ్వు ఎప్పుడైనా ఆ గదిలోకి వెళ్ళావా? లేక ఈ విషయంలో మనకు అప్సర కాని, వేరే ఇతరులు ఎవరైనా కాని సాయపడగలరా?” ఋషి ఆరా తీసాడు.
“లేదు ఋషి, కేవలం మహేంద్ర మాత్రమే తెరవగలరు. దీనికి మనకు మహేంద్ర వేలిముద్రలు మాత్రమే కావాలి.”
మళ్ళీ కాసేపు నిశ్శబ్దం... హఠాత్తుగా ఋషి, “లేదు. మనకు మహేంద్ర అక్కర్లేదు. మనకు అతని వేలిముద్రలు మాత్రమే కావాలి.” అంటూ ఋషి ఆ గడిలోనించి పరుగు తీసాడు.
అతను ఏం చెయ్యబోతున్నాడో స్నిగ్ధకు అర్ధం కాకున్నా, మౌనంగా అతన్ని అనుసరించింది. ఒక చాలెంజింగ్ అంశంపై పని చేసేటప్పుడు, చిన్న ఆశాకిరణం కూడా గొప్ప ఊరటనిస్తుందని ఆమె గుర్తించింది. పూర్తిగా కాకున్నా, ఆమెకి ఇప్పుడు కాస్త తేలిగ్గా అనిపించసాగింది.
(సశేషం)                                                                                     

No comments:

Post a Comment

Pages