గడియారం - అచ్చంగా తెలుగు
బాల గేయాలు 
గడియారం
టేకుమళ్ళ వెంకటప్పయ్య



పిల్లలకు రెండు, మూడు తరగతులకు రాగానే గడియారం చూసి టైం తెలుసుకోవడం నేర్పించాలి. కాలం యొక్క విలువ వారికి అర్ధమయేట్టు చెప్పాలి. సెకన్లు, నిముషాలు, గంటల వివరాలు వాళ్ళకు అర్ధమయే వరకూ చెప్పాలి. పిల్లలకు రకరకాల పద్ధతుల ద్వారా మనం చెప్పదలుచుకున్న లేక నేర్పించదలుచుకున్న విషయాలపై ఆసక్తిని కలిగించాలి. ముగ్గురన్నదమ్ములు, రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరువారు? అని అడిగామనుకోండి. వెంటనే చెప్పలేరు. అలాంటి పొడుపు కధల ద్వారా వారికి గడియారం గురించి చెప్పాలి.
క్రీ.శ.1500 సం.లో జర్మనీ దేశస్థుడు పీటర్ హెన్లెన్ మొదటి జేబు గడియారము తయారు చేసాడని అంటారు. పూర్వము ఎండ-నీడల సహాయముతో కాలమును గణించేవారు. అంతే కాక ఇసుక గడియారాలు కూడా వాడుకలో ఉండేవి. ఈ ఇసుక గడియారాల్లో రెండు బాగాలుగా ఉంటాయి. ఒక భాగంలో ఇసుక నింపబడి ఉంటుంది. మొత్తం ఇసుక ఒక భాగం నుంచి మరొక భాగానికి రాలడానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది. సాలార్జంగ్ మ్యూజియంలో గంటలు కొట్టే గడియారం ఉంది. గడియారం ఒక పెద్ద నగిషీలు చెక్కిన చెక్క డబ్బాలో ఉంటుంది. దానిలో ఎడమ పక్క చిన్న ఇల్లు లాగా ఉంటుంది. దాని తలుపులు మూసి ఉంటాయి. మధ్యలో గంట ఉంటుంది. సమయం అయ్యేసరికి తలుపులు తెరుచుకుని, ఒక బొమ్మ మనిషి వచ్చి ఎన్ని గంటల సమయం అయితే అన్ని గంటలు ఠంగు ఠంగుమని కొట్టి లోపలికి పోయి తలుపులు మూసుకుంటాడు. ఈ వింత చూడడానికి 12 గంటల సమయంలో ఎక్కువమంది జనం పోగవుతారు. అలాగే అన్నవరంలో నీడ గడియారం ఉంది. ఇవన్నీ చిన్న పిల్లలకు చూపిస్తే వారిలోని సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది.
ఈ మాసం ఆ విషయం పై రాసిన ఓ పాట చూద్దాం.
గడియారం
టికు టికు టికు టికు మని వినిపిస్తుంది శబ్దం
టక్కున ఆగిందంటే అంతా నిశ్శబ్దం 
ఎరుగుదురా మీరు దీని తమాషా 
మొహంలో పొట్టి పొడుగు రెండు చేతులు
పొట్టేమో గంటలు పొడుగేమో నిమిషాలు
ఎరుగుదురా మీరు దీని తమాషా
అరవై సెకండ్లు ఒక నిమిషం
అరవై నిమిషాలు ఒక గంట 
ఇరవైనాలుగు గంటలు ఒక దినం
ముప్పై దినాలు ఒక మాసం
పన్నెండు మాసాలు ఒక వత్సరం
కాల గమనాన్ని మనకు తెలుపుతుంది
కనువిప్పును మనకు కలిగిస్తుంది
కార్యాల్లో మనల్ని నిమగ్నుల్ని చేస్తుంది
కాలం అంతం చూపుతానంటుంది - కానీ
కాలం అనంతం ఆగదంటుంది 
కాలం వ్యర్ధం చేయవద్దంటుంది!! (సౌజన్యం: తెలుగు రత్నాలు)
-0o0-

సాలార్జుంగ్ మ్యూజియంలో గంటలు కొట్టే గడియారం.
అన్నవరంలో నీడ గడియారం
పూర్వం వాడిన ఇసుక గడియారం.

No comments:

Post a Comment

Pages