శ్రీరామకర్ణామృతం - 19 - అచ్చంగా తెలుగు
శ్రీరామకర్ణామృతం - 19
డా.బల్లూరి ఉమాదేవి 
కామవరం

81.శ్లో:వసాంతాక్షరాఖ్యే చతుఃపత్ర పద్మే
       త్రికోణాంతకంఠే ధరాతత్వ యుక్తే
      వరాభీతి పాశాంకుశం విద్రుమాభం
     గజాశ్వే నిషణ్ణం భజే రామచంద్రం

తెలుగు అనువాద పద్యము:
మ:అరయన్ భవ్యవసాంత వర్ణయుత పత్రాబ్జ త్రికోణోపరి
   స్థిర భూతత్త్వసమేతుడై రిపుభయోత్సేకప్రపాంశుంకుశ
స్ఫురితుండై వరవిద్రుమ ప్రతిభుడై భూతేశపుత్రాకృతిన్
పరగన్ జెన్నగు రామచంద్రవిభు సద్భక్తిన్ బ్రశంసించెదన్.

భావము:వకారముమొదలు సకారము వరకు నక్షరముల శోభ గల నాలుగు రేకులు గల కోణయంత్రము నందు భూత తత్త్వముతో కూడినట్టి పద్మ మందు గజాశ్వముల ఱందు కూర్చొన్నట్టి శ్రేష్టమైన యభయము,పాశము,. నంకుశము కలిగి పగడము యొక్క శోభను కలిగినట్టి లామచంద్రుని సేవించుచున్నాను.

82.శ్లో:బలాంతాక్షర ప్రాంతషట్పత్ర పద్మే
       లసత్తోయతత్త్వే వరాభీతిహస్తమ్
        మహాకుండికాంచాక్షమాలాం వహంతం
       చతుర్వక్త్రరూపం భజే రామచంద్రం

తెలుగు అనువాద పద్యము:
మ:పరగన్ భవ్య బలాంత వర్ణయుత షట్పత్రాంబుజంబున్ బలా
వరణంబై చెలువొందు నందు రిపు గర్వ  ధ్వంస హస్తోరు శ్రీ
కరసత్కుండిక యక్ష మాల ధరుడై కంజాసనాకారుడై
స్థిరతన్ నిల్చిన రామచంద్రు నతి భక్తి శ్రద్ధ కీర్తించెదన్

భావము:బకారము మొదలు లకారము వరకు గల యక్షరములు ప్రాంతమందుగల యుదక తత్త్వము గల యారు రేకుల పద్మమందుండి యభయ హస్తము కలిగినట్టి  కమండలువును జపమాలికను వహించుచున్న నాల్గు మోములు గల రాముని సేవించుచున్నాను.


83శ్లో:డపాంతరాఖ్యే మణివ్రాత పూరే
       రథాంగాబ్జ హస్తం మహేంద్రోపలాంగమ్
       లసద్వహ్నితత్త్వే నిషణ్ణం గదాంకం
      మహావిష్ణురూపం భజే రామచంద్రం.

తెలుగు అనువాద పద్యము:
మ:జ్వలనస్థానము నైడపాంత విలసద్వర్ణంబు నై యొప్పి యు
జ్జ్వలితంబౌ మణిపూరకంబున గదాచక్రాదిధారుండు నై
లలితేందీవర గాత్రుడై యనఘుడై  లక్ష్మీశు రూపంబునన్
జెలువైనట్టి రఘూద్వహున్  వరదునిన్ శ్రీరాము బ్రార్థించెదన్.

భావము:డకారాది పకారాంతములగు నక్షరములు కలిగి యగ్నితత్త్వము గల మణిపూరక చక్రమందు కూర్చున్నట్టి  శంఖచక్ర హస్తుడై  యింద్ర నీలములవంటి దేహము కలిగి గద చిహ్నముగా కలిగిన విష్ణురూపుడగు రామచంద్రుని సేవించుచున్నాను.

84శ్లో:కఠాంతాక్షరాఖ్యే జగత్ప్రాణతత్త్వే
        వరాభీతిహస్తం త్రిశూలం దధానం
         ఉమానాథమబ్జారిఖండోజ్జ్వలాంకం
      సదర్పాంగ రూపం భజే రామచంద్రం

తెలుగు అనువాద పద్యము:
మ:పవన స్థాన కఠాంత వర్ణ దళదీప్తంబై హరిద్రాభమై
ధ్రువమై యొప్పు ననాహతాంబుజము నందున్ శత్రుహృద్భీతి సం
భవ హస్తోజ్జ్వల శూలుడై గిరిసుతాభర్తై మృగాంకాకారుడై
శివరూపంబున దేజరిల్లు వరదున్ శ్రీరాము సేవించెదన్.

భావము:కకారాది ఠకారాంతాక్షర రూపమైన వాయుతత్త్వ రూపమగు ననాహత చక్రమందుండి యభయహస్తుడై త్రిశూలమును ధరించునట్టి చంద్రఖండము చిహ్నము గలిగి గర్విత రూపము గలిగి శివరూపుడైన రామచంద్రుని సేవించుచున్నాను.

85శ్లో:విశుద్ధాఖ్య పద్మే నభస్తత్ద్వ రమ్యే
      అరూపం సురూపం సమస్తస్వరూపం
    విశిష్టం మనోగమ్య మేకం త్వనాదిం
      భజే జీవ జీవాత్మ రామంచరామమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:సకలాత్ముండయి రూపవర్జితుడునై సద్రూపియై జీవ రూ
పకవాచ్యుండు ననాదియై సుజన సంభావ్యుండునై పుష్కల
ప్రకట స్థాన విశుద్ధపంకజమునన్ భాసిల్లుచున్నట్టి న
య్యకలంకాత్మున కాజిపుత్రునకు నేనశ్రాంతమున్ మ్రొక్కెదన్.

భావము:ఆకాశతత్త్వరూపమైన విశుద్ధ చక్రమందున్నట్టి రూపశూన్యుడైనట్టి మంచి రూపము కలిగినట్టి సమస్త వస్తు రూపుడైనట్టి అధికుడైనట్టి మనస్సునకు మాత్రము గోచరించునట్టి అద్వితీయుడైనట్టు కారణము లేనట్టి జీవరూపుడును జీవులయందు రమించు వాడును నైన రాముని సేవించుచున్నాను .

86.శ్లో:ద్విపత్రాబ్జ మధ్యే మనస్తత్త్వ గమ్యే
          జగత్కారణం జ్యోతిరానందరూపం
          లసద్భావ విష్ణుం మనేభావదీపం                        పరాత్మ స్వరూపం   భజే రామచంద్రం.


తెలుగు అనువాద పద్యము:

మ:తత హృత్పద్మమునన్ ద్విపత్ర కమల స్థానంబునందున్ మనో
గత దీపంబు బరాత్మ రూపము జగత్కల్యాణబీజంబునై
యతుల జ్యోతియు నై పరాత్పరమునై సానందమై కేశవ ప్రతిభం జెందిన రామచంద్రవిభు సంభావించి సేవించెదన్.

భావము:మనస్సు యొక్క తత్త్వముచే బొందదగిన రెండు రేకులు గల పద్మము యొక్క మధ్యము నందున్నట్టి జగత్తులకు కారణమైనట్టి తేజోరూపము ఆనందరూపము నైనట్టి ప్రకాశించుచున్న భావములయందు వ్యాపించినట్టి మనస్సునందు దీపమువలె నున్నట్టి పరమాత్మ స్వరూపుడైన రాముని సేవించుచున్నాను.

87.శ్లో:సదానంద దేవే సహస్రార పద్మే
గలచ్చంద్ర పీయూష ధారా ప్లుతాంతే
     స్థితం రామమూర్తిం నిషేవే నిషేవే
      నసేవేన్యదైవం నసేవే నసేవే.

తెలుగు అనువాద పద్యము:
మ:తత సాహస్రదళాప్త  నిర్గళ సుధా ధారాభిషేకంబునన్
సతతానందమునన్  జెలంగిన రఘుస్వామిన్ బరంధాము నా
శ్రిత చింతామణి రామచంద్రు  మదినే సేవింతు నిష్టాప్తికై
నితరాదిత్యుల నెంతకాలమునకున్నేనెంచ జిత్తమ్మునన్.

భావము:నిత్యానందముచే ప్రకాశించుచున్నట్టి జారుచున్న చంద్రుని యమృత ధారచేత రమ్యమైన సహస్రార పద్మమందున్నట్టి శ్రీరామ మూర్తిని  సేవించుచున్నాను.సేవించుచున్నాను.ఇతర దైవమును నేను సేవించను. సేవించను.సేవించను.


88.శ్లో:సుధాభాసిత ద్వీప మధ్యే విమానే
         సుపర్వాళి వృక్షోజ్జ్వలే శేషతల్పే
        నిషణ్ణం రమాంక నషేవే నిషేవే
         నసేవేన్యదైవం నసేవే నసేవే.

తెలుగు అనువాద పద్యము:
మ:తతదుగ్ధాబ్ధి సితాంత రీపమున మందారోప కంఠోర్వి సం
స్థిత సత్పుష్పక మధ్య సోమ విలసచ్ఛేషాహి తల్పంబునన్
సతతంబున్ కమలాయుతుండగు రఘుస్వామిన్ బరంధాము నా
శ్రితమందారము రాము దప్పనొరులన్  జింతింప భావంబునన్.

భావము:అమృతముచే ప్రకాశించుచున్న ద్వీపము యొక్క  మధ్యమందుగల విమానమందు కల్పవృక్షములచే ప్రకాశించుచున్న శేషశయ్య యందు గూర్చున్నట్టి లక్ష్మి తొడయందుగల రాముని సేవించుచున్నాను.ఇతర దైవమును సేవించను.సేవించను.సేవించను.

89.శ్లో:చిదంశం సమానంద మానందకందం
         సుషుమ్నాఖ్యరంధ్రాంతరాళే చ హంసం
        సచక్రం సశంఖం సపీతాంబరాంకం
      పరంచాన్యదైవం నజానే నజానే.

తెలుగు అనువాద పద్యము:

మ:సరసానందు సుషుమ్న మధ్యగత హంసస్థున్ జిదంశున్ గర
స్ఫురదబ్జారి గదాది సాధను జగత్పూర్ణాత్ము బీతాంబురున్
వరయోగీశ్వర భావ భావితు జిదానందున్ ముకుందున్ బరా
త్పరున్ శ్రీ రాము భజింతు నన్యులను సంభావింప భావంబునన్.

భావము:జ్ఞానరూపుడైనట్టి హెచ్చు తగ్గు లేని యానందము కలిగినట్టి యానందమునకుకారణమైట్టి సుషుమ్నా నాడియొక్క మధ్యమందు హంసరూపుడైనట్టి  చక్రముతో గూడినట్టు పీతాంబరముతో  గూడినట్టి రాముని సేవించుచున్నాను. ఇతర దైవము నెరుగను;ఎరుగను.

90.శ్లో:సుపర్వాళి వృక్షోజ్జ్వల స్వర్ణపీఠే
         వనౌకోముఖై ర్మౌనిభి స్సేవ్యమానం
         స్థితం పుష్పవృష్ట్యావృతం రామమూర్తిం
          సదా భూమిజాయుక్త మీళే హృదంతే

.
తెలుగు అనువాద పద్యము:
చ:చందన వృక్షమూల విలసత్తపనీయ మృగేంద్ర పీఠి నా
     నందము మీర జెన్నలరి నవ్యసుమోత్కర వర్షితాంగుడై
సుందర వామభాగ పరిశోభిత జానకియై మునీంద్ర
సద్బృందము వానరుల్ గొలువ బెంపు వహించిన రాము గొల్చెదన్.

భావము:కల్ప వృక్షములచే ప్రకాశించుచున్న బంగారు పీఠ మందున్నట్టి౹ వానరులు మొదలగు వారి చేతను మునుల చేతను సేవింప  బడుచున్నట్టి పువ్వుల వానచేత నావరింప బడినట్టి  యెల్లప్పుడూ సీత తో కూడినట్టి శ్రీ రామమూర్తిని  హృదయమధ్యమందు స్తోత్రము చేయు చున్నాను.

No comments:

Post a Comment

Pages