అక్షరనీరాజనం
వై.యస్.ఆర్.లక్ష్మి.
ఒక్క క్షణం వృధాగా రాలనీక
ఆరో ఏట నుండే అక్షరాలతో మైత్రి చేసి
నిరంతర కవితా కృషీవలుడై
వేనవేల గేయ ఫలాలనందించి
సాహితీ పిపాసుల ఆర్తిని తీర్చిన సాహితీ ప్రదాత
పలుకు పలుకు లోన తెలుగును పర్జన్యంలా పలికించి
పదం పదం లోన తెలుగును చైతన్యంలా ఎదిగించి
ప్రతి సిరా చుక్కని మరో కొత్త రెక్కగా ఎగరేసి
నిరాశా నిట్టూర్పులను బహిష్కరించి
ఆవిరి తపస్సుగా,ఊపిరి ఉషస్సుగా చైతన్యవంతమై
జీవితాల రెక్కలపై చెరగని సంతకమై
కర్పూర పరిమళాలు,వసంత గాలులు
లాలి పాటల లాలిత్యాలు,మమతల మాధుర్యాలు
భావ గీతాల సౌకుమార్యాలు
అన్నీ రవ్వంత సడిలేని రసరమ్య గీతాలే
అనుబంధం,ఆత్మీయత అంతా బూటకమని
ఆత్మశాంతి లేని సిరులను,నిధులను
పరిహరించాలన్న తాత్వికవేత్త
విశ్వంభర తత్త్వాన్ని విశ్వానికి చాటి
ఙ్ఞాన పీఠ మెక్కిన సాహితీ స్రష్ట
అక్షర గవాక్షాలను తెరచి
జీవితాన్నే మహా కావ్యంలా మలచుకున్న మనీషి
వాగ్దేవి వీణను కొనగోట మీటి
పద్య గేయాలను అలవోకగా నడిపిన దిట్ట
శిఖరమై అంబరాన్నంటినా
మూలాలు మరువని సాహితీ కల్పతరువు
అనితరసాధ్యం మీ మార్గం
అలుపెరుగని,మసకబారని వ్యక్తిత్వం మీ సొంతం
నిటారుగా నిల్చున్న హరిత చైతన్యమే మీ ఆకృతి
మరణాన్ని పాలుపట్టి,జోలపాడి నిద్ర పుచ్చుతూ
శాశ్వత నిద్ర లోకి జారిపోయిన
ఓ మహా కవీ
మీ కివే మా అక్షర నీరాజనాలు
అనుభవాల వెన్నముద్ద
లారగించినా మనసుకు
జిడ్డంటని సి.నారాయణ రెడ్డికే
ఈ నీరాజనం
******
No comments:
Post a Comment