ఉపవాసం (కధ) - అచ్చంగా తెలుగు

ఉపవాసం (కధ)

Share This

(జ)వరాలి కధలు - 11

ఉపవాసం (కధ)

గొర్తి వేంకట సోమనాధశాస్త్రి(సోమసుధ)


కిరణ్ వరాలికి వరసకి అన్నయ్య అవుతాడు.  అతని ఎదురుగా భార్యాభర్తలు వాదించుకొంటుంటే భార్యలపక్షం వహిస్తాడతను. అతను పనిచేసేది " హోం" డిపార్టుమెంట్లో గనుక ప్రతి " హోండిపార్టుమెంట్" ని వెనకేసుకొని రావాలన్నది అతని సిద్ధాంతం కాబోలు. భార్యాభర్తల  మధ్య అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు రావటం  సహజం.  వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలని యింగితం తెలిసినవారెవరైనా చెప్పి తప్పుకొంటూంటారు.  కానీ కిరణ్ తరహా వేరు.  ఇలాంటి పెద్దమనుషులు వారి తగవుల్లో దూరి భార్యల పక్షాన  మాట్లాడితే, వాళ్ళలో అతివిశ్వాసం పెరిగిపోయి భర్తను తీసిపారేసే ప్రమాదమున్నది.  కిరణ్ కారణంగా కొందరు జవరాళ్ళు చిన్నచిన్న తగాదాలపై భర్తలను కోర్టులకీడ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈనాడు విడాకుల కేసులు పెరగటానికి మూలకారణం యిలాంటి మధ్యవర్తులే!  నడిరోడ్డున హత్య కాబడే ఆడవాళ్ళకి   అండగా నిలబడ్డా ఫరవాలేదు.  కానీ అత్తమామల్ని తమ యింటినుంచి  అంపకమెట్టేయ్యాలనే భార్యలను కూడా సపోర్టు చేయటమే కిరణ్ చేసే పెద్ద పొరపాటు.  అతను స్వతహాగా నాస్తికుణ్ణని చెప్పుకొంటాడు.  "వ్యక్తి"పూజలే తప్ప "శక్తి"  పూజలు చేయనివాడు.
 ఒక సంవత్సరం కార్తీకమాసంలో మా యింటి కొచ్చాడు. గతంలో వరాలితో జరిగిన చిన్న వాదనలో ఆమె పక్షం వహించాడతను.  దానివల్ల మా యిద్దరి మధ్య పెద్దగా మనస్పర్ధలు రాకపోయినా, కిరణ్ జోక్యం వల్ల నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పుడు మానసికంగా నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటమే గాక భార్యాభర్తల మధ్యలో అనవసర జోక్యం చేసుకొనే అతని అలవాటు మానిపించాలని తీర్మానించుకొన్నాను.
   ఆరోజు కార్తీకసోమవారం.  అనుకోకుండా ఆరోజు మా ఆఫీసుకీ సెలవు పడింది.  అతన్ని చక్రబంధంలో యిరికించి, కుప్పిగంతులేస్తుంటే కళ్ళారా చూసి ఆనందించే అవకాశం ఉన్న  ఆ రోజే నా ప్లాను అమలు జరపటానికి నిశ్చయించుకొన్నాను.
  ఆరోజు ఉదయం తాపీగా కూర్చుని కాఫీలు త్రాగుతున్నాం.
  "కార్తీకమాసంలో కాఫీ ఖర్చెక్కువ" హఠాత్తుగా అన్నాను.
  " ఎందువల్ల? " కిరణ్ ప్రశ్నించాడు.
  "జవరాళ్ళంతా ఉపవాసముంటారు గనుక" అన్నాను.
  "అదేంటి?  ఆరోజు  పచ్చిమంచినీళ్ళు కూడా తాగకూడదంటారు కద!" వేళాకోళం  ధ్వనించేలా అన్నాడు. అతని మాటలకు వరాలి ముఖం కందగడ్డలా మారింది.  ఇప్పుడే చక్రం వేయాలి.
  " ఉపవాసమంటే  దేవుడికి దగ్గరగా నివసించటం.  అంటే ఆ రోజంతా దేవుని కీర్తనలు, కధలు వింటూ, భజనలు చేస్తూ పగలంతా దైవధ్యానంలో గడపాలి. అంతేగానీ ఒకప్రక్క కడుపు మాడ్చుకొంటూ, వంటకాల గురించి వల్లించుకొంటూ పగలంతా గడపటం కాదు. కానీ కడుపు కాలుతూంటే వంటకాలపై ధ్యాస తప్ప  దైవధ్యానం మీద మనసు లగ్నం కాదు కద! అదే కాఫీ తాగితే? ఆకలి చచ్చిపోతుంది గనుక దేవుడిమీదకి మనసు పోతుంది. అందుకే ఆరోజు కాఫీనీళ్ళు ఎక్కువగా తాగుతారు. కార్తీక సోమవారాలు ఎక్కువమంది  జవరాళ్ళు తప్పనిసరిగా ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం రోజు నీళ్ళు తాగ్గూడదు గానీ కాఫీనీళ్ళు తాగొచ్చు గనుక కార్తీకమాసంలో కాఫీ ఖర్చెక్కువ"  అన్నాను.
  " నువ్వు చెప్పింది నిజమేనయ్యా!" అప్రయత్నంగా కిరణ్ నా పక్షం పలకటంతో వరాలికి కోపమొచ్చింది.
   "ఆడవాళ్ళోపూట ఆకలిని భరించలేని బలహీనులనుకొన్నారా? ఆడది అబల కాదు సబల" వరాలి మాటలు విన్న కిరణ్ వెంటనే ప్లేటు ఫిరాయించాడు.
  "నిజమేనోయి! వాళ్ళకు సహనశక్తి ఎక్కువ.  ఎన్నోరకాల బాధల్ని తట్టుకొనేవారు ఆకలి బాధ తట్టుకోలేరా?"
  కిరణ్ తనపక్షం తిరిగిపోగానే వరాలు రెచ్చిపోయింది.
  " అలా చెప్పన్నయ్యా! కలం పట్టిన ప్రతివాడూ ఆడదాన్ని  చులకన చేసి  వ్రాస్తుంటారు"
దారి తప్పే బండిని గాడిలో పెడుతూ ఉపన్యాసం అందుకొన్నాను.
  " ఆకలి బాధను అంత తక్కువగా అంచనా వేయకు బావా! మిగిలిన బాధలకు, దానికి ఏనుగుకి దోమకి ఉన్నంత  తేడా ఉంది. ఆకలి ఉండబట్టే మనిషి ఆహారాన్ని కనుక్కొన్నాడు. తొలినాళ్ళలో వేటను ప్రధానంగా తీసుకొన్నా, తదుపరి వ్యవసాయాన్ని కనుక్కొన్నాడు. పంట ఉత్పత్తి పెంపకం కోసం ఎరువులు కనుక్కొన్నాడు. ప్రస్తుతం యితర గ్రహాల్లో తన నివాసానికి ఏర్పాట్లు చేసుకొనే ప్రయోగాలు చేస్తున్నాడు. ఆకలి లేకపోతే మనిషి తన బుర్రకి పదును పెట్టి యివన్నీ కనిపెట్టేవాడా? ఇంత పురోభివృద్ధి  సాధించేవాడా? బద్ధకానికి బలై ఎప్పుడో నశించిపోయేవాడు.  మానవ మేధాసంపత్తి పెరగటానికి మూలకారణం ఆకలి " నా ఊకదంపు ఉపన్యాసానికి మధ్యలో అడ్డు తగిలాడు.
  " ఊరుకో బావా! ఆకలినలా ఆకాశానికి ఎత్తేస్తావేంటి? రోజుల తరబడి భోజనం మానటం కష్టం గాని ఆఫ్టరాల్ ఒక్క పూట భోజనం మానటం కష్టమేమీ కాదు.  దానికోసం కాఫీ తాగవలసిన పని లేదు"
  " ఊరికే కబుర్లు చెప్పటం కాదు, అదేదో చేసి చూపించాలి" సమయం దొరికిందని బాణం సంధించాను.  నా మాటలకు కిరణ్ త్రుళ్ళిపడ్డాడు.
  "అలాగే!  ఉపవాసమేదో కష్టం అన్నట్లు మాట్లాడుతావేంటి? చెల్లెమ్మా!  నేను నాస్తికుణ్ణే కావచ్చు.  అయినా యీ రోజు ఉపవాసముంటాను. అదేదో పుణ్యం కోసం కాదమ్మోయి! బావ మీద పంతం కోసం.  ఉపవాసం ఉండేవాళ్ళని ఎద్దేవా చేస్తాడా?  చూడమ్మా! ఈ కప్పు కాఫీతో తడిపిన గొంతును మళ్ళీ సాయంత్రం చుక్కల్ని చూసేదాక తడపను " అభిమానంతో రెచ్చిపోయాడు.
  "అన్నయ్యా! ఆయనేదో పరాచికానికి అన్నారని ఉపవాసం ఉండొద్దు"  వరాలు కంగారు పడింది.
  "పందెం అంటే పందెమే! నిన్ను చులకన చేసి మాట్లాడిన బావ నోరు మూయిస్తాను"
  "చీకటిని రణంలో పారద్రోలేదే కద కిరణం. బావ అంతే!  పట్టుదలకు మారుపేరు కదటే! ఆనాడు కర్ణుడు భారతయుద్ధంలో మిత్రుడు దుర్యోధనుడికి సాయపడకూడదని, కృష్ణుడు ఎన్నో ప్రలోభాలు పెట్టాడు.  కర్ణుడు లొంగాడా? లేదే! కిరణ్ కూడా అంతే!  సాయంత్రం వరకూ నేను ఎన్ని ప్రలోభాలు పెట్టినా చలించడు. చూస్తూండు" అంటూ మరోముడి వేసి బాగా బిగించాను.
  " చాల్లెండి సంబడం.  ఆడుకొంటున్న పిల్లాణ్ణి గిల్లి ఏడ్పించే వేషం మీరూను.  అతిధికి అన్నం పెట్టకుండా పేగు మాడ్చిందనే అపఖ్యాతి నాకు రావటానికేగా మీరిలా చేశారు?" కిరణ్ పెరట్లో కెళ్ళినప్పుడు వరాలు నా దగ్గరకొచ్చి చిరాకు పడింది
 "మొగుడూపెళ్ళాల మధ్య గొడవల్లో యికపై తలదూర్చకుండా ఉండటానికే యీ ఎత్తు.  మన మధ్య వాదాల్లో ఎన్నిసార్లు తలదూర్చలేదు"
  "చాల్లెండి.  మీరు నా మాట రైటన్న సందర్భాలూ ఉన్నాయి. నేను మీరే కరెక్టన్న సంఘటనలూ ఉన్నాయి.  ఎవరో మధ్యవర్తి సపోర్టుతో మన వాదనలు పెద్ద జేసుకొని విడిపోతామా ఏమిటి? సంసారంలో యిద్దరి మధ్య సదవగాహన ముఖ్యం. పరాయివాళ్ళ జోక్యంతో నడిచే కాపురాలు ఎంతకాలం నడుస్తాయి చెప్పండి"
 "మనలాగ సర్దుకుపోయే వారెంతమంది ఉన్నారీ రోజుల్లో! ఇలాంటి మధ్యవర్తుల జోక్యంతో ఎంతమంది సంసారాలు చెడగొట్టుకోవటం లేదు? అందుకే పరాయివాళ్ళ గొడవల్లో తలదూర్చే అలవాటును కిరణ్ లాంటి ఒక వ్యక్తి మానుకొన్నా కొన్ని సంసారాలు నిలబడినట్లే"
 పెరట్లోంచి కిరణ్ రావటం గమనించి వీధిగదిలోకి తప్పుకొన్నాను.
 *****
మధ్యాహ్నం కిరణ్ తో కబుర్లు చెబుతుండగా వరాలు భోజనానికి పిలిచింది.
 "నువ్వూ రావోయి" పిలుస్తున్న నన్ను తినేసేలా చూశాడు.
 "ఆశ పెడుతున్నావా? ఆరు నూరయినా సాయంత్రం దాకా ఏదీ ముట్టను" పంతంగా అంటున్న అతన్ని అదోలా చూసి వంటింట్లోకెళ్ళాను.
వరాలు పెట్టింది కడుపునిండా తిని బ్రేవుమని త్రేనుస్తూ బయటికి వచ్చాను.
  అక్కడే ఉన్న కుర్చీలో నడుం వాల్చి, ఆ కళ్ళలో ఆకళ్ళను చూడలేక కళ్ళు మూసుకొన్నాను. కూర్చున్న చోటునుంచి లేచి మెల్లిగా నా దగ్గరకు వచ్చాడతను.
  "చెల్లాయి ఏం కూర చేసింది?" ఆత్మారాముడు ఆవురావురుమంటూంటే, కిరణ్  ఆకలిప్రశ్న వేశాడు.
కనీసం కబుర్లలోనైనా వంటకాలిరికించి కడుపునిండిన తృప్తిని  పొందాలని అతని తాపత్రయం.  అతనే కాదు, ఉపవాసాలు చేసేవాళ్ళు, లంఖణాలు ఉండేవాళ్ళ కబుర్లెప్పుడూ వంటల తయారీ మీదే ఉంటాయి.  ఆ కడుపు నిండాకనే వారు ఆంధ్రుల రాజధాని అమరావతిని కేంద్రసాయం లేకుండా  ఎలా కట్టబోతున్నారన్న దానిపై అంచనాలు వేసి చెబుతారు. తనకు లేని దానికోసం వెంపర్లాడటమే మానవనైజం కద!
  " పనసపొట్టు కూర ఆవపెట్టి చేసింది బావా, అదిరిపోయిందనుకో!" నా మాటలకు నోరూరి లొట్టలేశాడు.
  "చేస్తే ఆ కూర తనే చేయాలయ్యా! ఆవపెట్టి కూర చేయటంలో మా బంధువుల్లో ఆ కుటుంబాన్నే చెప్పుకొంటారు.  వాళ్ళమ్మా అదరగొట్టేసేదిలే! కూర రెండు గుప్పిళ్ళు లాగించావా?" ఉక్రోషంతో ఉడికిపోతున్నాడు.
  " వేడి వేడి కూర నోట్లో పెట్టగానే వెన్నముద్దలా కరిగిపోయిందనుకో! అందుకే రెండేం ఖర్మ, నాలుగు గుప్పిళ్ళు లాగించాను "
మూర్తి నాలుకతో పెదాలు తడుపుకొన్నాడు.
  " ఇంకేం చేయలేదా?" మరోప్రశ్న.
  " చేయకేం? నాకిష్టమైన వంకాయ పెరుగుపచ్చడి, కలిపిన చెయ్యే కాదు, అది చేసిన గిన్నె కూడా కడగక్కరలేకుండా నాకెయ్యాలనిపించింది.  దాంట్లో పచ్చిమిర్చి కొరుక్కొంటే బావా! . . .అదిరిపోయిందనుకో! పెళ్ళయ్యాక యింత బాగా తను వంట చేసింది యీ రోజేనయ్యా!" అతనివైపు చూడకుండా వర్ణిస్తూంటే, ఆకలితో బుసలు కొట్టాడతను.
  "దేనికైనా రాసిపెట్టుండాలి" నాస్తికుడి నోట వేదాంతం విని విస్తుపోయాను. ఆకలి మనిషికి మనుగడనే కాదు, ఆస్తికత్వాన్ని నేర్పుతుందన్న మాట!
   " మా చెల్లికి మరీ అంత వంట రానట్లు చెబుతావేంటి? నిన్న జీడిపప్పు పాయసం, వంకాయ పచ్చిపులుసు బాగా చేయలేదా? నిన్న యీ పాటికి పచ్చిపులుసు లాగిస్తూ స్వర్గంలో ఉన్నట్లు ఫీలయ్యాను కదయ్యా!" నిన్నటి రుచులు నెమరేస్తూ, వరాల్ని పొగుడుతున్నాడు.
  " అన్నయ్యా! కాఫీ" తానొక కప్పు లాగిస్తూ ఆ గదిలోకి వచ్చింది వరాలు.
  " స్త్రీ అబల కాదు సబల" సన్నగా గొణిగే నన్ను కోపంగా చూసింది. కిరణ్ యిదేం పట్టించుకొనే ధోరణిలో లేడు.
  " కాఫీ ఏంటమ్మా? హాయిగా పనసకూరే తినేవాణ్ణి. బావతో పందెం నెగ్గి తీరాలి" కిరణ్ తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు.
 " ఉపవాసముంచారు సరె! అలా ఊరించి చంపుతారెందుకు?" వరాలు నా దగ్గరకొచ్చి భుజంపై చిన్నగా గిల్లింది.
ఆరోజు సాయంత్రం వరకూ వివిధ రకాల వంటకాలు, వాటి తయారీ గురించి వర్ణిస్తూనే ఉన్నాడు. అతని ధోరణికి వరాలు నన్ను చూసి కళ్ళతోనే తిట్టిపోయసాగింది.  ఆకసంలోకి చుక్కలు రాకుండానే అతను 'చుక్కల్ని '  చూసేస్తాడేమోనన్న భయంతో నాలుగింటికే వంట ప్రయత్నాల్లో పడింది.
"రాత్రికి ఏం చేస్తున్నావమ్మా?" వంటింట్లో గిన్నెల చప్పుడు విని, వరాలి ప్రక్కన చేరాడతను.
  " ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఏం తింటారన్నయ్యా? ఉప్పుపిండేగా" అడిగిన కిరణ్ కి బదులిచ్చింది.
 " పగలంతా కడుపు మాడ్చుకొని నాలుగు రకాలు తినాలి గాని, ఉప్పుపిండితో లేవటమేంటమ్మా?" అసహనంగా అడిగాడు.
  " స్టేషన్లో బయల్దేరే రైలు మెల్లగా కదిలి వేగం అందుకోవాలి గాని, ఒక్కసారి వేగంగా బయల్దేరితే బండి పట్టాలు తప్పుతుంది అన్నయ్యా!" కాలే కడుపుకి, కదిలే రైలుకి ముడి వేసి చెప్పింది వరాలు.
"రెంటికీ పోలికేంటమ్మా? ఆకలంటే ఏమిటి?  జఠరాగ్ని. అగ్ని తనలో పడ్డ వస్తువులను వెంటనే మసిజేసి యింకా పడేయమన్నట్లు  చూస్తుంది కద! మాడే కడుపైనా అంతే!" అన్నాడు కిరణ్.
అతని బాధ పడలేక నాల్గురకాల పదార్ధాలు చేయటమే గాక పొద్దున మిగిలిన పనసకూర వేడిచేసింది. సాధారణంగా వరాలు ఉపవాసాలుండే రోజుల్లో, నీరసంతో ఉన్న ఆమెను యిబ్బంది పెట్టలేక, ఆరాత్రి నేను ఉప్పిపిండితోనే సరిపెట్టుకొంటాను. కానీ యీ రోజు కిరణ్ ధర్మమా అని రాత్రి సుష్టుగా తినబోతున్నాను.
   "వడ్డించమంటావా అన్నయ్యా?" వంటిల్లు వదలని కిరణ్ ని అడిగింది వరాలు.
  వెంటనే పెరట్లోకి పరుగున వెళ్ళి వచ్చి "ఆకసంలోకి చుక్కలింకా రాలేదు" అన్నాడు.  కడుపెలాగూ మాడింది గనుక కాస్తయినా పుణ్యం దక్కించుకోవాలని తాపత్రయమనుకుంటా! తెలుగు నాస్తికుల తీరే అంత! పైకి దేవుడు లేడంటూనే చాటుగా దండాలు పెడుతూంటారు.
సాయంత్రం ఆకాశంలో చుక్కలు కళ్ళబడగానే కిరణ్ వంటింట్లో చొరబడ్డాడు. రెండు ముద్దలు నోట్లో పడగానే, చెంబుడు నీళ్ళు లాగించేశాడు. కంచంలోని పదార్ధాలన్నీ కడుపులో పడేసుకోవాలని ఆత్రుత. కానీ పగలంతా కాలిన కడుపులో నిండిన గాస్ ముద్దని గొంతు దిగనివ్వటంలేదు. ఒలింపిక్స్ లో స్వర్ణపతకం తెచ్చుకొనే స్థాయిలో కుస్తీపట్టి పదార్ధాలని కడుపులోకి తోసేశాడు.
  "చెల్లెమ్మా! వంట బాగుంది"వరాలికో సర్టిఫికెట్ పడేసి, బరువెక్కిన పొట్టతో బయటకొచ్చి వాలుకుర్చీలో నడుం వాల్చాడు.  మరో చిత్రమేమిటంటే, యింతవరకూ వంటలను సమీక్షించినవాడు, ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఇండియా ఆర్మీ చేసిన సర్జికల్ దాడులను సమీక్షిస్తున్నాడు. ఎంతో ఉత్సాహంగా సమీక్షిస్తున్న అతను హఠాత్తుగా పెరట్లోకి పరుగు లంకించుకున్నాడు.
  " నిక్షేపంగా ఉన్నవాణ్ణి రెచ్చగొట్టి పేగు మాడ్చారు. కొద్దిగా ఉప్పుపిండి తిని లేవయ్యా అంటే ఆకలి, అగ్ని అంటూ కడుపు భారీస్థాయిలో నింపేశాడు. ఇప్పుడు చూడండి.  పెరట్లో వాంతి చేసుకొంటున్నాడు. అతనికేమన్నా అయితే వాళ్ళింట్లో నన్ను ఆడిపోసుకొంటారు" విసురుగా వంటింట్లోంచి వచ్చిన వరాలు నాపై కయ్యిమంది.
  "పతకాలకోసం గాక, ప్రజలసొమ్ముతో సరదాలు తీర్చుకొందుకు ఒలింపిక్స్ కెళ్ళే ఆటగాళ్ళయినా, ఆరుగంటలు కడుపు మాడ్చుకొని దండిగా తింటే హరాయించుకోలేరే? బక్కప్రాణి కిరణ్ హరాయించుకోగలడా? తేలిగ్గా ఉప్పుపిండితో లేపక, అతనికి నాల్గు రకాలు చేసి ఎవరు పెట్టమన్నారు?" నేరం ఆమెపై నెట్టేశాను.
  " బాగుంది. నేరం నాపైనే నెట్టేస్తున్నారా? నేనేమైనా చెబితే చేదస్తం అంటారు. ఉపవాసం వల్ల కడుపులో ఉన్న రుగ్మతలు నశిస్తాయి.  ఒంట్లో కొవ్వు కరుగుతుంది. పగలంతా భగవద్ధ్యానంలో గడపటం వల్ల అనారోగ్యసమస్యల వల్ల ఏర్పడే మానసిక రుగ్మతలు, తామసాలు తగ్గుతాయి.  మనిషిలో నిగ్రహశక్తి పెరుగుతుంది. అందుకే పెద్దలు యీ ఉపవాసమనే ఆచారం పెట్టారు.  మన ఆచారాలు వైద్యశాస్త్రరీత్యా గొప్పవని ఎవరు గుర్తిస్తున్నారు? 'ఈ రసాయనాలు మింగు, కడుపు మాత్రం  మాడ్చకు ' అని  చెప్పే అల్లోపతి వాడి అవస్థ పడతారు. ఆరోగ్యప్రదమైన ఉపవాసాలను ఎద్దేవా చేస్తారు.  సరె! గూట్లో ఉన్న తేనెసీసా పడేయండి.  నిమ్మకాయ నీళ్ళతో కలిపి యిస్తాను.  నీరసం, వికారం రెండూ తగ్గుతాయి" అని నేనిచ్చిన తేనెసీసాతో వంటింట్లోకెళ్ళింది.
 కిరణ్ పెరట్లోనుంచి వచ్చి వాలుకుర్చీలో వాలి అభిమానంతో కళ్ళు మూసుకున్నాడు.  వరాలు తెచ్చిన తేనెనీళ్ళు తాగి సేదతీరాడు.
 ఈ అనుభవంతో, భార్యాభర్తల మధ్య తలదూర్చే అలవాటు మానుకొన్నాడని తెలిసింది.
నెల్లాళ్ళ తరువాత -
  "మామయ్యా! ఈ లోకంలో భోజనప్రియులెవరు?" ప్రక్కింటి సరోజ పత్రికలో యిచ్చిన పజిల్ చూపిస్తూ అడిగింది.
  " అత్తయ్య నడుగు"  అని వరాలి దగ్గరకు పంపాను.
  "ఉపవాసం ఉండేవాళ్ళు" నన్ను క్రీగంట చూస్తూ చెప్పింది.
  "ఇందులో కుంభకర్ణుడు,బకాసురుడు, హిడింబాసురుడనే యిచ్చాడు. నువ్వు చెప్పింది యివ్వలేదత్తా!" అమాయికంగా అడిగిందా పాప.
  "ఇవ్వకపోయినా అత్త చెప్పింది గనుక అదే జవాబు" నవ్వుతూ అన్నాను.
"మీకూ తెలీదా?" అంటూ మరోయింటికి పరుగు తీసింది.  మీ దగ్గరకూ రావచ్చు. జవాబు సిద్ధం చేసుకోండి.
******
(ఇది ఉపవాసాలపై నా విమర్శ కాదు. ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యాన్ని యీ కధ ద్వారా నలుగురికి తెలపాలన్నదే నా(వరాలి) ఆకాంక్ష )

No comments:

Post a Comment

Pages