సరిలేరు
నీకెవ్వరూ....దా’సరి’
పోడూరి శ్రీనివాసరావు
సినీవినీలాకాశంలో
మరో ధృవతార రాలిపోయింది. అత్యధిక చిత్రాల దర్శకునిగా గిన్నిస్ రికార్డ్ సాధించి,
చరిత్ర పుటల కెక్కిన – బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దాసరి నారాయణరావు అనంతలోకాలకు
వెళ్లిపోయారు. ఇంతకుముందే స్వర్గావాసులయిన
ఎన్టీఆర్,ఎస్వీఆర్,అక్కినేని,సావిత్రి,శోభన్ బాబు,రాజబాబు...ఇలా ఎంతోమంది దొప్ప
కళాకారులతో స్వర్గలోకంలో చిత్రాలు నిర్మించి, దేవతలను సైతం ఆనందింపచేద్దామని....
అమరలోకానికి “ఆకాశదేశానా....” అంటూ ‘మేఘసందేశాన్ని” అందించి ‘బహుదూరపు బాటసారి’గా
వెళ్లిపోయారు.
ఆయన
మరణానికి యావత్ చలనచిత్ర ప్రపంచం దిగ్భ్రాంది చెందింది. కొన్ని నెలలుగా
అస్వస్థులుగా ఉన్నప్పటికీ...అన్నవాహికలోని సమస్య ఏర్పడటంతో శస్త్ర చికిత్స
చేసాక...ఇన్ఫెక్షన్ సోకడంతో...డాక్టర్లు దాసరిని బ్రతికించాలని చేసిన
ప్రయత్నాలలో... యమధర్మరాజుదే పై చేయి అయింది. దాసరి మృత్యుదేవతకు బందీగా
యమద్వారంలోకి అడుగెట్టాక... సాదరంగా ఆహ్వానించారు సమవర్తి. శ్రీ దాసరి
గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని,ప్రతిభను గుర్తించిన, నరకలోకాధిపతి వారిని గౌరవ మర్యాదలతో
సత్కరించి, స్వర్గానికి సాగనంపారు. ‘స్వర్గం-నరకం’ చిత్ర దర్శకుడిని నరకాధీశుడు
స్వర్గలోకానికి పంపారు.
అలాంటి
ప్రతిభాశాలి – శ్రీ దాసరి నారాయణరావు గారు.
******
శ్రీ దాసరి నారాయణరావు గారుసామాన్య కుటుంబంలో, పాలకొల్లులో మే 4,1942
వ తేదీన జన్మించారు. చదువుకోవాలని ఉన్నా ఆర్ధిక పరిస్థితి సహకరించలేదు.
తల్లిదండ్రులకు భారమవలేక నెలకు 3 రూపాయల జీతానికి కూడా పనిచేసారు.
నాటకాలంటే
ప్రాణం. దర్శకత్వం అభిమానించేవారు శ్రీ దాసరి – నటునిగా, సంబాషణల రచయితగా పాటల
రచయితగా, చలనచిత్ర దర్శకునిగా, జర్నలిస్ట్ గా, రాజకీయవేత్తగా,
నిర్మాతగా,కేంద్రమంత్రిగా,వార్తా పత్రిక ప్రచురణకర్తగా,అత్యధిక చలన చిత్రాలకు
దర్శకత్వం వహించినందుకు గిన్నిస్ బుక్ లో ప్రపంచ రికార్డుల గ్రహీతగా – బహు ముఖ
ప్రజ్ఞాశాలిగా, భారతదేశానికే వన్నె తెస్తాడని,బాల్యంలో ఎవరూ ఊహించి ఉండరు.
ఒకవ్యక్తి... ఏదైనా ఒక రంగంలో ఒక వ్యాపకంలో పేరు ప్రఖ్యాతులు గడించడం సాధారణమే!
కానీ....ఇలా విభిన్న రంగాలలో ప్రావీణ్యత సాధించడం, విజయాలు మూట గట్టుకోవడం చాలా
అరుదు. కానీ, అటువంటి అద్భుతాన్ని అందుకోవడం, ప్రజలను ఆశ్చర్యచకితులను కావించడం...
శ్రీ దాసరికే చెల్లింది.
యాభై
సంవత్సరాల సుదీర్ఘ సినీప్రస్థానం సాగించారు శ్రీ దాసరి నారాయణరావుగారు.
నాటకరంగం
మీద మక్కువతో, చిన్నతనంలోనే ముఖానికి రంగు పులుముకున్నారు శ్రీ దాసరి. 8 సంవత్సరాల
వయసులోనే పాఠశాలలో ప్రదర్శించిన ‘శ్రీ కృష్ణ తులాభారం’ అనే పౌరాణిక నాటకంలో
నారదుడి వేషం వేసారు. తన 13 వ ఏట రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన ‘పంచవర్ష
ప్రణాళికాప్రగతి’ అనే నాటికను ప్రదర్శించి రాష్ట్రస్థాయి ఉత్తమనటునిగా ఎన్నికయారు.
తన 14 వ ఏటనే ‘నేన్-నాస్కూలు’ అనే నాటిక రచించి, ప్రదర్శించి, దర్శకత్వం కూడా తనే
వహించారు. ఎన్నో నాటకాలలో నటించడమే కాకుండా, ఎందఱో వర్ధమాన కళాకారులను ప్రోత్సహించారు.
అదే అలవాటు చలనచిత్ర పరిశ్రమలో కూడా శ్రీ దాసరి కొనసాగించారు. ఎందఱో దర్శకులను,
నటులను పరిచయం చేయడమే కాకుండా,కొందరు కళాకారులకు పునరుజ్జీవితం కలిగించారు.
నరసాపురం కాలేజీలో చదువుతున్న రోజుల్లో “కన్నీరు-పన్నీరు”, “పద్మవ్యూహం” వంటి
నాటకాలను రచించారు. ‘క్షీరారామ ఆర్ట్ థియేటర్స్’ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సమాజం
ద్వారా నాటక ప్రదర్శనలివ్వడమే కాకుండా... ఎంతోమందిని నటులుగా నాటక రంగానికి పరిచయం
చేసారు. అంతేగాదు,వారిని నటులుగా తీర్చిదిద్దారు.
డిగ్రీ
పూర్తి చేసుకుని కొంతకాలం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసారు శ్రీ దాసరి. ఆ తరువాత
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అబిడ్స్ లో ఉండే
శ్రీ దాసరి, బాలానగర్ లోని HAL (హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) లో సరియైన
రావానాసౌకర్యం కూడా లేని సమయంలో కొంతమేర బస్ లలో ప్రయాణించి,మరికొంత దూరం కాలినడకన
ప్రయాణం చేసి ఉద్యోగవిధులకు హాజరయ్యేవారు. నాటక కళపై ఉన్న అభిమానంతో,
పిచ్చిప్రేమతో ఆఫీసయ్యాక, అబిడ్స్ లోని తనగదికి చేరి, నాటకాల రిహార్సల్ కోసం
రవీంద్రభారతి చేరేవారు.
ఒకసారి
రవీంద్రభారతిలో నాటకం వేస్తుంటే, ఈయన్ని చూసిన వై.వి.కృష్ణయ్య అనే నిర్మాత, తను
నిర్మిస్తున్న ‘అందంకోసంపందెం’ అనే సినిమాలో వేషం వేయమని అడిగారు. కానీ, అప్పటికే,
పత్రికల్లో, సినిమా చాన్సుల కోసం మద్రాసు వెళ్లిన కళాకారుల కష్టాలు చదివి ఉన్న
శ్రీ దాసరివై.వి.కృష్ణయ్యగారి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. కానీ,
వై.వి.కృష్ణయ్యగారు.దాసరిని విడిచి పెట్టలేదు. తన ‘అందం కోసం పందెం’సినిమాలో ముఖ్య
హాస్యనటుని పాత్ర – దాసరిదేనని చెప్పి, బలవంతంగా ఒప్పించారు. తోటి మిత్రులు కూడా,
అవకాశం అనంత తాను వెతుక్కుంటూ వచ్చిందని, తిరస్కరించవద్దని బలవంత పెట్టడంతో
మద్రాసు పయనమయ్యారు.
తీరా
మద్రాసు వెళ్లక, మేకప్ మ్యాన్ దాసరిని తక్కువగా చేసి చులకనగా మాట్లాడడం, పైగా
ముఖ్యహాస్యనటుని పాత్ర కమేడియన్ బాలకృష్ణదని, తనది కేవలం ఆ ముఖ్య హాస్యనటునికి
సహాయకుని పాత్రేనని తెలుసుకున్న తర్వాత వెనక్కు తిరిగి వచ్చేద్దామని అనుకున్నారు
దాసరి. నిర్మాత వై.వి.కృష్ణయ్యగారు ఈ మార్పు తనకు తెలియకుండా జరిగిందనీ,దాసరి
చేతులు పట్టుకుని బతిమాలారు. దాంతో ఆ పాత్రలో నటించక తప్పలేదు శ్రీ దాసరికి.
నాటకరంగంలో రాష్ట్రస్థాయి ఉత్తమనటుడి చలనచిత్ర రంగప్రవేశం మాత్రం కేవలం ఒక అనామక
పాత్ర ద్వారా జరిగింది.
తర్వాత
శ్రీ దాసరి, పాలగుమ్మి పద్మరాజుగారి దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్ గా చేరారు. ఆయనే,
దాసరిని,నిర్మాత ఎస్.భావనారాయణగారి దగ్గర చేర్చారు. సినీ నిర్మాణంలో భాగంగా
భావనారాయణగారు ఒక కన్నడ సినిమాను కొని
‘ప్రేమకు పర్మిట్’ పేరుతొ తెలుగులో డబ్బింగ్ చేసారు. ఆ సినిమాకు శ్రీ దాసరి
రచనాభాగం నిర్వహించగా, సినిమాలపరంగా, దాసరి తొలిరచన ‘ప్రేమకు పర్మిట్’ చిత్ర
డబ్బింగే అని చెప్పుకోవచ్చు. ఆ చిత్రానికి అడ్వాన్సు గా ఇచ్చిన మూడు వందల రూపాయలతో
పాండీబజారులో కొన్న ఉంగరం, తన తొలి సంపాదన గుర్తుగా, ఆయన వేలికి చాలా రోజులు
ఉండేదట.
తర్వాత
‘మా నాన్న నిర్దోషి’ చిత్రంతో సహకార దర్శకుడయ్యారు. సహకార దర్శకుడిగా, జగత్
జెట్టీలు, ఒకే కుటుంబం, వింత సంసారం, కూతురు-కోడలు- మొదలైన 12 సినిమాలకు
పనిచేసారు. కొన్ని సినిమాలకు మాటలు కూడా వ్రాసారు.
శ్రీ
దాసరి పాతికేళ్ల వయసు వాడయ్యాడు. అప్పుడే ఒక మహాద్బుతం జరిగింది. తెలుగుసినీ
చలనచిత్ర రంగంలో... ఆ అద్భుతమే భవిష్యత్ లో ఎన్నో అద్భుతాలనూ, రికార్డులను
సృష్టించింది. అదే – “తాతా-మనవడు” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం, శ్రీ దాసరికి
రావడం. ప్రతాప్ ఆర్ట్స్ బేనర్ లో శ్రీ కె.రాఘవ నిర్మాణంలో, శ్రీ దాసరికి
‘తాతా-మనవడు’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. తాతగా శ్రీ
ఎస్.వి.రంగారావు, మనవడిగా హాస్యనటుడు శ్రీ రాజబాబు నటించిన ఆ చిత్రం ప్రేక్షకాదరణ
పొందడమే కాకుండా అఖందవిజయం సాధించింది. ఆ విధంగా శ్రీ దాసరి తన తొలి ప్రయత్నంలోనే
పరిశ్రమ పెద్దల మెప్పు,ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇక వెనక్కు తిరిగి చూసుకొనే
అవకాశమే లేనట్లుగా ఎంతో బిజీ అయిపోయారు. సంవత్సరానికి పది సినిమాలు దర్శకత్వం
వహించిన రోజులూ ఉన్నాయి. ఆ తపనే, ఆ పట్టుదలే, ఆ వైవిధ్య చిత్రీకరణే శ్రీ దాసరిని
అత్యధిక సినిమాల దర్శకునిగా ‘గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్’ లో స్థానం పొందేలా
చేసింది. భారతదేశం గర్వపడేలా చేసింది.
ఆయన
విశేషప్రతిభ, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, చలనచిత్రరంగంలో ఒక ధృవతారగా, ఎన్నో విజయాలు
సాధించి, భారతీయ, ముఖ్యంగా దక్షిణ భారత చలనచిత్రరంగంలో ఎవరెస్ట్
శిఖరాన్నధిరోహించేలా చేసింది. ఆయన చేయి పడని శాఖ లేదు. నిర్మాతగా,దర్శకునిగా,
నటునిగా, కథారచయితగా, మాటల రచయితగా, పాటల రచయితగా, చలనచిత్రరంగంలో విశేష ప్రతిభ
కనబర్చారు.
అచిరకాలంలోనే
ప్రాముఖ్యత సంతరించికున్న తెలుగుదినపత్రిక ‘ఈనాడు’ కు పోటీగా ‘ఉదయం’ దినపత్రిక
స్థాపించి, తనదైనరీతిలో సమర్ధవంతంగా నడిపారు. సాహితీవేత్తగా తనకున్న, పరిజ్ఞానంతో
( చలనచిత్రాలకు, కథా రచయితగా, మాటల
రచయితగా, గీతరచయితగా అనుభవం ఉంది కదా) ఉదయం పత్రికను విజయవంతంగానే నడిపారు. తరువాత
వేరే కొన్ని కారణాల వల్ల అడిమూత పడిందను కోండి. కొన్నాళ్లు ‘ఉదయం’ వారపత్రికను
కూడా ప్రచురించారు. ఉదయమే గాక, ‘శివరంజని’ , ‘మేఘసందేశం’ అనే సినీవార పత్రికను
కూడా ప్రచురించారు. అంతేగాక ‘బొబ్బిలిపులి’ పేరుతొ రాజకీయ పక్ష పత్రికను కూడా
వెలువరించారు. జర్నలిస్టులంటే విపరీతమైన అభిమానం శ్రీ దాసరికి.
తొలుత
నుంచీ రాజదీయాలంటే ఆసక్తి,శ్రద్ధ ఉన్న శ్రీ దాసరినారాయణ రావుగారు మాజీ ప్రధాని
స్వర్గీయ రాజీవ్ గాంధీతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. రాజకీయ రంగంలోనూ,చురుకుగా
పాల్గొంటూ ‘కాపు సామాజిక వర్గం’నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ్యసభ
సభ్యునిగా, కేంద్రమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరపున పదవులు నిర్వహించారు.ఇటు
సినీరంగంలో విభిన్నరంగాలలో ప్రతిభ చూపుతూ కూడా,అటు రాజకీయ రంగంలోనూ సమర్ధుడుగా
పేరు తెచ్చుకున్నారు. సోనియాగాంధీ తో కూడా సత్సంబంధాలు కొనసాగించారు.
చలనచిత్రరంగంతో
పాటు టి.వి రంగంలో కూడా కాలూనారు శ్రీ దాసరి. హిందీలో రామానంద సాగర్ తీసిన
‘రామాయణ్’ సీరియల్ బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న కాలంలోనే శ్రీ దాసరి
దూరదర్శన్ లో ‘విశ్వామిత్ర’ పేరుతొ హిందీ సీరియల్ తీసి ప్రేక్షకులకు ఆనందం
కలిగించారు. ఇటీవలి కాలంలో కూడా ‘అభిషేకం’,’గోకులంలో సీత’ లాంటి సీరియల్స్ తో
ప్రేక్షకులనలరించారు. ‘అభిషేకం’ సీరియల్ 2000 ఎపిసోడ్లకు పైగా నడుస్తూ, నేటికీ
ప్రేక్షకులను ఉత్కంఠభరితులను చేస్తోంది.
చలనచిత్రాలకు
సంబంధించి,అన్ని విభాగాల్లోనూ తన ప్రతిభ చూపిన శ్రీ దాసరి, అంతటితో ఊరుకోలేదు.
పరిశ్రమలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న సభ్యుల బాగోగుల విషయంలో చురుకుగా
వ్యవహరిస్తూ, కార్మికుల పక్షాన్నే కొమ్ము కాసేవారు. చలనచిత్ర పరిశ్రమ మద్రాసులో
ఉన్నపుడు కూడా శ్రీ దాసరి సినీ కార్మికుల సమస్యల పరిస్కారంలో ప్రముఖ పాత్ర వహించేవారు.
సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాదుకు తరలి రావడంలో అక్కినేని నాగేశ్వరరావు,
ఎన్టీరామారావుల తర్వాత శ్రీ దాసరి కూడా ప్రముఖంగా పనిచేశారు. శ్రీ దాసరినారాయణ
రావుగారి మీద ఉన్న గౌరవంతో తెలుగు సినీ పరిశ్రమ అందరూ కూడా శ్రీ దాసరిని పెద్ద
దిక్కుగా భావించి ‘గురువుగారు’ అనే సంభోదించేవారు.
ఖమ్మంజిల్లా
సత్తుపల్లికి చెందిన యల్లంకి పద్మతో శ్రీ దాసరినారాయణ రావుగారి వివాహం 1960 దశకం
చివరలో జరిగింది. ఇది ప్రేమ వివాహమే గాక కులాంతర వివాహం కూడా. దాసరికి హరిహరప్రభు,
అరుణ్ కుమార్ అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
1978
వ సంవత్సరంలో తారకప్రభు ఫిలింస్ పేరుతో స్వంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి, జయసుధ
కథానాయికగా ‘శివరంజని’ చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా విశేష ప్రేక్షకాదరణ
పొందింది. ఆ బ్యానర్ పై 53 సినిమాలు నిర్మించారు. నటుడిగా సుమారు 63 చిత్రాలలో
నటించారు. దర్శకునిగా 150 చిత్రాలకు దర్శకత్వం వహించి “గిన్నీస్ బుక్ అఫ్
రికార్డ్స్” లో స్థానం సంపాదించారు. ఎన్నో చిత్రాలకు సంభాషణల రచయితగా, పాటల రచయితా
తన కలం వాడిని చూపించారు. శ్రీ దాసరి వ్రాసిన సంభాషణలకు చప్పట్లతో సినిమాహాలు
మారుమోగిపోయేది. ఆయన వ్రాసిన డైలాగులు వాడిగా, వేడిగా,ఆలోచింప చేసే విధంగా ఉండేది.
సేతారాములు, స్వయంవరం,జయసుధ,స్వప్న,మజ్ను,బొబ్బిలి
పులి,ప్రేమాభిషేకం,విశ్వరూపం,రాముడు కాదు కృష్ణుడు మొదలైన చిత్రాల్లో
ఆణిముత్యాల్లాంటి పాటల నందించారు శ్రీ దాసరి.
దర్శకునిగా
మొదటిచిత్రం = తాతామనవడు,50 వ చిత్రం – అద్దాలమేడ, 100 వ చిత్రం- చిరంజీవి
కథానాయకునిగా లంకేశ్వరుడు; 150 వ చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా – పరమవీరచక్ర;
చివరిసినిమా – మంచు విష్ణు కథానాయకునిగా ఎర్రబస్సు.
శ్రీ
దాసరినారాయణ రావుగారు తెలుగు సినీ పరిశ్రమకు అందించిన, పరిచయం చేసిన ప్రముఖులు –దర్శకులుగా;
కోడిరామకృష్ణ,రవిరాజా పినిశెట్టి; కె.మురళీమోహనరావు; రేలంగి నరసింహారావు;
ధవలసత్యం; కె.ఎస్.రవికుమార్; సురేష్ కృష్ణ; సత్యానాయుడు ----
నటుల్లో; మోహన్ బాబు,అన్నపూర్ణమ్మ; ఈశ్వరరావు;
ఆర్.నారాయణమూర్తి మొదలైన ప్రముఖులంతా దాసరి నారాయణ రావుగారి చిత్రాల ద్వారా సినీ
పరిశ్రమకు పరిచయమైన వారే.
శ్రీ
దాసరినారాయణ రావు తెరకెక్కించిన చిత్రాల్లో కొన్ని ఆణిముత్యాలు – తాతామనవడు;ఎవరికీ
వారే యమునాతీరే; రాధమ్మ పెళ్లి; తిరపతి; స్వర్గం-నరకం; బలిపీఠం; భారతంలో ఒక
అమ్మాయి;శివరంజని;గోరింటాకు ;నీడ;సర్దార్ పాపారాయుడు;శ్రీవారిముచ్చట్లు;మేఘసందేశం;ప్రేమాభిషేకం;తాండ్రపాపారాయుడు;బొబ్బిలిపులి;ఎమ్మెల్యే
ఏడుకొండలు;కంటే కూతుర్నే కను;తిరుగబాటు;మజ్ను;అమ్మ రాజీనామా; ఒరేయ్ రిక్షా;ఒసేయ్
రామ్లులమ్మా..... మొదలైనవి. శ్రీ దాసరి తీసిన బొబ్బిలిపులి,సర్దార్ పాపారాయుడు
సినిమాలు శ్రీ ఎన్టీ రామారావు రాజకీయరంగ ప్రవేశానికి దోహదపడ్డాయని శ్రీ దాసరి
చెబుతుండేవారు.
1983
లో దాసరి దర్శకత్వం వహించిన ‘మేఘసందేశం’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9 నంది
పురస్కారాలు లభించాయి. అంతే కాకుండా, ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ
ప్రాంతీయ భాషా చిత్రంగా రజతకమలం అందుకుంది. 1999 లో శ్రీ దాసరి స్వయంగా నిర్మించి,
దర్శకత్వం వహించిన ‘కంటే కూతుర్నే కను’ అనే చిత్రానికి జాతీయ పురస్కారంతో పాటు,
రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం కూడా లభించింది.
తండ్రికి,కొడుకుకు
కూడా హిట్ చిత్రాలనందించిన ఏకైక డైరెక్టర్ శ్రీ దాసరి. అలాగే దర్శకునికి ఒక
గుర్తింపు తీసుకుని వచ్చి, హీరో హీరోయిన్లతో సమానంగా సినిమా వాల్ పోస్టర్లపై
దర్శకుని ఫోటో ముద్రించడం, శ్రీ దాసరితోనే మొదలైంది. ఆ రోజుల్లో బాలీవుడ్ సూపర్
స్టార్ అయిన రాజేష్ ఖన్నాను రెండు విభిన్న పాత్రలలో దర్శకత్వం వహించి ఘనవిజయం సాధించిన
చిత్రాల దర్శకునిగా శ్రీ దాసరి పేరు భారతదేశ మంతటా మారుమ్రోగి పోయింది. బాలీవుడ్
లో ఆజ్ కా ఎమ్మెల్యే;రామావతార్;ఆశాజ్యోతి;స్వర్గ్-నరక్;జ్యోతి బనే జ్వాలా; ఎకైసా
ఇన్సాఫ్;వఫాదార్;యాద్ గార్...మొదలైన 13 హిందీ చిత్రాలకు శ్రీ దాసరి దర్శకత్వం
వహించారు. కన్నడలో స్వప్న;పోలీస్ పాపన్న అనే రెండు సినిమాలు తీసారు.
‘శివరంజని’చిత్రం ఆధారంగా తమిళంలో తీసిన ‘నట్చత్రం’ (శ్రీప్రియ) సినిమా అఖండ విజయం
సాధించింది.
2011
లో ఎంతో ప్రాణప్రదంగా చూసుకొని,ప్రేమించి పెళ్లి చేసుకుని, తన విజయాల్లో భాగస్వామి
అయిన జీవిత భాగస్వామి శ్రీమతి పద్మ మరణం శ్రీ దాసరిని ఎంతగానో కృంగదీసింది. రెండు
సంవత్సరాల పాటు, తన కార్యకలాపాలకు దూరంగా, యోగిలా,మౌనంగా గడిపారు శ్రీ దాసరి.
అవార్డుల విషయానికి వస్తే....
1982 వ సంవత్సరంలో ‘మేఘసందేశం’ చిత్రానికి జాతీయ స్థాయి ఉత్తమ ప్రాంతీయ
భాషా చిత్రం
1998 లో – ‘కంటే కూతుర్నే కను’ చిత్రానికి జాతీయ
స్థాయి స్పెషల్ జ్యూరీ అవార్డ్
ఫిల్మ్ ఫేర్ (సౌత్) అవార్డులు:
ఉత్తమ దర్శకుడు – గోరింటాకు –1979
ఉత్తమ దర్శకుడు- ప్రేమాభిషేకం- 1981
ఉత్తమ చిత్రం- మేఘసందేశం -1982
జీవనసాఫల్య పురస్కారం – 2001
నందిఅవార్డులు:
ఉత్తమ నటుడు – మేస్త్రీ – 2009
ఉత్తమ నటుడు –మామగారు – 1991
ఉత్తమచిత్రం –కంటే కూతుర్నే కను -
1998
ఉత్తమచిత్రం - బంగారు కుటుంబం - 1994
ఉత్తమచిత్రం – మేఘసందేశం - 1982
ఉత్తమచిత్రం - స్వర్గం-నరకం - 1975
ఉత్తమచిత్రం - సంసారం-సాగరం- 1973
ఉత్తమచిత్రం–తాతామనవడు - 1972
ఇంకా
ఎన్టీఆర్
జాతీయ పురస్కారం
రఘుపతి
వెంకయ్య అవార్డు – 1991
‘సాక్షి’
మీడియావారి ‘సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్’
‘మేఘసందేశం’
చిత్రానికి 9 నంది పురస్కారాలు
మేఘసందేశం
సినిమా తాష్కెంట్ చలన చిత్రోత్సవంలో విశేష మన్ననలు పొందడమే గాకుండా 1983 కేన్స్
ఫిల్మ్ ఫెస్టివల్ – మాస్కోలో ప్రదర్శింపబడింది.
1986
లో దర్శకత్వం వహించిన ‘తాండ్రపాపారాయుడు’, 1992 లో దర్శకత్వం వహించిన ‘సూరిగాడు’
అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయి.
1986
వ సంవత్సరంలో ఆంద్రవిశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.
11.06.2013
వ తేదీన శ్రీ దాసరిపై – నవీన్ జిందాల్ నుంచి బొగ్గు కుంభకోణం కేసులో – గనుల
కేటాయింపుకై రూ.2 కోట్ల 25 లక్షల ముడుపు తీసుకున్నట్లు CBI అభియోగం మోపి, దాసరిపై, నవీన్ జిందాలుపై
FIR దాఖలు చేసింది.
ఇంతటి
అద్భుత ప్రతిభాశాలి కొన్ని నెలలుగా తీవ్ర అస్వస్థతతో బాధపడి, అన్నవాహిక,
మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమౌతూ జనవరి 19 న కిమ్స్ ఆసుపత్రిలో
చేరారు. అన్నవాహికకు శస్త్రచికిత్స జరిగి, సుమారు రెండు నెలల పాటు ఆసుపత్రిలో
ఉన్నారు. మార్చ్ 29 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మే 17న మళ్లీ అస్వస్థతకు
గురి కావడంతో మరల ఆసుపత్రిలో చేర్చడం, అన్నవాహికలో మళ్లా సమస్య తలెత్తడంతో మరల
ఆపరేషన్ చేశారు. ఆ సందర్భంలోనే తిరిగి కోలుకోలేని దశలో, ఆరోగ్య సమస్య లెక్కువై,
గుండె ఆగిపోవడంతో తన 75 సంవత్సరాల వయసులో మే 30 వ తేదీన హైదరాబాద్ లో కన్ను
మూసారు,శ్రీ దాసరి.
ఆయన
మరణానికి యావత్ చలన చిత్ర పరిశ్రమ, అశ్రుధారలతో నివాళి అర్పించింది. తామెంతో
ఆప్యాయంగా ‘గురువుగారు’ అని సంబోధించే నిజమైన గురువు, ఆర్తత్రాణపరాయణుడు,
కార్మికవర్గానికి అండగా ఉండి,వెన్నంటి నిలచిన శ్రీ దాసరి ఇకలేడు అన్న విషయం
జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణా ప్రభుత్వం, శ్రీ దాసరి అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది. ఒక
ధృవతార నేల రాలింది.
***
కొన్ని వాస్తవాలను గమనించక తప్పదు. దేవదాసు సినిమాలోని థ్రెడ్ తో .ప్రేమాభిషేకం రూపొందింది. నా చిన్నతనంలో ప్రచారంలో వున్న కథను తాత-మనవడు గా రూపొందించారు. బండిట్ క్వీన్ సినిమాలోని థ్రెడ్ తో ఒసేయ్ రాములమ్మా చిత్రం రూపొందింది. నరకానికి పూలదారి అన్న నాటికలోని అంశంతో నీడ సినిమా రూపొందింది. బొగ్గు కుంభకోణం కేసు పూర్తయ్యేలోగానే వారు కాలం చెయ్యడం వలన ఆ కేసు నుంచి తప్పించుకున్నారు.
ReplyDelete