ఓ జ్యోతి కథ - అచ్చంగా తెలుగు
ఓ జ్యోతి కథ
పెయ్యేటి శ్రీదేవి

           
అది వందన అపార్ట్ మెంట్.  ఆ అపార్ట్ మెంట్లో నాలుగో అంతస్థులో, 403 నంబరు గల 2 బెడ్ రూమ్ ఫ్లేట్ లో జ్యోతి ఒక్కర్తే వుంటోంది.  ఆమె ఇంటర్ సెకండియర్ చదువుతోంది.  ఐదు అంతస్తులు వున్న ఆ అపార్ట్ మెంట్లో అందరికి ఎవరికే సాయం కావలన్నా చిటికెలో చేస్తూ, ఎవరికే సమస్య వచ్చినా చిటికెలో పరిష్కరిస్తూ, ఇలా మాట సయం, పని సాయం చేస్తూ అందరికీ తలలో నాలికలా వుంటూనే, తన చదువు తను చదువుకుంటుంది.
          జ్యోతి అందరితో కలివిడిగా వుంటుంది.  అందరికీ జ్యోతి అంటే చాలా ప్రేమ.  జ్యోతికి అందరూ తలో రోజు వంట చేసి కేరేజి పంపుతారు వద్దన్నా వినకుండా.  ' నువ్వొక్కదానివి ఏం వండుకుంటావమ్మా?  మాకెవరికీ నువ్వు బరువు కాదు.  నువ్వు మా ఇంటి జ్యోతివి.' అంటూ ఆమెని ఎంతో ప్రేమగా చూస్తారు.
          ఆదివారాలు మాత్రం జ్యోతి వృధ్ధాశ్రమాలకి వెళ్ళి, అక్కడ అందరికి పళ్ళు ఇస్తుంది.  అందర్నీ ఆత్మీయంగా పలకరిస్తుంది.  వాళ్ళచేత కథలు చెప్పించుకుంటుంది.   వాళ్ళు చెప్పే పాతకాలం కథలు, పాతకాలం విషయాలు, పాతకాలం వంటలు అడిగి తెలుసుకుని వాయిస్ రికార్డులో రికార్డు చేస్తుంది.  వాళ్ళు నిరాశ చెందకుండా కబుర్లు చెబుతూ ఉత్సాహపరుస్తుంది.  వాళ్ళు కూడా జ్యోతి రాగానే వాళ్ళకళ్ళలో ఆనందం తొణికిసలాడుతుంది.  ఓపిక వున్నంత వరకు ఏదో పని చెయ్యాలంటుంది.  'మెదడుని, శరీరాన్ని ఖాళీగా వుంచితే, మెదడులో పిచ్చి ఆలోచనలు వచ్చి, నిరాశ, నిస్పృహ ఏర్పడతాయి.  శరీరానికి శ్రమ లేకపోతే సోమరితనం అలవాటు అవుతుంది'  అంటూ ఏదో పని చేయిస్తుంది.  
          అందుకే కొంత లోను తీసుకుని, ' అమ్మమ్మ హోటల్ ' అని పెట్టించింది.  అమ్మమ్మ హోటల్ లో పాతకాలం వంటలు, పిండివంటలు, పచ్చళ్ళు, పులిహోర, అరిశలు, బూరెలు, ఇడ్లి, దోశ, అన్నీ వుంటాయి.  పిండివంటలు ఆర్డర్లమీద చేస్తారు.  అన్నీ రుచిగాను, శుచిగాను వుంటాయి.  హోటల్ మెల్లమెల్లగా పుంజుకుంటోంది.
          ఆప్యాయతకి మారుపేరు అమ్మమ్మ హోటల్.  ఆ బోర్డు అందర్నీ ఆకర్షిస్తుంది.  విపరీతంగా జనం వస్తున్నారు.
          నిజంగానే వచ్చినవాళ్ళకి ఆప్యాయంగా భోజనం, టిఫిన్లు పెడతారు.  అక్కడుండే వాళ్ళు వయసు మళ్ళినవాళ్ళే కాబట్టి, కన్నబిడ్డలకి పెట్టినట్టు పెడతారు.  కొడుకులు, కోడళ్ళు తరిమేసి, అనాథాశ్రమంలో చేర్చిన వృధ్ధమహిళామణులు వాళ్ళందరూ.  మరీ లేవలేని వాళ్ళు కాదు.  ఒకరికొకరు సాయంగా, ఒకరికి ఒంట్లో బాగుండకపోతే మరొకరు, ఇలా చేస్తారు.  ఒకరోజు ఒకళ్ళు రెస్టు తీసుకుంటే, మర్నాడు మరొకరు, ఇలా చేస్తారు.  ఒక్క ఆదివారం ఆ హోటల్ కి శలవు.  ఆ రోజు జ్యోతి వచ్చి అందరికీ మెడికల్ చెకప్ చేయిస్తుంది.  అందరిచేత వాళ్ళకి వచ్చిన ఆటలు ఆడిస్తుంది.  కేరమ్సు, చింతగింజలు, వైకుంఠపాళి, ఇలా కూచుని ఆడే ఆటలు.  వాళ్ళు కూడా వాళ్ళు పడిన కష్టాలు, బాధలు అన్నీ మర్చిపోయి, జ్యోతి చెప్పిన ఆటలు ఆడతారు.
          జ్యోతి అక్కడ అందర్నీ అమ్మా అనో, అమ్మమ్మా అనో, తనకి నచ్చిన విధంగా పిలుస్తూవుంటుంది.  ఇంక ఆ ఆదివారం వాళ్లతో కాలక్షేపం చేసి, సాయంత్రం ఇంటికి వెళ్ళబోతుండగా,
          కారులోంచి ఒకామెని ఆమె కొడుకు, కోడలు వృధ్ధాశ్రమంలో చేర్చడానికి తీసుకొచ్చారు.  ఆవిడ మరీ అంత ముసలామె కాకపోయినా, సరైన తింది లేక చాలా బలహీనంగా వుందనిపించింది.  కాని ఆ తల్లిని లోపలికంటా తీసుకొచ్చి, ఆశ్రమం యాజమాన్యంతో మాట్లాడకుండా, ఆమెని అక్కడే దింపేసి, బట్టలపెట్టె, అదీ అక్కడ పెట్టేసి వెళిపోయారు.  కాని ఆశ్రమంలో ఎక్కడా ఖాళీ లేదు.
          జ్యోతి వివరాలు అడిగింది.
          కొడుకు, కోడలు, ఒక మనవడు, మనవరాలు అమెరికాలో వుంటారు.  తల్లి ఒక్కత్తే స్వంత ఇంట్లో వుంటుంది.  అమెరికాలో వాళ్ళకి మనిషి అవసరం వచ్చింది.  తల్లిని తీసికెళ్ళి అడ్డమైన చాకిరీలు చేయించుకున్నారు.  పనిమనిషికి పెట్టినట్టు ఇంత తిండి పెట్టేవారు.  పళ్ళు, అవి వాళ్ళే తినేవాళ్ళు.  ఒంట్లో బాగుండకపోయినా, ఆ దేశంలో వైద్యం చాలా కష్టం.  డాక్టర్లు ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు మందులివ్వరు.
          ఇంక చెయ్యలేని పరిస్థితుల్లో, ఆ తల్లిని వదిలించుకోడానికి ఇండియా వచ్చి, తల్లి చేత సంతకాలు పెట్టించి, ఆ యిల్లు అమ్మేసారు.  అందుకే, ఆవిడ అవసరం ఇంక లేదులే అనుకుని, అనవసరంగా తిండి దండగ, వైద్యానికి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుందని అమెరికా వెళిపోతూ వృధ్ధాశ్రమం దగ్గిర వదిలేసి వెళిపోయారు.
          జ్యోతి ఇంటికి వెళిపోతూ, ' నాతో రా, అమ్మమ్మా.  నిన్ను నేను పెంచుకుంటాను.  జాగ్రత్తగా చూసుకుంటాను.' అంటూ పార్వతమ్మని తన ఇంటికి తీసుకు వచ్చింది.
          జ్యోతిని చూడగానే ఆ అపార్ట్ మెంట్లో అందరికీ ఆనందం కలిగింది.  కూడా వస్తున్న ఆ పెద్దావిడని చూసి, ' ఆమె ఎవరు?' అని అడిగారు అందరూ.
          జ్యోతి ఏం సమాధానం చెప్పకుండా ఆవిడని ఇంట్లోకి తీసికెళ్ళింది.  మంచినీళ్ళిచ్చి, ఫ్రిజ్ లోంచి పళ్ళు కోసి పెట్టింది.  స్నానం చేయమంది.  మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకోమంది.
          ' ఎవరు బంగారుతల్లీ నువ్వు?  నన్నింత ప్రేమగా తీసుకొచ్చి సపర్యలు చేస్తున్నావు?' అడిగింది పార్వతమ్మ.
          ముందర నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మమ్మా.  నేనెవరో తరవాత చెబుతాను.  చాలా బలహీనంగా వున్నావు.  ముందర ముందర నా గురించి నీకే తెలుస్తుందిలే.' అంటూ జ్యోతి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి, పళ్ళు నైవేద్యం పెట్టింది.  కాలేజికి వెళ్ళడానికి తయారైంది.  ఐదో అంతస్థులో, 504 నంబరు ఫ్లేటులో వుండే సుందరంగారి అమ్మాయి లత వచ్చింది.  ఇద్దరూ కలిసి ఆటోలో కాలేజికి వెడతారు.  లత కేరేజి తెచ్చింది.  మంచం మీద పడుకున్న పెద్దావిడ్ని చూసి ' ఎవరే ఆవిడ?' అని అడిగింది.
          ' నేను పెంచుకుంటున్నానే ఆవిడని.  అమ్మమ్మగా దత్తత తీసుకున్నాను.'
          లత ఇంకేం అడగలేకపోయింది.  ఎంత స్నేహితురాలైనా జ్యోతిని వివరాలు ఆడగటానికి భయమేసింది.  లతకే కాదు, జ్యోతి అంటే అక్కడ అందరికి ఎంత ప్రేమాభిమానాలున్నా, జ్యోతి వివరాలు అడగటానికి భయమే.  
          ' లతా!  ఇంకెవరూ నాకు కేరేజిలు పంపవద్దే.  ఇంట్లో నేనే వంట చేస్తాను.  లేకపోతే మా అమ్మమ్మ చేస్తుంది కొంచెం కోలుకున్నాక.'
          ' అదేమిటే జ్యోతీ!  ఈ అపార్ట్ మెంట్లో ఎవ్వరం నిన్ను పరాయిదాన్నిగా చూడటల్లేదు.  నువ్విలా మాట్లాడుతున్నావేమిటి?'
          ' నే చెప్పింది విను.  అంతే.  కేరేజి పంపవద్దు.'
          లతేం మాట్లాడ లేదు.
          ' అమ్మమ్మా!  మజ్జిగ అన్నం కలిపాను.  ముందర ఇది తిను.  నీరసం తగ్గుతుంది.  నువ్వు కోలుకున్నాక నీకు కావలసిన విధంగా తినవచ్చు.  నీకు ఒంట్లో బాగుండకపోతే చెప్పు.  ఈ అపార్ట్ మెంట్లోనే ఈశ్వర్ అని ఓ డాక్టరంకుల్ వున్నాడు.  చెకప్ చేసి మందులు రాసిస్తాడు.  నేను కాలేజికి వెడుతున్నా.  సాయంత్రం వస్తా.  రామాయణం, భారతం, భగవద్గీత పుస్తకాలు పక్క టీపాయ్ మీద వున్నాయి.  చదువుకో.  ఎవరన్నా వస్తే ఏం చెప్పకు.  నే సాయంత్రం వస్తా.' అంటూ లతతో లిఫ్టులో కిందకి దిగి కాలేజికి వెళిపోయింది.  సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ ఎవరితోనో బాతాఖానీ వేస్తోంది.
          ' అమ్మమ్మా!  పనిలేకుండా ఊరికే కూచుని, చుట్టుపక్కల వాళ్ళందరితో వేసే బాతాఖానీలు నాకు నచ్చవు.  ఒంట్లో బాగుంటే ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని పని చెయ్యి.  బాగుండకపోతే దేవుడి ధ్యానం చెయ్యి.' అంది.
          కాఫీ కలిపి ఇచ్చి తనూ తాగింది.  కాసేపయాక టెన్త్ వాళ్ళకి, నైన్త్ వాళ్ళకి, ఎయిత్ వాళ్ళకి ట్యూషన్లు చెప్పింది.  కాలేజి నించి వచ్చాక రోజూ పిల్లలకి ట్యూషన్లు చెబుతుంది.  ట్యూషన్లయ్యాక అడిగింది, ' అమ్మమ్మా!  రాత్రి నువ్వేం తింటావు?  అన్నమా, చపాతీలా?'
          అమ్మమ్మ ఏదో చెప్పబోయేంతలో, ' అమ్మమ్మా!  నిన్ను కించ పరచాలనే ఉద్దేశ్యంతో నేననలేదు బాతాఖానీ వేస్తున్నావని.  వాళ్ళు నిన్ను ఏవో ఆరాలడుగుతున్నారని తెలిసే వాళ్ళననలేక నీకు చెప్పాను.  ఏమనుకోకు అమ్మమ్మా!  నువ్వు నా మనిషివని చెప్పాను.'
          అమ్మమ్మ ఆశ్చర్యపోయింది  తన మనసులో విషయం చెప్పకుండానే పసిగట్టి, దానికి సమాధానం చెప్పిన విధానానికి.
          ' లేదమ్మా బంగారూ!  నువ్వు తప్ప నాకెవరున్నారు?  సరే, నాక్కొంచెం ఓపిక వచ్చింది.  నేనే చేస్తాలే అమ్మా చపాతీలు.' అంటూ ఐదునిమిషాల్లో కూర, చపాతీలు రెడీ చేసింది.
          ' అమ్మమ్మా!  చాలా బాగా చేసావు.' అంది.
          రోజూ వంట, రాత్రి చపాతీలు అమ్మమ్మే చేస్తోంది.
          అపార్ట్ మెంట్లో 201 ఫ్లేట్ లో గంగాధర్ లాయరు కూతురు శ్రావణికి పెళ్ళి నిశ్చయమైంది.  నిశ్చితార్థానికి అందర్నీ పిలిచారు.  అపార్ట్ మెంటు సెల్లార్ లో పెద్దఫంక్షను హాలుంది.  అక్కడ డిన్నర్ ఏర్పాటు చేసారు.
          అమ్మమ్మ హోటల్ నించి డిన్నర్ ఆర్డర్ చేసారు.  పులిహోర, మైసూర్ పాక్, గోంగూరపచ్చడి, బొబ్బట్లు, క్యాబేజి పులిహోర కూర, గుత్తివంకాయ కూర, అరటికాయ బజ్జీలు అన్నీ బాగున్నాయని అందరూ చాలా మెచ్చుకున్నారు.
          ఉన్నట్లుండి శాంతమ్మని అడిగిందొకావిడ.  ' శాంతమ్మా!  నువ్వు అమెరికా కొడుకు, కోడలు దగ్గిరకెళిపోయావు కదా?  ఎప్పుడొచ్చావు?  అమెరికా ఎలా వుంది?  మళ్ళీ ఎప్పుడెళతావు?  ఇక్కడే వుంటావా?  ఇల్లు అమ్మేసారట కదా?  మేం బొంబాయిలో వుంటున్నాం.  పెళ్ళికొడుకు మా అక్క తోటికోడలు కొడుకు.  నువ్వు ఎవరి తరఫు?  ఆడపెళ్ళివారి తరఫా, మగపెళ్ళివారి తరఫా?' గడగడా ప్రశ్నల వర్షం కురిపించేసింది.
          మీనాక్షమ్మ, శాంతమ్మ పక్క పక్క ఇళ్ళలో వుండేవాళ్ళు.  తరవాత కొడుకు పెళ్ళయాక మీనాక్షమ్మ బొంబాయి వెళిపోయింది.  ఇదుగో పెళ్ళికొడుకు అమెరికాలో వుంటాడు, అంటూ చెబుతుంటే, జ్యోతి చూసి గుర్తుపట్టింది అతన్ని.  వెంటనే గంగాధర్ గారి దగ్గరకెళ్ళి అతనెవరో చెప్పింది.  అది విని కోపంతో ఊగిపోతూ వెంటనే తాంబూలాలు ఆపుచేయించారు.
          ' ఏమిటి, ఏమయింది బావగారూ?' అన్నాడు అబ్బాయి తండ్రి.
          'అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లు, పదిరోజుల్లో పెళ్ళి జరిగిపోవాలని చెప్పి, పది లక్షలు కట్నం తీసుకుని పారిపోదామనుకున్నారా?  వృధ్ధాశ్రమంలో వాచ్ మెన్ గా చేస్తూ, అబధ్ధాలాడి నా కూతురి మెళ్ళో తాళి కడదామని చూస్తారా?  వెంటనే వెళిపోండి ముందర.' అంటూ వాళ్ళమీద ఆరిచాడు.
          పెళ్ళికూతురు స్వప్న, తల్లి సుందరి ఏడవడం మొదలుపెట్టారు.  జ్యోతి ఓదార్చింది.  ' ఊరుకో స్వప్నా!  పెళ్ళి దాకా రాలేదు, సంతోషించండి.  మీకు ఇంకో మంచి సంబంధం దొరుకుతుంది.  నాకు తెలిసింది కాబట్టి చెప్పాను.  మీరు అమెరికా సంబంధం అన్నారు కదా, ఇదేమిటి?  వీళ్ళతో సంబంధమేమిటి అనుకున్నాను.  ఈ తండ్రీ కొడుకులు వృధ్ధాశ్రమం దగ్గర వాచ్ మెన్ లుగా చేసేవారు.  వాళ్ళు సరిగా చెయ్యటల్లేదని తీసేసి ఇంకొకళ్ళని మాట్లాడుకున్నారు.  ఈ విషయాలన్నీ నాకు తెలిసుండీ మౌనంగా ఊరుకోలేక గంగాధర్ అంకుల్ కి చెప్పేసాను.'
          ' అమ్మా జ్యోతీ!  నువ్వు మా యింటి జ్యోతివమ్మా.  నా కన్నకూతురు జీవితాన్ని రక్షించావు.  నువ్వు రానంటే, ఆశ్రమంలో ఎవరికో ఒంట్లో బాగుండలేదని వెళతానంటే, నిన్ను బలవంతపెట్టి ఫంక్షనుకి రమ్మన్నాము.  నువ్వు రాకపోతే కనక ఆ మోసగాడితో నా కూతురుకి పెళ్ళి అయిపోయి వుండేది.  ఏ తల్లి కన్నబిడ్డవో, ఈ అపార్ట్ మెంట్ లో మేం వున్నప్పట్నించి, అందరికీ ఎంతో ఆత్మీయంగా సాయంగా వుంటున్నావు.' అంటూ ఎంతో కొనియాడారు.
          మర్నాడు ఆదివారం అమ్మమ్మ బోర్నవిటా కలిపి ఇచ్చింది.
          ' ఎందుకమ్మమ్మా?  నేను కలిపేదాన్నిగా?'
          ' వంట ఏం చెయ్యమంటావు బంగారూ?'  జ్యోతిని బంగారూ అని పిలుస్తుంది శాంతమ్మ.
          ' ఇవాళ నాకేం వద్దు.  నువ్వే ఏదో చేసుకు తిను.  ఈరోజు వృధ్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవాలి.  నేను వెళ్ళడం కొంచెం ఆలశ్యమైతే వాళ్ళు బాధపడతారు నాకేమైందోనని.  ఏం తినకుండా నాకోసం ఎదురు చూస్తూవుంటారు.  అదిగో, ఆటో వచ్చింది, వస్తా అమ్మమ్మా.' అంటూ అపార్ట్ మెంట్లో కనబడిన వాళ్ళందర్నీ పలకరిస్తూ ఆటో ఎక్కింది జ్యోతి.  కాని ఎప్పుడూ ఎక్కే ఆటో కాక, అతనికి ఒంట్లో బాగాలేదని, నన్ను పంపాడని మరొకతను చెబుతే, అతడి ఆటో ఎక్కింది.
          ఆ ఆటో ఎటో వెళ్ళిపోతోంది.  
          రాత్రి కరక్టుగా ఏడుగంటలకల్లా వందనా అపార్ట్ మెంట్స్ కి చేరుకునే జ్యోతి ఇంకా రాలేదు.  ఎక్కడికెళ్ళినా వెళ్ళేటప్పుడు, వచ్చాక అందరికీ కనిపించి, పలకరించే జ్యోతి ఏడుగంటలు దాటినా రాకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు.  ఒకవేళ ఆశ్రమంలోనే వుండిపోయిందేమో అని ఆశ్రమానికి వెళ్ళి కనుక్కున్నారు.  అక్కడ పొద్దుట్నించీ ఆమె కోసమే ఎదురు చూస్తున్నామని, కాని ఆమె ఇవాళ అసలు ఇక్కడికి రాలేదని చెప్పారు.  తరవాత పోలీసు రిపోర్టు ఇచ్చారు.
          నాలుగురోజుల తర్వాత జ్యోతి శవం ఒక పొదల్లో కనిపించింది.  తిరిగిరాని లోకాలకి వెళిపోయిన జ్యోతి గురించి అందరూ కన్నీరు, మున్నీరై ఏడిచారు.  అమ్మమ్మ, ' బంగారూ!  బంగారూ!' అంటూ ఏడ్చింది.
          సుందరి ఏడ్చింది, ' అమ్మా జ్యోతీ!  నా కూతురు జీవితాన్ని రక్షించినదానివి, నువ్వు బలైపోయావా తల్లీ?
          వృధ్ధాశ్రమంలో ఎవరికీ చెప్పలేదు  అందరూ జ్యోతి గురించి ఎదురు చూస్తూనేవున్నారు.
          ఒకాయన వచ్చి, ' అమ్మా జ్యోతీ!  నువు కూడా అమ్మ, నాన్నల దగ్గిరకి వెళిపోయావా తల్లీ?  మీ అమ్మా, నాన్నా కేదార్ నాథ్ యాత్రలో చనిపోయారు.  అప్పుడు నీ టెన్త్ పరీక్షలవుతున్న మూలాన నీకు చెప్పలేదు.  నీకు ఏం చెప్పకుండా నీకు ధైర్యం నూరిపోస్తూ వస్తున్నాను.  కష్టాలొస్తే ఎలా బతకాలో నీకు అనుక్షణం నూరిపోస్తూ వస్తున్నాను.  నీ గురించి అందరూ ఎంతో బాగా చెబుతుంటే పొంగిపోయాను.  అందరి జీవితాల్లో జ్యోతులు వెలిగించి, నువ్వెళ్ళిపోయావా తల్లీ?' అంటూ ఏడవసాగాడు.
          అందరి జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపిన జ్యోతి ఆరిపోయింది!

No comments:

Post a Comment

Pages