తప్పదంతే - అచ్చంగా తెలుగు
తప్పదంతే...!
- పి.వి.ఆర్. గోపీనాథ్
“ఇక్కడా! మతేమన్నా పోయిందేవిట్రా ... ఫారిన్ వద్దంటే ఏమో అనుకున్నాం, కనీసం ఏ బొంబాయో బెంగుళూరో పోవచ్చుగా?” వినకూడని మాటేదో విన్నట్లు గయ్యిమన్నది రంగనాయకమ్మ గారు.
“కాదు బామ్మా. ఇక్కడైతే మీకు దగ్గరగా ఉండచ్చనీ” నసిగాడు సుధీర్.
“అది కాదురా. ఇక్కడే ఉంటే ఏమొస్తుంది చెప్పు. పైగా పెళ్ళి కావలసినవాడివి కూడానూ” నచ్చ జెప్పబోయిందావిడ.
“మీరు పోగేసింది చాలదా మాకు. ఇంకా దేనికీ. ఉన్నంతలో సర్దుకుపోవాలని మీరే చెప్పేవారుగా”
“భడవకానా.. మా మాట మాకే చెప్తావుగా...అయినా... వొహరు చెప్తే వినే రకాలా మీవి. అన్నీ ఆ అమ్మ బుద్ధులే కదా” కోడలు గుర్తొచ్చి ఆవిడ చీదడం చూసి,
తనూ ఆపుకోలేక బామ్మా ప్లీజ్ అంటూ కర్చీఫ్ చేతిలోకి తీసుకుని అవతలకు నడిచాడు.
దూరాన గంట మోగడం, అమ్మమ్మా ఇక్కడున్నవా అంటూ లక్ష్మి రావడంతో రంగనాయకమ్మ గారు కూడా మౌనంగా ఆ పిల్ల వెంట డైనింగ్ హాలు వైపు నడిచింది. లక్ష్మి కూడా ఇక్కడ ఏడేళ్ళుగా చేస్తోంది. తల్లీ తండ్రీ ఒక్కసారే ప్రమాదంలో పోవడంతో వేరే దారిలేక ఇక్కడ చేరిందా పిల్ల. చురుకైనదీ, తెలివైనదీ, బుద్ధిమంతురాలూనూ.
***
 అదొక వృద్ధాశ్రమం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన సుధీర్ తాను పని చేయాలనుకుంటున్నది అక్కడే. రంగనాయకమ్మగారు దాదాపు పదిహేనేళ్ళబట్టి అక్కడే ఉంటున్నారు. అంతకు ముందు కాకినాడలో మున్సిపల్ స్కూలు టీచరుగా చేసి రిటైరయ్యారు. భర్త రంగారావుగారు అంతకు ముందే అక్కడే కాకినాడలోనే కాలేజీ లెక్చరరుగా రిటైరు కావడంతో ఆయనతో కలిసే  హైదరాబాద్ చేరారు. ఇద్దరికీ బాగా పెన్షన్లు వచ్చేవి. కాకినాడలో సొంత మేడా ఉంది. అది అద్దెకిచ్చి మరీ ఇంత దూరం వచ్చి వృద్ధాశ్రమంలో చేరారూ అంటే వెనక పెద్ద కారణమే ఉంది. కొడుకు రామారావు హైదరాబాదులో బ్యాంకు ఆఫీసరు. కాగా, కోడలు సీత హైస్కూలు టీచరు. కనుక వీరు రిటైరవగానే హైదరాబాద్ రావడంలో వింత లేదు. కానీ అన్ని విదాలా ఆత్మీయంగా చూసుకునే కోడలు ఉన్నా ఈ ఆశ్రమంలో చేరడం అనేదే ఆలోచింపజేసే విషయం కదా...
***
   “ఏమిటీ నువ్వనేదీ? తలకాయుండే మాట్లాడుతున్నావా?” భార్య సలహా వింటూనే ఇంతెత్తున లేచాడు రామారావు.
   “ అవునండి. మనం ఇక్కడే ఉండగా  పెద్దాళ్ళు నలుగురూ ఆశ్రమంలో గడపడం బాగుంటుందా. చెప్పండి మీరే..”
“అవుననుకో. కానీ, బంగారం లాంటి ప్రభుత్వోద్యోగం... అయినా వీళ్ళు ఒప్పుకోవాలిగా...”
అనుకున్నట్లుగానే పెద్దలు నలుగురూ ఈ ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలని చూశారు.
‘మా కోసమే నువ్వు ఉద్యోగం వదులుకునే మాటైతే మేం తిరిగి విశాఖ పోతాంలే అమ్మా. కూతురు చేత ఉద్యోగం మాన్పించి మరీ ఊడిగం చేయించుకుంటున్నారనే మాట మాకెందుకూ...?”
కాస్త గట్టిగానే అన్నారు సీత తండ్రి రాజారావు. 
తల్లి రుక్మిణి అలాగే కోప్పడింది “ఇది నీకు పుట్టిన బుద్ధేనా మీ దోస్తులెవరైనా నూరిపోస్తున్నారా తల్లీ?” అంటూ. 
ఆమె అత్త మామలూ అలాగే నిష్టూరాలు ఆడారు.
***
  రాజారావు సెంట్రల్ గవర్నమెంటులోనూ, రుక్మిణి ఇరిగేషన్ శాఖలో పనిచేశారు. ఇద్దరికీ పెన్షన్లు బాగానే వస్తాయి. అంత సంపాదనా, సొంత మేడా ఉండి కూడా వారు ఆశ్రమంలో చేరడానికి నిర్ణయించుకోవడానిక్కారణం కొడుకు జానకి రాముడి మీద కోపం. కోపం కూడా కాదు, తీవ్ర ఆగ్రహం. ద్వేషం కంటే ఓ మెట్టు తక్కువ అంతే. ఎందుకంటే....  బి.హెచ్.పి.వి.లో పనిచేసే అతను అక్కడే పనిచేసే సుశీలను చేసుకున్నాడు. కులాంతరమైనా ఆ పిల్లనూ, తల్లి దండ్రుల వైఖరినీ చూసి వీరెవరూ అడ్డు చెప్పను కూడా లేదు. ఓ రెండేళ్లు బాగానే ఉన్నారు. అంతలో ఏమొచ్చిందో చేసే ఉద్యోగాలను వదిలిపెట్టి ఇద్దరూ దుబాయి వెళ్ళిపోయారు. ఇక్కడ మనకున్నది చాలు కదా అంటే వినలేదు. సుశీల తల్లి దండ్రులూ, చివరకు సుశీల అన్నగారు కూడా చెప్పిచూశాడు. అయినా ఎవరి మాటా లక్ష్య పెట్టలేదు. సరికదా కావాలంటే తాను అక్కడి నుంచే  డబ్బు సర్దుబాటు చేయగలనన్నాడు. దాంతో ఒళ్ళు మండిన రాజారావుగారు విశాఖలోనే ఓ వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నారు.
 ***
   సరిగ్గా అదే సమయానికి రంగనాయకమ్మగారు కూడా రిటైరు కావడంతో రామారావు తల్లిదండ్రులిద్దరినీ తమతో పాటు హైదరాబాద్ తెచ్చేశాడు. విశాఖలో సంగతి తెలిసి సీతతో పాటు వీరూ చాలా బాధ పడ్డారు. వారినీ హైదరాబాద్ రమ్మంటే రామన్నారు. దాంతో చేసేదేమీ లేక ఊరుకున్నారు.
కాలం గడిచిన కొద్దీ విశాఖలోని ఆశ్రమంలో తల్లి దండ్రుల పరిస్థితి సరిగా లేదనీ, చీటికీ మాటికీ డబ్బులకోసం నిర్వాహకులు వేధిస్తున్నారనీ తెలిసింది. దుబాయ్ నుంచి పలకరింపులు కూడా ఆగిపోవడంతో, తల్లి దండ్రులు మానసికంగా కుంగిపోతున్నారనీ తెలియడంతో సీతలో ఆందోళన హెచ్చింది. కానీ, ఏం చేయాలో ఓ పట్టాన తేల్చుకోలేకపోయింది.
చివరకు విశాఖలో పరిస్థితి తీవ్రం అనిపించడంతో రంగారావు దంపతులే కల్పించుకుని వియ్యాలవారిని ఏమైనా సరే హైదరాబాద్ రావలసిందేనని పట్టు బట్టారు. నలుగురం ఒకో చోట ఉండవచ్చని చెప్పి చూశారు. మెత్తబడినట్లు కనిపించిన రాజారావుగారు హైదరాబాద్ వస్తామనీ కానీ వియ్యాలవారింటో అదీ కూతురింట్లో తల దాచుకోవటం బావ్యం కాదు గనుక నగరశివార్లలో విడిగా ఓ ఇంట్లోగానీ, ఆశ్రమంలోగానీ ఉంటామన్నారు. అందుబాటులోనే ఉంటామంటున్నారు గనుక వీరు అక్కడికి అదే భాగ్యమనుకున్నారు. అలా హైదరాబాద్ చేరిన రాజారావు దంపతులు వీరి ఇంటికి కొద్దిదూరంలో మరో చిన్న పోర్షన్ తీసుకుని ఉండసాగారు. కానీ అలా ఎక్కువ కాలం ఉండలేక తప్పని సరై మనసు చంపుకుని కాస్త పేరూ, మంచి వాతావరణమూ న్న వృద్ధాస్రమంలో చేరారు. తమకు ఏమాత్రం నచ్చకపోయినా రామారావు, రంగారావులే దగ్గరుండి అన్నీ మాట్లాడి చేర్పించి వచ్చారు.
ఈ పరిణామాలతో సీత ఎక్కువ కాలం సర్ది పెట్టుకోలేక పోయింది. ఒక ఆరు మాసాలు గడిచాయో లేదో దుబాయ్ నుంచి జానకిరాముడు ఫోన్ చేసి తాము ఇక ఇండియాకు రావడం వీలుకాకపోవచ్చుననీ, బహుశా అక్కడి నుంచే ఆస్ట్రేలియాకు మారే అవకాశం ఉందని చెప్పాడు. వీలైతే అమ్మానాన్నలను కూడా హైదరాబాద్ పిలిపించుకోమని ఓ సలహా పారేశాడు. తాము ఇక్కడికి వచ్చేసిన సంగతిని ఆమె తల్లిదండ్రులు అతనికి తెలియనివ్వలేదు మరి. అప్పుడు వచ్చిందామెకు ఆ విడ్డూరమనిపించే వినూత్నమైన ఆలోచన. కానీ, అమలులో పెట్టడానికే మరి కొన్ని నెలలు వేచిచూడాల్సి వచ్చింది.
***
  “అమ్మగారూ! రేపు రాలేనమ్మా!” చెప్పింది పనిమనిషి రంగమ్మ. రాలేనమ్మా అన్నప్పటికీ             అది నిస్సహాయత తెలపడమో, సెలవుకు పర్మిషన్ కోరడమో కాదు. నోటీసే. 
  “ఇలా వారం పది రోజులకోసారి నాగా పెడితే ఎలాగే?”
 “ ఏం చేయమంటారమ్మా. మా మొగాయనకు సుస్తీగా ఉంటేనూ...’ఈసారి విసుగే ధ్వనించింది.
ఆ తర్వాత మరి కొద్దిరోజులు మామూలుగానే అంటే తనకు తీరినప్పుడే రావడం, తోచినట్లే తోమడం, అంట్లు ఎక్కువైపోతున్నాయని సణగడం...గా. సాగింది.
మరో వైపు చాకలిదీ అదే ధోరణి. చివరకు కూడబలుక్కున్నట్లు ఇద్దరూ మానేసేరు. నెల్లాళ్ళు చూసినా ఎవరూ దొరకలేదు. దీంతోపాటు సీత ఒక్కర్తీ చేసుకోలేకపోవడం, నీరసం,  పిల్లాడిపై విసుక్కోవడం  చూసి  రామారావూ, పెద్దలూ కూడా మధనపడసాగారు. కానీ ఏంచేయాలో వారికీ  తోచలేదు.
చివరకు రంగారావు గారే భార్యతో సంప్రదించి తామూ విడిగా ఉంటామనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో సీత బాగా చలించిపోయింది. తాను చేయగలననీ ఇంకో ఆరు నెలలు ఆగితే పిల్లాడు స్కూలుకు వెళ్తాడు గనుక వెసులు బాటు ఉంటుందని చెప్పింది. కానీ, అప్పుడు మరింత చాకిరీ పెరుగుతుందనే వాస్తవం అందరికీ తెలిసినదే అయినా చేసేదేమీ లేదనుకుని ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. సుధీర్ వయసు అప్పటికి ఐదారేళ్లే కావడంతో అతనికి కేటాయించాల్సిన సమయం కాస్త ఎక్కువే మరి.
   సీత నిజంగానే మంచం పట్టడంతో ఇక లాభం లేదనుకున్న రంగారావు దంపతులు ఆమె కోలుకోగానే తాము నిజంగానే వేరే వెళ్ళిపోయారు. ఫలితంగా భారం తగ్గినట్లయి ఆమెకు కొంత వెసులుబాటు లభించినట్లయింది. చిత్రంగా మరో పది రోజులకే ఓ పని మనిషీ, ఆపై మరో వారానికే చాకలీ కూడా దొరికారు. అయితే...ఇక్కడే వచ్చింది పెద్ద సమస్య. సీత ఆలోచనలలో మార్పులకు దారి తీయించిన సమస్య. పెద్దవారు ఉన్నప్పుడు పనిమనిషి రెండు పూటలా వచ్చేది. చాకలి ఏ పన్నెండింటికో వచ్చేది.ఇప్పుడు పనిమనిషి ఒక్క పూటే రావాలి. దాంతో మరునాడి ఉదయానికి తోమాల్సినవి పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇక చాకలిని పొద్దున్నే రమ్మనేవారు. కానీ  పనిమనిష, చాకలీ దాదాపు ఒకే సమయానికి రావడం అదే సమయంలో  వీరి పనులకూ హడావుడి కావడంతో ఎవరి కాళ్ళకు ఎవరు అడ్డం పడుతున్నారో తెలియనట్లు మారాయి పరిస్థితులు. తన స్కూలుకే గాక, అటు బాబు స్కూలుకూ తరచూ లేటు అనివార్యమైపోయింది. అప్పుడు తిరిగి తలెత్తింది ఆ ఆలోచన, మరింత బలంగా...
***
    “తప్పు లేదండీ. అది మాత్రం ఉద్యోగం కాదా. పైగా అత్తయ్యగారినీ, అమ్మా వాళ్ళనూ, కూడా దగ్గరుండి చూసుకునే వీలవుతుందిగా.” 
   “అంటే...?!” అతనిలో అయోమయంతోపాటు ఆగ్రహమో, ఆందోళనో తెలియని బావం. 
అదే...ఈసారి కొద్దిగా వణికింది ఆమె గొంతు. 
“అవునండీ. ఆ సురేషూ వాళ్లూ కూడా అత్తయ్యగారినీ, మామయ్య గారినీ నా మాటలూ అంటున్నారట. అన్నీ ఉండి, అందరూ ఉన్నా, చివరకు అద్దె సక్రమంగానే ఇస్తున్నా మాకీ పెంటేమిటని వారు చాలా ఫీలవుతున్నారండీ. నేనూ చూడలేకపోతున్నానండీ….”
“ష్. ఊరికే అలా ఏడవకు, రాత్రికి తీరికగా ఆలోచిద్దాం.లే” మెత్త బడినట్లున్న ఆ ధోరణి చూసి సంబరపడింది సీత. ఆ రాత్రి మళ్ళీ తనే కదిపింది.
“ఏమండీ, ఏం చేద్దాం, రేపటితో నా లీవైపోతోంది కదా?”
“సెలవైపోతే బడికెళ్లు. అయినా బాబునేం చేద్దామనీ...”
“ఇప్పుడు బడైపోగానే డే కేర్ కదా. ఇకమీదట నా దగ్గరకే వస్తాడు. నేనైనా ఇల్లు వదలిపోవడంలేదుగా. పొద్దున్నే మీకు చేసి పెట్టి వెళ్తే తిరిగి రాత్రికల్లా వచ్చేస్తాను. సరేనా.. ” 
“బాగుంటుందా...” సాలోచనగా అన్నాడు. తర్వాత ఇద్దరూ చర్చించుకుని పెద్దవారితో మాట్లాడారు. వారు మొదట గయ్యిమన్నా సీత వాదనలోనూ సబబు కనిపించడంతో చేసేదిలేక మెత్తబడ్డారు. అలా ఆ నలుగురూ ఒకే ఆశ్రమంలో చేరారు. వారికి తోడు అన్నట్లుగా సీత ఉద్యోగం మానేసి అక్కడే అసిస్టెంటుగా చేరింది.
 ***
చూస్తుండగానే మరో పదేను క్యాలండర్లు కాల గర్భంలో కలసిపోయాయి. ఈలోగా రాజారావు గారిని కాలం కబళించింది. అదే సమయానికి తను పనిచేసే కంపెనీ పరిస్థితులు దెబ్బతినడంతో జానకి రాముడు ఆస్ట్రేలియా నుంచి వచ్చేసి తల్లిని తమతోపాటు విశాఖ తీసుకువెళ్ళిపోయాడు. అభిమానంతో అనేకన్నా తండ్రి  క్రియలకు వచ్చిన బంధు మిత్రుల మాటలే ఎక్కువ పనిచేశాయనుకోవచ్చు. ఇక్కడ తనను పలకరించేవారు లేరనే దిగులుకు వయసు, చక్కెర కూడా తోడవడంతో రాజారావుగారూ అనతి కాలంలో వియ్యంకుని చేరాడు. వెంట వెంటనే తగిలిన దెబ్బలకు సీత తట్టుకోలేక పోయింది. దాంతో రామారావు దాదాపు పిచ్చివాడిలా తయారైనాడు. విఆర్ఎస్ తీసుకున్నాడు. పెన్షన్ బాగానే వస్తుంది కానీ, మన లోకంలో ఉండడు. ఎప్పుడు తింటాడో ఏమో. కొడుకు గట్టిగా చెపితే పిల్లాడిలా విలవిల లాడుతాడు. ఎందుకైనా మరో మనిషిని పెట్టారు కనిపెట్టి ఉండటానికి.
  ***
“అందుకే బామ్మా, నిన్నూ నాన్ననూ వదిలి ఎలా వెళ్లడం”
“మరి పెళ్లి చేసుకుంటే దూరం పోతానన్నావు కదరా”
“దానికింకా టైముందిగా బామ్మా” అన్నాడు అటుగా పోతున్న లక్ష్మికి వినబడేట్లు. ఆ పిల్ల ఓపెన్ వర్సిటీలో డిగ్రీ చేస్తున్నది మరి. ఈ మాటలు విని,
“చూద్దాం” అని బామ్మగారికి వినపడనట్లుగా గుసగుసగా అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
***

No comments:

Post a Comment

Pages