కొత్త తరగతిలో - అచ్చంగా తెలుగు
కొత్త తరగతిలో..

పిల్లలూ-

స్కూళ్లు తెరిచారు!
ఎంచక్కా కొత్త తరగతి. కొత్త డ్రస్సులు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్లు అంతా భలేగా ఉంది కదూ! కొత్తెప్పుడూ అలాగే ఉంటుంది. పాతబడుతున్నకొద్దీ విసుగ్గా, చిరాగ్గా ఉంటుంది.
ఈనెల మీతో కొన్ని విషయాలు ముచ్చటించాలనుకుంటున్నానర్రా, అవేమిటంటే-
1. టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినండి. ఏరోజు పాఠాలు ఆరోజే ఇంటికెళ్లి చదవండి. మననం చేసుకోండి. సందేహాలుంటే ఇంట్లోని పెద్దలని అడిగి తెలుసుకోండి. లేదంటే మరుసటిరోజు టీచర్లని అడిగి తెలుసుకోండి. అంతేకానీ తెలుసుకోకుండా మాత్రం విడిచిపెట్టొద్దు.
2. ముఖ్యంగా లెక్కలు, ఫిజిక్స్. సూత్రాలను, సులువులనూ ఆకళింపు చేసుకోండి. అభ్యాసాల్లోని లెక్కలను శ్రద్ధగా సాధన చేయండి. మీకు పట్టు చిక్కేదాకా చేస్తూనే ఉండండి.
4. బట్టీ మాత్రం పట్టొద్దు. అప్పటికి వచ్చేసినట్టు, గండం గడిచినట్టు అనిపించినా ముందు ముందు చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది.
5. ఏరోజు పాఠాలు ఆరోజు చక్కగా చదువుకోవడంవల్ల పరీక్షల ముందు మీ మెదడుపై ఒత్తిడి ఉండదు. మీకూ చిరాకు అనిపించదు. రాత్రుళ్లు, పగళ్లు కష్టపడి చదవాల్సిన అవసరం ఉండదు. నెల, త్రైమాసిక, అర్ధ, చివరి సంవత్సర పరీక్షలకు సర్వసన్నద్ధంగా ఉంటారు. 
6. పరీక్షల ఫలితాలు విడుదలయ్యేప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉంటారు తప్ప ఉత్తీర్ణులవుతారో? లేదో? అన్న బెంగ ఉండదు.
7. తరగతిలో  మీకన్నా బాగా చదివే వాళ్లపట్ల ఈర్ష్య పెంచుకోవద్దు. బాగా చదివి వాళ్లని అధిగమించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యకరమైన పోటీ అంటే అదే!
8. మీరు చేయాల్సింది ఇంతే. ఫలితాలు ఎంత బాగుంటాయంటే, మీ టీచర్లు, తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్లు, బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చూసి మురిసిపోతారు. 
9. ప్రతి సంవత్సరం పైన చెప్పిన విధంగానే చదివితే..పదో తరగతి తర్వాత మీరు ఉన్నత చదువులకు తేలిగ్గా ఎంపికవుతారు. భవిష్యత్తు బంగారమవుతుంది. మీకూ, మీ వాళ్లకూ అదే కదా కావలసింది. పెద్దయింతర్వాత స్కూలు ఫోటోలు చూస్తూ తీపి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు.
చదువు బరువు కాదు. ఎలా చదవాలో తెలుసుకుంటే చాలా తేలిక.
ఆటలు ఆరోగ్యమే. కానీ ఆటల్లో సమయం వృధా చేయొద్దు. సమయం చాలా చాలా విలువైనది. ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవలసిందే. ముఖ్యంగా మీరు..విద్యార్థులు! ఉంటాను మరి.

మీ మామయ్య

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

No comments:

Post a Comment

Pages