శ్రీ రామకర్ణామృతం - 13 - అచ్చంగా తెలుగు

శ్రీ రామకర్ణామృతం - 13

Share This

శ్రీ రామకర్ణామృతం - 13

డా.బల్లూరి ఉమాదేవి, కామవరం


21.శ్లో :సుధాసముద్రాంత విరాజమానె 
        ద్వీపే సితేచందన పారిజాతె 
       మహాసనే పన్నగ తల్పమధ్యే 
      నిషణ్ణమీళే రఘువంశ రత్నమ్. 

  తెలుగుఅనువాదపద్యము. 

శా:క్షీరాబ్ధ్యంత సితాంతరీ పవిలసచ్ఛ్రీచందనాగాంతిక 
స్ఫారానర్ఘ్య వినూత్న రత్న నిచయ ప్రద్యోత దీఠంబునం 
దారూఢంబగు కాద్రవేయ వర పర్యంకాంతారాసీనుడౌ 
శ్రీరామున్ రఘువంశ రత్నము మదిన్ చింతింతు నశ్రాంతమున్. 

  భావము:అమృతసముద్రమధ్యమందు ప్రకాశించుచున్న శ్వేతద్వీపమందుగల చందనప్రిజ్తములనెడి కల్పవృక్షములనడుమ గొప్ప పీఠమందు శేషశయ్యా మధ్యమందు కూర్చొన్న రఘువంశ శ్రేష్టుడైన రాముని నుతించుచున్నాను. 

22.శ్లో :స్మితాననం పద్మదళాయతేక్షణం 
         వినీల మాణిక్య జితాంగ శోభితం 
         జటా కిరీటం శరచాపలాంఛనం 
         నమామ్యహంభానుకులాబ్ధి కౌస్తుభమ్. 

   తెలుగుఅనువాదపద్యము: 

ఉ:ఉందరమందహాసు పరిశుద్ధసరోరుహ పత్రనేత్రు బౌ 
  రందర నీలగాత్రుని విరాజిత భవ్య జటా కిరీటు సా 
నందు సకార్ముకాస్త్రుజననాయకు భానుకులాబ్ధి కౌస్తుభున్చందన చర్చితాంగు రఘుసత్తమునిన్ మదిలో భజించెదన్. 

  భావము:చిరునవ్వు మొగమునందు కలిగినట్టి పద్మపురేకులవలె విశాలమైన నేత్రములు కలిగినట్టి నీలమణులను జయించిన శరీరముచే ప్రకాశించునట్టి జటాకిరీటములు కలిగినట్టి ధనుర్బాణములు చిహ్నముగా కలిగినట్టి సూర్యవంశమను సముద్రమునకు కౌస్తుభమణియైనట్టి రామునకు నమస్కరించుచున్నాను. 

23.శ్లో :ప్రసూనబాణాంకితమిక్షుచాపం 
         చక్రాబ్జ పాశాంకుశవంశనాళం 
          కరైర్దధానం ఘననీలవర్ణం 
          శ్రీ కృష్ణ రూపం ప్రణమామి రామం. 

   తెలుగుఅనువాదపద్యము. 
చ:కరములనెన్మిదింట సుమకాండము వేణువు నిక్షుచాపమున్ 
  దరముకశాంకుశంబులు సుదర్శన పాశములున్ ధరించి భా 
స్కర నిభవర్ణుడై మహితసత్కరుణా కరకృష్ణమూర్తియై 
  పరగిన రామచంద్రునకు బావన కీర్తికిభక్తి మ్రొక్కెదన్. 

  భావము:పుష్పబాణములచే నలంకరించబడినట్టి చెరుకువింటినిచక్రమును,శంఖమును.పాశమును,అంకుశమునుపిల్లనగ్రోవిని ఎనిమిది చేతులందు ధరించినట్టి సూర్యునివంటిరంగుకలిగినట్టి శ్రీకృష్ణరూపుడైనట్టిరామునకు నమస్కరించుచున్నాను . 

24.శ్లో :బహూరు పాదోదర వక్త్ర లోచనం 
         దీప్తప్రచండానల దుర్నిరీక్ష్యమ్ 
          అశేషబృందారక నాగగోచరం 
         భజామితేరాఘవ విశ్వరూపం. 

   తెలుగుఅనువాదపద్యము. 

మ:కరపాదోదర లోచనోరుముఖ సంక్రాతోద్భవాగ్నిచ్ఛటా 
స్ఫురితంబై కడు దుర్నిరీక్ష్యమయి దిక్పుంజంబులన్నిండి ని 
ర్జర వాఙ్మానస దుర్లభంబయిన రాజన్యేభ్యు రామావనీ 
శ్వరువిశ్వాకృతి కేనొనర్చెద నమస్కారంబు లశ్రాంతమున్. 
  
భావము:ఓరామాఅనేకములైన తొడలు పాదములు కడుపులు మొగములు కన్నులు కలిగినట్టి తీక్ష్ణాగ్నివలె చూడశక్యముగానట్టి 
సమస్త దేవతలతోను సర్పములతోనూ గోచరమైనట్టినీవిశ్వరూపమును సేవించుచున్నాను. 

25.శ్లో :సహస్రనేత్రాననపాదబాహు 
         మనంతవీర్యం రవికోటితుల్యమ్ 
         స్రక్చందనాలంకృత దివ్యదేహం 
        భజామ్యహం తేచ్యుతవిశ్వరూపమ్. 

   తెలుగుఅనువాదపద్యము. 

మ:కరనేత్రాననశీర్షపాదములువిఖ్యాతిన్ సహస్రాంకమై 
  సరసీజాప్త సహస్రకోటి నిభమై స్రక్చందనాలంకృత 
స్ఫురితంబయ్యు ననంత వీర్యమయి సంపూర్ణప్రభావాఢ్యమై 
పరగున్ రాఘవువిశ్వరూపము మదిన్ భావించిసేవించెదన్. 


  భావము:వేలకొలది కన్నులు మొగములు కాళ్ళుచేతులు కలిగినట్టి అంతము లేని పరాక్రమము కలిగినట్టి కోటిసూర్యులతో సమానమైనట్టిపూలదండలచేతగంధము చేత నలంకరింపబడిన శ్రేష్టమైమ దేహము కలిగినట్టి 
నీవిశ్వరూపమును సేవించుచున్నాను. 

26.శ్లో :కలంబకోదండ గదాబ్జసంయుతం 
దంష్ట్రాకరాళక ధనంజయానననమ్ 
       పీతాంశుక  స్వర్ణ కిరీటకుండలం 
        భజామి తే రాఘవ విశ్వరూపమ్. 

   తెలుగుఅనువాద పద్యము. 

మ:దరకోదండ గదాకదంబ యుతమున్ దంష్ట్రా కరాళాగ్ని వి 
స్ఫుర దాస్యంబు సువర్ణచేల ధృతమున్ భూరిప్రభారత్నక 
ర్బుర సంజీవ కిరీటికుండల మహా భూషోజ్జ్వలంబున్ శుభం 
కరమౌ రాఘవ విశ్వ మూర్తికి నమస్కారంబులర్పించెదన్. 

  భావము:బాణముతో ధనుస్సుతో  గదతో శంఖముతో కూడినట్టి కోరలో భయంకరమైన చిహ్నములుగాయగ్నితో కూడిన మొగము గలిగినయట్టిపచ్చనిబట్టయు బంగారుకిరీటము కుండలములుకలిగినట్టినీవిశ్వరూపమునో రామా సేవించుచున్నాను. 

27.శ్లో :కోదండ మిక్షు జనితం స్మరపంచ బాణం 
           శంఖం రథా వయవమంకుశ పాశ వేణుమ్ 
           హస్థైర్దధాన మమల ద్యుతి ముద్వహంతం 
         ప్రద్యుమ్న కృష్ణ మనిశం భజ రామచంద్రమ్. 

   తెలుగుఅనువాదపద్యము. 

చ:చెఱుకువిలైదు బాణములుచే ధరియించి రథాంగ వేణుపా 
శరుచిరశార్ ఙ్గ ముఖ్య ఘనసాధన యుక్త మహాష్టబాహు సుం 
దరుహరినీలగాత్రు బరు దర్పకుకృష్ణు సువర్ణచేలు దా 
శరథి బలాధిపున్  శరధిసన్నుతు నచ్యుతు రాముగొల్చెదన్. 


భావము:చెరుకు విల్లు మన్మథుని సంబంధమైన ఐదు బాణములు శంఖముచక్రముఅంకుశము పాశమువేణుదండము ఎనిమిది చేతు  లందు పూనినట్టి నూతనమణులకాంతి గలిగినట్టి ప్రద్యుమ్నావతారుడైనల్లనిరూపుగలట్టి శ్రీరామచంద్రుని సేవించుచున్నాను. 

28.శ్లో :సీతాలోకన తత్పరంమణినిభం వ్యాఖ్యానముద్రాంచితం 
వామేజానుని లంబహస్త మనిశంవీరాసనే సంస్థితం 
మూలేకల్పతరో రనాది మునిభిర్బ్రహ్మాదిభిస్సేవితం 
ముక్తాహారకిరీట కుండలధరం మూర్ధాభిషిక్తం భజే. 

   తెలుగుఅనువాదపద్యము. 

మ:విమలున్ కల్పక మూల సంస్థితుమహా వీరాసనున్ జానకీ 
రమణీదర్శన తత్పరున్ మణినిభున్రత్నోజ్జ్వలద్భూషణున్ 
ప్రమదున్ జాను విలంబ హస్తు వరదున్ వ్యాఖ్యాన ముద్రాంచితున్ 
సుమనఃపూర్వభవాది నిర్జరమునిస్తోత్రున్ విభుని గొల్చెదన్ 

  భావము:సీతను చూచుట యందాసక్తుడైనట్టి నీలమణులతో సమానుడైనట్టి బోధ ముద్రతో కూడినట్టి యెడమ మోకాలియందు వ్రేలాడుచున్న హస్తము గలిగినట్టి వీరాసనమునందున్నట్టి కల్పవృక్షము మూలమందుండి ప్రాచీన మునులచే బ్రహ్మాదులచే సేవింపబడుచున్నట్టిముత్యాల హారములు కిరీటములు కుండలములనుధరించినటువంటి పట్టాభిషేకమునుపొందినటువంటిరాముని సేవించుచున్నాను. 

29.శ్లో :యద్రూపమానందకరం మునీనాం 
      యద్బాణమాఖండల శత్రునాశమ్ 
       యద్దైవతం సర్వజనాంతరస్థం 
        తత్సర్వ రూపం రఘునాథ మీళే. 

   తెలుగుఅనువాదపద్యము: 

ఉ:ఎవ్వని మూర్తి యోగతతి కెప్పుడు సంతస మొందచేయుదా 
నెవ్వని కాండకాండముమహేంద్ర విరోధి వినాశకారణం 
బెవ్వడు విశ్వ విశ్వగతు డెవ్వడు భక్తజనావన  ప్రియుం 
డవ్విభుడైన రామునకహర్నిశమున్నతులాచరించెదన్

భావము:యెవని రూపముమునులకు సంతోషము కలుగచేయునో యెవని బాణము రాక్షసులను నశింపచేయునో యే దేవుడు సమస్తజనుల యంతరంగము నందుండునో అట్టిసర్వస్వరూపుడైన రఘునాయకుని స్తుతించుచున్నాను. 

30.శ్లో :నాదం నాదవినీల చిత్తపవనంనాదాంత తత్త్వప్రియం 
     నామాకార వివర్జితంనవఘనశ్యామాంగ నాదప్రియమ్ 
    నాదాంభోజ మరంద మత్తవిలసద్బృంగం మదాంతస్థితం 
    నాదాంత ధ్రువమండలాబ్జ రుచిరం రామం భజే తారకమ్. 
     
   తెలుగుఅనువాదపద్యము.  
  
శా:నాదున్ నాదవినీలచిత్తపవనున్ నాదాంత తత్త్వ ప్రియున్ 
     నాదాం ధ్రువ మండలాబ్జ రుచిరున్ నామక్రియావర్జితున్ 
నాదాంభోజ మరంద మత్త మధుపున్  నాదప్రియున్ సన్నవాం 
భోదశ్యాము మదంతర స్థితుని రామున్ తారకున్ గొల్చెదన్. 

భావము:ఓంకారవాచ్యుడును వేదాంతములందు ప్రతిపాదింప బడినవాడును నామరూపములు లేనివాడును క్రొత్తమేఘమువలె నల్లనైనవాడును వేదములయందు ప్రీతిగలవాడును అంతరాత్మయైన వాడును ఆశ్రయించువారిని రక్షించువాడును నైన శ్రీరాముని సేవించెదను. 

No comments:

Post a Comment

Pages