ప్రేమతో నీ ఋషి – 27
-
యనమండ్ర
శ్రీనివాస్
( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక
తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది.
కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా
పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే
తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని
అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి
పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న
ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత
అది ఏమైందో ఎవరికీ తెలీదు.
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది
గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే,
కొంత గతం తెల్సుకోవాలి.... కొన్ని నెలల
ముందు మాంచెస్టర్ లో గొప్ప వ్యాపార
దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు
సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో
స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా
పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు
క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని
చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్
వేలానికి వారిద్దరూ వెళ్తుండగా, దారిలో
స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని
చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి
మహేంద్రతో ఆ విషయం చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో
కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని,
అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ మృణాల్ శవం కనిపిస్తుంది. మృణాల్ నకిలీ
పెయింటింగ్స్ తయారుచేసే వర్క్ షాప్ ను ఎక్కడ ఏర్పరిచాడో పరిశోధిస్తుంటారు ఋషి,
స్నిగ్ధ. ఇక చదవండి...)
“ఎస్, మీరు చెప్పేది నిజంగా సాధ్యమే. మనం
మహేంద్ర వేలిముద్రల నకలును తేలిగ్గా రూపొందించగాలం. “అన్నారు వశిష్ట ఆచార్య.
వశిష్ట మాంచెస్టర్ సిటీ హాస్పిటల్ లో
వేలిముద్రల నిపుణుడు, సీనియర్ డాక్టర్. చాలామంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు,
క్రిమినల్ విషయాల్లో ఆయన్ను తరచుగా సంప్రదిస్తూ ఉంటారు. ఆయన ఋషికి క్లైంట్, ఋషి
ఆయనకు రిలేషన్షిప్ మేనేజర్. ఆయనకు ఋషితో
మంచి అనుబంధం ఉంది.
వేలిముద్రల నకలు గురించి ఋషి అడిగిన
ప్రశ్నకు ఆయన సాధ్యమేనని బదులిచ్చారు.
“ఆ నకలు బయోమెట్రిక్ డివైస్ ను కూడా
మోసపుచ్చేంత ప్రామాణికంగా ఉంటుందా ?” ఋషి మళ్ళీ అడిగాడు. ఋషి ఏం చెయ్యబోతున్నాడో
స్నిగ్ధకు అర్ధం కావట్లేదు.
“నువ్వు చెయ్యబోతున్నది చట్టపరంగా సరైనదా
లేదా అన్నది నాకు తెలియట్లేదు. నిజమే, ఈ వేలిముద్రల నకలుతో నువ్వు బయోమెట్రిక్
డివైస్ ను కూడా మోసపుచ్చగలవు. ఫోర్జరీలు చాలా సులువు. సాంకేతికంగా, ఏ
వేలిముద్రకైనా నకలు తయారుచెయ్యడం పెద్ద సమస్యేమీ కాదు. ప్రస్తుతం ఉన్న సులుభమైన
పద్ధతుల ద్వారా వేలిముద్రల ఫోర్జరీ చాలా సులువు. కొన్ని వారాల క్రితం ఒక
నేరస్తుడు, తోటి నేరస్థుడి చూపుడు వేలిముద్ర సంపాదించాడు. దాన్ని “నా స్నేహితుల వేలి ముద్రలు” అన్న ఒక
పుస్తకం నుంచి సేకరించాడు, దాని యజమానికి ఆ పుస్తకం సంగతి కూడా గుర్తు లేదు.
అందులో ఇండియన్ ఇంకుతో ఉన్న ఒక కుడి చేతి వేలిముద్రను ఇతను తీసుకుని, ఆ ముద్రను ఒక
మంచి నాణ్యతతో కూడిన రబ్బర్ స్టాంప్ గా మలిచాడు. దాన్ని తయారు చేసాకా, జాగ్రత్తగా
తుడిచాడు. ఆ తర్వాత ఒక ఆఫీస్ బద్దలుకొట్టి, అందులో ఉన్న సొమ్మంతా దోచుకు
వెళ్ళిపోతూ, తన మిత్రుడి వేలిముద్రల్ని తెలివిగా అక్కడ వేసి, వెళ్ళాడు. “మాంచెస్టర్
సిటీ పోలీస్ వారితో పరిశోధించిన ఒక తాజా కేసు గురించి ఆయన ఋషికి చెప్తున్నారు.
“వశిష్ట్, దీనిలో మీరు నాకు సాయం చెయ్యగలరా?
ఈ అమ్మాయి జీవితం కాపాడేందుకు నాకు ఇది చాలా అవసరం. దీనివల్ల మీకే ఇబ్బందీ కలగదని
నేను మాటిస్తున్నాను.దయుంచి నాకు సాయం చెయ్యండి.” ఋషి వశిష్టను బ్రతిమాలాడు.వశిష్ట
ముందు నిరాకరించారు. ఋషి పరిపరి విధాలా బ్రతిమాలాకా, ఆయన ఒప్పుకున్నారు.
అప్పటికే స్నిగ్ధ ఆలోచించడం మానేసింది.
సమయం గడుస్తున్న కొద్దీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆమెను ఆమె మలచుకోలేకపోతోంది.
ఋషి ఏం చెయ్యబోతూ ఉన్నాడో కూడా ఆమెకు తెలియట్లేదు.
“మీ వద్ద మహేంద్ర వేలిముద్రలు ఉన్నాయా?”
ఋషికి సాయపడేందుకు ఉద్యుక్తుడవుతూ అడిగారు వశిష్ట.
“ఉన్నాయి, స్నిగ్ధ వద్ద ఉన్నాయి, “ఋషి
వెంటనే సమాధానం ఇచ్చాడు.
స్నిగ్ధ ఇది వినగానే షాక్ కు గురై మాట్లాడింది.
“నా దగ్గరా?ఎలా? నా దగ్గర ఆయన వేలిముద్రలు లేవు. “ అంది.
“స్నిగ్ధ, గుర్తు చేసుకో, నీ పుట్టినరోజు
నాడు మహేంద్ర తన వేలిముద్రలను DNA ఆర్ట్
కోసం నీకు ఇచ్చారు. దాన్ని నువ్వు పోర్ట్రైట్ గా మార్చాలని అనుకున్నావు, కదూ?”
ఋషికి బాగా గుర్తున్నట్లుగా అనిపించింది.
“అవును...” స్నిగ్ధ ఇంకేమీ మాట్లాడలేకపోయింది.
ఆమెను మరింత మాట్లాడనివ్వకుండా, ఋషి
వెంటనే ఆమె వద్దకు ఒచ్చి, ఆమె హ్యాండ్ బాగ్ తీసి, అందులో ఒక కార్డులో స్నిగ్ధ
భద్రంగా దాచిన మహేంద్ర వేలిముద్రలను బయటికి తీసాడు.
“కాబట్టి, మనం చెయ్యాల్సిందల్లా ఈ
వేలిముద్రలను బయోమెట్రిక్ డివైస్ కు అనుకూలంగా మలచాలి, కదూ? “ ఋషి వశిష్టను
అడిగాడు.
“క్లుప్తంగా చెప్పాలంటే... అంతే.” వెంటనే
బదులిచ్చారు వశిష్ట.
వెంటనే మహేంద్ర వేలిముద్రలకు నకలును
తయారుచేసే పని మొదలైంది.
****
“హలో స్నిగ్ధ, ఎక్కడున్నావ్? సండే రోజు నిన్ను
ఇబ్బంది పెడుతున్నానా?” వారిద్దరూ ఆఫీసుకు వెళ్తూ ఉండగా మహేంద్ర ఇండియా నుంచి కాల్ చేసారు.
“లేదు బాస్, దయుంచి చెప్పండి, నేను మీకు ఏ విధంగా
సాయం చెయ్యగలను?” ఆ సమయంలో స్నిగ్ధ మహేంద్ర కాల్ ను ఊహించలేదు. అదీ మృణాల్ నకిలీ
పెయింటింగ్స్ ను ఎలా తయారు చేసేవాడో కనుగొనేందుకు వాళ్ళిద్దరూ ఆఫీస్ కు వెళ్తున్న
సమయంలో ఆమెకిది ఇబ్బందిగా ఉంది.
“గత మూడు రోజులుగా ఒక పనిమీద మృణాల్ తో
మాట్లాడాలని చూస్తున్నాను. అతను దొరకట్లేదు. అతను ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా?
రోజూ ఆఫీస్ కు వస్తున్నాడా? మహేంద్ర మామూలుగా అడిగినా, స్నిగ్ధకు వెన్నులోంచి
వణుకు పుట్టసాగింది.
వెంటనే ఆమె బదులివ్వలేకపోయింది. కొన్ని సెకండ్ల
తర్వాత, ఆమె తేరుకుని, “బాస్, నాక్కూడా తెలీదు. నేనతన్ని రెండు రోజుల క్రితం
చూసాను. రేపు ఆఫీస్ కు వస్తాడేమో చూస్తాను. మీకు ఏ సంగతీ చెప్తాను. ఇంకేమైనా సాయం
కావాలా?” అని అడిగింది .
“స్నిగ్ధ, ఆ పని చెయ్యి. విశ్వామిత్ర పెయింటింగ్
గురించి మీరు పరిశోధిస్తూ ఉన్నారని భావిస్తాను. ఈ వారంలో ఏ సంగతీ తేల్చేయ్యండి. ఈ
ప్రాజెక్ట్ లో ఎటువంటి లోపాలు జరక్కూడదని, నేను మిష్టర్ శర్మ ని దీని
డాక్యుమెంటేషన్, ఆడిట్ ప్రాసెస్ లన్నీ చూసుకోమని చెప్పాను. నా డబ్బు వృధాగా
పోలేదన్న నమ్మకాన్ని ఇది ఇస్తుంది. మున్ముందు ఏం చెయ్యాలో ఈ ఆడిట్ రిపోర్ట్,
సాంకేతిక పరీక్షలు తెలియచేస్తాయి. నువ్వు మిష్టర్ శర్మకు సాయం చేస్తావని
నమ్ముతున్నాను. మనం ఆయన అడిగిన సమాచారమంతా ఇవ్వాలి. రేపు ఆయన మాంచెస్టర్ వస్తున్నారు.”
అన్నారు మహేంద్ర మాట్లాడడం ముగిస్తూ. ఆయన మాట్లాడిన ప్రతీ మాట ఆమెకు తన తలపై
పేలబోయే బాంబులా అనిపించింది.
ఆమె తన ఉద్వేగాన్ని జాగ్రత్తగా కప్పిపుచ్చి, “ఇది
చాలా మంచి ఐడియా. మొత్తం డాక్యుమెంటేషన్ అంతా నేను వారితో పంచుకుంటాను. ఆయన మన
ఆఫీసుకు వస్తున్నారా?” అని అడిగింది స్నిగ్ధ.
“లేదు, ఆయన హోటల్ నుంచే అన్నీ చూస్తారు, రేపు
మాంచెస్టర్ రాగానే ఆయన నీకు కాల్ చేస్తారు. ఏం కంగారు పడకు, కాని మొత్తం ప్రక్రియ
జాగ్రత్తగా జరిగేలా చూడు. ఇది నా పరువుప్రతిష్టలకు సంబంధించిన అంశం.”
గత కొన్ని రోజులుగా దెబ్బ మీద దెబ్బ తగులుతూ
ఉండడంతో ఆమె తల బద్దలయ్యేలా ఉంది. ఆమె తన ఆలోచనల్లో ఉండగానే ఋషి స్నిగ్ధ ఆఫీస్ ను
చేరుకున్నాడు. వారు కార్ దిగి, ఆఫీస్ లోకి వెళ్ళారు.
(సశేషం)
No comments:
Post a Comment