నిద్రించే చెట్టు
డా. వి.బి కాశ్యప
హా .... పి .... బర్
హా .... పి .... బర్ .... డ " నా మాటలను అణచివేస్తూ సైరన్ లా మోగింది అలారం. తను బెడ్ మీద అటు ఇటు కదిలి, మళ్లీ ఒక్క క్షణం ఆగి, మెల్లగా లేచి కూర్చుంది. బెడ్ పక్కన నుంచొని, తనకేసి జాలిగా చూసాను నేను .
అగాథపు లోతుల్లో నుంచి చూసినట్టుగా నాకేసి చూసింది, అరమోడ్పు కన్నులతో. కానీ ఆ కళ్ళలో ఇదివరకటి జీవం లేదు.చెక్కిలి సగం దాకా వచ్చేశాయి, నల్లటి వలయాలు.నన్ను గుర్తించగానే అదే చిన్న నవ్వు.తిరిగి నేనూ నవ్వాను.నా భావశూన్యమైన ముఖం అంచుల్లో ఆ నవ్వుని తను పసిగట్టగలదు.మంచం చివరకి జరిగి, బల్ల మీద అలారం ఆపాక, పక్కనే ఉన్న పెద్ద కత్తెర చేతిల్లోకి తీసుకున్నది.దాన్నే ఆసరాగా చేసుకుని నిలబడింది గట్టిగా నిట్టూరుస్తూ.
కళ్ళు మరొక్క సారి నులుముకుంటూ, ఆ కత్తెర రెండు చేతుల్లోకి తీసుకొని మెల్లగా నా వైపు నడుచుకు రాసాగింది . తెరచుకుని ఉన్న కిటికీ తలుపులలో నుంచి చల్లని గాలి వీచింది.తన నైటీ రెపరెపలాడింది.నా కళ్ళ వెంట నీరు.తలను బలవంతంగా ప్రక్కకు కదిలించాను.తన స్థితి దారుణంగా ఉంది.చిక్కిశల్యమైన ఆ దేహం ఇంకెన్నాళ్లు తన ప్రాణాన్ని నిలపగలదో అర్ధం కావడం లేదు.కానీ, నా కన్నీరు తనకి చూపలేను.నా కోసం తను పడుతున్న శ్రమని భారంగా తలచానని తెలిస్తే తట్టుకోలేదు.అందుకే మళ్ళీ తనవైపు తిరిగి కష్టంగా నవ్వాను, అదే అస్పష్టమైన నవ్వుని.
నా దగ్గరకు చేరి, పెద్దగా ఆవులించింది.తర్వాత మోకాళ్ళపై కూర్చుని నా పాదాలు క్షుణ్ణంగా పరిశీలించింది.పది వేళ్ళతో పాటు పాదాల ప్రక్కల నుంచి కూడా వేళ్ళు పెరిగి కింద ఉన్న చెక్క ఫ్లోరింగ్లోకి చొచ్చుకొని పోయి ఉన్నాయి, నన్నక్కడే బంధిస్తూ.
“మూడు రోజుల నుంచి త్వరగా ముదిరిపోతున్నాయి... ఈ కత్తెర మార్చాలేమో” తనలో మాట్లాడుకుంటున్నట్టుగా బలహీనంగా నవ్వి తల పైకెత్తి నన్ను చూసింది.సమాధానమివ్వలేదు, గబ గబా మాట్లాడలేను కదా. అందుకే మాట్లాడటం తగ్గించేసాను. తను మళ్లీ పనిలో మునిగి పోయింది. ఫ్లోరింగ్ నుంచి నా కాలుని విడదీస్తుంది, జాగ్రతగా, నా పాదానికి దెబ్బతగలకుండా .
“అం ....త జా...” కస్టపడి ఆ రెండు పదాలు పలుక గలిగాను. నా మనసు లో ' అంత జాగ్రత్తెందుకు .... నాకు ఎలానో నొప్పి తెలియదు. నువ్వు పాదం తెంచినా, రేపీపాటికి పెరిగిపోతోంది కదా ' అనుకున్నాను . తను అర్ధం చేసుకుని , ' పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నాలో శక్తి ఉన్నంతవరకు మీకే చిన్న దెబ్బ కూడా తగలనివ్వను ' తల పైకేత్తకుండానే పనిలో పనిలో ఉంటూనే అన్నది.
నాకు తెలుసది.ఎలక్ట్రికల్ చైన్ సా ఒక్కటి తెచ్చుకుంటే ఇంత సమయం ఈ పనికి వృధా చెయ్యాల్సిన అవసరం రాదు.ఒక కాలు విడదీశాక అలసటగా ఒక్క క్షణం నిట్టూర్చింది.బక్క పలుచని తన దేహంకత్తెర ఉపయోగించడానికే వణుకుతోంది.రెండో కాలు కూడా విడదీసాక కొంచెం నడిచాను.అసలు ఆ మానులో నా శరీరం ఎంతవరకు ఉంటుందో మర్చిపోయి చాల కాలమైంది నాకు. కానీ తనకు మాత్రం అంగుళం తేడా కూడా రాకుండా నా గురించి తెలుసు .
‘ప్రేమలో ఇచ్చి పుచ్చుకోవడం రెండూ ఉంటాయంటారు.నేనేమిచ్చాను తనకి?తన ఊపిరిని ధారపోస్తూ నా కోసం ఇంత శ్రమ పడడానికి.’
తన పని అయ్యాక , మళ్ళీ ఆ కత్తెర ఆసరాగా చేసుకొని నిలబడి, రెండడుగులు వేసి తూలీ కింద పడిపోయింది. నేను వెనక్కి తిరగాలని అనుకుని ఒక అయిదు నిమిషాల్లో తిరిగే సరికి, తను లేచి మంచపై పడిపోయింది.అలారం మంచానికి మరోవైపు పెట్టి.అలా మంచం చేరుకోవడానికి ఎంత కష్టపడి ఉంటుందో. తలచుకోగానే కంటి నుండి వచ్చిన నీరు, చెక్కిలి దాటకుండానే నాలోనే ఇంకిపోయింది .
‘ఒక విఫల ప్రయోగాన్ని ఇలా భుజాలపై మొయ్యవలసిన అవసరం ఏమిటి?నేనారోజు ఆవేశ పడకుండా ఉండాల్సింది.’ ఇలా అనుకోవడం ఇప్పటికి ఎన్ని లక్షల సార్లు జరిగిందో. ‘అవును, ఆ రోజు ఆవేశంలో నా ఇంటి యజమాని తలపై కొట్టకుండా ఉండి ఉంటే,అదుపు తప్పి అతను గోడకు బలంగా తగిలి మరణించకుండా ఉంటే, నేను జైలు కి వెళ్ళవలసిన అవసరం వచ్చి ఉండేదే కాదు. ఈ ప్రయోగం లో భాగం కావలిసి వచ్చేది కాదు.
కానీ! అదే గనుక జరగక పోయి ఉంటే నాజీవితంలో తనంత అద్భుతమైన వ్యక్తిని కలువ గలిగి ఉండేవాడిని కాదు. ఇది అదృష్టమా ? దురదృష్టమా ?’
హఠాత్తుగా గుర్తొచ్చింది అసలు విషయం సమయం 10:15 నిమిషాలయింది.ఇంకో గంటా నలభైఅయిదు నిమిషాలలో తన పుట్టినరోజు.అప్పటి దాక తనని నిద్ర లేవనివ్వకూడదు.అలా జరగాలంటే, నేను మంచం ఆవలకు చేరుకొని అలారం ఆపెయ్యాలి.అప్పుడు 11 గంటలకి తనకి మళ్ళీ నిద్రలేచే అవసరం తప్పుతుంది.నా శరీరం మళ్లీ నేలకి బందీ కాకుండా ఉండాలంటే నేను నడుస్తునే ఉండాలి.మొత్తం దృష్టిని అంతా అలారం వైపే ఉంచి, మెల్లగా అడుగులో అడుగులేయ్యడం మొదలెట్టాను, తనని పరిశీలనగా చుడాలని మనసులో ఉన్నా.మనసు సరిగా లగ్నం చెయ్యకపోతే, నిద్ర ముంచుకువచ్చేస్తుంది.తనతో గడిపిన రోజులు, నా గతం గుర్తుతెచ్చుకుంటూ అడుగులెయ్యసాగాను.
*********************************************
నేను జైలు శిక్ష అనుభవించడం మొదలెట్టిన అయిదు సం.ల తర్వాత, మూడో ప్రపంచయుద్దం మొదలయ్యింది. ఒక మూడు నెలల్లోనే, దాదాపు వందకోట్లకు పైగా విగతజీవులయ్యారు. కానీ ఆ తర్వాతే మొదలయ్యింది, అసలయిన మారణకాండ. అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న ఒక దేశంలో తలపండిన అధ్యక్షుడికొచ్చిన ఒక వెర్రి ఆలోచన, ఈ భూ ప్రపంచపు ముఖ చిత్రాన్ని సమూలంగా నాశనం చేసింది.
అణ్వాయుధ పోరు మొదలయ్యింది. మరో మూడు నెలల్లో, 400 కోట్లను దాటిపోయింది మరణించిన వారి సంఖ్య. కొన్ని దేశాలకు దేశాలు స్మశానాలయ్యాయి.ఎన్నో పట్టణాలు నిర్మానుష్యమయ్యాయి.భూములు పాడయ్యాయి.అప్పటి దాకా ఉన్న ఆంక్షలను నిలబెట్టే వారే లేకపోయారు.మా జైలు కూడా సగం ధ్వంసమయ్యింది.దానిని నడిపే శక్తి లేక ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.
అణుధార్మికతతో మలినం అయిన భూమండలంపై స్వయం సత్తాక శక్తికలిగిన పెద్ద పెద్ద గాజు నగరాలు తయారయ్యాయి.అందులో ఇళ్లు అన్నీ అద్దం వంటి ఫలకాలతో, లోపలిభాగాలు కనపడకుండా, నిర్మింపబడి ఉంటాయి.అలాంటి నగరాలు 6 నెలల్లో ఎలా కట్టబడ్డాయో అంతు చిక్కకుండా ఉంది.అందులో ఆధిపత్యం కలిగిన పెద్దలు ఉంచబడ్డారు.వారితో పాటు శాస్త్రవేత్తలు కూడా.
అలాంటి నగరాల్లో, ఆఫ్రికా దేశంలో ఉన్న ఒక నగరం మా జైలుని అందులో ఉన్న ఖైదీలతో సహా కొనుక్కున్నది.ఆ నగరాలకు తరలింపబడ్డాక అర్ధం అయ్యిందోక్కటే.‘ఏ యుద్డంలోనైనా రాజులు మరణించే కాలం అంతరించింది. సైనికులు, సామాన్యుల గడువు తీరడం వల్లే యుద్దాలొస్తాయని’ . అవును మరి, అక్కడ మూడో ప్రపంచ యుద్దాన్ని ప్రారంభించిన రెండు దేశాల అధ్యక్షులు ఒకే భవనంలో ఉండడం గమనించాక అలాగే అనిపించింది .
మమ్మల్ని కొన్నాక, అయిదు భాగాలుగా విభజించారు, వయస్సు ప్రకారం.నన్ను శాస్త్రవేత్తల బృందానికి అప్పగించారు.ఆ రోజు నుంచి నా మీద మొదలయ్యాయి ప్రయోగాలు.ఆ ప్రయోగాల కోసమన్నట్టు మాకు చాలా మంచి ఆహారం, వసతి కల్పించే వారు.నా మీద ఏం ప్రయోగాలు జరుగుతున్నాయో అర్ధం అయ్యేది కాదు.
ఆ శాస్త్రవేత్తల బృందంలోని నా వయసు యువకుడొకడు మాత్రం ఖాళీ సమయంలో నాతొ గడుపుతూ ఉండేవాడు. తన వయసు వాళ్ళెవరు అక్కడ లేకపోవడంతో నన్ను రాత్రి సమయాలలో తన గదికి ఆహ్వానించేవాడు. తను మద్యం తాగుతుంటే నేను ప్రక్కన కూర్చునేవాడిని.తనకి చెప్పడానికి నా దగ్గర విషయాలేముండేవి కావు.అందుకే తనే మాట్లాడేవాడు. యుద్దానికి ముందు తను ప్రేమించిన అమ్మాయిని ఎలా దొంగతనంగా కలిసేవాడో చెప్పేవాడు. నా స్నేహితడని చెప్పగలిగిన మనిషి ఈప్రపంచంలో అతనొక్కడే.
యుద్ధం ముందు హటాత్తుగా ఆఫ్రికా పిలిపించారతన్ని, తను చేసిన ఒక పరిశోధన నచ్చి.కానీ, ఇప్పుడు తనొచ్చిన దేశమే మిగల్లేదు. నావాళ్ళనే వాళ్ళు చిన్నప్పటి నుండి లేకపోవడంతో నాకర్ధమయ్యేది కాదు తన బాధ. ఒక రోజు ఆ ఊరికి దూరంగా ఉండే ఉద్యానవనానికి తీసుకెళ్ళాడ .చాల పెద్ద అడవిలా ఉంది చుట్టూ అద్దాలతో.ఎవరికి అక్కడకు వచ్చేంత తీరిక ఉండదు.అక్కడ కూర్చున్నప్పుడు చెప్పాడు.నా మీద జరుగున్న పరీక్షలన్నీ అసలు ప్రయోగం ముందుగా జరిగేవని.నా శరీరంలో రేడియోధార్మికత ఎక్కువగా ఉండటం వలన ప్రయోగం వాయిదా పడుతున్నదని.
ఆ తర్వాత ఒక్కడినే కూడా చాలా సార్లు అక్కడికి వచ్చాను. ఒక సం.గడిచింది.మందులతో త్వరగా ప్రయోగానికి సిద్దం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలని అనిపించినప్పుడల్లా దొంగచాటుగా వార్తలు వినేవాడిని, రాత్రి కాపలాదారు గది వెనుక నుంచొని. మిగిలిన జనాభాల్లో మందులకు లొంగని వ్యాధులు ప్రబలడం, క్యాన్సర్లు పేట్రేగటం జరుగుతున్నాయి.
తినడానికి తిండిగింజలు పండించుకోలేక ఆకలి చావులు కూడా మొదలయ్యాయని.ఇప్పుడు ఈ గాజు నగరాల్లో తప్ప, ఇంకెక్కడా మానవ సంచారం లేదని చెప్పవచ్చు. భూమి కింద బంకర్లలో ఉన్న జనాభా అక్కడక్కడా మిగిలిన ప్రపంచం అయింది .
ఒకరోజు ఆ పార్కులో కూర్చుని ఆ యువ శాస్త్రవేత్త, "మన శరీరం లో మనది కానిది ప్రవేశించినప్పుడు దానిని నిర్మూలించే క్రమంలో మన శరీర కణాలే మన మీద దాడి చేస్తాయి.దాన్ని రోగనిరోధక శక్తి గా పిలుస్తాం.అది చేతులేత్తేసినప్పుడు, దానికి సహాయంగా బయటనుండి మందులు వాడతాం.కానీ, ఆ మందు మోతాదు మించితే ఏమవుతుందో తెలుసా?” నా వైపు తిరిగి అన్నాడు. నా మనసులో మాట చెప్పాను, "బహుశా ! ఈ ప్రపంచంలా అవుతుందేమో !" అని .
"ఆమె నా జీవితంలోకి వచ్చి ఇది అయిదవ సం.తను నన్ను విడిచి రెండు సం.లయింది.ఇంకా ప్రతి రాత్రి తనని కలలో కలుస్తుంటాను.తల్లీ తండ్రీ ఇప్పటివరకు గుర్తురాలేదు నాకు.ఎందుకో తెలుసా?" ప్రశ్నార్ధకంగా చూసాడు నా వైపు.తెలియదన్నట్టు తలూపాను నేను. "తను నన్ను పూర్తి చేసింది. నీలో సగాన్ని నువ్వు ఎప్పటికి మర్చిపోలేవు." అని కళ్ళు మూసుకున్నాడు .
అప్పుడతను బహుశా ఆమెను కళ్ళ ముందు ఊహించుకుంటూండవచ్చు. అతని ముఖంలో ప్రశాంతత .ఎలాంటి పరిస్థితుల్లో అయినా నున్నగా గడ్డం కత్తిరించుకుంటాడు.ఆమెకి ఇష్టం ఉండదని చెప్పి.నాకు తనని ఒక సారి చూడాలనిపించింది.కానీ అతని దగ్గర ఆమె ఫోటో కూడా మిగల్లేదు కనీసం.
ఇలా మరో 3 నెలలు గడిచాక. హఠాత్తుగా ఒక రాత్రి నగరం అంతా ప్రమద ఘంటికలు మ్రోగ సాగాయి. ఉలిక్కిపడి లేచిన నాకు, నా గది తలుపు తెరుచుకుంటూ వచ్చిన ఆ యువ శాస్త్రవేత్త కనిపించాడు.నా చేయి పుచ్చుకుని పరుగులందుకున్నాడు.నా అనుమానం పెదవి దాటాక ముందే వివరించడం మొదలుపెట్టాడు.
"ఈ గాజు నగరాలు, ప్రపంచ శాంతి చిహ్నాలుగా అనేక దేశాలు కలిసి నిర్మించుకున్నాయి.వీటి లక్ష్యం తిరిగి మనుష జాతిని బ్రతికిన్చుకోవడం.అందుకోసం ప్రతి నగరంలో అనేకమంది శాస్త్రజ్ఞులు పరిశోదనల్లో మునిగిపోయారు. కానీ ఇప్పటికీ మత మౌడ్యం కమ్మేసిన కొన్ని నగరాలు ఉన్న చోటు నుండే. తమవి కాని నగరాలన్నిటిని నాశనం చేయగల సంపత్తిని పరిశోధించాయి.మళ్ళీ యుద్ధం మొదలవబోతోంది.ఇప్పుడు మనం వారిపై ముందస్తు దాడి చేయబోతున్నాం.
కానీ నిన్నిప్పుడు తీసుకెళ్తుంది భుగ్రహంలో దాచడానికి కాదు.ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్ళడానికి. ఈ రోజు మనం గెలవచ్చు, కానీ రేపెమౌతుందో తెలియని సందిగ్దావస్థ నెలకొన్న తరుణంలో, అన్ని పరిశోదనలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలందాయి. అందుకే నువ్వు ప్రయోగానికి సిద్దం కాకముందే, రేపే నీ మీద ప్రయోగం చెయ్యాలని నిర్ణయించారు.
ఇప్పటి దాకా ఈ ప్రయోగం మనిషికి ఆకలిని హరించే మహత్తర శక్తిని ప్రసాదించడం కోసమనుకొని, నా వంతు సహాయం చేసాను. కానీ ఈ రోజు ఆ తలపండిన శాస్త్రజ్ఞుల మనసుల్లో నిండిన కల్మషం బయటపడింది. వృక్షాలు తమ ఆహారాన్ని అవే తయారు చేసుకోవడానికి హరితరేణువులపై ఆధార పడతాయి.ఆ హరిత రేణువులు ఏ జంతువులోను ఉండవు. ఇప్పుడు వాటిని మనిషి శరీరంలో ఏదో ఒక భాగంలో ప్రవేశపెట్టి అక్కడ నుంచి, మనిషే తనంత తానుగా శక్తిని సృష్టించుకునేలా చేసి ఆహారం కోసం శ్రమించే బాధ తప్పిస్తారనుకుంటే, దానితో పాటుగా వృక్షాలలో ఉండే మరికొన్ని జన్యుమార్పులను కూడా నీ శరీరంలో ప్రవేశపెట్టి అమరత్వం సాధించడానికి ప్రయత్నించదలచారు". మాట్లాడుతూనే ఒక కట్టడం వెనుక మూలకి తీసుకొచ్చాడు.
అక్కడ ఆపి ఉన్న ఒక పెద్ద వాహనంలోకి ఎక్కాము.నా భుజాలు పట్టుకుని, “ప్రతి జీవికి ఆయువు ప్రకృతి ప్రసాదించింది, ఆ సమతుల్యత దెబ్బతీయడం అనర్ధం కోరి తెచ్చుకోవడమే” అని స్టీరింగు వైపు తిరిగాడూ.నాకదంతా అయోమయంగా అనిపించింది.కానీ అతని మీద నమ్మకంతో సీటులో కూర్చున్నాను.సీటు బెల్టు పెట్టుకునే లోపు నేను కూర్చున్న వాహనం ఎగిరి బోర్లా పడింది, పెద్ద ప్రేలుడుతో.నా స్పృహ తప్పింది.తిరిగి స్పృహలోకి వచ్చేసరికి నా గదిలో బెడ్ మీద ఉన్నాను. ఏం జరిగిందో అర్ధం కాలేదు. బయటకు వచ్చేసరికి అందరూ ఏమి జరగనట్టు ప్రవర్తిస్తున్నారు.నా మనసెందుకో కీడు శంకించింది.
మరుసటి రోజు అక్కడి వాళ్ళు నాపై ప్రయోగం విజయవంతంగా జరిగినట్టుగా చెప్పారు. అప్పుడు నాకర్ధమయింది, నాకు స్పృహ తప్పిన సమయం లో ఏం జరిగి ఉండొచ్చనేది. అంతే కాదు, ఇక నా స్నేహితుడెప్పటికి కనపడడని. మరో రెండు రోజుల తర్వాత జరిగిందా సంఘటన.ఉదయం నేనొకరిని కలవాల్సి ఉంటుందని పిలిపించారు.నా కుడిచేయి ఆకుపచ్చగా మారిపోయింది గత రెండ్రోజుల్లో. ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమవ్వడానికి నాలో వచ్చిన మార్పు తరువాతి తరానికి చేరుతుందా ? లేదా ?తెలుసుకోవలసి వుంటుంది.
అందుకోసం ఒక తోడుని వెతుక్కోవాలని, సంవత్సరంలోగా పిల్లల్ని కనాలని చెప్పారు.అప్పుడు మొదటి సారిగా నా స్వేఛ్చ ఏ మేరకు కోల్పోయానో అర్ధం అయింది.నన్నొక గదిలోకి తీసుకెళ్ళి అక్కడున్న అడ్డం నుంచి అవతల గదిలో ఉన్న ఏడుగురు అమ్మయల్లో ఒకరిని ఎంచుకోమన్నారు.
వాళ్ళంతా శరీర సంస్కారం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నారు.వాళ్ళందరి మద్యలో కదలకుండా కూర్చుని అద్దంలో నుంచి నా వైపే చూస్తున్న అమ్మాయి నాలో ఆసక్తి రేకెత్తించింది.అ చూస్తున్న అమ్మాయిని ఒకసారి కలవాలి అన్నాను.ఈ అద్దంలో నుంచి నేను కనపడనని చెప్పారు.కానీ తన చూపలా లేదు.నిజంగా నన్నే చూస్తున్నట్లుంది.
ఆ సాయంత్రం శుభ్రంగా మార్చబడ్డాక నా గదిలోకొచ్చింది తను. తన కళ్ళు నన్ను చూస్తున్నాయంతే! ఆ కళ్ళలో ఏ స్పందనా లేదు.సరాసరి వచ్చి మంచంపై పడుకుంది వెల్లకిలా.ఆశ్చర్యపోవడం నా వంతయింది.ఆ తర్వాత పక్కకి తిరిగి ఆ పరుపుని తడిమింది తన కళ్ళ నుంచి నీళ్ళు కారసాగాయి.తనని కదిలించకుండా కిందపడుకున్నాను నేను.
మరుసటి మధ్యాహ్నం దాకా నిద్రపోయింది.ఉదయం నిద్రలో ఉండి అప్పుడప్పుడు వెక్కుతూ ఏడుస్తున్న తనని చూస్తే జాలి కలిగింది.వారానికొకసారి ఈ నగరాల నుండి జన సంచారం ఉండడానికి అవకాశం ఉన్న ప్రదేశాలకి, పెద్ద పెద్ద వాహనాలలో వెళ్లి వాళ్లనీ కనుక్కుని తెస్తుంటారు, రకరకాల ఉపయోగాలకోసం.అలా వచ్చిన వారిలో ఒక అమ్మాయి తను.అంతకుముందు ఎలాంటి పరిస్తితుల్లో ఉండి ఉంటుందో.నిద్రకి ఎంత మొహం వాచి ఉంటుందో ఊహించగలను.ఒకప్పుడు ఆ బాధ నేననుభవించిం దే కదా.
మధ్యాహ్నం మా ఇద్దరి భోజనం తనే తినేసింది.తన ప్రవర్తన ఎలా ఉందంటే, ఇంకో నిమిషంలో చనిపోవడానికైనా సిద్దం ఆకలి తీర్చుకోవడం కోసమన్నట్టు.
“నీ పేరెంటీ?” అన్నం తింటున్న తను సమాధానమివ్వలేదు.
"మీరా ..." అని పిలిచాను.తినడం ఆపేసి, నా వైపు చూసింది. "నీ గతం సంగతి నా కనవసరం నీ పేరు కూడా నువ్వు గుర్తు చేసుకోనవసరం లేదు.. ఈ రోజు నుంచి నువ్వు మీరా... సరేనా!" అన్నాను. నాకున్న స్వేచ్చనంతా మరొకరితో పంచుకుంటే కలిగే ఆనందం ఇప్పుడు తెలిసింది నాకు.బహుశా, నా స్నేహితుడు కూడా ఇలానే అనుకుని ఉంటాడు నన్ను కాపాడబోయినపుడు.
ఆ రోజు నుంచి తనని కంటికి రెప్పలా చూస్కున్నాను.ఈ ఆకాశం కనపడని నగరంలో అద్భుతాలన్నీ పరిచయం చేసాను.నా ఒక్కడికే అనుకొన్న ఉద్యానవనం మా ఇద్దరిదయింది.అనేక విన్నపాల అనంతరం మా కోసం ఒక ఒక చిన్న చెక్క ఇల్లు అక్కడ కట్టడానికి ఒప్పుకున్నారు మిగిలిన శాస్త్రవేత్తలు.అది వారి మనసులో పశ్చాత్తాపానికి నిదర్శనం అయి ఉండొచ్చు.
మరో రెండు నెలలు దొర్లిపోయాయి.తను గర్భవతయింది.అది తెలిసిన రోజు రాత్రి, నా స్నేహితుడు ఊహించిందే జరిగింది.ఒక అణుబాంబు మా నగరం పై పడింది.మా ఇంటిలో నుండి కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతిని చూసాను.ఆ తర్వాత కొన్ని సెకన్లలో మమ్మల్ని చేరిన వేడి గాలులకు ఇద్దరం స్పృహ తప్పాం.లేచేసరికి మీరా నేలపై పడి ఉంది.తన కటి నుంచి క్రింద భాగమంతా రక్తంతో తడిసి ఉంది.తన గర్భం పోయిందని నాకర్ధమయింది.తనకు ప్రధమ చికిత్స చేసాక, రెండు రోజులకి తేరుకుంది.
మా కోసం ఎవరూ రాకపోవడంతోనే అర్ధం అయింది.ఆ నగరంలో మిగిలింది మేమే అని.నగరం అంతా బూడిదైపోయింది.దూరం నుంచి చూసిన నాకు మేమక్కడ బందీలైపోయామని అర్ధమైపోయింది.ప్రక్కనగరం మరో 3500కి. మీ ల దూరంలో ఉందని నా స్నేహితుడొక సారి అన్నాడు అక్కడికి ఈ వాతావరణంలో వెళ్ళడం జరగని పని. మా ఇంటి కింద ఉంచిన ఆహారం మరో రెండేళ్లకు సరిపోతుంది. సహాయం కోసం వేచి చూద్దామని నిర్ణయించుకున్నాము. అయినా, నాకు ఆకలి అవడం మానేసి చాలా కాలం అయింది.నా కుడిచేయి నా శరీరానికి కావలిసినన పోషకాలని సూర్యరశ్మి నుండి తయారు చేసుకోగలదని నాకు తెలుసు.
ఎక్కువగా రక్తం పోవడంతో, తను కోలుకోవడానికి చాలా రోజులు పడుతున్నది. ఈ లోగా నా కుడి చేతిపై ప్రతిరోజూ చెక్కులు కట్టడం మొదలుపెట్టింది.వాటిని తనే శుభ్రం చేసేది. బిడ్డ పుట్టడని తెలిసాక చాలా బాధ పడింది కానీ నన్నే తన బిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టింది. నా రుణం తీర్చుకోవడానికి ఎం చేసినా చాలదనేది.ఈ చెక్కులు కట్టడం మెల్లగా ముదిరి, చెట్టు బెరడులా తయారవ్వసాగింది.శరీరం నుండి విడదీయడం కష్టమవసాగింది.
సగం చేయి విరిగిపోయింది ఒక సారి గట్టిగా ప్రయత్నిస్తుంటే.తను ఎంతో భయపడింది.అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా చేసేది నా పని.ఆ చేయి మాత్రం తిరిగి మూడ్రోజుల్లో యధాస్తితికి వచ్చింది.ఇలా మారిన చేయి కట్టెలా బరువెక్కసాగింది.నా చేయి చెట్టులా మారిపొతున్నదని అర్ధం అవ్వడానికి ఎక్కువ కాలం పట్టలేదు.కానీ ఆ మార్పు అక్కడకు ఆగిపోలేదు.నెమ్మదిగా పైకి ప్రాకడం మొదలుపెట్టింది.
తను కూడా బరువు తగ్గడం మొదలు పెట్టింది.నాకు వైద్యశాస్త్రంలో నైపుణ్యం లేదు.తనకేమై ఉంటుందన్నది తెలియడం లేదు.అప్పుడప్పుడు దగ్గేది.అందులో రక్తం పడేది.రాత్రిళ్లు ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బంది పడేది.
"ఈ చెట్లు ఎలా బ్రతికున్నాయి?" ఇంటిఎదురుగా ఎప్పుడూ కూర్చునే బల్ల మీద నాతో ముచ్చటిస్తూ అడిగింది .
"ఇవి అణుధార్మికతను తట్టుకునేలా పెంచబడ్డాయి.మనం నగరానికి కొంచెం దూరంలో ఉండటం వల్ల మంచే ...." అని ఆగిపొయాను.‘ఏం మంచి జరిగింది?’ నా చేయి చూసుకుని, తనని చూసాను.
తను మాత్రం ప్రశాంతంగా పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, " మనం ఎందుకు బ్రతకలేక పోతున్నాం?" అన్నది. నా దగ్గర సమాధానం లేదు.కన్నీరు తప్ప. అది చూసి నా దగ్గరికి చేరి కళ్ళు తుడిచింది.నా గురించి ఎప్పుడూ బాధ పడకండి నాకొక జీవితం ఇచ్చారు.అది ఎప్పటికి మీదే.ఇంకేం చేయనవసరం లేదు నాకోసం." అన్నది.
తిరిగి వెళ్లబోయేటప్పుడు నా చేయి ఆ బల్లకి అంటుకుపోయింది.నా శరీరం నుండి స్థిరత్వం కోసం వేర్లలా పెరుగుతున్నాయి, కొంతసమయానికి. తను నవ్వి చేత్తో వాటిని పీకేసి, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళింది ఇంటికి.
ఇంకొంత కాలం లోనే నాశరీరం అంతా పచ్చగా మారిపోయి, అక్కడక్కడా బెరడులా మారటం మొదలెట్టింది. నా పనులు చేసుకోవడం కష్టంగా మారింది. ప్రతిరోజూ నాకు పళ్ళు తోమడం దగ్గర నుంచి అన్నీ తనే చేసేది. ఒక రోజు బాధతో నిద్రలేచింది తను. తన నడుముపై అలవాటుగా నిద్రించేటప్పుడు వేసిన చేయి గడచిన మూడు గంటల్లో తన శరీరంలోకి చొచ్చుకుని వెళ్ళింది, కొంతమేర. పెద్ద గాయం కాకముందే లేవగలిగింది. ఆ రోజే తనతో కలస్ నిద్రించిన చివరి రోజు.అప్పుడనిపించింది, ఇదే చివరి రోజని ముందే తెలిస్తే, హత్తుకుని నిద్రించే వాడిని కదా అని.
నా కదలికలు ఇంకా సన్నగిల్లాయి.శరీరం అంతా బెరడులా, వేర్లలా రాసాగింది.కదలకుండా ఉండగలిగిన సమయం కొంచెం కొంచెంగా తగ్గిపోతున్నది.తను రాత్రిపూట మధ్యలో నిద్రలేచి, నన్ను కదిలించి, పెరిగిన వేర్లని కత్తిరించటం పనిగా పెట్టుకుంది. మొదట్లో చేతులతో తుంచేస్తే తెగిపోయే,వేర్లు మెల్లగా గట్టిపడనారంభించాయి.
తన ఆరోగ్యం నిద్రలేమితో ఇంకా ఇంకా త్వరగా క్షీణిస్తోంది.తను మధ్యలో నిద్రలేవకుండా ఉండడానికని గదిలో రాత్రంతా తిరుగుతుండే వాడిని.కానీ తన చుట్టూ తిరుగుతుంటే తనకి నిద్రపట్టేది కాదు. ఉదయం పూట నా శరీరం నుంచి ప్రాణవాయువు విడుదలయితే, రాత్రి ప్రాణాలు హరించే కార్బన్దైఆక్సైడ్ విడుదలయ్యేది. అందుకే కిటికీ దగ్గర ఉండే వాడిని. ఆ ఇంటిలో అన్నీ చెక్క వస్తువు లైపోవడం ఇబ్బందిగా మారింది . .
ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి.చివరికి ఇప్పుడు ప్రతి గంటకు ఒకసారి అలారం పెడుతుంది.మంచానికి ఆవల వైపు.నేను మంచం ఈ వైపు నుంచి అటు వెళ్ళడానికి గంట పడుతుంది.నేనక్కడికి వెళ్లి అలారం అలారం ఆపితే ఇంకొక్క గంట పడుకుంటుంది తను.
***************************************
ఎట్టకేలకు ఈ రోజు గడియారాన్ని చేరుకున్నాను, ఐదు నిమిషాలుండగానే. అలారం ఆపేశాను.తన వైపు తిరిగి చూశాను.అస్తవ్యస్తంగా మంచంపై వాలి ఉంది.సరి చేయాలని ఉన్నా చెయ్యలేను.అడుగు నడవడానికి 5-10 నిమిషాలవుతుంది.ఎటువైపు వంగలేను.కానీ నిన్నటి నుండి తనకు కనపడకుండా మూసి ఉంచిన, కుడిచేతిని మరొక్కసారి చూశాను.ఆ చేతిలో తన కానుక ఉంది.
" హా .... ప్ ..."
" హా ... ఫై .. బార్ ..."
" హ ........" మళ్ళీ తనని అభినందించే మాటలను మననం చెయ్యసాగాను. అలా చేస్తూనే నిద్రలోకి జారిపోయాను.పెద్దగా అలారం మొగేసరికి మెలకువ వచ్చింది.సమయం వచ్చేసింది.గడియారం వైపు తిరిగి ఉన్న తలని బలవంతంగా తన వైపు తిప్పాను. కాళ్ళు కదిలిద్దామనుకునే సరికి, అప్పటికే ఒక కాలు నేలకి అతుక్కుపోయింది. తను లేచి బయటకు లాగాలి నన్ను, అలారం మోగడం పూర్తయింది.అయినా తను లేవలేదు.
పడుకున్న విధానం మారలేదు.భయం ప్రవేశించింది నా గుండెలోకి.బలమంతా ఉపయోగించి లాగాను నా కాలుని, సగం పాదం కిందే ఉండిపోయి మిగతా శరీరం ఊడి వచ్చేసింది.మెల్లగా నడిచి 15 ని ల్లో తనని చేరుకున్నాను. చూపు మిగిలిన ఒక్క కంటికీ కన్నీరు అడ్డం పడుతుండగా దగ్గరగా వెళ్ళాను.తన పక్కన మంచంపై పడిపోయాను, వెల్లకిలా.
మూసి ఉన్న చేతిని బలవంతంగా తెరిచాను.రెండు మూడు వేళ్ళు విరిగినా ఆ చేయి తెరుచుకుంది.నా అరచేతిలో పూసిన పువ్వుని తన తలదగ్గర ఉంచాను.మెల్లగా తన వైపు తిరిగి తనని తనని గట్టిగా హత్తుకున్నాను.ఆశ్చర్యకరంగా, తన స్పర్శ నా మొద్దు శరీరం లోంచి తెలుస్తుంది. కాసేపటికి అర్ధం అయింది, అది నా జ్ఞాపకం అని.తనని కౌగిలించుకున్న విషయం కూడా అర్ధం కావటం లేదు.అయినా సరే, గట్టిగా నా హృదయానికి హత్తుకున్నాను.
" హా ...పి ...... బర్ .. డ్ " ఇకపై మాట రాలేదు. నా చివరి కానుకని తను అందుకోలేకపోయింది.అలా ఎంత సేపున్నానో తెలియదు.మళ్ళీ అలారం మోగింది.నాకు నవ్వాలనిపించింది గడియారాన్ని చూసి, 'ఇకపై నాకు నీ అవసరం లేదని, కాని చిత్రంగా కన్నీరే వచ్చింది.
"నిద్రపో మీరా .. " మనసులో అనుకున్నాను, తనని వదలకుండా. నేనూ కళ్ళు మూసుకున్నాను.తను నాలో మెల్లిగా కలిసిపోతుందని నాకు తెలుసు.ఇంకొన్ని రోజులకి తను ఉండదు.కానీ నేను మాత్రం ఎన్నటికి ఇలా ఉండిపోతానని తెలుసు. అయినా అదంతా ఆలోచించే అవసరం లేదు కదా!
***
No comments:
Post a Comment