సామ్రాజ్ఞి - 10 - అచ్చంగా తెలుగు
సామ్రాజ్ఞి - 10
భావరాజు పద్మిని


(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్దంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. తమ రాజ్యంలోని వివిధ బలాబలాలను గురించి అర్జునుడి సర్వసేనానియైన ప్రతాపరుద్రుడితో చెబుతూ ఉంటుంది వీరవల్లి. ఈలోపు విదూషకుడు చతురుడు అక్కడికి వచ్చి, వారికి వినోదాన్ని కల్పిస్తాడు. సంధిచర్చలకు సీమంతిని నగరానికి రావాలన్న కోరికతో వీరవల్లి ద్వారా సామ్రాజ్ఞికి ఒక లేఖను పంపుతాడు అర్జునుడు. ఆమె ఆహ్వానంపై అర్జున సేన బయలుదేరి, స్ర్తీ సామ్రాజ్యం చేరేందుకు పంపానదిని దాటుతూ ఉంటుంది. ఇక చదవండి...)

పంపానదిని దాటి సీమంతినీ నగరపు ఒడ్డున అడుగుపెట్టగానే ఘనమైన పూర్ణకుంభ స్వాగతం లభించింది అర్జున పరివారానికి. దండనాయకి వీరవల్లి తన సేనతో వారికి వందనం సమర్పించి వారికి తోడుగా నిలిచింది. దారిపొడవునా పరిచారికలు పూలజల్లు కురిపించసాగారు. ఒకవైపు సంగీతమంతా ఔపాసన పట్టినట్లున్న గాయినులు వాయిద్యాల మేళవింపుతో కూడిన తమ గంధర్వగానంతో, మురిపిస్తూ ఉండగా, మరోప్రక్కన అప్సరసల్ని తలపిస్తున్న నర్తకీమణులు స్వాగత నృత్యాలు చేయసాగారు. అర్జునుడు తమ రాజ్యానికి విచ్చేసాడని, అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది. వారలా ముందుకు వెళ్లి, ఒక పెద్ద సింహద్వారానికి చేరుకున్నారు. ఆ ద్వారం మీద స్త్రీ సామ్రాజ్య చిహ్నం ఉంది. దాన్ని నిశితంగా పరిశీలించాడు అర్జునుడు. అడ్డంగా ఎక్కుపెట్టిన ఒక విల్లు, ఆ విల్లుకి బాణంలా త్రిశూలము, దాని చుట్టూ మండుతున్న అగ్ని చిహ్నాలు ఉన్నాయి.

“మహారాజా ! స్త్రీ అగ్ని స్వరూపిణి అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక విల్లంబులూ, త్రిశూలము, మా రాజ్య దేవత ఆదిపరాశక్తి ఆయుధాలు. స్త్రీలంతా ఆదిశక్తి స్వరూపాలేనని సూచించే చిహ్నమిది. ” అంటూ తమ రాజ్య చిహ్నాలను గురించి వివరించింది వీరవల్లి. “భళా! బహు యుక్తిగా చిహ్నాలను ఎంచుకున్నారు.” మెచ్చుకున్నాడు అర్జునుడు.




వారా ద్వారాన్ని దాటి లోనికి ప్రవేశించగానే ఒక్కసారి తమ కళ్ళను తామే నమ్మలేక పోయారు. ఏదో భూతల స్వర్గానికి వచ్చినట్లుగా ఉంది వారి పరిస్థితి.

మొత్తం నగరం అక్కడినుంచి నాలుగు అంతస్తుల్లో అతి పెద్ద చదునైన వేదికలుగా నిర్మించబడి ఉండడం కనిపించింది. ఒక  వేదికకు, ఇంకొక వేదికకు మధ్య కందకాలు, వాటిపై పొడవాటి తాళ్ళ వారధులు కనిపించాయి. వర్షపు నీరు నగర అవసరాలకు నిల్వ ఉండేలా కట్టిన వారధులు కూడా వారికి కనిపించాయి. నగరమంతా గోడల మీద మహిషాసుర మర్ధిని, భద్రకాళి, చండి, వంటి అమ్మవార్ల గాధలు రంగురంగుల కుడ్య చిత్రాలుగా చిత్రించబడి ఉన్నాయి.

వారలా ముందుకు వెళ్తూ  మొదట ఒక తామ్ర వేదికకి చేరుకున్నారు. “అర్జున మహారాజా ! మా సీమంతినీ నగర నిర్మాణం మీకు అచ్చెరువు కలిగిస్తోందని మీ ముఖకవళికలను బట్టీ ద్యోతకమవుతున్నది. మా నిర్మాణ వైశిష్ట్యం గురించి చెబుతాను, వినండి. నగర నిర్మాణ రచన  చాలా పకడ్బందీగా చెయ్యబడింది. ముందుగా దిగువ స్థాయి ఉద్యోగులు, సైనికులు నివసించే తామ్ర నివాసాలు ఈ తామ్ర వేదికపై, నిర్మించబడ్డాయి. ఆతర్వాత దండనాయకులు, మధ్యతరగతి వ్యాపారిణులు వంటి వారు నివసించే కాంస్య నివాసాలు ఆ కనిపిస్తున్న కాంస్య వేదికపై ఉంటాయి, ఆ పైన ఉన్నత స్థాయి రాజోద్యోగులు, సైన్యాధ్యక్షులు, సంపన్న వర్గం వారు, నివసించే రజత  నిర్మాణాలు రజత వేదికపై ఉంటాయి. అన్నింటికీ ఎగువన ఉన్న స్వర్ణ వేదికపై , పైకప్పు శ్రీచక్ర ఆకారంలో వచ్చేలా నిర్మించబడ్డ మా సామ్రాజ్ఞి ప్రమీలా దేవి కోట పూర్తిగా స్వర్ణంతో నిర్మించబడి, మణుల తాపడాలతో చీకట్లో సైతం మెరుస్తూ ఉంటుంది. ఆ అంతఃపురంలోనే మా గుర్విణి శక్తిసేన కూడా నివసిస్తూ ఉంటారు. ఒక వేదికకు మరొక వేదికకు మధ్య కందకాలు, వారధులు ఉండడం చూసారు కదా. ఏ కారణంగానైనా ప్రమాద భేరి మ్రోగితే, మా సైన్యం ఆ తాళ్ళ వారధులను ఒక వైపు నుంచి లాగి, మడిచేస్తుంది. తద్వారా శత్రువులు పూర్తిగా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం దుర్లభమవుతుంది. శత్రుసేన ఆదిలోనే నిరోధించబడుతుంది. “ అంటూ వీరవల్లి చెబుతూ ఉండగానే...

“భేష్... ఇటువంటి వాస్తు కౌశలం మేము ఇంతవరకు ఏ రాజ్యంలోనూ చూడలేదు...” అని మెచ్చుకున్నాడు అర్జునుడు.

“కృతఙ్ఞతలు మహారాజా ! ‘స్త్రీలు ఇంత గొప్ప నగరాన్ని ఎలా నిర్మించారా?’ అని ఇదంతా మీకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాని, మీకోసం మరిన్ని ఆశ్చర్యాలు వేచి ఉన్నాయని, మా అతిధులైన మీకు సవినయంగా మనవి చేస్తున్నాను.” చిరునవ్వుతో చెప్పింది వీరవల్లి.

తామ్ర వీధిలో ‘సైనిక శిక్షణా శిబిరం’ ఉంది. అక్కడే ఉన్న విశాలమైన మైదానాల్లో మల్లయుద్ధం, కత్తియుద్ధం, విల్లంబుల ప్రయోగంలో కొందరికి శిక్షణ ఇవ్వడం కనిపిస్తోంది. వీధుల్లో రకరకాల అంగళ్ళు నెలకొని ఉన్నాయి. అన్నింటిలోనూ స్త్రీలే అమ్మకాలు చేస్తున్నారు. అందరూ ఎరుపు రంగుఅంచులున్న తెల్లని వస్త్రాలు ధరించారు. సైనికులుగా, పుష్పలావికలుగా, వర్తకీమణులుగా, ఓషధ వైద్యమణులుగా ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తున్న స్త్రీలను విచిత్రంగా చూస్తూ, మొదటి వేదిక వారధి వద్దకు వచ్చారు వారు. అసలా వంతెన తమ అశ్వ, రధ శకటాలను మొయ్యగలదా అన్న అనుమానంతో ఆగిపోయారు వారు.

“సందేహించకండి మహారాజా ! ఈ వారధిపైనే మా గజ బలగాలు కూడా ప్రయాణిస్తాయి. చూసేందుకు నాజూగ్గా అనిపించినా, తాళ్ళతో పాటు లోహపు తీగలను పేనిన వంతెన ఇది. సుమారు వెయ్యి కిలోల బరువును మోయ్యగలదిది. నిస్సందేహంగా పయనించండి.” అంది వీరవల్లి.
ఆ వారధి దాటి వారు నెమ్మదిగా కాంస్య వేదికపైకి ప్రవేశించారు. తామ్ర వేదిక కంటే కాస్త ఘనంగా ఉంది అక్కడి నిర్మాణం. వీధుల్లో స్థంభాలకు పైన ఇత్తడి తాపడాలు ఉన్నాయి. లోహంలో, వైభవంలో మార్పే తప్ప, వాణిజ్య స్థలాలు, ఆలయాలు, వినోద వేదికలు, శిక్షణా మైదానాల విషయంలో అచ్చంగా తామ్ర వేదికనే పోలి ఉంది ఆ కాంస్య వేదిక. అశ్వ గజబలగాలను లొంగదీసుకుని, వాటితో యుద్ధం చెయ్యడంలో కొంతమందికి అక్కడ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి స్త్రీలు నీలి రంగు అంచులున్న తెలుపు చీరలు ధరించారు. వినోద వేదికల్లో నృత్య, గాన, కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఆ కాంస్య వేదిక వారధి దాటి, రజత వేదిక పైకి ప్రవేశించారు వారు.

ఇక్కడ వీధుల్లో స్థంభాలకు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. గోడలకు వెండి తాపడాలు ఉన్నాయి. రాజ తంత్రాలలో, వేద విద్యలలో, పలు కళల్లో ఆ వేదికపై శిక్షణ ఇస్తున్నారు. అక్కడి స్త్రీలు ధరించిన దుస్తులు కూడా వెండి జరీతో చేసినట్లు మెరిసిపోతున్నాయి. వారి మెడలో వెండి ఆభరణాలు వారి నగిషీల నైపుణ్యాన్ని చాటుతున్నాయి. తెల్లని వేదిక, విచిత్రమైన పద్ధతిలో తెల్లని వస్త్రాలు ధరించిన స్త్రీలు, వారి కొప్పుల్లో తెల్లని కొండమల్లెలు, వారి మేడలో వెండి ఆభరణాలు, తెలుపు రంగు వీధులు... అర్జున సేనను విస్మయానికి గురి చేస్తుంటే, మరో వైపు అప్పుడే ఉదయిస్తున్న పూర్ణ చంద్రుడి పండువెన్నెల, అక్కడి ప్రాకారాలపై ప్రతిఫలిస్తూ అదేదో వెండి వెన్నెల నగరమేమోనన్న భ్రమను వారికి కలిగించసాగింది. ప్రదోష వేళ వారు వెలిగించిన  దీపాల, అగరు పొగల పరిమళాలు అర్జున సేనను కమ్మేస్తున్నాయి. ఆ వేదికను దాటి ముందుకు వెళ్లేందుకు మనస్కరించకపోయినా, త్వరలోనే చీకటి పడుతుంది కనుక, స్వర్ణ వేదికపైకి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు వారు.

రజత వారధి దాటి, స్వర్ణ వేదికకు ప్రవేశించగానే, కాగడాల వెలుతురులో వారిని అతిధి గృహానికి తీసుకుని వెళ్లి, తగిన సత్కారాలన్నీ చేసారు సేవికలు. మార్గాయసంతో డస్సిపోయిన సేన వారు ఏర్పరచిన పట్టుపానుపులపై త్వరలోనే నిద్రలోకి జారుకున్నారు.
(సశేషం...)




No comments:

Post a Comment

Pages