(జ)వరాలి కధలు - 6
" పెళ్ళి " గోల
రచన : గొర్తివేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
ఆదిమజాతి స్థాయినుంచి ఆచార సంప్రదాయ స్థాయి వరకూ పరిణతి చెందిన క్రమంలో మానవసమాజం క్రమశిక్షణాయుతమైన పద్ధతులను రూపొందించుకొంది. పశుపక్ష్యాదులను గమనించండి. లేవగానే ఆకలి తీర్చుకోవటానికి అన్వేషణ చేస్తాయి. ఆకలి తీరగానే విశ్రాంతి, తిరిగి లేవగానే తిండి కోసం తాపత్రయం. వాటిలో తగిన వయసు వరకే తల్లి బిడ్డలను సాకుతుంది. తర్వాత ఎవరి బ్రతుకు వారిదే! జంటకట్టే సమయంలో అవి వావి వరుసలను చూడవు. ఇద్దరికీ యిష్టమైతే కలవటమే! అందుకే దాన్ని 'పశుకామం ' అంటారు. వాటిలాగే వేట ప్రధానంగా జీవించే మనిషి సాటి జీవాలను చంపి తినే క్రమంలో, అటునుంచి ప్రతిఘటన వచ్చినప్పుడు గాయపడటమో, తనే చనిపోవటమో జరిగేది. అందుకని తిండివిషయంలో ప్రతిఘటించని మొక్కలపై ఆధారపడి బ్రతకటం నేర్చుకొన్నాడు. దానికోసం శాస్త్రీయపద్ధతులను కనిపెట్టి , విత్తనాలు నాటి మొక్కలను, గింజధాన్యాలను పండించి తినటం ప్రారంభించాడు. మైధునం విషయంలో కూడా పశువుల్లా గాక ఆరోగ్యకరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన వ్యవస్థను రూపొందించాడు. ఆడ-మగ అన్న స్థాయి నుంచి అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అంటూ వావివరుసలను ఏర్పరచుకొని ప్రణాళికాబద్ధమైన కుటుంబ వ్యవస్థ, ఆరోగ్యకరమైన వైవాహిక వ్యవస్థను రూపొందించాడు. అయితే యీ ప్రపంచంలోని కొన్ని దేశాలలో వివాహమనేది ఒప్పందం ప్రకారం కొన్ని సంవత్సరాలు మాత్రమే నడుస్తోంది. ఇద్దరికీ యిష్టమున్నంత కాలమే కలిసి బ్రతుకుతారు. మనస్పర్ధలు వస్తే విడిపోయి, మరొక వ్యక్తిని వెతుక్కొంటారు. వారు సంతానం అనే ప్రతిబంధకాన్ని లెక్కచేయరు. తగిన వయసు వరకు యిద్దరిలో ఎవరో ఒకరు వారిని సాకుతారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారి జీవితం వారిదే! అక్కడ శృంగారమన్నది వారి వ్యక్తిగతం. కానీ భారతదేశంలో యీ వివాహవ్యవస్థను కొన్ని కఠినమైన నిబంధనలతో రూపొందించారు. ఇక్కడ ఒక్కసారి పెళ్ళయితే జీవితాంతం ఆ వ్యక్తితో కలిసి బ్రతకాల్సిందే! దంపతులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను తమ జీవిత భాగస్వామికోసం మార్చుకోక తప్పదు. అలా చేయకపోతే చుట్టూ ఉన్న సమాజం కల్పించుకొని వారిని సంఘబహిష్కరణ చేసేవరకూ వెళ్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో వస్తున్న మార్పుల కనుగుణంగా మన దేశంలోకి విదేశీ భావాలు దిగుమతి అయిపోయి యిక్కడ పాతుకొనిపోతున్నాయి.. విదేశీ సంస్కృతిని నరనరాన జీర్ణించుకొన్న సెలిబ్రిటీలు శృంగారాన్ని బజారుపరం చేసే విధంగా ప్రవర్తించి వాలటైన్స్ డే , సహజీవనం లాంటి పిచ్చిపిచ్చి పద్ధతులు యువత భావాలలోకి చొప్పింపజేసి పవిత్రమైన మన కుటుంబ, వివాహవ్యవస్థలు దెబ్బతినే పరిస్తితులు కల్పిస్తున్నారు. మన ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన వ్యక్తిస్వేచ్ఛ అనే ప్రాధమిక హక్కు మన సంస్కృతిపై జరిగే యీ దాడికి ఊతమిచ్చి చట్టపరంగా ప్రతిఘటించటానికి వీలు లేకుండా చేస్తోంది. విచారించవలసిన విషయమేమిటంటే యీ ' పెళ్ళి ' ని యువతరం "దేశంలో మద్యం విరివిగా దొరికే అవకాశముండగా ఒక సీసా బీరుకోసం మనమే మద్యం దుకాణం పెట్టుకొన్నంత బుద్ధితక్కువ పని "అని భావిస్తున్నారు. $ $ $
" ఏమడోయి! ఏం చేస్తున్నారు? " వంటింట్లోంచి వరాలి రాకను తెలిపే కేక విని బల్లమీద వ్రాస్తున్న డైరీని మూసేసి కుర్చీలో వచ్చి కూర్చున్నాను. మరేంలేదు! "మళ్ళీ పొద్దున్నే మొదలెట్టారా?" అని ఆమె చేత పొద్దున్నే అక్షింతలు వేయించుకోవటమెందుకనే తప్ప ఆమెకు భయపడి మాత్రం కాదు. అలా కూర్చుని కుర్చీ ప్రక్కనే పడి ఉన్న వార్తాపత్రికను తీసి చదువుతున్నట్లు నటించాను. "ఏమండీ! పెళ్ళి వల్ల లాభమా? నష్టమా?" వస్తూనే వరాలు వేసిన ప్రశ్నకు త్రుళ్ళిపడ్డాను. " సంసారమన్నది ఒక చీకటి గది. బయట ఉన్నవాళ్ళు లోపలికెళ్ళాలనుకొంటారు. లోపలున్నవాళ్ళు బయట పడాలనుకొంటారు" అని ఎక్కడో చదివిన గుర్తు. అదే విషయం చెబితే ఉదయాన్నే ఏ ప్రపంచ యుద్ధం వస్తుందోనని మౌనంగా ఉన్నాను. " మిమ్మల్నే! లాభమా? నష్టమా? చెప్పండి" అంటూ ప్రక్కనే ఉన్న మరో కుర్చీ లాక్కుని కూర్చుంది. నేను ఏదో ఒకటి చెప్పేదాక వదిలేలా లేదు. " వరాలూ! ఉదయాన్నే ఏమిటీ దాడి? ఈ ఏడాది బడ్జెట్ గురించో, మండిపోయే ధరల గురించో అడిగితే చెప్తాను గాని ఉరుములేని పిడుగులాంటి యిలాంటి ప్రశ్నలేస్తే నేనే కాదు. ఏ భర్తా బదులీయలేడు." అన్నాను. " అదికాదండీ! ఈ రోజుల్లో ఆడాళ్ళూ, మగాళ్ళూ పెళ్ళంటే విముఖత చూపిస్తున్నారు కదా! ఎందుకంటారు?" ఒకపట్టాన వదిలేలా లేదు. ఏదో ఒకటి చెప్పక తప్పదు, " ఆర్ధికసమస్యే మూలకారణం. ఈ రోజుల్లో తన సంపాదనతో తను బ్రతకటమే కష్టమైపోతుంటే మరో వ్యక్తిని భరించడమంటే మాటలా? రేప్పొద్దున్న పిల్లా పీచు కలిగితే పీచుని అంటల్లో పారేసినా పిల్లని పెంచటానికి దశావతారాలెత్తవలసి వస్తోంది. పెళ్ళి కాకపోతే యీ బాధలుండవుగా!" నా బదులుకు తననుంచి ప్రతిస్పందన లేదు. నా పనైపోయిందనుకొంటూ తిరిగి పేపర్లో తలదూర్చాను. వేంటనే చేతిలోని పేపరు లాగేసి దూరంగా ఉన్న మంచంపై పడేసి వచ్చింది. " నేను చెప్పేది వినండి ముందు " అంత అధార్టీతో చెబుతూంటే వినక తప్పుతుందా? చెప్పమన్నట్లు సైగచేశాను. " నిన్న సాయంత్రం ప్రక్కరూంలో ఉన్న ఫణి అమ్మగారు వచ్చారండి. తన కొడుకు పెళ్ళి చేసుకోనంటున్నాట్ట. ఎంతో బాధపడుతున్నారు. ఆడపిల్లంటే కేకలు పెట్టయినా ఒప్పించేది. మగాడై పోయాడు. రేపో, మాపో ఆవిడ నెలలు నిండిన కూతురింటికి వెడుతుందట! తాను ఊరెళ్ళాక వేళపట్టున తిండి లేక కొడుకేమైపోతాడోనని ఆవిడ బాధ" " అయితే నన్నేం చేయమంటావ్?" చిరాకు నటించాను. " మంచి రచయితలు కదా! మీరతనికి క్లాసు పీకాలి" " వరాలూ! ఉప్మాలోకి ఉల్లిపాయలు తరుగుతాను. ఊరగాయ పెట్టడానికి సాయపడతాను. కాని ఊరివాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించాలంటే నా వల్ల కాదు " నిష్కర్షగా చెప్పేశాను. " అలాగంటే ఎలాగండీ?పక్కింట్లో ఉండి పట్టించుకోకపోతే ఎలా? మీతో చెప్పి అతని బుర్ర మార్పిస్తానని చెప్పానండీ!" "చేదస్తం మొగుడు కొత్త చేద చేత్తో పట్టుకొని నీళ్ళకోసం నూతిలో దిగాట్ట!" " ఆ చేదకి తాడు కట్టి నీళ్ళు తోడుకోక యితనెందుకు నూతిలో దిగటం?" "తాడు తెగితే చేద నూతిలో ఉండిపోతుంది కదా! అందులో కొత్తది" " కానీ యితనికి కట్టిన తాడు తెగి నూతిలో పడిపోతే అతని పెళ్ళాం మొళ్ళో తాడు తెగుతుంది కదా!" " ఆమె తాడు తెగితేనేం? కొత్త చేద అతని చేతిలోనే అతనితో పాటే నూతిలో ఉంటుందిగా! ఈ కాలం కుర్రాళ్ళ ఆలోచనలు అంతే! వాళ్ళకు తోచిందే తప్ప కన్న తల్లిదండ్రులు చెప్పినా వినని రోజులొచ్చాయి. అతని స్నేహితులెవరో అతని బుర్ర తిని ఉంటారు. అదే పట్టుకొని అతను ప్రవర్తిస్తున్నాడేమో! నువ్వన్నట్లు నేను పాఠమే చెప్పాననుకో! ' నా సొంత విషయాలు మీకనవసరం ' అంటే నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? అతను మరింత ముందుకుపోయి దురుసుగా ప్రవర్తిస్తే నా గతేంటి ?" నా మాటల్ని కొట్టి పారేసిందామె. " ఫణి మంచి కుర్రాడేనండీ! చెప్పాల్సిన విధంగా చెబితే మారవచ్చునేమో! నేను చెప్పినట్లు చేయటం మీకిష్టం లేనట్లుంది" ఆడది కళ్ళెర్ర జేస్తే. . . . .అంతే సంగతులు. ఆమె కోరినట్లుగానే ఫణికి క్లాసు పీకి ఫలితాన్ని ఆమెకు చెప్పక తప్పలేదు. $ $ $ ఫణి తల్లి వరాలికి తన కొడుకుని అప్పజెబుతూ తానులేని రోజుల్లో అతని యోగక్షేమాలు చూసుకోమని పదేపదే కన్నీళ్ళు పెట్టుకొంది. వరాలు అతన్ని తన తమ్ముడిలా చూసుకొంటానని భరోసా యిచ్చి బస్సు ఎక్కించింది. ఆవిడ ఊరెళ్ళాక వరాలు మొహమాట పడే ఫణిని బలవంతంగా యీడ్చుకొస్తోంది. ఇలా ఉండగా ఒక సెలవురోజు " గాడ్స్ మస్ట్ బి క్రేజీ" అన్న యింగ్లీషు ఫస్ట్ షోకి వెడదామన్నాను. ఆకాశంలో తన వ్యక్తిగత ఫ్లైట్ లో చక్కెర్లు గొడుతున్న వ్యక్తి తాగి పడేసిన మద్యం సీసా ఆదిమజాతి వారి నివాసాలకి దగ్గరలో పడుతుంది. ఆకాశం నుంచి ఊడిపడ్డ ఆ సీసా ఏమిటో తెలియక దాన్ని రకరకాల ఉపయోగించి గాయపడుతూంటారు. దానితో దాన్ని ఒక అతీంద్రియశక్తిగా భావించి, వాళ్ళలో ఒకడు ఆ సీసాను చాలాదూరం తీసుకెళ్ళి కొండమీదనుంచి పారవేసి తన యింటికి తిరిగి వెడతాడు. ఈ సినిమా కధను ఒక పత్రికలో చదివి వరాల్ని బలవంతంగా బయల్దేరదీశాను. సెలవురోజు కావటాన యింట్లో ఒంటరిగా ఉన్న ఫణిని బలవంతంగా వరాలు మాతో పాటే లాక్కొచ్చింది. మన సరదా మధ్యలో అతనెందుకని చాటుగా కేకలేసినా వినలేదు. సినిమాహాల్లో మా వెనకసీట్లో కూర్చున్న యిద్దరు సందర్భం లేకుండానవ్వుకొంటున్నారు. వాళ్ళలా నవ్వుతూంటే ఏదో వాసన కూడా వస్తోంది. ఇరవై, పాతిక సంవత్స రాల మధ్య ఉండే వాళ్ళు దంపతుల్లా లేరు. అప్పుడప్పుడు ఆ కుర్రాడికి తిక్కరేగి యీలలు కూడా వేస్తున్నాడు. వాళ్ళు చేసే గోలకి తట్టుకోలేక వారి పక్కనే కూర్చున్న పెద్దాయన సీటు మారిపోయాడు. వాళ్ళ వెకిలిచేష్టలకి ఫణి కూడా యిబ్బంది పడ్డాడు. సినిమా అయిపోయాక హాలునుంచి బయటకొస్తున్న మా ముందే నడుస్తున్న వాళ్ళు తూలిపోతున్నారు. వాళ్ళను చూసి కొందరు లోలోపల నవ్వుకొంటూంటే, కొందరు వాళ్ళ వికార చేష్టలకు తిట్టుకొంటున్నారు. ప్రపంచమంతా తామిద్దరే అన్నట్లు నడుస్తూ మెట్లు దిగుతుండగా, లోపలికెళ్ళినదాన్ని కుర్రాడి పేగులు హరాయించుకోలేక వాంతి చేసుకొంటూ మెట్లమీదనుంచి దొర్లిపోయాడు. ప్రక్కనున్న అమ్మాయి కంగారుగా మెట్లు దిగి బోర్లా పడిన అతన్ని వెల్లకిలా త్రిప్పింది. ఆ దొర్లటంలో ముక్కు చితికి దానిలోంచి కొద్దిగా రక్తం కూడా వస్తోంది. సినిమానుంచి బయటకొస్తున్న వాళ్ళు, హాలు ఆవరణలో ఉన్న జనం వారి చుట్టూ మూగారు. " ఏమ్మా! అబ్బాయికి ఒంట్లో బాగులేదా?" ఒక పెద్దాయన ఆ అమ్మాయినడిగాడు. " అదేంలేదు. ఫుల్లుగా ఎక్కించింది లోపల ఉండలేక బయటకు తన్నుకొచ్చింది. ఆ వాసన తెలీటంలేదా? పడిపోయినవాడు మరింక యిప్పట్లో లేవడు. ఏదో ఆటోలో వాణ్ణి యింటికి చేర్చాల్సిందే!" పాతికేళ్ళ కుర్రాడు పళ్ళికిలించాడు. " చూడమ్మా! మెట్లమీద కక్కేశాడు. ఈ ప్రక్కన హోటలుకెళ్ళి కాస్త నీళ్ళు తెచ్చి కడిగేయి. హాలు యజమాని చూస్తే నిన్ను తిడతాడు. అది అయ్యాక ఆటోలో యింటికి తీసుకెళ్ళు" సలహా చెప్పాడొకడు. వాళ్ళ ప్రశ్నలకు, అక్కడ చేయాల్సిన పనులకు కంగారుపడి నీళ్ళు తెస్తానని చెప్పి ఆ అమ్మాయి మెల్లిగా జారుకొంది. ఆ పిల్ల వస్తుందని చూసిన జనం తనకోసం వెతికారు. దూరం నుంచి యిదంతా గమనిస్తున్న మేము ఆ అమ్మాయి కదులుతున్న సిటీబస్సు ఎక్కేసిందని చెప్పాం. అదివిన్న జనాలికేంచేయాలో తోచలేదు. " ఈ కుర్రాడా? వీడిప్రక్కనో అమ్మాయి ఉండాలే! సినిమా హాల్లో వాళ్ళ గోల భరించలేక సీటు కూడా మారాల్సి వచ్చింది" హాల్లో వారి బారిన పడిన బాధితుడు తన గాధ వివరిస్తున్నాడు. " అది వీడి పెళ్ళామయితేగా మర్యాదగా ఉండటానికి? తలనిండా పూలూ, ఆ షోకు చూస్తేనే తెలుస్తోంది. కుర్రాడితో ఖుషీకోసం వచ్చింది. పడిపోయి యిప్పుడప్పుడే లేవడుగా! డబ్బు కూడా ముందే లాగేసుంటుంది. అందుకే వీడితో అవసరం లేదని మరొకణ్ణి చూసుకోవటానికి పోయింది" యిందాకటి కుర్రాడే ఆ అమ్మాయిమీద వ్యామోహంతో మరికొన్ని అసభ్యమైన మాటలు కలిపి చెబుతున్నాడు. " అచ్చు పెళ్ళాంలా కనిపించి ఎంత మోసంచేసింది? ఆ అమాయికమైన ముఖం చూసి నిజంగా పెళ్ళామే అనుకొన్నాం. దాని. . . ...."అంటూ కొంతమంది తమ భాషాపాండిత్యాన్ని బయట పెట్టుకొన్నారు. "దాని సంగతి తరువాత. . . అందరూ వీణ్ణి లా వదిలేస్తే, వీడు చేసిన కంగాళీకి చిర్రెత్తిన హాలు యజమాని వీణ్ణి హాలు బయట డ్రైనేజీలోకి యీడ్చేస్తాడు. ఏ కుక్కలో వీణ్ణి పీక్కుతింటూంటే ఆ మైకంలోనే దిక్కులేని చావు చస్తాడు " అక్కడ ఉన్న వాళ్ళలో సానుభూతి తన్నుకొస్తోంది. " జేబులో వెతికితే వాడి ఐడి కార్డ్ దొరకచ్చు. అందులో వీడి అడ్రస్సు తప్పకుండా ఉంటుంది." సలహాల్రావు సలహా పడేశాడు. " అదిసరే! పడిపోయిన వీణ్ణి యిలా వాడింటికి చేరిస్తే. . . .యింట్లోవాళ్ళు మనమే అతన్నేదో చేశామని అల్లరి చేస్తే. . " సందేహాల్రావు చెప్పేది నిజమే! జాలిపడ్డవాణ్ణే జైలుపాలు చేసే రోజులివి. "అదీ నిజమే! పోలీసులకు చెబితే వీడి సంగతి వాళ్ళే చూసుకొంటారు" మనదేశంలో పోలీసులు అభాగ్యులే! బజారు గొడవనుంచి యింట్లో తగవుల దాకా వాళ్ళే చూడాలంటే అయ్యేదేనా? కలగజేసుకొన్నా, కలగజేసుకోక పోయినా యీ జనాలు తేలిగ్గా పోలీసులని తిట్టిపోస్తారు. " కుర్రాడి ముఖవర్ఛసు బాగానే ఉంది. ఏ సాంప్రదాయికమైన పిల్లనో పెళ్ళాడక యీచిల్లర సంబంధాలేమిటి? ఈకాలం పిల్లలు పెళ్ళాట్టమంటే అదేదో తప్పు చేసినట్లే అనుకొంటారు. వయసుగోల భరించలేక మత్తు పదార్ధాలకి, యిలాంటి చిలక్కొట్టుళ్ళకి అలవాటు పడి యిలా దిక్కులేని వాళ్ళలా రోడ్డున పడతారు. ఇందులో ఉన్న ఆనందమేంటో వాళ్ళకే తెలియాలి" ఒక సంఘ సంస్కర్తగారి ఉవాచ, " అందరి విషయంలో అలా జరగదండీ! తల్లిదండ్రులు సరి లేకపోతేనే పిల్లలు యిలా తయారవుతారు" ఒక మానసికవేత్త తీర్పు. ఇంతలో ఎక్కడినుంచో యిరవైరెండేళ్ళ అమ్మాయి చుట్టూ చేరిన జనాన్ని తోసుకొంటూ ఆ కుర్రాడి దగ్గరకొచ్చింది. " ఏమయ్యా! ఏంజరిగిందయ్యా నీకు? అయ్యా! మీరన్నా చెప్పండి. ఏమైంది?" చుట్టూ ఉన్న జనాన్ని అడిగిందామె. " ఏముంది? తాగి పడిపోయాడు. మెట్లమీద ఆ కంపు తెలీటం లేదా? మీ ఆయన సంగతి తరువాత. . . .ముందు లోపల బాత్రూంలో నీళ్ళు తెచ్చి మెట్లు కడుగు " అప్పుడే అక్కడికొచ్చిన హాలు మేనేజరు ఆ అమ్మాయిపై విరుచుకు పడ్డాడు. " అలాగేనయ్యా! " అంటూ పది నిమిషాల్లో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసిందామె. ఆమె శుభ్రం చేస్తున్నంతసేపూ చుట్టూ చేరిన జనం తినేసేలా చూస్తూంటే కట్టు బట్టని సరిగా కప్పుకొంటూ నానా తంటాలు పడిందామె. " ఈ గుంట యిందాకటి గుంట కాదురా! ఇదెవర్తో?" " ఎవరమ్మా నువ్వు? ఈ కుర్రాడు తెలుసా? " ఒక పెద్దమనిషి ప్రశ్న. " ఈయన నా మొగుడేనండీ! మా యిల్లు యిక్కడికి దగ్గరే! ప్రశాంత్ నగర్! మాకు తెలిసినాయన యీయన్ని చూసి నాకు చెబితే వచ్చానయ్యా!" " ఇంతవరకూ పెళ్ళే కాలేదనుకొన్నాం. ఇంత అందమైన భార్య నెట్టుకొని పిచ్చి వేషాలేశాడంటే ఏదో కారణం ఉండాలి" యిందాకటి కాలేజీ కుర్రాడే కాలరెగరేస్తూ అన్నాడు. " చేతిలో ముద్ద ఉన్నా నోట్లో కెళ్ళే యోగం ఉండాలిగా!" ఒక ముసలాడు తన చపలత్వాన్ని బయటపెట్టుకొన్నాడు. "అంతేలే! ఈ కాలం కుర్రాళ్ళకి పెళ్ళాం విలువ తెలిసేడిస్తేగా!" అనగానే పదిమంది ఫక్కుమన్నారు. నేరం చేయని ముద్దాయిలా పదిమంది ముందు తలొంచి నిలబడిందామె. " ఆటో "హఠాత్తుగా వరాలి గొంతు వినిపించి త్రుళ్ళిపడ్డాను. నన్ను గమనించకుండానే ఆటోని బేరమాడి ఆ అమ్మాయిని పిలిచింది. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆమె మా వద్దకొచ్చింది. " వంద రూపాయిలివ్వండి" వరాలు అడగ్గానే నా నరాలు బిగుసుకొన్నాయి. కానీ అంతమందిలో ఏమనలేక జేబులోంచి వంద తీసిచ్చాను. " ఏమ్మా! ఇదిగో డబ్బులు. ప్రశాంత్ నగర్ లో ఎక్కడికెళ్ళాలో అతనికి చెబితే దించేస్తాడు. మా ఫోన్ నంబరిస్తాను. అరగంట తరువాత ఫోన్ చేసి నువ్వు క్షేమంగా చేరినదీ, లేనిదీ చెప్పు. ఏంటండీ అలా చూస్తారు? కాస్త చెయ్యి వేసి ఆ కుర్రాణ్ణి ఆటోలో చేర్చండి" వరాలి మాటలకు మారాడక అక్కడి జనం ఆ కుర్రాణ్ణి ఆటోలో చేర్చారు. అలా చేర్చేటప్పుడు ఒకళ్ళిద్దరు ఆ అమ్మాయి భుజాలకు తమ భుజాలు తగిలించి సరదా తీర్చుకొన్నారు. " వెధవలు " వరాలి సణుగుడికి నాకే భయమేసింది. " మీకేమనిపించింది?" భోజనాల దగ్గర హఠాత్తుగా వరాలు ప్రశ్నించింది. " చాలా సరదాగా ఉంది. చిన్న సీసా పట్టుకొని కధను చక్కగా నడిపించారు, ఆంగ్లసినిమా అయినా అభ్యంతరకర దృశ్యాలు లేవు" " సినిమా సంగతి సరే! సినిమా హాలు దగ్గర జరిగిన దానిగురించి. . . ." వరాలి ప్రశ్నకు ప్రక్కన ఫణి ఉండటంతో జవాబు చెప్పక మౌనంగా ఉన్నాను, "ఆ పిల్ల పిచ్చిదండీ! తన సరదాని పట్టించుకోని వాడెలా పోతే తనకెందుకని యింట్లో కూర్చోక, పదిమంది ముందుకు వచ్చి పదిరకాల మాటలు పడింది. ఆ అమ్మాయో? తన సరదాలు తీర్చే అతను పడిపోగానే చల్లగా జారుకొంది. ఎవరో అన్నట్లు ఏ కుక్కో అతని ఎముకముక్క కొరుక్కుంటే ఏమయ్యేవాడు? అదృష్టవంతుడు. పెళ్ళాం వల్ల దిక్కు లేని చావు తప్పింది" వరాలు మాటలకు నాలో కవిగాడు రెచ్చిపోయాడు. "పెళ్ళి సరదా మాత్రమే కాదు సంఘంలో ఒక హోదానిస్తుంది. అక్కడ జనాలు ఏమన్నారు? ఆ కుర్రాడలా రోడ్డున పడటానికి అతన్ని కన్న తల్లిదండ్రులే కారణమన్నారు. ఈ పిచ్చి పనితో ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మాట పడ్డారు" వరాలికి వత్తాసు పలికాను. "ఎంత స్వంత అభిప్రాయాలున్నా మనం ఉండే సంఘానికి అనుగుణంగా కొన్ని విషయాల్లో పోక తప్పదు" వరాలు చెబుతుంటే నా ప్రక్కన ఉన్న ఫణి చేయి కడిగేశాడు. "అదేంటయ్యా అప్పుడే చేయి కడిగేశావ్?" "నా భోజనం అయిపోయిందక్కా!"అంటూ జేబురుమాలితో చేయి తుడుచుకొంటూ తన గదికి వెళ్ళి పోయాడు. ఉదయాన్నే కనిపించలేదని అతని గదికెడితే తాళం కప్ప దర్శనం యిచ్చింది. రెండు వారాలైనా అతని జాడ లేదు. "అక్క గారి పాఠానికి హడిలిపోయి రాత్రికి రాత్రే దుకాణం ఎత్తేశాడంటావా?" నా పరిహాసానికి వరాలు గుర్రుగా చూసింది. "అంతేలెండి! మగాళ్ళకి ......కాదు.... మొగుళ్ళకి తమ భార్య కార్యదక్షతపై నమ్మకం తక్కువ" వరాలి మాట వింటున్న నామీద కిటికీ లోంచి కవరు వచ్చి పడటంతో తుళ్ళిపడ్డాను. నేలమీద పడ్డ కవర్ తీసి ఆత్రంగా చూశాను. "ఏమిటది?"అడిగిన వరాలికి చేతిలోని కవరిచ్చాను. "ఏదో మిత్రుల మాటలు విని ఆప్పుడలా అన్నాడేమో గానీ... నా తమ్ముడు బంగారం" వరాలు గర్వంగా తలెగరేసింది. వరాలి కార్యదక్షతకు జేజేలు కొడుతూ ఆమె చేతిలోని ఫణి శుభలేఖ సందడి చేసింది. .@ @ @
No comments:
Post a Comment