కలిమినిందరిని దగ్గరుకొరకే – వీడె - అచ్చంగా తెలుగు

కలిమినిందరిని దగ్గరుకొరకే – వీడె

Share This
“కలిమినిందరిని దగ్గరుకొరకే – వీడె” 
 (అన్నమాచార్యుల కీర్తనకు వివరణ ) 
డా.తాడేపల్లి పతంజలి 

కలిమినిందరిని దగ్గరుకొరకే - వీడె
సులభుడై తిరిగీని చూడరమ్మా॥పల్లవి॥
భంగపెట్టి గొల్లవారి పాలువెన్నలు
దొంగిలించు కొరకే తోవలనెల్లా
చెంగలించి చేతులెత్తి చెలగుచును- వీడె
దొంగి దొంగి తిరిగీని తోలరమ్మా॥కలిమి॥
గుట్టుదీర రేపల్లెకొమ్మలనెల్లా
రట్టుసేయుకొరకే రచ్చలనెల్ల
గట్టిగాజాటెడి మొలగంటలతోడ- వీడె
చుట్టపుబాలునివలెజూడరమ్మా॥కలిమి॥
చెప్పరాని తనమాయచేత నిందరినిఁ
గప్పెడికొరకే వేంకటవిభుఁడు
కప్పెడి నల్లనియలకలనుదురు-వీడె
గుప్పెడి ముద్దులు యెత్తుకొనరమ్మా॥కలిమి॥ (రేకు: 74-5  సంపుటము: 5-257  ) 
------------------------------------------------------------------------
అర్థ తాత్పర్య విశేషాలు
॥పల్లవి॥
కలిమినిందరిని దగ్గరుకొరకే - వీడె
సులభుడై తిరిగీని చూడరమ్మా
అర్థాలు
కలిమిన్=అతిశయ సంపదతో ;  ఇందరిని=ఇంతమందిని;   దగ్గరుకొరకే = సమీపించుట కొరకు; వీడె= ఈశ్రీకృష్ణుడు;సులభుడై= సులభుడు+ ఐ= సుఖముగా లభించువాడై( an accessible or affable person.) ;   తిరిగీని= మనమధ్యే తిరుగుచున్నాడు. చూడరమ్మా= చూడండమ్మా!
తాత్పర్యము
ఇంతమంది హృదయాలను  సమీపించుట కొరకు అనగా హృదయాలలో తనను కొలిచే వారిని అనుగ్రహించుట కొరకు ఈశ్రీకృష్ణుడు  సుఖముగా మనము పట్టుకొనేటట్లు  మనమధ్యే దగ్గరగా  తిరుగుచున్నాడు. చూడండమ్మా!
విశేషాలు
సులభః
విష్ణు సహస్రనామములోని సులభ శబ్దానికి వ్యాఖ్యానమిది.
భక్త్యాసమర్పితైర్లభ్య పత్రపుష్పఫలాదిభిః ।
సుఖేన లభ్యత ఇతి విష్ణుస్సులభ ఉచ్యతే ॥
భక్తితో  సమర్పించే  పత్ర పుష్పాదులచేత సుఖముగా లభించేవాడు కనుక సులభుడు.అని విష్ణువుకి పేరు.
చూడరమ్మకు అన్నమయ్య ఇతర ప్రయోగాలు 
అల్లదివో చూడరమ్మ అతివభావము నేఁడు
ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
ఇంతులాల చూడరమ్మ యెన్నఁ గొ త్తలు
చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేఁడు
చూడరమ్మ చెలులార జూటితఁడు
చూడరమ్మ చెలులాల సుదతి చక్కఁదనాలు
చూడరమ్మ చెలులాల సుదతి చెలువములు
చూడరమ్మ చెలులాల సుదతి భాగ్యాలు నేఁడు
చూడరమ్మ చెలులాల సొబగు లిద్దరివిని
చూడరమ్మ నిచ్చకొత్తసొద్యమ(ము?)లాయ
చూడరమ్మ యిటువంటి సుదతులు లేరెందు
చూడరమ్మ యిదె నేఁడు సుక్కురారము
చూడరమ్మ యీతనిసుద్దులెల్ల నిట్లానే
చూడరమ్మ సతులాల సుదతి లాగులు నేఁడు
01 వ చరణము
భంగపెట్టి గొల్లవారి పాలువెన్నలు
దొంగిలించు కొరకే తోవలనెల్లా
చెంగలించి చేతులెత్తి చెలగుచును- వీడె
దొంగి దొంగి తిరిగీని తోలరమ్మా॥కలిమి॥
అర్థాలు
భంగపెట్టి =అవమానపెట్టి;  తోవలను+ఎల్లా= సమస్తమైన దారులలోః 
చెంగలించి= వికసించు, అతిశయించు, ఉత్సాహపడు;  చేతులు+ఎత్తి= చెలగుచును= శబ్దము చేయుచు;  దొంగి దొంగి= చాటు చాటుగా;  తోలరు+అమ్మా= ఓ అమ్మా !  పంపించండి 
తాత్పర్యము
గొల్లవారి పాలువెన్నలు దొంగిలించటం  కొరకు   దారికాసి ఉన్నాడు ఈ కృష్ణుడు.
చేతులెత్తి శబ్దం చేస్తాడు. అంతలోనే మాయమయిపోయి తిరుగుతాడు. వీడిని ఎలాగయినా పట్టుకొని , వాడి ఇంటికి పంపించండి.
విశేషాలు
తోలు : 
తోలు  అనునది ఒక సకర్మక క్రియ. దీనికి అర్థం పంపు; 
ఈ క్రియకు మనుష్యుల విషయంలోనూ వాడుక ఉన్నది."మరణ మయ్యెడినాడు మమతతో నీ యొద్ది, బంట్లఁ దోలుము ముందు బ్రహ్మజనక" (నరసింహశతకం. 59 తెలంగాణా మాండలికాలు - కావ్య ప్రయోగాలు రవ్వా శ్రీహరి)
002 వ చరణము
గుట్టుదీర రేపల్లెకొమ్మలనెల్లా
రట్టుసేయుకొరకే రచ్చలనెల్ల
గట్టిగాజాటెడి మొలగంటలతోడ- వీడె
చుట్టపుబాలునివలెజూడరమ్మా॥కలిమి॥
అర్థాలు
గుట్టుదీర= రహస్యముగా;  రేపల్లె కొమ్మలనెల్లా= రేపల్లెలోని ఆడవాళ్లం దరిని; రట్టుసేయు= నిందచేయుటకొరకే ;  రచ్చలన్ +ఎల్ల= అన్ని వీథులలో పడి ‘; గట్టిగాజాటెడి మొలగంటల= కటి ప్రదేశములొ కట్టిన గంటలు తోడ= - వీడె;చుట్టపుబాలుని= ఎప్పుడో అరుదుగా కలిగే దర్శనం కలిగించే బాలుని వలె
తాత్పర్యము
ఈ శ్రీ కృష్ణుడు రేపల్లె ఉన్న ఆడవాళ్ల గుట్టు రట్టుసేయటానికి వీథులలో మొలకు ఉన్నచిరు గంటలు మోగుతుండగా తిరుగుతున్నాడు. వీడిని అపురూప బాలునిలా చూడండి.
విశేషాలు
ఒక పక్క ఆడవాళ్ల గుట్టు రట్టుసేయటానికి తిరుగుతున్నాడని నింద వేస్తూ, ఇంకొక పక్క అపురూప బాలునిలా చూడండి అంటున్నాడు అన్నమయ్య. అనగా మొదట చెప్పిన వాక్యం ఉత్తుత్తిగా మనం చూడాలి.
003 వ చరణము
చెప్పరాని తనమాయచేత నిందరినిఁ
గప్పెడికొరకే వేంకటవిభుడు
కప్పెడి నల్లనియలకలనుదురు-వీడె
గుప్పెడి ముద్దులు యెత్తుకొనరమ్మా 
అర్థాలు
గుప్పెడి = చల్లును 
తాత్పర్యము
ఇంత అని  చెప్పరానిది ఆ వేంకటేశుడనే కృష్ణుని  మాయ. మాయ చేత
ఈ లోకాన్ని నేను కప్పుతున్నానని చెప్పటానికి, తననుదుటిని నల్లని ముంగురులతో వీడు  కృష్ణుడు కప్పుతున్నాడు. వీడు ముద్దులు కురిపిస్తున్నాడు. ఇంకా చూస్తారేమిటి? ఎత్తుకోండి.
విశేషాలు
మాయ 
1. తాడును చూసి పాము అని భ్రమపడటం మాయలో పడటం. ‘‘యా నవిద్యతే వస్తుతః సా మాయా’’. వాస్తవంగా ఏది లేదో అది ఉన్నట్లు తోచడం మాయ.
2. అజ్ఞానం/ అవిద్య మాయ.
3. ఆవరణం, విక్షేపం అనే రెండు శక్తులు కలిగినది మాయ.
4. ఇంద్ర జాలం, ఇంకా అలాంటిదే మరేదైనా విద్య అని మాయకుసామాన్యార్థం.
5. శివునిలోనే ఉండి, శివుడి ఇచ్ఛ ప్రకారం నడచుకొనే ఒక వృత్తి మాయ అని శైవమతానుయాయుల నిర్వచనం.
6. ‘మా’ అంటే లేదు, కాదు అనీ, ‘యా’ అంటే ‘ఏది’ అనీ అర్థం చెప్పుకుని ఏది లేదో, ఏది కాదో అది అని మాయకు ఒక వివరణ ఉంది.
7.. శంకరాచార్యుల వారు ‘మాయ’ను అచింత్యం అన్నారు. అసత్తూ కాదు, సత్తూ కాదు అని భావం. 
ఈ అన్నమయ్య  కీర్తనను భక్తితో భావన చేస్తే మాయ కట్లు  తెగటం మొదలుపెడతాయి.స్వస్తి.

No comments:

Post a Comment

Pages