తులసి పెళ్ళి - అచ్చంగా తెలుగు

తులసి పెళ్ళి

Share This
తులసి పెళ్ళి
ఓలేటి శశికళ 

చాన్నాళ్ళ తరవాత సాయంత్రపు వ్యాహ్యాళికి బీచ్ రోడ్ కొచ్చాను. మధాహ్నపు మండుటెండ నీరెండలోకి మారి, పొద్దున్నుంచీ ప్రతాపం చూపించినసూరీడు ఇక చాల్లే బాబూ! పోయి విశ్రాంతి తీసుకుంటే పోలే! అనుకుంటూ, కుంటుకుంటూ కునుకేయడానికి పోతున్న వేళ. పొద్దున్నంతా తనమీంచి చల్ల గాలులొదిలి భూమిని బుజ్జగించిన సముద్రం, సాయంత్రానికి నునువెచ్చగా మారి, ఓ మోస్తరు చల్లగాలులు మనకిస్తున్న వేళ, గేదెలుతప్ప, ఆవులు కనిపించని గోధూళి వేళ, ఉన్నంతలో పరిసరాల వీక్షణాన్ని ఆస్వాదిస్తున్న వేళ, యధాప్రకారం మోగాల్సిన సెల్ ఫోను మోగేసింది. 
ఎవరా నా యీ ప్రకృతి సౌందర్యోపాసనని భంగం చేసినవారు? అని చూసా. ఎవరి వల్ల నా శ్రామిక జీవితానికొక ఊరట దొరికిందో, ఎవరి రాక వల్ల మాఇల్లూ వాకిలి వాటి తీరుతెన్నులు కాపాడుకోగలుగుతున్నాయో, ఎవరి వలన మా ఇంటి శునకరాజం మొరగడం మరిచిపోయి హాయిగా , విశ్రాంతిగాజీవించ గలుగుతోందో, ఎవరి దయను నా ఏకైక కైక అదే పుత్రిక నా కేకల నుండి, పని నుండి తప్పించుకుని ఊపిరి పీల్చుకుంటోందో, ఆమహానుభావురాలు "తులసీమాత", మా ఇంటోలో లివ్ ఇన్ సహాయకురాలు. ( పనిపిల్ల అనకూడదని నా హిపోక్రసీ హెచ్చరించింది)
" అమ్మా!! అర్జంటుగా రండి. నాకు చాలా గాభరాగా ఉంది" . 
"ఏమయ్యిందే? కుక్కర్ పేలగొట్టావా? గేసు లీకా? మిక్కీ తప్పించుకుని వీధి కుక్కలంబడి పారిపోయిందా? కొంపతీసి జారిపడ్డావా ఏంటి".... నాప్రశ్నావళి. చెప్పింది సాంతం వినకుండా సొంత ఆలోచనలు గుప్పించడమే మా సంసార నావకు బొక్కలు( భాష! భాష! అంటోంది అంతర్వాణి)పెడుతోంది అని మా ఆయన మొత్తుకుంటూనే ఉంటాడు. అది వేరే సంగతి. ఒదిలేయండి. అది( తులసి. అది ఇది అనడం బూర్జువా బుద్దయునా,నేను నా కూతుర్ని కూడా అది , ఇదే అంటాను కనక మీరు సర్దుకు పోవాలి నా ఆత్మవంచనతో).
" అబ్బా! వినండమ్మా. ఆయన ఫోన్ చేసారు."
" ఎవరే? గుట్ట మీద సత్యనారాయణ స్వామి గుడి పంతులుగారేనా? చెప్పానే కల్యాణం ఒద్దని...."
" అమ్మా!"( చిన్న ఆక్రోశన దాని గొంతులో)
" వినండమ్మా పూర్తిగా. అదే ఆ డాక్టరు గారు. మొన్న మనం వెళ్ళాం కదా"
" ఓ! డాక్టరు గారు చేసారా? ఏమన్నారు? మిక్కీకి జోడీ దొరికిందటా?"
" అమ్మా! ( ఈ సారి నా కూతురి మార్కు కోపం దాని గొంతులో). కాదమ్మా. ఆ రోజు మారేజీ బ్యూరోలో ఒక డాక్టరు గారి ఫొటోవు చూసాం కదా.ఆయన ఫోన్ చేసారు. ఒక గంటలో చూపులకి ఒస్తున్నానని. మీర్రండి వెంటనే . నాకు టెన్షన్ గా ఉంది"..... 
అప్పుడు వెలిగింది నాకు. అవునవును. ఆ అబ్బాయిపేరు జయరాం. ఎమ్ బీ బి ఎస్ చేసి,  కొబ్బరి తోట దగ్గరెక్కడో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా తులసికోసం చూసిన పెళ్ళికొడుకు. ఇప్పుడు నాకు కాళ్ళు ఆడడం లేదు. తులసికి శుభ్రంగా తయారయ్యి మంచి చీరా అదీ కట్టుకుని రెడీగా ఉండమనిచెప్పి, బీచ్ రోడ్డులో ఉన్న స్వీట్ మేజిక్ నుండి స్వీట్లు, స్నేక్స్ పేక్ చేయించుకుని , ఆటో పట్టుకుని ఇంటికి పరిగెట్టా.
ఇంటికెళ్ళే సరికి తులసి, మా అమ్మాయి తెగ హడావిడిగా ఉన్నారు. మా అమ్మాయి దాని చీరల్లో మంచి డిజైనర్ చీర కట్టించి, తేలికగా మేకప్చేసింది. దాని బారెడు జడని చక్కగా పాయలజడ అల్లింది. డ్రాయింగ్ రూం అంతా చక్కగా సర్దేసారు ఇద్దరూ. మా అమ్మాయి ఆల్ ద బెస్ట్ చెప్పేసిజాగింగ్ కి వెళ్ళిపోయింది. దాని స్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. బీరువాలోంచి ఒక సింపుల్ నెక్ లేస్, ఒక జత గాజులూ తొడిగాను.తులసి ఒద్దని నిరాకరించింది. నేనే బలవంతంగా వేసి, దాని కోసమే చేయించి పెట్టానని చెప్పా. దాని కళ్ళలో నీటి చలమ. దానికి ఏం మాట్లాడాలో,ఎంత మాట్లాడాలో అంతా గబగబా నాలుగు ముక్కల్లో చెప్పేసా. ఇద్దరం పెళ్ళికొడుకు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. 
కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసా. అతనే కాబోలు జయరాం. నిలబడి ఉన్నాడు. లోపలికి ఆహ్వానించా. బాగా చదువు సంస్కారంఉన్నవాడులా ఉన్నాడు. నమస్కారం చేసి కూర్చున్నాడు. ఒక్కడే వచ్చాడు. చాలా ఇన్ ఫార్మల్ గా ఉన్నాడు. పొడుగ్గా, ఛామనఛాయలో,మొదలవుతున్న బట్టతలతో, కళ్ళజోడుతో. 
తన వివరాలు చెప్పుకొచ్చాడు. తల్లితండ్రులది నర్శీపట్నం దగ్గర చిన్న పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. తను, చెల్లి. చెల్లికి పెళ్ళయ్యింది. తనచదువంతా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో అయినట్టు, మెడిసిన్ తిరుపతిలో చేసినట్టు చెప్పాడు. పీజీ చేసే స్థోమతు లేక , డిప్లొమా చేసి,సొంత ప్రాక్టీసు పెట్టుకున్నట్టు, కొబ్బరితోట అంతా శ్రామికుల ఏరియా కనుక తీరిక లేని ప్రాక్టీసు ఉంటుందని, తక్కువ ఫీజు తీసుకుంటాననిచెప్పుకొచ్చాడు. మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. ముప్పై మూడు, ముప్ఫై నాలుగు మధ్యలో ఉంటుందేమో వయసు.
ఈ లోపున మా ఆయనొచ్చారు. నా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఆ అబ్బాయి గురించి ఏం చెప్పాలో నాకు తెలీలేదు. ఆయనమొహంలో ప్రశ్నార్ధకం! మెల్లగా కూడదీసుకుని చెప్పా " తులసిని చూసుకోడానికి వచ్చాడు" అని. ఆ అబ్బాయి డాక్టరనే సరికి మొహంలో స్పష్టంగావిభ్రాంతి. ఫ్రెషయ్యి రండని తోసేసి, అమ్మాయిని చూస్తారా అని అడిగా.
" దానికే కదండి ఒచ్చింది. ఇది పీక్ ప్రాక్టీస్ టైం నాకు " అన్నాడు నవ్వుతూ. " తులసీ" అని పిలిచా. కాఫీ ట్రేతో , భయానికి చిరు చెమటలుపడుతుంటే ఒచ్చి అందరికీ కాఫీ ఇచ్చి నిలబడింది. నేను నా పక్క కూర్చోమని సంజ్ఞ చేసా. తను బెరుగ్గా నిలబడే ఉంది. " కూర్చోండి" అన్నాడుజయరాం. సిగ్గుపడుతూ కూర్చుంది. కొంచెం చొరవగానే పరికించి చూసాడు. బావుంటుంది తులసి. దాని ఛామనఛాయని తెలుపులోకి,దుబ్బజుట్టుని బారెడు జడలోకి, చిన్న ఎత్తున్న పళ్ళని ఆరోగ్యమైన బుగ్గలు దాచేసినట్టు మార్చేసిన ఘనత మాత్రం నాదే. తెలీని వాళ్ళు నా కూతురేఅనుకుంటారు. నేను, తులసీ సింబయాటిక్ గా ఒకరికొకరం సాయం చేసుకున్నాం ఇన్నాళ్ళు. 
దాని రూపం అతనికి నచ్చినట్టే ఉంది. తృప్తిగా తల పంకించాడు. ఇప్పుడు సంధించాడు అసలయిన ప్రశ్న.
" ఏం చదువుకున్నారు? " . పరమ బెంబేలెత్తించే ప్రశ్న. మా ఆయన నాకేసి ఆసక్తిగా చూసారు జవాబు కోసం. నాలో మహానటి, కధాకారిణి , వెయ్యిఅబద్ధాల సామెత నమ్మిన ఇల్లాలు మేల్కొంది. మొదలెట్టా నా కళాకారీ. 
" జయరాం! మీకు తులసి గురించి కొంత చెప్పాలి. తను మీ కులం అమ్మాయి. మేము బ్రామ్మలం. ఇద్దరిదీ ఒకే వూరు. చిన్నప్పటినుండీ మాఇంట్లోనే ఆడుకునేది. తండ్రి పెద్దరైతు. కరెంటు షాకుకి చచ్చిపోతే, తల్లి నలుగురాడ పిల్లలకు, కొడుక్కూ పెళ్ళి చేసేసరికి ఆస్తి కరిగి పోయింది.అన్నగారు ఉన్న ఆస్థి అమ్మి డైనమైట్తో రాయ పగలకొట్టే వ్యాపారం పెట్టుకుని కాలు పోగొట్టుకున్నాడు. దానితో తులసిని గురించి పట్టించుకోలేకపోతున్నారు. 
అందుకే మా అమ్మగారు తనని నా దగ్గర పెట్టుకుని సంబంధాలు చూడమని పంపారు. మా పాపకి సాయంగా కూడా ఉంటుందని. ఊళ్ళో ఎనిమిదివరకే చదువుకుంది. మీకుతెలీనిదేముంది స్టాండర్డ్ ఉండదు. ". తులసి భయంతో మూర్ఛపోయేట్టుంది. తను పెద్ద నిషానీ కేండిడేటు, సంతకం తప్పమారు అక్షరం రాదని తెలిస్తే కొంప మునిగిపోతుంది. మావారు నా కేసి అపనమ్మకంగా చూస్తున్నారు "నిజమా?" అని. తనకి తెలిసిన స్టోరీ వేరుమరి. జయరాం ఖంగు తిన్నాడు. " అదేమిటండీ రమా ఆంటీ నాకు చదువులేదని చెప్పలేదు. తను చూడడానికి గ్రాడ్యుయేట్ లా ఉంది. మీరేమోహైస్కూల్ డ్రాపవుట్ అంటున్నారు. నాకు చదువుకున్న అమ్మాయి కావాలి. నర్సింగ్ నేర్చుకుని  నాకు హెల్పర్ గా క్లినిక్ లో పనిచెయ్యాలి నా వైఫ్"అన్నాడు.
నేనేదో చెప్పబోతుంటే తులసి టక్కున అందుకుంది. " నాకు నర్సింగ్ ఒచ్చండి. పెద్దమ్మగారికీ, పెద్దయ్యగారికీ నేనే సుగర్ ఇంజక్షన్లు చేసేదాన్ని, బీపీచూసేదాన్ని, ఏ మందులు దేనికి వెయ్యాలో నాకు బాగా తెలుసు. నాకు పెద్ద డాక్టర్ గారు డ్రస్సింగ్ చెయ్యడం అవన్నీ నేర్పించారు" అంటూ ధైర్యంగాచెప్పింది. ఈసారి ఆశ్చర్య పోవడం నా ఒంతయ్యింది. " నేను తులసి మా పేరెంట్సుకి హెల్ప్ చేసేదని సర్దేసా. అప్పుడు మా ఆయనడిగారు, ఇంతకీమీ బాగ్రౌండు ఏంటి?,  అని.
" మీకు బ్యూరో ఆంటీ చెప్పుంటారే! నేను డివోర్సీని అంకుల్. నా మొదటి భార్య డాక్టర్. నాక్లాస్ మేట్. నా కన్నా ధనవంతురాలు, పెద్దకులంఅమ్మాయి. మా పెళ్ళి ఎవరికీ ఇష్టం లేదు. ఇద్దరం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. బాగానే ఉండేది లైఫ్. ఈ లోపున తనకి తిరుపతిలో పీజీ సీటొచ్చింది. నాకురాలేదు. అక్కడికి నన్నూ మారమని. ఇల్లరికం రమ్మనమని పోరారు. ఇష్టం లేకపోయినా వెళ్ళా. నేను అక్కడ పడ్డ అవమానాలు పగవారికి కూడాఒద్దు. అయిష్టంగానే బాబుని కంది. వాడిని ఈసడించుకునేది. నా పేరెంట్సు ఒస్తే పేదవాళ్ళని, కులం తక్కువ వాళ్ళనీ అవమానించి పంపేసారు. ఈలోపున తనకి గల్ఫ్లో ఉద్యోగం ఒచ్చింది. మా సీనియర్ ఒకడితో బాగా క్లోజ్ అయ్యింది. విడాకులడిగారు. నేను ఇవ్వనన్నాను. వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్తో మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించారు. భారీ ఆలిమోనీ తీసుకుని విడిచి పెట్టింది. బాబు ఇప్పుడు మా చెల్లి దగ్గరపెరుగుతున్నాడు. ఇంత అయ్యాకా నాకు పెళ్ళన్నా, చదువుకున్న అమ్మాయిలన్నా విరక్తి ఒచ్చేసింది. అందుకే డిగ్రీచదువుకున్న, సామాన్యకుటుంబంలో అమ్మాయిని చూడమని ఆంటీకి చెప్పాను".. తన కధ చెప్పుకొచ్చాడు జయరాం. 
టీవీ సీరియల్లో చిన్న విషాద సంఘటనొస్తేనే ఏడ్చేసే తులసి అతని కధ వినగానే వెక్కి పెట్టింది. దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అతను " బాబునికన్నతల్లిలా చూడగలగాలి. మా అమ్మానాన్నలు నా వల్ల ఉన్నదంతా నష్టపోయారు. వాళ్ళని సొంత వాళ్ళలా చూడాలి"..... అంటూ అర్ధాంతరంగాఆపాడు. ఆశ్చర్యకరంగా మావారు అందుకున్నారు. 
" మరింకేం జయరాం! మీకు మా తులసే సరయిన జోడి. బుద్ధివంతురాలు, పనివంతురాలు, మంచి తెలివితేటలు, పైగా ప్రేమాభిమానాలున్న పిల్ల,పైగా మీ కులం అమ్మాయి. బ్రతికి చెడ్డ వాళ్ళు. ఒక మంచి అమ్మాయికి జీవితం ఇచ్చిన వారవుతారు" అన్నారు. నేను కృతజ్ఞతా భారంతో చూస్తున్నచూపులు తప్పించుకుంటూ.
" సరే అంకుల్. నేను ఆలోచించుకుని , మా పేరెంట్స్ తో డిస్కస్ చేసి యే విషయం కబురు చేస్తా. టైం కావాలి. మీలాంటి మంచి కుటుంబాన్నికలిసినందుకు చాలా హేపీగా ఉంది", అంటూ లేచి " బై తులసీ. ఆల్ ద బెస్ట్ " అని నవ్వేసి సెలవు తీసుకున్నాడు. మా ఇంట్లో అందరికీ జయరాంబాగా నచ్చేసాడు. నిజంగా ఈ పెళ్ళే అయితే తులసి చాలా అదృష్టవంతురాలవుతుంది. తను చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలన్నీ పోతాయి. 
డైనింగ్ టేబుల్ దగ్గర వివరాలడుగుతున్న మా అమ్మాయికి నా అబద్ధాలన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారాయన. " ఎందుకమ్మా అలా చెప్పారు?అవన్నీ నిజం కాదని తెలిస్తే ఇంకా దడుచు కుంటారేమో ఆయన", అంది తులసి. తన మొహంలోకి తేరిపారి చూసా. అభావంగా ఉండడానికిప్రయత్నిస్తోంది కానీ, దాని మనసు ఆశా నిరాశల మధ్య డోలాయమానంగా ఉందని తెలుస్తోంది. వెంటనే మా అమ్మాయి" నీకేం తక్కువ తులసీ.నీలాంటి అమ్మాయి దొరకాలంటే పూజచేసుకోవాలి. అయినా నేనూ, అమ్మా మొత్తుకుంటూనే ఉన్నాం చదువుకోమని. అమ్మ ప్రయవేటుకి పంపితేనవ్వుతున్నారని వెళ్ళడం మానేసావు". తులసి మాట్లాడలేదు. 
రాత్రి నిద్ర పట్టలేదు. బాల్కనీలోకొచ్చి ఉయ్యాలలో కూర్చున్నా. తులసి గురించిన ఆలోచనలు నీడల్లా ముసురుకుంటున్నాయి. అవును నిజాలుదాచాను. అది మా వూరి పిల్ల కాదు మా పనిపిల్ల అనే నిజం చెప్పలేదు. అయినా ఎందుకు చెప్పాలి. అది మా ఇంట్లో నా కూతురితో సమంగాపెరుగుతున్న పిల్ల. దాని బాధ్యత నాది. దాన్ని దానక్క చూసే రిక్షావాడికో, కొబ్బరికాయలు తీసేవాడికో, మట్టిపని వాడికో ఇచ్చి చెయ్యడం నా వల్లకాదు. మా ఇంట్లో నిశ్చింతతో, సుఖమైన జీవితంలో ఉంది. తనకీ కలలున్నాయి.. ఆశలున్నాయి. 
తను చూసే సీరియల్స్ లో అమ్మాయిల్లా గొప్ప జీవితం జీవించాలన్న దాని కలలు నాకు తెలుసు. అందుకే ఇంత సాహసం. చదువు, డబ్బు, అండలేకుండా, పెద్ద కట్నాల కులాల్లో ఎవరొస్తారు ఈ పిల్లని చేసుకోడానికి? అందుకే రమ ఆంటీకి చెప్పా. ఎవరయినా రెండో సంబంధం, ఎక్కువవయసులేని ఉద్యోగస్తుడిని చూడమని. ఇదిగో జయరాం ఒచ్చాడు. ఒక లక్ష రూపాయలు, కొంచెం బంగారం ఇచ్చి చేతులు దులుపుకోచ్చు. కానీశుభ్రమైన జీవితాన్నిచ్చి మళ్ళీ రొచ్చులో తొయ్యడం అన్యాయమనిపించింది. దానితో మాట్లాడితే, తన మనసు తెలుకున్నందుకు చాలాఆనందించింది. అయినా చిన్న పిల్ల కూడా కాదు. ఇరవై ఎనిమిదని వాళ్ళమ్మ చెప్తే తెలిసింది. అస్సలు వయసు తెలీకుండా నాజూగ్గా ఉంటుంది.స్వచ్ఛంగా మాట్లాడుతుంది. తను మాట్లాడే ఇంగ్లీషు పదాలకి మేమే ఆశ్చర్య పోతాం. దొంగ పీనుగులు అక్కలూ, అన్నగారూ చదివించకుండాపదమూడేళ్ళ పిల్లని పనికి పంపేసారు వైజాగ్కి.
మా అత్తగారు పనిసాయానికి చిన్న పిల్లని చూడమంటే తులసి అక్క సూర్య , వాళ్ళ ఊళ్ళోంచి  చెల్లిని తెచ్చిమా అత్తగారి దగ్గర పెట్టింది. దీనిఅమాయకత్వం, చురుకుదనం , మెతకదనం మా అత్తగారికి తెగ నచ్చేసి చాలా బాగా చూసుకునేవారు. అక్కడ ఆడింది ఆట పాడింది పాటగాఉండేది. మా అత్తారింట్లో ఎవరికేమి కావలసి ఒచ్చినా తులసి ఇస్తేనే తీసుకోవడం. మా అత్తగారు అరవై యేళ్ళ సంసారం, సామాను తులసిహయాములో భద్రంగా ఉండేవి. దానికి మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తానని మాటిచ్చారు. కాలమలాగే సాగిపోతే ఏ గోలా ఉండదు. దాని ఖర్మకొద్దీ మా మామగారు, తరవాత మా అత్తగారూ మంచాన పడ్డారు. ఎవరిళ్ళకీ ససేమిరా రానని మొండికేసి సొంత ఇంట్లో ఉండి పోయారు. ఇద్దరికీతులసీ రాత్రీ పగలూ అనకా చేసిన సేవ అనిర్వచనీయం. తనకి ప్రతిఫలంగా ఒచ్చే ఎక్కువ జీతం అంతా సూర్య చీటీలు కడుతున్నాననితీసేసుకునేది. మా అత్తగారూ, మామగారూ మూడేళ్ళు తీసుకుని కాలధర్మం చేసాకా, తులసికి మిగిలింది చెడిపోయిన ఆరోగ్యం, ఎముకల పోగులాంటి శరీరం. మా అత్తగారి ఆఖరి కోరికగా కొంత బంగారం ముట్టింది అంతే.
డబ్బంతా దగ్గర పెట్టుకున్న అక్క పెళ్ళిమాటే ఎత్తడం లేదు. మిగిలిన అక్కలూ, అన్న డబ్బు దానికిచ్చి పెళ్ళి మమ్మల్ని చెయ్యమంటావా? అనిస్వారీ చేసారు. ఎవరో ముస్లింల ఇంట్లో పెద్ద జీతానికి పనుందని సూర్య మళ్ళీ పనికి పెట్టింది. రెండు నెలలు చేసి, వాళ్ళు మేకపిల్లని కోయమన్నారని,భయపడి పని ఒదిలేసి మా ఇంటికి పారిపోయి ఒచ్చేసింది. తనకెక్కడా బావుండలేదని, నేనయితే మా అత్తగారిలా దయతో చూస్తానని ,పెట్టుకోమని తెగ బతిమాలింది. వయసులో ఉన్న పిల్ల బాధ్యత తీసుకోడానికి సందేహించాను కానీ నా అంచనాలకు మించి తలలో నాలుకలా నాకుసాయం చేసిన అమ్మాయిని నిర్దయగా ఒదల్లేను కదా. ఆలోచనల మధ్య తెల్లారింది. 
వాళ్ళ కులం వాళ్ళ మేరేజ్ బ్యూరోల్లో ఫోటోలు, తయారుచేయించిన దొంగ జాతకం ఇచ్చొచ్చాను. చదువు లేకపోతే  కష్టమండీ అంటున్నారు. టెంత్చదివిందని బొంకేసా. అందరికీ ఉద్యోగం చేసే అమ్మాయిలు, లక్షల కట్నాలూ కావాలి. పోనీ ఏదయినా జెన్యుయైన్ కారణాన డివోర్స్ తీసుకున్నవాళ్ళయినా, విడోవర్ అయినా చిన్న వయసువాళ్ళున్నా చూడమన్నా.. 
ఆ మధ్య ఒక సంబంధం ఒచ్చింది. లాయరట. ఆ అబ్బాయి తల్లి కాల్ చేసింది. కొడుకుది పెద్ద ప్రాక్టీసని, ముందు సంబంధం అమ్మాయి పిచ్చిదని,డిప్రషెన్ తో కాల్చుకుని చచ్చిపోయిందని, రెండేళ్ళ తరవాత ఇప్పుడు పెళ్ళకి ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. మేము కోటీశ్వరులం అంటూనేపదిలక్షల కట్నం అడిగింది. ఐదు లక్షలిస్తామన్నాను. సరే అనేసింది. పిల్లని కలవడానికి వస్తామన్నారు. మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి, నా అడ్వకేట్ఫ్రెండ్ రాణికి కాల్ చేసా వివరాలు కనుక్కుందామని. విషయం విని మ్రాన్పడిపోయా. తల్లీ కొడుకులు పరమ శాడిస్టులని, మొదటి కోడల్ని వాళ్ళేకాల్చి చంపేసారని, కేసు నడుస్తోందని. ఎంత మోసం. మేట్రిమోనియల్ సంబంధాలంటే భయపడి పోయా.
ఇంకో ముచ్చట చెప్పాలి. మా అపార్ట్ మెంట్లో ఇద్దరు బాగా డబ్బున్న తులసి కులం వాళ్ళున్నారు. వారు అక్కరలేని సానుభూతి చూపిస్తూవాళ్ళింట్లో పనిచెయ్యకు. మా ఇంటికొచ్చేయి. కక్కాముక్కా తినచ్చు అని మభ్యపెతుతూ ఉండేవారు. సరే ఏదో కులం సానుభూతి ఉంది కదా అనిఏమన్నా సంబంధాలు చూసిపెట్టమన్నా. దానికి వాళ్ళు చాలా మనసు కష్టపెట్టేసుకుని, " భలేవోరే! మా ఊళ్ళో పాలేరు కూడా చేసుకోడు దీన్ని.వాళ్ళుపది పదిహేను లక్షలకి తక్కువ తీసుకోట్లేదు కట్నాలు. దీనికేటుందని అడగమంటారు?" అని నా నోరు మూయించారు.
జయరాం జవాబు కోసం ఎదురుచూస్తూ వారం గడిచిపోయింది. యే ఫోను మోగినా పరిగెత్తుకొస్తున్న తులసిని చూసి భలే బెంగగా , బాధగాఅనిపించింది. ఎట్టకేలకు రమా ఆంటీ నుంచి ఫోన్ ఒచ్చింది. జయరాంకి పిల్ల నచ్చింది కానీ చదువు లేనందున చేసుకోలేనన్నాడని సారం. తులసికిఅర్ధమయ్యింది. మర్నాడు నా దగ్గరకొచ్చి కొన్నాళ్ళు సెలవు తీసుకుంటానని, వాళ్ళ అక్కని కలిసి తన డబ్బు లెక్కలు తేల్చుకుని పెళ్ళి సంగతినిలతీసి వస్తానని చెప్పింది. అర్ధం చేసుకున్నా ను దాని " బాధ. కొంచెం డబ్బిచ్చి పంపా. రెండు నెల్లవుతోంది తులసి మా ఇల్లు వదిలి వెళ్ళి. ఫోనులేదు. అక్కగారు, ఫోన్ చేస్తే ఒచ్చింది , మళ్ళీ వెళ్ళిపోయింది అని నిష్పూచీగా చెప్తుంటే ఒళ్ళుమండి పోయింది. తులసీ మొబైల్ స్విచ్ ఆఫ్. నామనసు కీడు శంకిస్తోంది. ఏమయిందీ పిల్ల? పెళ్ళవ్వట్లేదని ఏ  అఘాయిత్యమైనా చేసుకుందా కొంపతీసి. సాయంత్రం ఈయనొస్తే ఈయన ఫ్రెండ్ సీ.ఐగారికి చెప్పించాలి. బుర్ర పరిపరి విధాల పోతుంటే ఫాను మొగింది. నిరాసక్తంగా తీసా. " తులసి". 
అమ్మా!  సాయంత్రం ఇంటి కొస్తాను... నెమ్మదిగా వినిపించింది. సిగ్నల్ ని తిట్టుకుంటూ 
" రావే! అడగడం ఎందుకు? ఏమయిపోయావిన్నాళ్ళూ? అంటున్నాను ఫోను కట్టయిపోయింది. సరేలే వస్తుందిగా. తనే చెప్తుందని ఊరుకున్నా.సాయంత్రం ఐదున్నరకి నేనూ, మా అమ్మాయి టీవీ చూస్తుంటే ఒచ్చింది తులసి. నుదుట చిన్న బొట్టు స్థానాన పెద్ద ఎర్రటి బొట్టు, మెడలో బంగారుగొలుసుతో పెనవేసుకున్న  పసుపుతాడు, నల్లపూసలు, కాళ్ళకి మట్టెలు, చేతులకి బంగారు గాజులు, లేత ఊదా పట్టుచీరలో గుమ్మం దగ్గరనిలబడింది. మా అమ్మాయి "తులసీ "అంటూ పరిగెట్టుకెళ్ళి కావలించుకుంది. గబుక్కున వెనక నిలబడ్డ వ్యక్తిని చూసి, తడబడి, "రండి రండి " అనిలోపలికి ఆహ్వానించింది. అతన్ని చూసి ఖంగుతిన్నా. " జయరాం"!!!!
తేరుకుని గుమ్మంలో నిలబడమని హారతిచ్చి లోపలికి తీసికొచ్చా. తులసి నన్ను కావలించుకుని " అమ్మా! ఇదంతా మీ చలువే . మీ వల్లే ఈఅదృష్టమంతా. ఆరోజు మా అక్కతో చాలా గొడవయిపోయిందమ్మా. నా డబ్బంతా చీటి పాడి కూతురికి పెళ్ళి చేసేసింది. నన్ను పెళ్ళికి పిలవలేదు.నేను దాచుకున్న చీరలు, సారె సామానూ దానికే ఇచ్చేసింది. రెండేళ్ళక్కానీ డబ్బు ఇవ్వలేదంట. చాలా ఏడుపొచ్చింది. చచ్చిపోదామనుకున్నా.అక్కడ మెట్టగుడి కెళ్ళా. మాకు తెలిసినాయన నలభై పుణ్యక్షేత్రాలకి బస్సేసాడు. బయలు దేరేముందు మా ఒదిన వరసామెకి ఏక్సిడెంటయ్యింది.నన్ను బస్సెక్కేయమన్నారు. 
మీరిచ్చిన డబ్బులోంచి రెండు వేలు చేతిలో పెట్టి ఎక్కేసానమ్మా. పిచ్చిదానిలా కనిపించిన ప్రతీ దేవుడికీ మొక్కుకున్నా నా బతుక్కి దారిచూపించమని. అప్పుడు చూపించాడమ్మా వెంకన్నబాబు తిరుపతిలో ఈయన్ని.  వాళ్ళ బాబుతో, అమ్మానాన్నలతో ఒచ్చారు. వాళ్ళు పెద్దవాళ్ళు.బాబుని కాయలేక పోతుంటే నేను తీసుకుని ఆడించా. బాగా మాలిమయిపోయాడు. వీళ్ళ అమ్మగారికి వడదెబ్బ తగిలి లేవలేకపోయారు. నాకుతోచిన సేవ చేసాను. ఏమనుకున్నారో ఏమో?మా అబ్బాయిని పెళ్ళిచేసుకుంటావా అని అడిగారు. నేను దాచకుండా నా జీవితం గురించి చెప్పా. మాకులపోళ్ళ పిల్లవి. అదిచాలు అన్నారు. తిరుపతిలోనే పెళ్ళయిపోయింది. ఈ రోజుకి పదహారు రోజులు. మిగిలిన క్షేత్రాలు కూడా చూసుకుని వారంక్రితం ఒచ్చాము.  
ఆయన చాలా మంచివారమ్మా. నన్ను చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. అత్తమామలు, ఆడపడుచు బాగా కలిపేసుకున్నారు. బాబు నా సొంతకొడుకే."..... నా చెయ్యి పట్టుకుని గలగలా మాట్లాడుతున్న తులసిని మురిపంగా చూస్తూ, మా వారికి ఫోన్ చేసా. జయరాం మా అమ్మాయినిచెల్లమ్మా అంటూ, మా ఇద్దరినీ ఎంతో మన్నిస్తూ ఇట్టే కలిసిపోయాడు. ఆ రాత్రి మా ఇంట్లోనే భోంచేసి, మేము పెట్టిన పట్టు బట్టలు తీసుకుని కాళ్ళకిదణ్ణం పెట్టారు. వెళ్ళేముందు తులసి చేతిలో ఒక చిన్న మెరుపుల సంచీ పెట్టా లక్షన్నర రూపాయిలు, ఐదు తులాల బంగారం పెట్టి. కేన్సరొచ్చికుమిలిపోతుంటే కన్నతల్లిలా సేవలు చేసి, నా కోపతాపాలు, తిట్లూ భరిస్తూ, నాకు సంపూర్ణ ఆరోగ్యం ఒచ్చే వరకూ సేవలు చేసిన బంగారుతల్లికిఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. అందరూ ఒదిలేసినా భగవంతుడొదలడు కదండీ సేవామూర్తులను, అమృతమయిలనూ!! 
******** 
జయరాం ఈమధ్య పెద్ద ఆస్పత్రి కట్టాడు. దాని పర్యవేక్షణంతా తులసే. పదేళ్ళ బాబూ, నాలుగేళ్ళ కూతురుతో అది( అదే) జమీందారిణిలా ఉంది.  తృప్తిగా కళ్ళారా చూసా దాన్ని.
******

No comments:

Post a Comment

Pages