బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ నటులు ప్రదీప్ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ నటులు ప్రదీప్ గారితో ముఖాముఖి

Share This
బహుముఖ ప్రజ్ఞాశాలి  సినీ నటులు ప్రదీప్ గారితో ముఖాముఖి 
భావరాజు పద్మిని 

అతి చిన్న వయసులోనే అనుకోకుండా సినీ రంగంలో అడుగుపెట్టి, ఆ తర్వాత సి.ఎ పూర్తి చేసి, టీవీ రంగంలో ప్రముఖ పాత్రను పోషించడమే కాకుండా, తాను జీవితంలో పొందిన అనేక అనుభవాల ద్వారా, యువతను సరైన దారిలో నడిపించేలా శిక్షణ ఇస్తున్నారు సినీ, టీవీ, నటులు కొండిపర్తి ప్రదీప్ గారు. వారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం... 
చిన్నప్పటినుండి మీకు నటన పట్ల ఆసక్తి ఉండేదా ?
అవునండి. ప్రముఖ రంగస్థల కళాకారులు విన్నకోట రామన్న పంతులు గారు మా తాత. సహజంగా నటుల కుటుంబం కావడంతో అతి చిన్న వయసు నుంచే నాటకాలు వేసేవాడిని.  అమ్మా, నాన్నా ఇద్దరికీ కళల్లో అభినివేశం ఉంది. మా ఇల్లు సాహితీ సాంస్కృతిక నిలయంలా ఉండేది. మేము ఐదుగురం అన్నదమ్ములం. నేను మూడోవాడిని.వారు పెట్టిన ఒకటే నియమం ఏమిటంటే ఫస్ట్ క్లాసు లో పాస్ అవ్వాలని. నా కెరీర్ లో నేను చదువులో బానే షైన్ అయ్యాను.
ఐదో ఏట నేను నాటకరంగం వైపు అడుగులేసాను. ఏడేళ్ళ వయసులో ‘కప్పలు’ అనే ఆత్రేయ గారు రాసిన నాటకం వేసాను. నా 13 వ సంవత్సరంలో గొల్లపూడి మారుతీరావు గారు రాసిన ‘రాగరాగిణి’ అన్న నాటకం వేసాను. అందులో ఒక మూగ పాత్ర వేసినందుకు ఆల్ ఇండియా లెవెల్లో ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ‘గా ప్రైజ్ వచ్చింది నాకు.
జంధ్యాల గారితో మీకు పరిచయం ఎలా కలిగింది ?

ఒకసారి రవీంద్ర భారతిలో జంధ్యాలగారు రాసిన ‘ఓ చీకటి రాత్రి’ అన్న నాటకం వేస్తుండగా జంధ్యాల గారు ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు చూసి, నన్ను ‘ముద్దమందారం’ సినిమాలో హీరోగా తీసుకున్నారు. రెండో సినిమా బ్రేక్ పడకూడదని , ' మల్లెపందిరి ' లో గెస్ట్ రోల్ చేయించారు. మూడోది ' నాలుగు స్థంభాలాట ' ! అదే నేను చేసిన ఆఖరు సినిమా . గొప్ప విషయం ఏమిటంటే, తర్వాత్తరవాత నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్ కి (సంధ్యారాగంలో శంఖారావం ) జంధ్యాల గారు డైరెక్ట్ చేశారు. అది నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవం.
'ముద్దమందారం' తర్వాత మీ ప్రస్తానం ఎలా కొనసాగింది?
ఈ సినిమాలో నేను నటించినప్పుడు నాకు 19 ఏళ్ళు. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. ఆ సమయంలో పెద్ద పెద్ద నట దిగ్గజాల వంటి హీరోలు ఒక 15 మంది ఉండేవారు. వీళ్ళందరి తర్వాతే మన నెంబర్ వస్తుంది. అటువంటప్పుడు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను చదువుకోకపోతే, ఒకవేళ సరైన అవకాశాలు లేకపోతే ఏమైపోతానా అన్న ఆలోచనతో, చదువుకున్నాకా, ఒక పాతికేళ్ళు వచ్చాకా, తిరిగి ఇండస్ట్రీకి వెళ్లాలని అనుకున్నాను. ఆ గ్యాప్ లో బాలచందర్ గారు, భారతీరాజా గారు, భానుమతి గారు వంటి గొప్ప దర్శకులు స్క్రీన్ టెస్ట్ కు పిలిచారు. కాని, చదువును కొనసాగించాలన్న నా కోరికను మన్నించి, దీవించి పంపారు. సీఏ, సైకాలజీ డిగ్రీ విద్యాభ్యాసం తర్వాత సినీ పరిశ్రమలో తిరిగి ప్రవేశించడం జరిగింది. అప్పుడు నటించిన నాలుగు స్తంభాలాట’, ‘రెండు జెడల సీతసినిమాలు అప్పట్లో ఎంతగానో ప్రజల ఆదరాభిమానాలు చూరగొని సినీ పరిశ్రమలో మైలు రాళ్లుగా నిలిచాయి.
బుల్లితెర వైపు మీ దృష్టి ఎలా మళ్ళింది?
నేను సి.ఎ మూడేళ్ళు చదివాకా, రెండో పరీక్షకు ఒక గాప్ వచ్చింది. అందులో ప్రభు గారనే ఒకాయన ‘అనగనగా శోభ’ అనే ఒక డాక్యు డ్రామాను 13 భాగాలుగా, నాతోనూ, శిల్పతోనూ, హైదరాబాద్ దూరదర్శన్ కోసం తియ్యాలని నన్ను సంప్రదించారు. అందులో నటించాను. అప్పుడు మా అన్నయ్య నన్ను టీవీ రంగంలోనే కొనసాగమని సలహా ఇచ్చారు. అప్పట్లో నాకు 25 ఏళ్ళు. పేరు, కీర్తి, డబ్బు విరివిగా దొరికే సినీ రంగాన్ని వదిలి, నేను బుల్లితెర వైపు మళ్లడం పలువురికి నచ్చలేదు. అప్పట్లో టీవీ అంటే చిన్న చూపు ఉండేది. అప్పుడు నేను “ఒక పెద్ద రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉండే బదులు, ఒక చిన్న రాజ్యానికి రాజుగా ఉండాలనుకుంటున్నాను,” అని చెప్పాను. అలాగే ఉన్నాను.
 జంధ్యాల గారితో పని చేస్తున్నపుడు నాకు స్క్రీన్ ప్లే లో ఆసక్తి కలిగింది. ఆ శిక్షణతో నేను కొన్ని సీరియళ్ళకు దర్శకత్వం వహించాను. 1986లో తొలిసారిగా రాష్ట్రంలో బుల్లితెర సీరియళ్ల సంస్కృతిని తీసుకొచ్చిన ఘనత నాకే దక్కుతుంది. ‘బుచ్చిబాబు’ సీరియల్‌ మొత్తం ఆంధ్రా తెలుగు పరిశ్రమలో టీవి సీరియళ్ల పరంపర ప్రారంభమైంది. నేను దర్శకత్వం వహించిన మట్టి మనిషి సీరియల్ లో అక్కినేని నాగేశ్వరరావు నటించారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాతగా, దర్శకుడిగా, ఆర్టిస్ట్‌ గా 100 సీరియళ్లను నిర్మించాను. సీరియల్స్‌ లో 12 నంది అవార్డులు నాకు దక్కాయి. నా భార్య సరస్వతి కూడా టీవీ సీరియల్స్‌లో నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ రాణిస్తోంది.
ఇలా స్టేజి, టీవీ, రేడియో, సినిమా నాలుగు మాధ్యమాలతో సంబంధం ఉన్న అతి కొద్ది మంది ఆర్టిస్ట్ లలో నేను ఒకడిని.
 సరస్వతి గారితో మీకు పరిచయం ఎలా కలిగింది?
ఇది మా పెద్దలు చూసిన తొలి సంబంధం. పెద్దల సమ్మతితో 88 లో మా పెళ్లి అయ్యింది. పెళ్లైన తర్వాత తను కొన్నాళ్ళు చదువుకుని, లెక్చరర్ గా చేసింది. ఆ తర్వాత 89 లో శైలజా సుమన్ గారి ప్రోత్సాహంతో తనూ ఆంకరింగ్ లోకి వచ్చింది. నాకు అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉండే సరస్వతి నా జీవితంలో నాకు లభించిన గొప్ప వరమని చెప్పగలను.
జంధ్యాల గారి సినిమాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. డైలాగ్స్ ఎప్పుడు రాసేవారు, పాత్రల సృష్టి, దర్శకత్వం, డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఎలా చేసేవారు? మీరు గమనించిన విశేషాలు చెప్పగలరా ? 

ఆయనలో గొప్ప దర్శకుడినే మీరు చూసారు. కాని, ఆయనలో గొప్ప రచయత కూడా ఉన్నారు. నాలుగు స్తంభాలాట సినిమా తీస్తూ, అదే సమయంలో ఆయన మరో మూడు సినిమాలకు డైలాగ్ లు రాయటం నేను చూసాను. అందులో ఒక సినిమా ఛాయలు మరొక సినిమాపై పడకుండా, హాస్యాన్ని, ఆర్ధ్రతను విడివిడిగా అతి గొప్పగా పలికించిన ఆయన ఘనత చూసాను. ఆయన పాత్రలన్నీ ఆయన చుట్టుప్రక్కల గమనించిన వివిధ వ్యక్తుల మనస్తత్వాల లోంచే పుట్టేవి. ఆ మానరిసమ్స్ నే ఎక్షాగరేట్ చేసి, పాత్రలు సృష్టించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అంకితభావం కల ఒక గొప్ప జీనియస్ !
 ప్రస్తుతం నటులుగా కెరీర్ ఎంచుకునేవారు అవకాశాలు లేనప్పుడు డిప్రెషన్ కు గురై, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారికి మీరిచ్చే సందేశం ఏమిటి?
ఇది సరైన పధ్ధతి కాదు. ఇటువంటి బలహీన క్షణాల్లో వారు నావంటి అనుభవజ్ఞులతో మాట్లాడి సూచనలు తీసుకోవాలి. ఒక దారి మూసుకుపోయినప్పుడు, మరొక దారిలో పయనించాలి కాని, జీవితాన్నే అంతం చెయ్యడమనేది సబబు కాదు.
ఎవరి జీవితమూ సరళరేఖ కాదు, నా కెరీర్ లోనే నేను అనేక రంగాల్లో, అనేక రకాల సవాళ్ళను ఎదుర్కుంటూ విజేతగా నిలిచేందుకు ఎంతో కష్టపడ్డాను. మనం కన్న కలలను నిజం చేసుకోవాలంటే రైతు పొలంలో విత్తనాలు చల్లి సాగు చేసిన విధంగా కష్టపడాలి. మధ్యలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కుని, నిలబడాలే తప్ప, జీవితాల్ని అంతం చేసుకోకూడదు. నా 35 ఏళ్ళ కెరీర్ లో నేను ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా అన్నీ తట్టుకుని నిలబడ్డాను. పరిస్థితులకు అనుగుణంగా ఇలా తమను తాము మలచుకునే నేర్పును అలవార్చుకోవాలన్నదే వారికి నా సూచన.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
నేను పెద్దగా ప్రణాళికలు ఏమీ వేసుకోను. నా మనసుకు నచ్చిన పని చేస్తాను. నా 35 ఏళ్ళ కెరీర్ లో ఇలాగే పనిచేసాను. ప్రస్తుతం ‘దర్శకుడు’ అనే సినిమాలో నటిస్తూ, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, ఈవెంట్ మానేజ్మెంట్, డాకుమెంటరీ లు తియ్యడం, రేడియో నాటకాలు వెయ్యడం వంటి అనేక ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.

శ్రీ ప్రదీప్ గారు, సరస్వతి గారు జీవితంలో మరిన్ని విజయాలను సాధించాలని మనసారా ఆకాంక్షిస్తోంది ‘అచ్చంగా తెలుగు.’
***


No comments:

Post a Comment

Pages