కపిల మహర్షి
మంత్రాల పూర్ణచంద్రరావు
పూర్వము కర్దమ ప్రజాపతి కృతయుగమున విశ్వ సృష్టి కొఱకు బ్రహ్మచే నియమింపబడి సరస్వతీ నదీ తీరమున పదివేల సంవత్సరములు తపస్సు చేసెను.అతడు ఒకనాడు జపమునందు ఏకాగ్ర మనస్సుతో విష్ణుమూర్తి ని ధ్యానించగా ఆతడు ప్రత్యక్షమయి దేవహుతి వలన తొమ్మిది మంది కుమార్తెలునూ, నా అంశ వలన ఒక కుమారుడూ జన్మించును అని వరమిచ్చెను.తరువాత కొంత కాలమునకు దేవహుతికి కర్దముని వలన గళ, అనసూయ,శ్రద్ధ,హవిర్భువు,గతి,క్రియ,
ఖ్యాతి,అరుంధతి,శాంతి అను తొమ్మిది మంది కుమార్తెలు జన్మించెను.తరువాత కర్దముడు సన్యాసము స్వీకరిచెదను అని చెప్పగా దేవహుతి కుమార్తెల వివాహము చేసి మన వంశము నిలుపుటకు ఒక కుమారుని ఇవ్వుముఅని ప్రార్ధించెను.అందులకు కర్దముడు త్వరలోనే విష్ణుమూర్తి నీకు పుత్రునిగా జన్మించును,కావున నీవు విష్ణువును ప్రార్ధించుము అని చెప్పి అచటనే ఉండి పోయెను.
కొంత కాలము పిదప విష్ణుమూర్తి ఆమె గర్భమున జన్మించెను,అప్పుడు దేవతఃలు పుష్పవర్షము కురిపించగా బ్రహ్మాదులు వచ్చి ఆ బాలుని చూచి కర్దమ దంపతులకు ఆ బాలుని గురించి వివరించి కపిలుడు అని నామకరణము చేసి వెడలిరి.
పిమ్మట కర్దముడు తన కుమార్తెలను వివాహమాడుటకు మునులు అందరినీ పిలిచి మరీచికి గళను,అత్రి మహర్షికి అనసూయను,అంగీరసునకు శ్రద్ధను,పులస్త్యునకు హవిర్భువును, పులహునకు గతిని,క్రతువునకు క్రియను,భ్రుగుమహర్షికి ఖ్యాతిని,వసిష్టునకు అరుంధతి ని, అధర్వునకు శాంతిని ఇచ్చి వైభవముగా వివాహములు చేసి పంపెను.
తరువాత కర్దముడు కపిలుని ఏకాంతమునకు తీసుకువెళ్ళి పాదాభివందనము చేసి స్వామీ నీవు ఇచ్చిన మాట ప్రకారము నా ఇంట జన్మించితివి, నేను నా సంసార బాధ్యతలు నెరవేర్చితిని ఇక నేను ఏకాంతమునకు పోయి తపము ఆచరిన్తును, అనుమతి ఇవ్వు మని కోరెను.నాయనా మునీంద్రా నేను నీ ఇంట వెలసినది జ్ఞాన బోధచేయుటకు మాత్రమె ఇక నీవు ఏకాంతమునకు పోయి నన్నే భక్తితో కొలువుము, మోక్షము పొందెదవు అని బదులిచ్చెను. పిమ్మట కర్దముడు ఏకాంతమునకు పోయి పరమాత్మలో ఐక్యము చెందుటకు భక్తిభావమున సమస్త ప్రపంచము నారాయణుడి గా తలచి తపము చేసి భగవంతునిలో ఐక్యము చెందెను. అప్పుడు కపిలుడు బిందుసరయున తపోనియమమునందు ఉండెను.
అంత దేవహుతి కుమారుని దర్శించి రక్షింపుము అని వేడుకొనెను. అప్పుడు కపిలుడు దేవహుతికి జీవుడు సంసార బంధమున చిక్కి త్రిగుణా సక్తము అగును , అదే నారాయణాసక్తమయినచో మోక్షమును పొందెదరు అని చెప్పి ఆమెకు సాంఖ్య యోగము,భక్తి యోగము ను బోధించెను.తరువాత ఆమె గురు బలముచే విష్ణు సాయుద్యము చెందెను.ఆమె మోక్షము నొందిన ప్రదేశము " సిద్దిపద " అని ప్రసిద్ధి చెందెను. తరువాత కపిలుడు సాంఖ్యాచార్యాభిష్టుతమగు యోగమును అవలంభించెను.
ఒకనాడు కపిల మహర్షి ఉత్తమమయిన రూపము కల గోవును చూచి వేదస్వరూపమని తెలిసి కూడా నిర్లక్ష్యముగా ఉండెను.ఇది చూసి స్యూమరశ్మి అను ముని కపిలునకు వేదముల యందు చులకన ఉన్నది అని తలచి ఆ గోవు నందు ప్రవేశించి మహర్షీ వేదముల మీద మీ అభిప్రాయము ఏమి ? అని అడిగెను. అందులకు కపిలుడు వేదముల యందు నాకు ఆదరము,నిరాదరమూ లేదు,కానీ సంసారులు అందరకూ వేదములలో చెప్పినట్లు ఆచారములు చేయుచూ వాటివల్ల వచ్చే సుఖాలను, ఎలాంటి క్షేమము కలుగుతుందో వాటిని పొందాలి.పాణి, యుపస్థము, ఉదరము, వాణి అనునవి మూయరాని వాకిళ్ళు.వానిని మూయకలిగిన వానికి తపోదాన వ్రతాదులు కానీ,వేద ప్రామాణ్యము కానీ కావలసిన పని లేదు అని తెలిపెను. అంతట స్యూమరస్మి గోవునుండి బయటకు వచ్చి కపిలునకు నమస్కరించి సత్యమును తెలుసుకొనుటకు ఇలా గోగర్భము నుండి ప్రస్నించితిని క్షమించుము మునీంద్రా మీ ద్వారా వేదములు గూర్చి మరింత తెలుసుకోన గోరుచున్నాను,నా యందు దయ ఉంచి చెప్పండి మహానుభావా అని అడిగెను. అంతట కపిల మహర్షి వేదములే లోకమునకు ప్రమాణములు, శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ లలో శబ్దబ్రహ్మ మూలమున పరబ్రహ్మము గ్రహించ వచ్చును.బ్రాహ్మణులు ఉత్తములయివేదములు చెప్పిన కర్మలు చేయుచు శాశ్వత పదము పొందవచ్చును.సర్వము వేదం పరినిష్టము కావున నేను వేదములు ఆచరించు బ్రాహ్మణులకు నమస్కరింతును.అని పలికెను ఈ మాటలు విని ఆ ముని ఆనందముగా వెడలిపోయెను.
తరువాత ఒకనాడు పుండరీకుడు అను రాజు వేటకు బయలుదేరి అడవిలో తిరుగుచూ దాహము వేయగా కపిల మహర్షి ఆశ్రమము వద్ద ఉన్న నది యందు నీరు త్రాగి అటుగా వచ్చిన లేడి ని చూసి దానిపయి బాణము వేసెను, అది పరుగెత్తి వెళ్లి కపిలుని ఆశ్రమమునందు ప్రాణము విడిచెను..అది చూసి కపిలుడు తన ఆశ్రమమునందు ఈ పని చేసినది ఎవరు అని వెదుకుచూ ఒక చెట్టు నీడన విశ్రమించుచున్న రాజుని చూసేను,రాజు మునిని చూసి భయముతో నమస్కరించి తన గురించి చెప్పుకొని, తను చేసిన తప్పును క్షమింపుము అని కోరెను.అప్పుడు ఆ మహర్షి ఓయీ క్షణ భంగురమయిన జీవితము కల మానవుడు పశువు కన్నా బుద్ధి బలము కల వాడవు అయి ఏ పాపము ఎరుగని నోరులేని సాధు జంతువుని చంపుట వలన మహా పాపము కలుగును.రక్త మాంస ములు కలిగిన నీ శరీరము మీద నీకు ఎంత ప్రేమ కలదో దానికీ అంతే కదా, తుచ్చమగు నీ విలాసములకు నోరు లేని ఈ జంతువును బలికొంటివి కదా, నిన్ను ఇప్పుడు ఏమి చేసిననూ తప్పులేదు. అని చెప్పి వైరాగ్యము బోధించెను.
పుండరీకుడు ఆమహానుభావుని కాళ్ళ మీద పడి తనను క్షమింపుము,ఇప్పుడే నేను ప్రాణ త్యాగము చేసెదను అని పలికి ఒరనుండి కత్తిని తీసెను.కపిలుడు వారించి రాజా మోక్షము కోరువాడు పూర్వజన్మ కర్మలు క్షణికములు, పరహింస పాపహేతువులు అని తెలుసుకొని గురు పాదముల వద్ద తత్వములు తెలుసుకొని జీవించవలెను..ఇట్లు బోధించి కపిలుడు తన ఆశ్రమమునకు పోయెను.
తరువాత పుండరీకుడు సర్వ సంపదలు వదిలి కపిలమహర్షి ఆశ్రమమునకు వచ్చి తనను శిష్యునిగా చేసుకొని తపస్సు చేయుటకు అనుమతి కోరెను,కానీ కపిలుడు ఆతని వైపు కన్నెత్తి చూడక మాట్లాడక ఉండెను.కానీ పుండరీకుడు కదలక 13 రోజులు అట్లే ఉండెను.14 వ రోజున కపిలుడు శిష్యులతో స్నానము ముగించుకుని వచ్చుచూ పుండరీకుని చూసి పలకరించి ఆతనిని గృహస్థాశ్రమము చేయుమని నచ్చ చెప్పగా పుండరీకుడు వినలేదు.కపిలుడు సంతోషము పొంది అతనికి జ్ఞాన యోగము బోధించెను.
పరాయ సర రూపాయ
పరమాత్మన్ పరాత్మనే
నమః పరమ తత్వాయ
పరానందాయ ధీమహి
అను మహా మంత్రమును ఉపదేశించెను
ఒకసారి సగర చక్రవర్తి విష్ణు ప్రీతి కొఱకు అనేక యాగములు చేసెను,అయిననూ తృప్తి చెందక మరొక యాగము తలబెట్టి అశ్వమును విడిచెను.ఇంద్రుడు అసూయ చెంది ఆ అశ్వమును తీసుకొనిపోయి పాతాళములో ఉన్న కపిల మహర్షి ఆశ్రమము దగ్గర విడిచి పెట్టెను. సగరుడు గుఱ్ఱము తిరిగి రాలేదు అని తనపుత్రులను వెదుకుటకు పంపెను . గోవు ఎక్కడా కనపడక పాతాళమునకు వెళ్లి చూడగా అక్కడ ముని ఆశ్రమమున ఉండుట చూసి ఆతనిని సంహరింప దలచెను.అంతట కపిలుడు కళ్ళు తెఱచి చూసినంతనే వారందరూ భస్మీ పటలము అయ్యెను. తరువాత సగరుడు మనుమడు అగు అంశుమంతుని పంపెను. అతడు వెదుకుచూ పాతాళమునకు వెళ్ళగా అక్కడ అశ్వమును చూసి పక్కనే ఉన్న భస్మ రాసిని చూసి కపిలునకు ప్రణామములు అర్పించెను. నాయనా నీవు బుద్ధిమంతుడవు, నీ అశ్వమును తీసుకొని పోవుము, నీ తండ్రులు మూర్ఖులు అగుటచే భస్మము అయ్యిరి, గంగా నది వారి మీద ప్రవహించినప్పుడు వారు బ్రతికెదరు అని చెప్పి పంపెను.చివరకు భగీరధుడు గంగా నదిని ప్రవహింప చేసి సగర పుత్రులను బ్రతికించెను.
కపిల మహర్షి సాంఖ్య యోగమును బోధించిన మహాత్ముడు.ఆయువు అల్పము అనియు సుఖదుఖములు కాలమును బట్టి వచ్చును అని తెలిసుకొన వలెను.కర్మ తత్వమును వేదములు చెప్పిన విధము తెలుసుకొని సత్త్వ రజ స్తమో గుణములు వలన బుద్ధికి కలుగు ప్రవర్తనలు గుర్తించ వలెను.వేదోచిత కర్మలు మనము చేస్తే మన జీవితాలు ఒక దారిలో పడతాయి.ముక్తి కోరుకొనుటే మనకు ఆవశ్యం,పరమాత్మను మనకు దానినే ఇవ్వమని కోరుకోవాలి.అదే మన కర్తవ్యం.ఆత్ముడు పరమున తగులును,పరము మోక్షమున తగులును.మోక్షము ఇక దేని యందు కలగదు పదహారు వికారములు కల ప్రకృతి ఆత్మకు ఆశ్రయము,ఆత్మ ప్రకృతి విక్రుతులకు అతీతము ఆత్మకు రెండు రూపములు ఉన్నవి.ఒకటి విషయములందును, రెండవది మద్యస్థ భావము కలిగి ఉండును.
ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అను అయిదు వాయువులు అతనివి.వాటిని ఈ విధముగా తెలుసుకొనిన జ్ఞానము అంతరాత్మను చూపును. గర్భవాస దుఃఖము, జన్మవ్యద,బాల్య విమూఢత్వము రాగము, క్లేశము,వార్ధక్యము వీనివలన కలుగు సుఖడుఖములను వదిలి ఆత్మను చూసి మోక్షము పొందవలెను.కపిలుడు బోధించిన సాంఖ్య యోగమును తెలుసుకొనవలెను అంటే మన బోటి వారికి సంవత్సరములు పట్టవచ్చు . ఆయన సాంఖ్య శాస్త్రము చెప్పుటకు నేను సరిపోను. కపిలుని గురించి చెపుతూ ఈ విషయములు టూకీగా చెప్పితిని.ఆయన సాక్షాత్తూ విష్ణు మూర్తి యే.
కపిల మహర్షి మాతృ మూర్తికి భక్తి యోగము బోధించెను.తామస రాజస సాత్వికములు అను మూడు విధములయిన భక్తియోగమును ఇట్లు చెప్పెను.నిత్యమూ హింస చేయుచూ ఆడంబరముగా తిరుగుచూ ఉపాయముతో భగవంతుని సేవిన్చువాడు తామస భక్తుడు.విషయ సుఖముల యందు ప్రవీణుడు అయి నిత్యమూ ఐశ్వర్యము అనుభవిన్చుచూ నిత్యమూ భగవంతుని పూజించువాడు రాజస భక్తుడు. పాప పరిహారము కొఱకు భగవదర్పణ బుద్ధితో కర్మలు చేయుచూ సాటి జనులు మేలు కోరు వాడు సాత్విక భక్తుడు.అని తెలిపెను. ఈ మూడూ కాక పరమేశ్వరుని గుణములు విని ఆతని యందె మనస్సు నిలిపినవాడు పరమ భక్తుడు.అని భక్తి యోగము తెలిపెను.
కపిల మహర్షి పడమర తీరమున ఒక అడవిలో పద్మాసనుడయి కనులు మూసుకుని యోగావస్థలో ఉండెను.అప్పుడు రావణుడు వరబలము వలన బలవంతులను అందరినీ జయించి ఇటు వచ్చుచూ కపిలుని చూసేను. అప్పుడు రావణునకు మహర్షి కన్నుల నుండి అగ్ని జ్వాలలు,చేతుల యందు అనేక ఆయుధములు, శరీరమంతయూ ఉరమున లక్ష్మీదేవి,శల్యముల మరుద్గణములు, ఉదరమున సముద్రములు కన్నులలో సూర్యచంద్రులు,దాత,విధాత,రుద్రాదులు కనపడిరి. రావణుడు ఇది మునుల మాయ అని తలచి ఆతని మీద అనేక అస్త్రములు ప్రయోగించెను.అప్పుడు కపిలుడు ఓరీ దుర్మార్గుడా నన్నే అంతము చేయ తలపెట్టినావా అని ఆగ్రహముతో ఒక్క గుద్దు గుద్డెను, దానికి రావణుడు మూర్చపోయెను. తోటి రాక్షసులు మునిని అడ్డగించగా వారిని హుంకరించి పక్కన ఉన్న గుహలోనికి వెళ్ళిపోయెను. రావణుడు మూర్చ నుండి తేరుకుని గుహలోకి వెళ్ళగా అందు మహా వీరులు,దేవసుతులు,సిద్ధులు,మొదలగువారు కనపడిరి. మరింత ముందుకు వెళ్ళగా దేవతా స్త్రీలు వింజామరలు వీచుచుండగా ఒక సౌందర్యవతి పాదములు ఒత్తుచుండగా కపిల మహర్షి విశ్రాంతి తీసుకొనుచుండెను.రావణుడు అదిచూసి ఆశ్చర్యము చెంది ఆయన చరిత్ర అడిగెను. అప్పుడు కపిల మహర్షి ఈతడు త్వరలో చంపబడును అని తెలుసుకొని నోరు తెరిచేను.అందు విశ్వరూపము ప్రత్యక్షమయ్యెను.అది చూచి రావణుడు భయపడి నమస్కరించి స్వామీ మీ చేతిలో చనిపోవుటకంటే శుభము ఇంకొకటి లేదు. నేను అందు కొఱకే వెదుకుచూ ఉన్నాను.అని పలికెను.ఇంతలో మహర్షి గుహతో సహా అంతర్ధానమయ్యెను.
కపిల మహర్షి వలన లోకమునకు సాంఖ్య యోగము, భక్తి యోగము అను మోక్ష సాధనములు లభించెను.విష్ణు మూర్తి కపిలుని అవతారమెత్తి ఋషులకు,తద్వారా జనులకు తత్వ బోధామ్రుతముచే పునీతులను చేయుటకే అనుటకు ఎట్టి సందేహమునూ లేదు. ఆ మహనీయుని తత్వ బోధనలు చదివి ప్రజలు తమ జీవితములను సార్ధకము చేసుకొందురు గాక.
No comments:
Post a Comment