అగ్గిపుల్ల ప్లీడర్లు - అచ్చంగా తెలుగు

అగ్గిపుల్ల ప్లీడర్లు
మాబాపట్ల కధలు – 16
భావరాజు పద్మిని

“వర్ధనమ్మ గారు, చెప్పండి, నా క్లైంట్ జమున భర్త రెండో పెళ్ళికి మీరు వెళ్ళారా? అక్కడ ఏం జరిగింది?” అడిగారు ఓ రెండోపెళ్ళి కేసులో తన క్లైంట్ తరఫున సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన వర్ధనమ్మను లాయర్ సుందరం గారు.
“వెళ్లానండి, అక్కడ ఆ రోజున బాపట్ల వంకాయలు చింతపండు పులుసు వేసి, మగ్గబెట్టిన పెళ్లి కూర చేసారు...చాలా బాగా కుదిరింది. ఆ తర్వాత దోసావకాయ వేసారు, కారం నసాళానికి అంటిందంటే నమ్మండి. మావిడికాయ పప్పైతే ఆకులో అరమైలు పాకింది, అన్ని నీళ్ళు పోస్తారటండి, చోద్యం కాప్పోతే !”
“ఆహా, ఇంకా...” ఓపిగ్గా ఆవిడ నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తూ అడిగారు సుందరం గారు.
“ఇంకా అంటేనండి, ఉదయం అరిటాకులో పెట్టిన జీడిపప్పు ఉప్మాలో జీడిపప్పు బాగా తగ్గింది. వంటవాళ్లు నొక్కేసి ఉంటారని నా అనుమానం.”
“అయ్యుండచ్చు. కానీ మీరు పెళ్ళికి వెళ్లి ఇంకేం చేసారు?” ఆవిడ కళ్ళలోకి చూస్తూ మళ్ళీ అడిగారు సుందరం గారు.
“ఏం చేస్తామండి, ఓ రెండు మూడు సార్లు ఫిల్టర్ కాఫీ ఇచ్చారు కాని, పాలు మాగిపోయాయండి, ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవద్దూ అంట? ఓసారి నేను పెళ్లివంటకు కాకినాడ వెళ్ళినప్పుడు నేను పెట్టిన కాఫీ ఘుమఘుమలకి పందిరంతా అదిరిపోయింది. జనాలు భోజనాలు మానేసి కాఫీలు తాగారంటే నమ్మండి!”
ఆవిడ వైఖరికి సుందరం గారికి బి.పి పెరిగిపోతోంది. అసహాయంగా రామూర్తి గారి వంక చూసారు. ఇంకొక్క ప్రయత్నం చెయ్యమన్నట్టు సైగ చేసారు రామ్మూర్తి గారు.
“అంటే, నేను అడుగుతున్నది మీరు నా క్లైంట్ జమున భర్త రెండో పెళ్ళికి వెళ్లి అక్కడ ఏం చూసారు అని. సరిగ్గా ఆలోచించి చెప్పండి.”
“అయ్యో నా మతి మండ ! అదే కదండీ చెబుతూ ఉంటా, పెళ్ళిలో వంట వాళ్ళు అసలు బాలేదు. అదే మా అనపర్తిలోనైతే ఇలాంటి వంట కుక్కలు కూడా ముట్టవు. ఏదో ఆ పెళ్లి వాళ్ళు మంచి వాళ్ళు గనుక సరిపోయింది. లేకపోతే పెద్ద రభస అయిపోనూ...ఆయ్ ” మళ్ళీ అదే ధోరణిలో చెప్పుకు పోతోంది వర్ధనమ్మ. కోర్టులో ఆవిడ వైఖరికి అంతా నవ్వసాగారు.
పోయింది, అంతా అయిపోయింది, సాక్ష్యం బలంగా లేదని, జడ్జీ గారు ఈ కేసు కొట్టి పారేస్తారు, పాపం జమున !అనుకుని, “ఓవర్ టు డిఫెన్స్ “ అనేసి కాల్లీడ్చుకుంటూ వెళ్లి, తన మిత్రుడు రామ్మూర్తి పక్కన కూర్చున్నారు సుందరం గారు.
బాపట్ల రైలుపేటలో ఉండే లాయరు  సుందరం గారికి, మాయాబజార్ లో ఉండే రామ్మూర్తి గారికి చిన్నప్పటి నుంచి మంచి స్నేహం. వీళ్ళ భార్యలు దమయంతి, అనసూయమ్మ గార్లకు కూడా మంచి స్నేహం కుదరడంతో వారిద్దరి మధ్య అనుబంధం మరింత గట్టిపడింది.
సుందరం గారు సివిల్, క్రిమినల్ రెండూ చదివి, రెండు పడవల మీదా ప్రయాణం చేస్తూ కేసులు చూసేవారు. రామూర్తి గారు కేవలం సివిల్ కేసులే చూస్తూ వన్ వే లో దూసుకు పోయేవారు. ఇద్దరూ సబ్ కోర్ట్ లో తరచుగా కలుసుకుంటూ కబుర్లాడుకునేవారు. అప్పటికప్పుడు దొంగ సాక్ష్యాలు అవీ ఏర్పాటు చెయ్యాల్సి వచ్చినా, ఒకరికొకరు ‘నవజాత సాక్షుల్ని’ ఏర్పాటు చేసేసుకునేవారు.
సుందరం గారికి ‘జమున’ అనే క్లైంట్ ఉంది. జమున భర్త ఆమెకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు, అందుకే ఆమె హిందూ వివాహ చట్టం సెక్షన్ 125 క్రింద తన భర్తపై క్రిమినల్ కేసు వేసింది. కాని, ఊళ్ళో బలం, పరపతి ఉన్న జమున భర్త ఏ సాక్ష్యాన్ని కోర్టు దాకా రాకుండా చేసాడు. ఎలాగైనా తననే నమ్ముకున్న జమునకు అన్యాయం జరక్కుండా చూడాలంటే, అప్పటికప్పుడు ఏదైనా దొంగ సాక్ష్యాన్ని సృష్టించాల్సిందే ! సమయానికి ఇంకేమీ తోచక రామ్మూర్తి గారిని ఆశ్రయించారు సుందరం గారు.
ఆ సరికి రామ్మూర్తి గారింట్లో ఆవకాయలవీ పెట్టుకునేందుకు సాయం కోసం అనసూయమ్మ గారి పుట్టిల్లైన అనపర్తి నుంచి తెచ్చుకున్న వర్ధనమ్మ అనే వంటావిడ వాళ్ళింట్లో ఉంది. ఆవిడతో మర్యాదకి ఇద్దరికీ కాఫీ పంపారు అనసూయమ్మ గారు. వెంటనే సుందరం గారి కన్ను వర్ధనమ్మ గారి మీద పడింది. ఆవిడ పొరుగూరు ఆవిడ కనుక, అక్కడ ఎవరికీ తెలీదు కనుక, ఆవిడని ఒప్పించి, సాక్ష్యానికి తెమ్మన్నారు. సాటి ఆడకూతురి కోసం జాలి గుండెతో ఆవిడా ఒప్పుకుంది. ఇక్కడే మొదలైంది అసలు తమాషా...
వర్ధనమ్మ గారిని సాక్ష్యం చెప్పేందుకు కోర్టు బోనులో ప్రవేశపెడితే, సహజంగా ఆవిడ వంటావిడ కనుక వంట సంగతులే చెప్తూ, ఈ కేసులో కీలకమైన విషయాలు “పెళ్ళికి వెళ్లాను, తాళి కట్టారు, సన్నికల్లు తొక్కారు, సప్తపది మెట్టారు,” అని చెప్పకుండా వంటల గురించే చెప్పుకు పోతోంది.
డిఫెన్స్ లాయర్ కాసులరాజు లేచాడు. అతను మామూలుగా సివిల్ కేసులే చూస్తాడు, క్రిమినల్ కేసు టేక్ అప్ చెయ్యడం ఇదే రెండోసారి. అతను లేవగానే “ఒరేయ్ సుందరం, డిఫెన్స్ లాయర్ ఇతనా, ఇక నువ్వీ కేసు గెలవడం ఖాయం, చూడు తమాషా !” అంటూ ముసిముసిగా నవ్వుకోసాగారు రామ్మూర్తి గారు.
“ఎందుకలా అంటున్నావు? నాకేం అర్ధం కావట్లేదు మూర్తి” ఆశ్చర్యపోతూ అన్నారు సుందరం గారు.
“గురుడికి క్రిమినల్ కేసులు కొత్త. గతంలో ఓ కేసు వచ్చిందిలే. రైల్ లో బల్బులు కొట్టేసిన ఒక దొంగ, రైల్వే పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ బల్బులమీద “IR” అంటే ఇండియన్ రైల్వేస్ అన్న అక్షరాలు స్పష్టంగా రాసున్నాయి. పైగా, దొంగ రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డాడు కూడాను. అటువంటి కేసుల్లో మామూలుగా తప్పొప్పుకుని, క్షమాపణ అడిగితే, జడ్జీ గారు ఏదో నామమాత్రపు జరిమానా వేసి ఒదిలేస్తారు. కాని, గురుడు కొత్త పిచ్చోడు కనుక, ‘యువరానర్, “IR” అంటే ఇండియన్ రైల్వేస్ మాత్రమే ఎందుకు కావాలి, ఇటాలియన్ రైల్వేస్ ఎందుకు కాకూడదు , ఐర్లాండ్ రైల్వేస్ ఎందుకు కాకూడదు అంటూ వితండ వాదం చేసాడు. ఒళ్ళు మండిన జడ్జీ గారు, ఇతని క్లైంట్ అయిన దొంగకు నెల రోజుల కారాగార శిక్ష వేసారు. బయటికొచ్చాకా, ఆ దొంగ లబోదిబోమన్నాడు. ఆ నెల రోజుల్లో ఈ కాసులరాజు ఇంట్లో దొంగలు పడ్డారు. ఇదీ మనోడి తీరు. వాక్కూడనిది వాగి తన నెత్తి మీదకే తెచ్చుకుంటాడు. అదీ విషయం. “ నవ్వాపుకుంటూ చెప్పారు రామ్మూర్తి గారు.
ఇంతలో తను సాక్షిని క్రాస్ ఎక్సామిన్ చెయ్యకపోతే, అంతా తనకేమీ రాదనుకుంటారని, సాక్షిని విచారించేందుకు దర్పంగా లేచాడు కాసులరాజు.
“ఏవమ్మా, నువ్వా పెళ్ళికి వెళ్ళావా?” అని వర్ధనమ్మ గారిని అడిగాను.
“ఏం నాయనా, నీకు బ్రహ్మ జెవుడు గానీ ఉందేంటి? ఇంతవరకూ వెళ్ళాననేగా గొంతు చించుకు చెప్తుంటా! అన్నట్టు ఆ బూంది లడ్డు కట్టిన తింగర సన్నాసి ఎవడో గాని, సమంగా కట్టలేదు, పట్టుకుంటే విడిపోయింది. ఇక అరిసెలైతే, సంక్రాంతి పిడకల్లా ఉన్నాయి. ఏవిటోనమ్మా... పిదప కాలం, పిదప పెళ్ళిళ్ళు ...” చేతులు తిప్పుతూ సాగదీస్తున్న ఆవిడ వైఖరికి కోర్టులో నవ్వులు వెల్లివిరిసాయి.
“ఆర్డర్, ఆర్డర్...” అన్నారు జడ్జీ గారు.
ఈవిడ మాటలతో అవమానంగా ఫీల్ అయిన కాసులరాజుకి తిక్క రేగింది. “ఏవమ్మా, నువ్వు తినడానికి వెళ్ళావా, పెళ్లి చూట్టానికి వెళ్ళావా? పెళ్లి గురించి చెప్పమంటే ఆడ బకాసురుడిలా ఇందాకటి నుంచి తిండి గోలే!” అని కోప్పడ్డాడు ఆవిడని.
అంతే, అప్పుడు బల్బు వెలిగిన ఆవిడ, తను పెళ్ళికి వెళ్లానని, తాళి కట్టడం చూసానని, కేసుకు కావాల్సిన అన్ని విషయాలు చెప్పేసింది. తీర్పు సుందరం గారికి అనుకూలంగా వచ్చింది. జమున భర్తకు శిక్ష పడింది. మౌనంగా క్రాస్ ఎక్సామిన్ చెయ్యకుండా ఉన్నా సరిపోయేదని, కాసులరాజు తలబాదుకున్నాడు.
ఆ సాయంత్రం రామ్మూర్తి గారింట్లో కలిసిన స్నేహితులు ఇద్దరూ ఈ సంఘటన తల్చుకుని ఒకటే నవ్వులు. “బాగుంది, ఫీజు మీరు తీసుకుంటే, పాపం ఆ కాసులరాజు వాదించి గెలిపించాడా? అన్యాయం కదూ,” అంటూ వెటకారాలు ఆడారు ఆ ఇల్లాళ్ళు.
“ఇవాళ కోర్టు సాగరం ఈదేసాము. కాని, రేపటి సంగతే ఎలాగా అని ఆలోచిస్తున్నా,” అన్నారు సుందరం గారు.
“ఓ రేపు ఒక సివిల్ కేసులో నువ్వూ, నేనూ తల పడాలి కదూ! పర్లేదు, ఈ రోట్లో తల పెట్టడం మనకు అలవాటేగా !” నవ్వుతూ అన్నారు రామూర్తి గారు. వీరిద్దరి మాటలూ ఆ ఇల్లాళ్ళు ఆసక్తిగా వినసాగారు.
“తల పడడం సంగతి సరే మూర్తి! కాని, అసలు నాకొక అనుమానం ! ఏవిటంటే మనం ఈ సివిల్ కేసుల్లో ఆస్తుల తాలూకు పుట్టు పూర్వోత్తరాల బాండ్ పేపర్స్ అన్నీ జేమ్స్ బాండ్ లలా పరిశోధించి అందిస్తే, ఆ జడ్జీ గారు కనీసం కాగితం తిప్పి అయినా చూడరని, నోటికొచ్చిన తీర్పు ఇస్తారని ఎప్పటినుంచో నా సందేహం.” మనసులో మాట బయట పెట్టారు సుందరం గారు.
“ఇదీ మాటంటే! నా మనసులో మాట లాక్కున్నావ్ సుందరం. నాకూ ఇదే సందేహం. నీకు, నాకే కాదు ఆయన అసలు సైటేషన్ తాలూకు పత్రాలు కన్నెత్తైనా చూడరని మన బార్ కౌన్సిల్ లో అందరి అనుమానమూనూ,” ముందున్న బల్ల గుద్దుతూ అన్నారు రామ్మూర్తి గారు.
కాసేపు సాలోచనగా బట్టతల గోక్కున్న సుందరం గారు, “అయితే ఓ పని చేద్దామా?” అన్నారు. ఆయనకు వచ్చిన ఆలోచన ఏవిటో వినేందుకు మిగతా ముగ్గురూ చెవులు రిక్కించారు.
“మరేం లేదు, రేపు నీ సైటేషన్ కాగితాల్లో నువ్వు అగ్గిపుల్లలు పెట్టు. నా పేపర్స్ లో నేనూ అగ్గిపుల్లలు పెడతాను. పెట్టిన పుల్లలు కింద పడిపోతే జడ్జీగారు మన కాగితాలు పరిశీలించినట్టు, లేకపోతే లేనట్టు, ఏమంటావ్?” ఆయన ఐడియా కి మిగతా ముగ్గురూ చప్పట్లు చరిచారు.
“భేషుగ్గా ఉంది సుందరం! అలాక్కానీ. “ అన్నారు రామ్మూర్తి గారు. మర్నాడు జడ్జీ గారి పరీక్షకు రంగం సిద్ధమయ్యింది. ఆ నోటా ఈ నోటా ఈ వార్త మిగతా బార్ సభ్యులకు పాకింది. అంతా ఏమౌతుందా అని ఆసక్తిగా ఎదురుచూడసాగారు.
జడ్జీ గారు వచ్చారు, హియరింగ్ అయ్యింది, తీర్పు ఇచ్చి వెళ్ళిపోయారు. ఎవరి సైటేషన్ ఫైల్స్ వాళ్లకి ఇచ్చారు. బార్ సభ్యులు అందరికీ ఉత్సుకత, అంతా గుమిగూడారు. చివరికి, ఇద్దరు మిత్రులూ ఫైల్స్ తెరిచి చూస్తే ఏముంది... పెట్టిన అగ్గిపుల్లలు పెట్టినట్టు నిక్షేపంగా అక్కడే ఉన్నాయి. బార్ సభ్యులంతా పగలబడి నవ్వసాగారు.
ఈ సందడికి మళ్ళీ అక్కడికి వచ్చారు జడ్జీ గారు, ఏవిటి విశేషం అన్నట్లు కళ్ళు ఎగరేసారు.
“ఏం లేదు జడ్జీ గారు, ఏరా రామూర్తి, నీ అగ్గిపుల్లలు బాగున్నాయా?” అని అడిగారు సుందరం గారు, మళ్ళీ పెద్ద పట్టున నవ్వసాగారు అంతా.
“బాగున్నాయ్ సుందరం, మరి నీవో...” అన్నారు మూర్తిగారు.
“ఆ ఆ అగ్గిపుల్లలకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదురా. భద్రంగా ఉన్నాయి,” అన్నారు సుందరం గారు. వీళ్ళిద్దరి మధ్యా అందరూ పొట్ట పగిలేలా నవ్వుతున్నారు.
ఈ అగ్గిపుల్లల గొడవ ఏవిటో,  జడ్జీ గారికి తెలీలేదు. “ఏవిటయ్యా, ఈ అగ్గిపుల్లల గోల? నాకేం అర్ధం కావట్లేదు,” అన్నారు.
“ఏం లేదు సార్, మీరు సైటేషన్ ఫైల్స్  చూస్తారని నేను, చూడరని ఈ సుందరం పందెం వేసుకున్నాము. అందుకే ఇవాళ మీకిచ్చిన ఫైల్స్ లో ఇద్దరం అగ్గిపుల్లలు పెట్టి ఇచ్చాము. నాది కాప్పోతే కనీసం మా సుందరం ఫైల్ అయినా చూస్తారని చిన్న ఆశ. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఆస్తుల కాగితాలు చెక్కు చెదరకుండా చూసుకోవడం మీ దగ్గరే నేర్చుకోవాలి. పెట్టిన పుల్లలు పెట్టినట్టే ఉన్నాయండి. “ కోర్టు హాల్ నవ్వులతో మార్మ్రోగిపోతూ ఉండగా అన్నారు మూర్తి .
ఒక్కక్షణం గంభీరంగా మొహం పెట్టిన జడ్జీ గారు, వాళ్ళ నవ్వులతో శృతి కలుపుతూ, “ఓసోస్... ఈ పాటి దానికి ఇంత పన్నాగం పన్నాలటయ్యా , నన్నడిగితే నేనే చెప్దును కదూ. నేనసలు ఏ ఫైల్స్ చూడను. దాన్నిండా మీరు చేసే మాయలేగా ! మనసుకు తోచిన తీర్పు ఇచ్చేస్తా. ఆ రకంగా చూస్తే మనమంతా మాయాబజార్ మాయగాళ్ళమేగా !” అన్నారు.
ఈ దెబ్బతో సుందరం గారికి, రామ్మూర్తి గారికి మా బాపట్ల లో ‘అగ్గిపుల్ల ప్లీడర్లు’ అన్న పేరు స్తిరపడిపోయిందండి ! ఇదీ కధ !
****




No comments:

Post a Comment

Pages