అక్షరం
- డా.పి.వి.ఎల్.సుబ్బారావ్ ,విజయనగరం
శిల కాదు ఒడిశెల
కల కాదు, ఎగిసే అల
హిమపాతం కాదు,ఉరికే జలపాతం
ఆరిపోయినఅగ్నికాదు,మండుతున్నఅగ్నిపర్వతం
మంద పవనం కాదు నిలువ,నీయని మహా ప్రభంజనం
సాధరాణాస్త్రం కాదు, ఎవ్వరూ ఎదిరించలేని పాశుపతం
పచ్చికూర గాయ కాదు, ఘాటైన కొత్త ఊరగాయ
కళ్ళుకప్పే మాయ కాదు, కళ్ళు తెరిపించే బ్రహ్మం.
అక్షరం--
నీ ఆస్తే కాదు, నీ అస్తిత్వం
నీ సత్వమే కాదు, నీ వ్యక్తిత్వం
మిత్రమా! నీ జీవన సర్వస్వం
అక్షరం --
తరతరాలుగా అభయమిస్తొంది,
యుగయుగాలుగా దారిచూపిస్తొంది,
విప్లవాలకు బాటలు వేసింది,
అరాచక కోటలు కుదిపింది,
అమాయకత్వానికి మాటలు నేర్పింది,
అలసిపోయిన మనసుకి వినోదకేంద్రం,
బాధలతో నోరెండిపోతే చలివేంద్రం,
జీవన గమనంలో వికాసానికి సూత్రం,
చింతలు తీర్చే అద్భుత మంత్రం,
సంస్కరణలకు శ్రీకారం,ఆచరణకు ప్రాకారం,
అక్షరం.... అమరం,అద్వితీయం, అప్రమేయం
అందుకే అక్షరాన్ని మనమెప్పుడూ మరువం,
అక్షరం జన హృదయక్షేత్రాలలో కల్పవృక్షవిత్తు,
మొలకెత్తి విస్తరిస్తే సమస్యలన్నీ చిత్తు.
అందరినీ రామ సోదరుల్లా కలుపుతుంది,
జీవన పోరాటంలో విరామం ఎరుగని యోధున్ని చేస్తుంది,
నింగిలో గువ్వై విహరిస్తుంది,
తారాజువ్వై మెరుస్తుంది,వినిపిస్తుంది.
మహోగ్రతాపాలుపోగెట్టే,అతిశీతలఉదకమండలాలుప్రారంభిస్తుంది,
మమతలమలెలసువాసనల్ని,సునాయాసంగాపంచుతుంది,
మధురరుచులమామిళ్ళమాటలేన్నోపరిపరిపలుకుతుంది
“స్వచ్చత”అనేఒక్కలక్షణంచాలు,జీవనంరమణీయకావ్యం
“స్పష్టత”అనేఒక్కలక్షణంచాలు,జీవితంలోచిక్కుముడులకు
“ఉత్తిష్ట”అనేఒక్కపిలుపుచాలు,జాతిచైతన్యవంతం.
దైవం దశావతారాలే ఎత్తాడు
అక్షరం అవసరమొచ్చినప్పుడల్లా ఆలస్యం చెయ్యక,
అవతరిస్తూనే ఉన్నది ఆర్తులను ఆదుకుంటూనే ఉన్నది,
సంక్షోభానికి తెరవేస్తూనే ఉన్నది,సంక్షేమానికి తెర తీస్తూనే ఉన్నది.
కవి అక్షరాన్ని --
పదిలంగా,పవిత్రంగా, పసందుగా
ఆత్మీయంగా, అలోచించి ,ఆచితూచి
అనాధలకు "ఆలంబనగా"
ఆకలితో ఉన్నవారికి "ఆహారంగా"
ఆకతాయిలపై " ఆయుధంగా"ఉపయోగించాలి.
అక్షరం కవి ఆత్మ,
కనిపించకపోయినా
కనిపించని లోకాలకు వెళ్ళిపోయినా
వత్తిని వెలిగించే అగ్గిపుల్లై,
ప్రజల హృదయంలో ఎల్ల వేళలా
ఆరని వివేక జ్యోతులు వెలిగిస్తూనే ఉంటుంది
జాతిని ప్రగతి పథంలో వడివడిగా నడిపిస్తూనే ఉంటుంది.
***
No comments:
Post a Comment