నాకు నచ్చిన కథ--కవుల రైలు(శ్రీ తిలక్) - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ--కవుల రైలు(శ్రీ తిలక్)

Share This
నాకు నచ్చిన కథ--కవుల రైలు(శ్రీ తిలక్)
శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి) 

తెలుగుదేశం కవులతో నిండి మూడవ తరగతి రైలు పెట్టె లాగా కిక్కిరిసిపోయింది." ఇంక  జాగా లేదు" అని కేకలేస్తున్నా వినిపించుకోకుండా, టిక్కెట్లు కొనుక్కొని కొత్త కవులు తోసుకొని లోపలికి ఎగబడుతున్నారు.కొందరు ఫుట్ బోర్డుల మీద నిలబడి,మరికొంతమంది కమ్మీలు పట్టుకొని వేలాడుతున్నారు.ఒకావిడ మేలిముసుగు వేసుకొని వచ్చింది.సుతారంగా, అందంగా ఉంది.కళ్ళలోఅపూర్వమైన వెలుగు.ఎర్రని పెదవుల్లో తియ్యని సిగ్గు ఒంపులు.వెన్నెలనీ,ఉష:కాంతినీ,మల్లెపువ్వుల్నీ, 
మంచిగందాన్నీ,రత్నాలనీ కలబోసి మనమీద జల్లినట్లు అనిపిస్తుంది,ఆవిడను చూస్తే... అక్కడ దగ్గరలో నిలుచుంటే---ఆవిడ నిస్పృహగా చూసింది  రైలు పెట్టె కేసి.లోపలి బొగ్గుపులుసు గాలీ,చుట్టపొగా,వాగుడూ కలసి పెట్టెలోంచి బయటకు దుర్భరంగా వ్యాపిస్తున్నాయి."ఇక్కడ చోటులేదు దయచేయవమ్మా,నువ్వు కూడానా మా ఖర్మ " వగలొలకబోసుకుంటూ అన్నాడొక ఆసామి చుట్ట కాండ్రించి ఉమ్మివేస్తూ.ఆయన 'కవిశార్దూల' బిరుదాంకితుడు.అప్పకవీయం అడ్డంగా బట్టీవేసాడు."నో ప్లేస్ మేడం వెరీ సారీ ప్లీజ్ "అంటూ కన్ను గీటాడొక నవయువకుడు,గాగుల్సు తీసి,సెకండ్ హాండు బీడీని నోట్లోనే ఉంచుకొని. కొందరు వెకిలిగా నవ్వారు. కొందరు దగ్గారు.మరి కొందరు ఈలలు వేసారు.పాపం ఆవిడ వెనక్కి తిరిగి జాలిగా వెళ్ళిపోయింది.రైలు కదిలిపోయింది.స్టేషన్ మాస్టారు వచ్చి ఆమెను చూసి"పాపం చోటు లేదామ్మా!నీ పేరు?" అని అడిగాడు."కవిత" అందా సుందరి.కవుల రైలు గమ్యం తెలీకుండా వడివడిగా వెళ్లిపోతుంది.ఈ కథను ఇక్కడ కూడా వినండి !
****
('నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అని చక్కని భావుకత వెలిబుచ్చిన శ్రీ తిలక్ అతి చిన్నతనంలోనే స్వర్గస్తులయ్యారు.వారు చనిపోయిన మూడు సంవత్సరాలకు వారు వ్రాసిన  'అమృతం కురిసిన రాత్రి' అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి బహుమతి లభించింది.'అమృతం కురిసిన రాత్రి' --కావ్యం పేరే కాదు,ప్రతి వాక్యం రసాత్మకంగా ఉంటుంది.'వాక్యం' ను కొద్ది మార్పులు చేసి ,తిరిగి వ్రాస్తే,'కావ్యం ' అవుతుందని కీర్తి శేషులు సంజీవదేవ్ గారు అన్నారు.కొద్ది మార్పులంటే,వాక్యాన్ని రసాత్మకంగా చెప్పటమే కావ్య రచన.కవిత్వం తెలిసిన వాడు కథలు కూడా అద్భుతంగా చెప్పగలడు. 'కవిత' అంటే కవి శార్దూలాలకే ఏహ్యభావముంటే ,ఇక సగటు తెలుగువాడి పరిస్థితి ఎలా ఉంటుందో  క్లుప్తంగా, ఒక పదచిత్రంలా సమర్పించిన తిలక్ గారి సృజనాత్మక శక్తికి జోహార్లు!నిజానికి తిలక్ గారి కథలంటే సాహిత్యాభిమానులందరికీ ఎక్కువ మక్కువ.వారికి స్మృత్యంజలి ఘటిస్తూ......)

2 comments:

  1. తిలక్ గారి మరో కవితారూపకం!

    ReplyDelete
  2. విషయం సున్నితమైనదే। చెప్పింది సూటిగా నాటుకుంది।
    అప్పటి రచయితలు బహు సంస్కార వంతులు ఇప్పుడు జరుగుతున్నదాన్ని ఊహించి బాగా రాసేరు। అక్షరంతో భవిష్య దర్శనమైంది। ధన్యవాదాలు। కవిత రూపంలో పరిచయం చేసినందుకు।

    ReplyDelete

Pages