శ్రీమద్భగవద్గీత- 10
నల్గవ అధ్యాయము
జ్ఞానయోగము
రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
9642618288
అపరేని యతా హారాః
ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి
సర్వేప్యేతే యజ్ఞ విదో
యజ్ఞక్షపిత కల్మషాః
30వశ్లోకం
కొందరు ఆహార విషయమున క్రమశిక్షణగలవారై ఇంద్రియ వ్యాపారములను వశపర్చుకున్న ఇంద్రియముల ద్వారా ప్రేల్చుచున్నారు వీరందరూ పాపము నశించువారగుచున్నారు.ఆహార నియమము కూడా ఒక యజ్ఞమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుచున్నాడు.ఆహార నియమము కూడా ఒక యజ్ఞమే.ఆహార నియమము సామాన్యవిషయమని చాలామంది భావింతురు. గీతాచార్యుడు ఆహార నియమమునకు సముచిత స్థానమొసగి గౌరవించెను.మోక్షమునకు కావలసిన ప్రధాన సాధనలలో దీనిని కూడా జేర్చెను. ఏలయనగా ఆహారము చేతనే మనస్సు ఏర్పడుచున్నది.ఆహారము యొక్క స్థూల పదార్ధము వలన శరీరమున్ను మనస్సున్ను ఏర్పడుచున్నవి. శుద్ధమైన ఆహారమువలన మనస్సుకూడా శుద్ధమగుచున్నది. ఆహారము సాత్వికమైనచో ఆ సాత్పికాణువుల చేనేర్పడు మనసు కూడా సాత్వికమగుచున్నది.
రజోగుణాత్మకమైన మాంసాహారము స్వీకరించు మానవులందును జంతువులందును క్రూరత్వము కనపడుచుండును.పెద్ద ఫాక్టరీలో చిన్న బోల్టు సరిగా లేనిచో ఫాక్టరీ ఎట్లాగిపోవునో అట్లే ఆహారనియమమను చిన్న విషషయము సరిగా లేనిచో
మోక్ష ప్రయత్న సాధనా పూరక యంత్రాగమంతయు స్థబ్దమైపోగలదు ఆహారము శుద్ధముగానుండిన మనసు సుద్దముగా నుండును. మనసు పరిశుద్ధమైననే దివ్యప్రేమ జనించి మోక్షప్రాప్తి కలుగును. కావున ఆహార సంయమము ఒక యజ్ఞముగా
భగవానుడుదహరించెను.
ఆహారము మితముగను, సాత్వికముగను, న్యాయార్జితముగను ,భగవదర్పితముగను ,నియమముతో సేవించినట్లుండవలెను. హింసతోకూడిన విషయములేవియును భగవానునిచే చెప్పబడలేదు ఈ ఆహారనియమముల వలన అనేక జన్మల నుండీ మనసుకు పట్టియున్న కుళ్ళు తొలగిపోవును మన పెద్దలు ఆచరించిన వారానికొకరోజు ఉపవాస దీక్ష కూడా ఆహార సంయమమే యుక్తాహారము వలన శరీరము ఇంద్రియములు మనసు మన స్వాధీనములో నుండి సాదనలో ప్రగతి సాధ్యమౌతుంది
నహి జ్ఞానేచ సదృశం
పవిత్రమిహ విద్యతే
తత్స్వయం యోగసంసిద్ధః
కాలేనాత్మనివిన్దతి
38 వ శ్లోకం
ప్రపంచములో జ్ఞానముతో సమానముగా పవిత్రమైనదేదియూ లేదు మనుజుని పునీతమొనర్చి పరిశుద్ధమొనర్చు వస్తువు జ్ఞానమునకు మించి మరియొకటి లేదు. అది జీవుని యొక్క అజ్ఞాన రూపమాలిన్యమును పోగొట్టి ఆత్మానుభూతిని
కలుగజేయును.ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యము మరుగనయున్న తనయాత్మను అనుభూత మొర్చుకొనుటయే.ఆ జ్ఞానము లభించవలెనన్న స్వప్రయత్నము వలననే సాధ్యము తన ఆకలిని తానే తీర్చుకొనవలెను.దైవము గురువులు సహాయము చేయగలరు తన స్వప్రయత్నము చేతనే జ్ఞానమునుసంపాదించవలెను ఆ జ్ఞానమెచట ఉదయించును తన యందే తన హృదయమందే జ్ఞానముదయించును గాని అన్య ప్రదేశమున కాదు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరఃసంయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్వాపరాం శాంతి
మచిరేణాధిగచ్ఛతి
39 వ శ్లోకం
గురువాక్యమందు, శాస్త్రవాక్యములందు శ్రద్ధ గలవాడును ఇంద్రియములను లెస్సగా జయించినవాడునుయగు మనుజుడు జ్ఞానమును బొందుచున్నాడు. అట్టి జ్ఞానమును పొందినవాడు పరమశాంతిని శీఘ్రముగా బడయగల్గుచున్నాడు.బాహ్య విషయములకు ఏకాగ్రత ఎంత ముఖ్యమో, జ్ఞానసముపార్జనకు కూడా అంతే ముఖ్యము.మనస్సును దృశ్యవిషముల నుండీ మరల్చి ఆత్మయందే ఏకాగ్రమొనర్చిన స్వస్వరూప జ్ఞానముదయించును. జ్ఞానముదయించిన వ్యక్తి ఆత్మానాత్మ వివేకముచే
పరమశాంతిని పొందుచున్నాడు.జ్ఞానోదయముచే మోహమంతరించి మోక్షమునకు ప్రధానవస్తువగు పరమశాంతిని పొందుచున్నాడు.
***
No comments:
Post a Comment