సామ్రాజ్ఞి – 11 - అచ్చంగా తెలుగు
సామ్రాజ్ఞి – 11
భావరాజు పద్మిని

(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్దంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. తమ రాజ్యంలోని వివిధ బలాబలాలను గురించి అర్జునుడి సర్వసేనానియైన ప్రతాపరుద్రుడితో చెబుతూ ఉంటుంది వీరవల్లి. ఈలోపు విదూషకుడు చతురుడు అక్కడికి వచ్చి, వారికి వినోదాన్ని కల్పిస్తాడు. సంధిచర్చలకు సీమంతిని నగరానికి రావాలన్న కోరికతో వీరవల్లి ద్వారా సామ్రాజ్ఞికి ఒక లేఖను పంపుతాడు అర్జునుడు. ఆమె ఆహ్వానంపై అర్జున సేన   స్ర్తీ సామ్రాజ్యం చేరుకొని, అక్కడి అద్భుత నిర్మాణ వైశిష్ట్యానికి ఆశ్చర్యపోతారు . ఇక చదవండి...)



ప్రాతఃకాలం...
ఉదయాన్నే కాలకృత్యాలు ముగించుకుని, సంధ్య వార్చుకున్నాడు అర్జునుడు. స్వర్ణ అతిధి గృహం బయట ఉన్న ఉద్యానవనంలో వ్యాహ్యాళికి బయలుదేరాడు.

మంచుకి తడిసిన పారిజాతాల సుతిమెత్తని పరిమళం గాలిలో కలిసి మత్తెక్కిస్తోంది. ఉద్యానవనం మధ్యలో ఏర్పరిచిన బాట నిండా రాలిన పున్నాగలు పూల తివాసీ పరచినట్లు ఉన్నాయి. అప్పుడే విరిసిన పువ్వులలోని మధువు కోసం తుమ్మెదలు రొద చేస్తూ అన్వేషిస్తున్నాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు పువ్వుల మీదుగా ఎగురుతుంటే, వనంలోని కొన్ని పూలకి రెక్కలొచ్చి ఎగురుతున్నట్లు అనిపించసాగింది. ఆ కొండ మీద నుంచి, కొండను వడ్డాణంలా చుట్టుకున్న పంపానది, దానికి ఆవల రెల్లు గడ్డి లంకలు కనిపించసాగాయి. ఆ మనోజ్ఞమైన ప్రకృతిలో అర్జునుడు మైమరచి నడుస్తూ ఉండగా, అద్భుతమైన సంపెంగల సుగంధం అతడిని  కమ్మేసింది. సంపంగి పూలంటే అతనికి చాలా ఇష్టం.

ఆ సువాసనను వెతుకుతూ అలా ఎంత దూరం వెళ్ళాడో అతనికే తెలీలేదు. చివరికి తారసపడింది ఒక సంపెంగ వనం. అందులో విరబూసిన చంపక వృక్షాలు, ఆకుపచ్చ సంపెంగలు, ఆకు సంపెంగలు, ఇలా సంపెంగల్లో ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో, అన్నీ అక్కడకు తెచ్చి, శ్రద్ధగా పెంచుతున్నట్లు ఉంది. కనీవినీ ఎరుగని క్రొంగొత్త సంపెంగ జాతులు కనువిందు చేస్తూ ఉండడంతో, పరవశించి చూడసాగాడు అర్జునుడు. దివిలో తను దర్శించిన దేవేంద్రుడి ఉద్యానవనాన్ని తలపిస్తోంది.

మరో ప్రపంచంలో తేలియాడుతున్న అర్జునుడు లయబద్ధమైన అందెల సవ్వడి చెవులకు సోకడంతో ఈ లోకానికి వచ్చాడు. ఆ దిశగా వెళ్ళిన అర్జునుడికి, అక్కడొక పెద్ద వేదిక కనబడింది. ఆ వేదికపై నాట్యాచార్యుడు నట్టువాంగం వాయిస్తూ, గానం చేస్తూ ఉండగా, ఒక విలక్షణమైన నాట్యం చేస్తోంది ఒక స్త్రీ. ఆమెనే చూస్తూ ఉన్నారు వేదిక దిగువన ఆసీనులైన మరికొందరు స్త్రీలు. ఉత్సుకతతో మరింత సమీపానికి వెళ్లి, తాను ఎవరికీ కనిపించకుండా ఒక పొద మాటున దాగి చూడసాగాడు.

తనూ అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా విరాట రాజపుత్రి ఉత్తరకు నాట్యం నేర్పినవాడే కదా ! నృత్య శాస్త్రంలో ఇటువంటి నృత్యాన్ని ‘మోహిని అట్టం’, అంటే మహావిష్ణువు మోహినీ అవతార గాధను తెలిపే నృత్యమిది. అడపా దడపా దక్షినాది నుంచి వచ్చే నృత్య కళాకారులు ఇటువంటి నాట్యాన్ని చెయ్యడం తను చూసాడు. కానీ, ఇటువంటి అద్భతమైన లాస్యాన్ని, హావభావాలను ఎన్నడూ చూడలేదు.

మోహినీ అట్టం నాట్య ప్రక్రియ భరతముని తన నాట్య శాస్త్రంలో వివరించారు. ఇందులో అతి క్లిష్టమైన అంశం ఏమిటంటే, శివుడిగా తాండవం చేస్తూ, ఆ గాంభీర్యం, రౌద్రం పలికించాలి, తర్వాత విష్ణువు మోహినిగా అవతరించిన సమయంలో ఆ స్త్రీ సహజ లాలిత్యాన్ని, అనేక రసాలు మేళవించిన కవళికలను ప్రదర్శించాలి. మళ్ళీ లయ, తాళం, ముద్రలు, భంగిమలూ  ఏవీ తప్పకూడదు. ఎక్కడా తడబడకుండా నర్తిస్తోంది ఆమె. అద్భుతమైన ఆమె సౌష్టవం ఆమె విన్యాసాలకు మరింత సౌందర్యాన్ని ఆపాదించి పెడుతోంది. ఆమె నాట్యంలో పూర్తిగా లయమయ్యింది, కాదు కాదు, ఆమే నాట్యంగా మారిపోయింది. అలా జరిగితే తప్ప, ఈ స్థాయిలో నర్తించే అవకాశం లేదు. ఈమె ఎవరై ఉంటుంది? ఈ రాజ్యానికి ఆస్థాన నర్తకేమో. లేదు, లేదు, అంతకు మించిన హుందాతనమేదో ఈమెలో ఉంది... అర్జునుడు ఆలోచిస్తూ ఉండగా, ఆమె నాట్యం ముగియడంతో క్రింద ఉన్న స్త్రీలంతా బిగ్గరగా అరుస్తూ చప్పట్లు కొట్టారు.

“భళా సామ్రాజ్ఞి, భళా ! మీ నాట్యం నిరుపమానం, అద్వితీయం !” ప్రసంశించారు నాట్యాచార్యులు. వంగి, ఆయన పాదాలకు నమస్కరించింది ఆమె. “ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు! విజయీభవ!” అంటూ దీవించారాయన.

“ఓహో అయితే ఈమేనా స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల? క్రింద ఉన్నవారు ఆమె సఖులు, పరివార జనం అయ్యుంటారు,”అనుకున్నాడు అర్జునుడు. ఈ లోపల వారంతా అంతఃపురం లోనికి వెళ్లిపోవడంతో అతనూ మౌనంగా వెనక్కి పయనమై, తమ అతిధి గృహం చేరుకున్నాడు.
***

ఆ రోజున అర్జునుడితో సంధి చర్చలకు తయారౌతోంది సామ్రాజ్ఞి. తమ స్త్రీ సామ్రాజ్య వైభవమంతా ఆమె అలంకరణలో ప్రస్ఫుటమయ్యేలా ఆమెను అలంకరించమని ఆజ్ఞాపించింది గుర్విణి శక్తిసేన. అందుకే చెలికత్తెలు ఆ రోజున ప్రమీలను ప్రత్యేకంగా అలంకరించేందుకు ఉదయం నుంచి అన్ని సన్నాహాలు చేసారు.
మంచి గంధం, ఔషధులు, పరిమళ ద్రవ్యాలు కలిపిన నీటితో ఆమెకు మంగళ స్నానాలు చేయించారు. ఆపై కుంకుమగంధపు అత్తరు పూతలు ఆమె మేనికి అలదారు. వెలకట్టలేని ధగద్ధగాయమానమైన రత్నాల చెవి  కమ్మలను ఆమె చెవులకు తొడిగారు. లలితమైన పూతీగల కొమ్మల్లా  ఉన్న ఆమె చేతి వేళ్ళకు కెంపుల ఉంగరాలు తొడిగారు.
చంద్రుడి వెన్నెలపై సుధారసాన్ని చిలికించినట్లున్న ,మణిమయ ఖచితమైన మువ్వల అంచులున్న తెల్లని పావడాను, కుంకుమ పూవుల వర్ణమున్న కెంపుల రవికను ఆమెకు తొడిగారు. దానిపై బంగారు, వెండి దారాలతో నేసిన బట్టపై రాజహంసల చిత్రాలున్న చీరను కట్టి, అమూల్యమైన ముత్యాల దండలు వేసారు. రవ్వల గాజులు, కంకణాలు ఆమె చేతికి వేసారు. వింత మణులు పొదిగిన అందెలను ఆమె పాదాలకు అలంకరించి, పారాణి దిద్దారు. గోమేధిక పుష్యరాగ మరకతమణులు పొదిగిన మొలనూలు వడ్డాణం పెట్టారు.
ఆమె కురుల అలంకారం చేసే సేవిక ఆ రోజున ఆమె కబరీ బంధాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్ది, జడకు విరజాజులు, కొప్పులో సంపెంగలతో పాటు ఒక తెల్ల కలువను తీర్చింది.  పూలు తీర్చిన కొప్పు వెనుక రవ్వల తీగలు చిన్న కిరీటంలా అల్లిన ఆభరణాన్ని అమర్చింది. ఒక అద్భుతమైన పరిమళం అక్కడ వ్యాపించింది.
అలంకరణ పూర్తయ్యి, లేచి నిల్చుంది సామ్రాజ్ఞి. ఆమెను చూసేందుకు అక్కడ ఉన్న చెలుల రెండు కళ్ళూ సరిపోవట్లేదు. ఆమె మేఘమండలం నుంచి దిగివచ్చిన మెరుపు తీగలా ఉంది. హరివిల్లు మీదుగా దివికి జారిన నిండు జాబిల్లిలా ఉంది.
“రాజరాజేశ్వరీ ! రాజ పరమేశ్వరీ ! అష్టదిగ్రాజమనోభయంకరీ ! కేరళాధీశ్వరీ ! స్వామినీ ! పరాకు, సావధానత, జయము జయము !” అని అనుంగు చెలులు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా, మూర్తీభవించిన సామ్రాజ్యలక్ష్మిలా తన ఏకాంత మందిర స్వర్ణ ద్వారాలు దాటి ముందుకు కదిలింది సీమంతినీ నగర సామ్రాజ్ఞి ప్రమీల !
(జైమిని భారతంలోని సామ్రాజ్ఞి అలంకార వర్ణనలు కొన్ని యధాతధంగా ఇందులో పొందుపరచబడ్డాయి.)
(సశేషం) 



No comments:

Post a Comment

Pages