పోస్టుమాన్ పరాంకుశం
కౌండిన్య
పోస్టుమాన్ పరాంకుశం కు కొత్తగా ఆ ఊరికి ట్రాన్సఫర్ అయ్యింది. ఆ ఊరు కొట్టిన పిండిలాంటిది. చిన్నప్పుడు వీధి వీధి తిరిగిన ఊరు. స్వతాహాగా తిరగడం అంటే ప్రాణం, ఉద్యోగ రిత్యా ఎలాగూ తప్పదు. ఉత్తరాలు డెలివెరీ చేసేటప్పుడు పరాంకుశం కు నచ్చని అంశం ఏదైనా ఉందంటే వెంటపడే వీధి కుక్కలే. సర్కస్ లో లాగా సీటు మీద ఎక్కి ఆ సందులలో నడిపిన గడియలెన్నో.
'ఏ జన్మలోనో ఎదో చేసి ఉంటావు నాయనా' అంది.
'ఏ జన్మదో కాదు నానమ్మ ఈ వైరం, బహుసా ఈ జన్మదే' అన్నాడు.
'నువ్వెపుడైనా కుక్క తోక పట్టుకున్నావా?, అడి అడిగాడు.
'ఛీ.. పాడు' అంది.
'బోలెడు వెంటబడి ఒక్కటి మాత్రం ప్యాంట్ పట్టుకొని ఎంతకీ వొదలక పోతే, నేను తోక పట్టుకొని గట్టిగా లాగి వొదిలిచ్చుకొని మరీ పరిగెత్తాల్సి వచ్చింది' అన్నాడు. 'నిన్ను శుద్ధి చేయాలుండూ' అంటూ లోపలికి వెళ్ళబోయింది.
'ఇది ఎప్పటి సంగతోలే నానమ్మ' అన్నాడు లేకపోతే పసుపు నీళ్ళు ఒళ్ళంతా చిలకరిస్తుందని.
చక్కగా నీడ పట్టున ఉండే ఉద్యోగం చూసుకో నాయనా' అంటూ
'ఇలా తిరిగి తిరిగీ కాళ్ళు అరిగిపోవడం వల్లేనే నువ్వు పొడుగు ఎదగనిది' అంది నానమ్మ. 'మీ తాతగారు నీలాగనే ఒక్క క్షణం ఇంటి పట్టున ఉండేవారు కాదు.
' ఓ చోట కూర్చొని చేసే ఉద్యోగం నాకు నప్పదే నానమ్మ, బయట నలుగుర్ని పలకరిస్తూ చేసే ఉద్యోగమే నాకు నయం' అన్నాడు.
'ఎన్నాళ్ళు ఇలా ఎండలో తిరుగుతావు నాయనా? చూడు కమిలిపోయి, నల్లగా బొగ్గులా తయారయ్యింది నీ శరీరం. ఇలా అయితే నీకు పిల్లని ఎవరిస్తారు? వయసు ముదిరిపోకుండా పెళ్ళి చేసుకోరా', అంది.
'సరే నానమ్మ నాకు కూడా అనిపిస్తోంది. నీలాంటి పిల్లను చూసి పెట్టు' అన్నాడు.
'అదేం మాటరా, నా కన్నా మంచి పిల్లే వస్తుంది, బంగారం లాంటి వాడివి నువ్వు' అంది.
ఇంటి వెనక పోర్షన్లో ఉంటున్న అమ్మాయి గుర్తుకొచ్చింది నానమ్మకు. చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగినట్లు ఆ పిల్లనేదో అడిగితే పోలేదు అని అనుకుంది మనసులో.
సాయంత్రం పెరడులో నానమ్మ ఆ పక్కింటి పిల్లను కలిసింది. 'ఏం అమ్మాయి. నీకు పెళ్ళి చూపులేమైనా చూస్తున్నారా ?' అని అడిగింది.
'పొరపాటున మీ మనవడిని ఏమైనా కట్టపెడదామను కుంటున్నారా ఏంటి? అంది.
'గడుసు పిల్లవే' అంది.
'అయినా నాకు పోస్టుమాన్ ల కు పొత్తు కుదరదు లేండి' అంది
'పోస్టుమాన్ అయితే ఏం అమ్మాయి మనిషి వెన్న' అంది
'ఆలోచిస్తానులేండి' అంది
‘అది సరేకానీ ఎన్నడూ అడగలేదు, ఇంతకీ నీ పేరేమన్నావు ? అని అడిగింది.
'కబికందు' అంది
'అదేం పేరు విడ్డూరంగానూ' అంది
క బాష లో చెప్పానులేండి. 'బిందు' అని తెప్పింది.
'ఓ అదా' అంది నానమ్మ గారు. లోపలకు నడుస్తూ ఆలోచిస్తానంది శుభశకునమే అనుకుంది మనసులో.
సాయంత్రం పరాంకుశం వచ్చే సమయానికి ముసుగు తన్ని పడుకొని ఉంది. పరాంకుశం దగ్గరుకు వెళ్ళాడు. దుప్పటి పైకి తీసాడు. గుప్పున జండూ బామ్ వాసన కొట్టింది. ఒళ్ళు వేడిగా ఉందేమోనని నుదురు పట్టుకొని చూసి నానమ్మతో 'ఏంటి నానమ్మ, నలతగా ఉందా?' అని అడిగాడు.
'అవును నాయనా. ఈ రోజు ఏమి చేయలేక పోయాను' అంది
'ఫర్వాలేదు లే... నే బయటకు వెళ్ళి ఎదైనా తీసుకొస్తాను' అన్నాడు
'ఎందుకూ, మన ఇంటి వెనక అమ్మాయి ఇస్తానంది. వెళ్ళి పట్రా' అంది
'అయినా వాళ్ళని వీళ్ళను అడగటం ఎందుకే నానమ్మ. నే వెళ్ళి చిటికెలో హోటల్ లో పట్టుకొస్తాగా' అన్నాడు పరాంకుశం.
'ఆ మాట తనతో అన్నాను నాయనా. ససేమీరా ఒప్పుకోలేదు ఆ అమ్మాయి', అంది
'నాకు ఆడవాళ్ళతో మాట్లాడాలంటే సిగ్గు. నే వెళ్ళలేనే నానమ్మా' అన్నాడు
విసుగుతో నానమ్మ ' పోనీ ఓ ఉత్తరం రాసి డెలివరీ చేయరా, వెధవా' అంది కోపం ప్రదర్శిస్తూ.
పరాంకుశానికి ఆ ఉపాయం నచ్చింది. ఆ విప్పిన తొక్కా మళ్ళీ తగిలించుకొని ఒక చిట్టి రాసి తీసుకొని వెళ్ళి వాళ్ళింటిలో పడేసి తిరిగొచ్చాడు.
వెంటనే తిరిగొచ్చిన శబ్ధానికి పరిస్థితి అర్థమై 'ఉత్తి చవట. అన్న పని చేసి ఉంటాడు అంటూ ఏం తెలీదు, అన్నీ చెప్పాలి' అని దుప్పటి లోపల గొణుక్కుంటూ .
ఎంత సేపటికి ఆ అమ్మాయి జాడ కనపడక విసుగుగా లేచి వంట చేసి 'నువ్వు తిను నాయనా' అంటూ మళ్ళీ ముసుగు తన్నింది. నానమ్మ ఎందుకలా విసుగుగా ఉందో అర్థం కాలేదు.
తరువాత రోజు మళ్ళీ పెరట్లో కలిసినపుడు అడిగింది నానమ్మ.
'ఎవే అమ్మాయి. చిట్టీ వేసాడుటగా మా మనవడు' అంది సాగదీస్తూ.
'ఏదో ప్రేమ లేఖ రాసినట్లు మురిసిపోతున్నారే? టెలిగ్రామ్ లో లాగా రెండు ముక్కలు రాసాడు మీ మనవడు' అంది బిందు.
'వాడిని ఓ దారికి తీసుకొచ్చే బాధ్యక నీకే అప్పచెబుతున్నా అమ్మాయి' అంది నానమ్మ.
'తలెత్తి చూసే రకం లాగా కూడా లేడు మీ మనవడు, నన్నేం మార్చమంటారు' అంది బిందు.
'నే చెబుతాగా' అంది నానమ్మ.
' అవునూ, ఇంటిలో నీకు సంబంధాలు ఏమైనా చూస్తున్నారా?' అని అడుగుతూ 'ఏంటి రెండ్రోజుల నుండి మీ అమ్మ నాన్న కన్పించటం లేదు' అడిగింది నానమ్మ.
'అమ్మా నాన్న ఊరెళ్ళారు లేండి.'
' ఆ పెళ్ళచూపులకు చాలా మందే వొచ్చారు.. నా కంటి సైగలు చూసి తట్టుకోలేక పరారయ్యారు లేండి’ అంది.
'గట్టి పిల్లవే' అంది నానమ్మ.
గలగలా నవ్వేసింది బిందు.
'నా మీద మరీ ఆశలు పెంచుకుంటున్నట్లున్నారు' అంది మళ్ళీ 'నా సంగతులు పెద్దగా మీరు తెలియవు కూడా' అంది బిందు నవ్వుతూ.
'పెద్ద వాళ్ళు రానీ అన్నీ విషయాలు మాట్లాడతాను' అంది నానమ్మ.
తరువాత రోజు మధ్యాహ్నం బిందు వాళ్ళ ఇంటి గడియ కొట్టిన శబ్ధం వచ్చింది. తలుపు తీసి బయటకు వచ్చింది. ఎదురుగుండా పోస్టుమాన్ పరాంకుశం నిలబడి ఉన్నాడు. ఇప్పటి వరకూ ఇద్దరూ ఒకరినొకరు సరిగా చూసుకుంది లేదు. మొదటిసారి ఒకరునొకరు కళ్ళల్లో పరస్పర ఆకర్షణతో చూసుకున్నారు.
'మీకు ఈ ఉత్తరం వచ్చింది' అన్నాడు. సూటిగా కళ్ళలో కళ్ళు కలపలేక మొహమాటంతో తలదించుకొని అందించాడు.
బిందు మాత్రం కళ్ళలోకి సూటిగా చూస్తూ 'మీ నానమ్మ గారి ట్రైనింగ్ బాగానే ఉందే. అపుడే ప్రేమ లేఖలు రాయడం వరకూ వచ్చిందే' అంది.
తలెత్తాడు. 'అబ్బే, నేను రాసింది కాదండి. మీకే ఈ ఉత్తరం బయట ఎక్కడినుండో వచ్చింది.' అంటూ అందించి, మళ్ళీ బిందు చేతిలోనుండి లాక్కొని ఇదేదో సైన్యం నుండి వచ్చిన లెటర్ లాగా ఉందే అని అన్నాడు.
తనవైపు చూస్తూ 'మీకు సైన్యం లో తెలిసిన వాళ్ళు ఉన్నారా?' అని అడిగాడు.
అది విని ఆమె ముఖ కవళికలు మారడం గమనించాడు.
ఏమైనా తప్పు మాట్లాడానా అని పశ్చాత్తాప పడ్డాడు.
ఆ ఉత్తరం తనకు అందించాడు.
బిందు తన ఏడుపును ఆపుకున్నట్లు అర్థమయ్యింది.
ఆమెతో అయోమయంగా అర్థం కాక 'ఏడుస్తున్నారా' అని అడిగాడు. తనను తాను తమాయించుకుంది.
'ఇంకా చాలా ఇళ్ళకి ఉత్తరాలు అందించాలి. నే వస్తాను' అంటూ బయలుదేరాడు.
బిందు ఆ ఉత్తం తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది.. ఆమె కళ్ళు జలమయం అయ్యింది.
తన బట్టల అరలోంచి ఉత్తరాల కట్ట తీసి, ఇది కూడా జత చేర్చి లోపల పెట్టేసి ఉన్న చోటే నేల మీద చతికిల పడింది. ఆ ఉత్తరం చదువ తలుచుకోలేదు.
రెండు రోజుల తరువాత బిందు వాళ్ళ తల్లి తండ్రులు రావడం గమనించింది నానమ్మ. ముసుగులో గుద్దులాటలాడే కంటే ఓ సారి వారితో మాట్లాడాలన్న నిశ్చయంతో సాయంత్రం వెళ్ళి తలుపుకొట్టింది.
'లోపలికి రండి' అంటూ తల్లి ఆహ్వానించింది. 'బిందు మీగురించి చెప్పింది' అంది. మీరు ఎక్కువగా కనపడరు కానీ మీ అమ్మాయే కలుపుగోలుగా మాట్లాడేస్తుంది అంది నానమ్మ.
'ఏది తను ఎక్కడా కనపడటం లేదు' అంటూ కనపడిన గదుల వరకూ కళ్ళతో వెతికేసింది నానమ్మ.
'రెండు రోజుల నుండి తను అదోలా ఉంది లేండి' అంది తల్లి
నే వచ్చిన విషయం దేనికంటే, 'బిందు ని చూసిన తరువాత మా పరాంకుశం కు సరిజోడు అనిపించింది, అదేదో మీతోనే మాట్లాడితే మంచిదని ఇలా వచ్చానమ్మ' అంది.
'మా మనవడు పరాంకుశం మాత్రం ముత్యం లాంటి వాడు' అంది నానమ్మ మనవడి గుణగణాలని పొగుడుతూ.
'వాడి నెమ్మది తనానికి మీ బిందు కలుపగోలుకు సరిపోతుందని పించింది',
'ఇలా అడిగానని మీరు మరోలా అనుకోవద్దు' అంది బిందు తల్లితో.
'ఇందులో అనుకునేదేముందిండి' అంటూ మీకు కూడా కొన్ని విషయాలు తెలిస్తే బావుంటుంది అంటూ చెప్పబోయేలోగా బిందు బయటకు వచ్చింది.
'ఏం అమ్మాయి రెండు రోజుల నుండి కంటికి నలుసైపోయావు? అంది నానమ్మ పలకరిస్తూ.
'లోపలకు వెళ్ళు.. ఎందుకు వచ్చావు' అంది తల్లి.
నానమ్మ కు బిందు తల్లి మాటలలో కోపం, విసుగు కనిపించాయి. కోపంగా వెళ్ళి తలుపేసింది బిందు.
కొంత సేపటి వరకూ నిశ్శబ్దం. నానమ్మకు ఎలా మాటలు కలపాలా అర్థం కాలేదు.
'ఇది సరైన సమయం కాదేమోలేండి.' అంటూ లేచి నించున్నారు నానమ్మ గారు.
బిందు తల్లి దగ్గరకు వచ్చి 'నిరాశపరిచి నందుకు క్షమించండి. తను రాకేష్ ను తప్ప ఇంకెవ్వరీ చేసుకోనని భీష్మించుకూర్చుంది. మారదు. అది అంతే' అంది తల్లి.
'ఇలా ముందుగా నే ఊహించుకున్నందుకు పొరపాటు నాదే లెమ్మ'
'నే ఏమీ అనుకోనులే, పిల్ల జాగ్రత్త. పెద్ద వాళ్ళం మనమే సర్థి చెప్పాలి' అని బయలుదేరింది.
సాయంత్రం నానమ్మ దిగులు గ్రహించాడు పరాంకుశం. 'ఏంటి నానమ్మ ఆ అమ్మాయి గూర్చేనా ఆలోచిస్తోంది?' అన్నాడు.
'ఈ రోజే నా పెళ్ళి చేయమనేమైనా అడిగానా నిన్ను?, అన్నాడు.
మౌనంగా ఉండిపోయింది. 'నా కడుపులో ఏం బాలేదు నువ్వు తినేయ్ నాయనా' అంది.
తల్లి తండ్రులు పోయిన తరువాత నానమ్మే సర్వస్వం. ఆదిలోనే హంసపాదు అన్నట్లు మొదట్లోనే ఇలాగ జరగడం కొంచెం నానమ్మకు బాధ కలిగించింది. పరాంకుశం పెళ్ళి విషయంలో ముభావంగా ఉన్న వెంటనే పెళ్ళి చేయాలన్న పట్టుదల పెరిగింది. సంబంధాలు ఏమైనా ఉంటే తెలుపమని తనకు తెలిసిన నలుగురికీ చెప్పింది. ఏవి సరేనై సంబంధాలు రాక దిగులు పెంచేసుకుంది.
ఆ రోజు బిందు వాళ్ళింట్లో హడావుడికి జరుగుతోందని గ్రహించింది నానమ్మ. ఆ శబ్ధాలు వినపడకుండా తలుపులు కిటికీలు వేసుకుంది.
బిందు చిన్ననాటి స్నేహితుడు రాకేష్. చదువుకునో రోజులలో కలిసి ఏంతో సమయం గడిపారు. చిన్ననాడే పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించు కున్నారు. వారి చదువులు పూర్తవ్వగానే రాకేష్ కు సైన్యంలో ఉద్యోగం వచ్చింది. ఓ రెండేళ్ళు చేసిన తరువాత పెళ్ళి చేసికుందామని కలలు కన్నారు. మొదట్లో ఉత్తరాలు తరుచుగా రాసేవాడు, తరువాత కొన్ని సంవత్సరాలు అసలు తన దగ్గర నుండి ఏ వార్త లేకపోవడం తో బిందు తల్లి తండ్రులు మధ్యలో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు కానీ వేటినీ ఒప్పుకో లేదు.
రాకేష్ మీద ఆశలు వొదులుకున్న వేళ మళ్ళీ ఉత్తరం రావడం తను తిరిగిరావడం వెంట వెంటే జరిగిపోయాయి. ఓ వారం లో బిందుని పెళ్ళి చేసుకొని తీసుకొని వెడిపోతానన్నాడు. తప్పేది లేక హడావుడిగా పెళ్ళి జరిపించారు. బిందు రాకేష్ తో వెళ్ళిపోయింది.
నానమ్మకు మనసేం బావుండటం లేదు. పరాంకుశం నానమ్మకు సర్థి చెబుతున్నాడు కానీ అనుకోకుండా ఎదురైన సంఘటన వల్ల నానమ్మ ఇంకా తేరుకోవడం కష్టంగా ఉంది. ఓ రోజు బాగా సుస్తి చేసింది. కోలుకుంటుందను కున్నాడు పరాంకుశం. సాయంత్రం ఇంటికి రాగానే తెలుసుకున్నాడు తనను ఒంటరి వాడిని చేసి ఈ లోకంలో నుంచి వెడిపోయిందని. అనవసరంగా తన పెళ్ళి బెంగతో చితికిపోయింది అనుకొని చాలా బాధ పడ్డాడు. తనకు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన రాలేదు. బిందు వాళ్ళ తల్లి తండ్రులు ఆ ఊరినుండి వెడిపోయారు. పరాంకుశం ఒంటరి వాడై తన ఉద్యోగం విషయాలతో పెళ్ళి ఆలోచనలు రాకుండా గడుపుతున్నాడు.
ఐదేళ్ళు గడిచాయి. ఓ రోజు పరాంకుశం బిందుని చూసాడు. ఏమీ మారలేదు అనుకున్నాడు. ఓ పాప చేయి పట్టు కొని ఉంది. అచ్చం బిందు లానే ఉంది.
నానమ్మ సంగతి తెలిసిందని అంది బిందు.
'సెలవులకు వచ్చారా ?' అని అడిగాడు పరాంకుశం.
నిశ్శబ్దం. ఆమె నోట మాట రాలేదు. బిందు పెదాలు వణుకు తున్నాయి. యుద్దంలో ఆయన అమరుడైయ్యారు అంది కంటతడి పెట్టుకుంటూ.
నివ్వెరపోయాడు. ఏమి మాట్లాడాలో తెలియలేదు పరాంకుశం కు. కొంతసేపటికి తేరుకొని
'ఎక్కడ ఉంటున్నారు' అని అడిగాడు. చెప్పింది.
సరే మళ్ళీ కలుస్తానని బయలుదేరాడు.
ఆ రోజు పాతవిషయాలు వద్దన్నా జ్ఞాపకం వచ్చాయి.
బిందు మళ్ళీ ఆ ఊరు రావడం ఊహించని పరిణామం. ఆలోచనలు సహజం అటు మళ్ళు తున్నాయి. ఆ ఆలోచనలలో ఏదో తెలియని జాలి కలిగింది ఆమె మీద. ఎన్నో ఏళ్ళు నిరీక్షణ చేసి తిరిగివొచ్చిన సైనికుడిని పెళ్ళి చేసుకున్న కొన్ని ఏళ్ళకే ఇలా జరగడంతో బాధనిపించింది. సహాయం అవసరమేమో అని అనుకున్నాడు మళ్ళీ తన స్వభావానికి స్వతాహాగా అడగదలుచుకోలేదు.
ఓ రోజు బిందు వాళ్ళ ఇంటికి ఉత్తరం డెలివరీ కి వెళ్ళాడు. లోపలనుండి వాళ్ళమ్మాయి పరిగెత్తుకువచ్చింది. తను కూడా వెనుక వచ్చి అక్కడ చాటుగా నిలుచుంది.
‘ఇది కూడా సైన్యం దగ్గర నుండి వచ్చిన ఉత్తరంలానే’ ఉందని ఆ పాపకు అందించాడు ఇవ్వమని.
బిందు అది తీసుకొని తెరిచింది. దాన్ని చూస్తూ కన్నీళ్ళు కారుస్తూ పరాంకుశానికి చూపమని ఇచ్చింది. ఆ పాప అది అందచేసి బయట వరండాలో ఆడుకోవటానికి వెడిపోయింది.
యుద్దంలో రాకేష్ వీరోచితంగా పోరాడినందుకు గుర్తించారు ప్రభుత్వం వారు. నిశ్శబ్దంగా నించున్నాడు.
ఆ నిశ్శబ్ధంలో కూడా తను దగ్గరగా ఉంటే చాలు ఏంతో గుండె ధైర్యంగా ఉంటుంది అనుకుంటోంది బిందు. తన మాట్లాడటానికి సరే ఇది సమయం కాదు. వేరే సారి కలిసినపుడు మాట్లాడదామనుకొంది.
పరాంకుశం తన కళ్ళలోకి చూసాడు, బిందు ఏదో చెప్పాలని నిగ్రహించుకొన్నట్లు తెలుస్తోంది. ఇంకా కన్నీరు ఆవిరి కానేలేదు.
'మళ్ళీ కలుస్తాను' అని చెప్పి మరొకసారి వెనుకకు తిరిగి కంటి చూపులతో పలకరించి బయలుదేరాడు. ఆ పాప ఆటలు ఆడుతూ అటువెడుతున్న పరాంకుశాన్ని హద్దుకుంది. తల మీద నిమిరాడు.
ఓ సారి పోస్టాఫీసు లో కనిపించింది. ప్రభుత్వం వారు నెల నెలా రాకేష్ వాళ్ళ కుటుంబానికి చెందే మొత్తం వేసేందుకు కావలసిన అకౌంట్ తెరవడానికి పోస్ఠాఫీసు వచ్చింది. పరాంకుశం దగ్గర ఉండి అన్నీ చూసుకొన్నాడు.
ఆ పని పూర్తయిన తరువాత పరాంకుశం తో ' ఒక సారి మీతో మాట్లాడాలను కుంటున్నాను' అని చెప్పింది బిందు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో రావచ్చు నేను ఎలాగూ బయటకు వెడుతున్నాను ఈ ఉత్తరాల డెలివరీ కు అన్నాడు. సరేనంటూ తనూ, పాప నడిచారు.
'మీ గురించి మీ నానమ్మ గారి గురించి రాకేష్ కు సరాగాగా చెప్పాను' అంది. అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిసాయి.
'పెళ్ళయిన కొత్తలో సంగతి. కోపంగా ఉండేదాన్ని'. అంది
రాకేష్ నన్ను అర్థాంతరంగా పెళ్ళి చేసుకొని తీసుకువెళ్ళినందుకు అదీకాక నాతో చాలా తక్కవ సమయం గడుపుతున్నందుకు ఇంట్లో తోచక పోరు పెట్టేదాన్ని. ఓ రోజు అనుకోకుండా మీ ప్రస్తావన తీసుకొని వచ్చాను.
'ఆ సంగతి తెలుసుకొని జరిగిందంతా అడిగాడు, ఈ సారి ఆ ఊరు వెళ్ళినపుడు నన్ను పరాంకుశాన్ని కలిసేలా చేయి. నేను మాట్లాడి సారీ చెప్పాలన్నాడు సరదాగా'
‘పాత సంగతులు ఎందుకు లేండి, జరిగిందేదో జరిగిపోయింది’ అన్నాడు.
‘మీకు ఏ రకమైనా సహాయం కావలన్నా చేస్తానన్నాడు’.
బిందు తన తోడు కోరుకుంటోంది. పరాంకుశం మాత్రం జాలితో సహాయం చేద్దామన్న ఉద్దేశ్యం తప్ప తన లాగా ఆలోచించడం లేదని గ్రహించింది.
బిందు తల్లితండ్రుల గురించి అడిగాడు. వాళ్ళు కూడా నానమ్మ గారి దగ్గరకే చేరుకున్నారని చేప్పింది. రాకేష్ తల్లి తండ్రులు నన్ను, పాపని చేరనీయలేదుట. ‘అలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళాలో తోచక ఇక్కడకే వద్దామని నిశ్చయించుకున్నాను’ అని చెప్పింది.
తను ఉంటున్న వీధి రాగానే సెలవు అడిగి తను బయలు దేరాడు. పరాంకుశానికి పెళ్ళిచేసుకోవాలని కానీ, తనతో కలిసి ఉండటమూ అన్న ఆలోచన ఎందుకో సబబుగా అనిపించలేదు.
ఓ సంవత్సరం నుండి తను కూడా ఆ ఊరునుండి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఇంతవరకూ ఏ సంగతి తెలియలేదు.
మరీ దగ్గరేకంటే దూరంగా ఉండటమే ఇద్దరికీ మేలని తను నిశ్చయం తీసుకున్నాడు.
ఓ సారి ఆఫీసులో ట్రాన్సర్ గురించి మళ్ళీ అడిగాడు.
ఓ నెలలో ట్రాన్సఫర్ ఆర్డర్లు రావచ్చని తెలిసింది.
ఆర్డర్ వచ్చిన కొన్ని రోజుల తరువాత ఓ సారి బిందు ఇంటికి వెళ్ళాడు.
పరాంకుశం ఇంటికి రావడం చూసి మనసులో ఎన్నో ఆశలు రేగి ఆ ఆహ్వానంలోనే తన ఆనందమంతా చూపించింది బిందు.
ఎలా చెప్పాలో తెలియక కొంత సేపటి వరకూ మాట్లాడకుండా నించున్నాడు.
'అయ్యో ఆలోచనలో పడి కూర్చోండి అని కూడా అనలేదు. క్షమించండి' అంది
'ఫర్వాలేదు' అన్నాడు.
జేబులోంచి ఓ ప్యాకెట్ తీసి తన చేతికి అందచేసాడు.
'నానమ్మ...మన మీద చాలా ఆశలు పెట్టుకొంది కాబోలు' అంటూ తనకోసం అంటూ ఆ పాప వైపుకు చూపిస్తూ ఇవ్వమని చెప్పాడు.
నానమ్మ గారు మాటలు మనసులో మెదిలాయి. ప్యాకెట్ తీసి చూసింది. లోపల నానమ్మ గారి బంగారపు గొలుసు కనిపించింది.
ఇంకో విషయం అంటూ ఆగాడు..
'’ఈ ఊరునుండీ ట్రాన్సఫర్ అయ్యింది' అన్నాడు.
‘ఓ వారంలో ఈ ఊరి నుండి వెళ్ళాల్సివస్తుంది’ అన్నాడు
‘ఎందుకో మీకు ఈ సంగతి చెప్పాలని పించింది', అన్నాడు పరాంకుశం. బిందు కన్నీళ్ళలోనుంచి నీరు జలపాతంలా వద్దన్నా తన్నుకు వచ్చింది.
'అర్థం చేసుకుంటారు కదూ' అంటూ 'ఏనాడు అవసరం అనిపించినా నేనున్నాని మాత్రం మరువద్దు' అంటూ ఓ లెటర్ అందచేసాడు.
'దీనిలో ఆ ఊరి అడ్రెస్ వివరాలు పొందు పరిచాను' అన్నాడు.
వెనుతిరిగాడు. ఎవరో చేతులు పట్టుకొన్నట్లుగా అనిపించింది. స్పర్శ తెలియని చేతులు మృదువైనవి అవి బిందు వే అనుకున్నాడు. చిన్నగా వొదిలించు కన్నాడు, వెనక్కు చూసే ధైర్యం చేయలేదు.
'జీవితాంతం మీకో స్నేహితుడు ఉన్నాడని మరువద్దు బిందు' అన్నాడు మొదటిసారి తనను పేరుతో పిలిచాడు.
ఆ పిలుపు చిరకాలం నాతో మిగులుతుందనుకోంది. పరాంకుశం బిందు చేతి స్పర్శ తనతో చిరకాలం మిగిలి పోతుందనుకున్నాడు.
ఆ రోజు పోస్టాఫీసులో ఆఖరి రోజు. అందరూ వీడ్కోలు పలికుతున్నారు. గత కొన్ని నెలలుగా మన పరాంకుశానికి మనసు మనసులో లేదు అని మాట్లాడుకుంటున్నారు. పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చారు కొందరు. ఇన్నేళ్ళ సర్వీసులో మన పరాంకుశం అంత మంచి మనసున్న పోస్టమాన్ ను చూడలేదని పోస్టుమాస్టారు గారు ప్రశంశలు కురిపించారు. అందరికీ పరాంకుశం నచ్చుతాడు. ఏం చేసేవాడివో చెప్పేదాకా విన్ను ఒదిలేదు లేదు అంటూ ఏడిపిస్తున్నారు అందరూ.
పరాంకుశం ధ్యాస ఎక్కడుందో తనకే తెలియదు.
ఓ రోజు తలుపు గడియకొట్టారు. బిందు పాపతో బయటకు వచ్చింది. పోస్టుమాన్ అంకుల్ అంటూ దగ్గరకు వెళ్ళి తన చేతిలోది తీసుకుంది. అందచేసి వెడిపోయారు. అమ్మ చేతికిచ్చి లోపలకు పరిగెత్తింది. తెరిచి చూసింది. మధ్య మధ్యలో కన్నీరు చీరకొంగుతో తుడుచుకుంటూ చదువుతోంది. చివరలో..
తోడు ఎంతైనా అవసరమనిపించింది. మీకు అభ్యంతరం గనుక లేకపోతే పాపతో ఈ ఊరికి వచ్చేయండి.మీ రాకకు ఎదురుచూస్తూ.. మీ పరాంకుశం ‘ అని చదివింది.
పాప బయటకు వచ్చి ‘మళ్ళీ ఏడుస్తున్నావా?’ అని అడిగింది.
‘నాన్న దగ్గరకు వెడదాం పదా, చాలా రోజులయ్యింది’ అంది
కౌగిలించుకుంది. ‘రెండు రోజులాగి సర్ధుకోని వెడదాము’ అంది బిందు.
‘ఇంకెపుడూ ఏడవగూడదు. సరేనా’ అంది పాప.
‘సరే’ అంది బిందు.
No comments:
Post a Comment