యోగక్షేమం వహామ్యహం - అచ్చంగా తెలుగు

యోగక్షేమం వహామ్యహం

Share This
యోగక్షేమం వహామ్యహం....
"మినీకథా చక్రవర్తి" కె.బి.కృష్ణ 
పితామహస్య జగతో మాతా ధాతాపితామహః
వేద్యం పవిత్ర మోంకార బుక్సామయజురే వ చ
ఈ జగత్తు కు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, కర్మఫలప్రదాతను, తెలుసుకొనదగిన వస్తువును, పావన పదార్ధమును, ఓంకారమును ఋగ్వేద, యజుర్వేద, సామవేదములును అయియున్నాను. 
భగవద్గీత లోని ముఖ్యమైన ఆధ్యాయాలలో " రాజ విద్యారాజ గుహ్య యోగము " ఒకటి. నేను రోజూ ప్రాతఃకాలం లో లేచి సంధ్యావందనం చేసుకుని, తరువాత శ్రీమద్ళగవద్గీత లోని సాధ్యమైనన్ని ఎక్కువ శ్లోకాలు తాత్పర్య సహితంగా చదవడం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే మనిషి తన జీవితం లో కొంత వయసు వచ్చేక తన జీవితగమనాన్ని సాధ్యమైనంతవరకూ భక్తి మార్గం వేపు నడిపించడానికి ప్రయత్నించాలి. త్రికాల సంధ్యావందనం నిర్వర్తించడం వలన కూడా వేదమాత గాయత్రీదేవి అనుక్షణం నన్ను పరిరక్షింస్తోందని నా ప్రగాఢ నమ్మకం.ఒక రకంగా చెప్పాలంటే నన్ను నేను భగవంతునికి అంకితం చేసుకున్నాను. ఉదయం నిద్ర లేచినా, నడుస్తున్నా బైక్ పై ప్రయాణిస్తున్నా ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ శుభకార్యం తల పోసినా, భగవంతుడు నా వెనుక వెన్ను తడుతూ అనుక్షణమూ కాపాడుతున్నాడనే ఒక పరిపూర్ణవిశ్వాసంతో జీవితం కొనసాగిస్తున్నాను. మనిషి జీవితంలో జయాపజయాలు ఎదురైనపుడు, ఘనత సాధిస్తే అంతా తన గొప్పతనమే అనుకుంటాడు, అదే అపజయం  తారసిల్లితే అయ్యో దేవుడు  నాకు ఎందుకు ఇలా చేశాడు ? అని వాపోతాడు, అప్పుడు దేవుడు గుర్తుకు వచ్చి, ఇది సమంజసం కాదని నేను అనుకుంటాను.
ఇలాగ నేను ఆలోచనల్లో ఉండగా, నా సెల్ మోగింది. ప్రతి రోజూ నేను ప్రాతఃకాల నంద్యావందనం చేసుకుంటూండగా లేదా గీతా పారాయణం లో ఉండగా గాని తప్పకుండా ల్యాండ్ ఫోనులో కాని సెల్ ఫోను లోగాని రింగ్టోన్ వచ్చి నన్ను భక్తి మార్గం నుండి మరలిస్తానే వుంటుంది. కానీ ఇవ్వాళ ఎందుకో అంతా అయిపోయాక ఫోన్ మోగడం సంతోషాన్ని కలిగించింది. సెల్ పోను నేటి హైటెక్ జీవితం లో మనిషి శరీరం లో ఒక ముఖ్య భాగం వలె, ప్రధాన స్థానం ఆక్ర మించేసుకుంది. ఒక్కోసారి ఫోన్ కాల్స్ దాడి భరించలేక దూరంగా విసిచేయాలనిపిస్తుంది కాని అమ్మో! అలా చేయలేం.
“హలో....”
“ నేనండీ సిద్ధాంతి. ఉదయాన్నే మీరు గీత చదువుకున్నాక చల్లని కబురు చెబుదామని ఫోన్ చేశాను. నేను మొదటి నుండీ మీ అమ్మాయి అదృష్టవంతురాలు అంటూనే ఉన్నాను కదా. పారిస్ సంబంధం వచ్చిందండీ బాబూ మీ అమ్మాయికి. అయితే కొంచం ఖరీదైనదనుకోండి. అయినా మీరు ఎలాగోలాగ చేసేయగలరు. నేను ఒక అర్థగంట లో మీ ముందు ఉంటాను, శెలవు " అంటూ సిద్ధాంతి గారు ఫోన్ పెట్టేశారు.
నాకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిత్రకారులు బావు గారి బొమ్మలన్నా వారి వ్యక్తిత్వం అన్నా ఎంతో ఇష్టం, తదనుగుణం గానే మా అమ్మాయి అచ్చం బాపు బొమ్మ లాగే వుంటుంది. విద్యాభ్యానంలో లంగా వోణీలు రెండు జడలూ, ఉద్యోగం లో ఖరీదైన వాయిల్ చీరలూ, కట్టింది- ఐదున్నరడుగుల ఎత్తులో స్లిమ్ గా, బంగారు మేని చాయ లో చూడ చక్కగా వుంటుంది. బాపు గారంటే మీకు ఇష్టం కదా అచ్చంగా అలాగే ఉంటుందేమిటండీ మీ అమ్మాయి అంటోంటారు నా మిత్రబృందం అంతా. ఉన్నది ఒక్కతే అమ్మాయి ఆ తరువాత నా శ్రీమతికి సంతానం కలగలేదు. ఒక మగనలుసు జన్మిస్తే వంశోద్ధారకుడు ఉంటాడని మేం ఆనుకున్న ఆశ నెరవేరలేదు. మా ఇద్దరి
కర్త కర్మ క్రియ లలో బహుశ ఏదైనా లోటుపాటు ఉన్నాయేమో, అయినా సర్వేశ్వరుడు ఇచ్చిన కానుక అంతే.
నేను దిగువ మధ్యతరగతి ఉద్యోగిని, మాకు వచ్చే జీతం తో ఒక సమగ్ర ప్రణాళిక తో మా ఏకైక పత్రికను ఆమె కోరిక మేరకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని చేశాము. చదువు చివరి సంవత్సరం లోనే ఐదంకెల జీతం తో ఉద్యోగం వచ్చేసింది, బెంగుళూరులో ఉంటోంది ఒక్కర్తీ. సాధ్యమైనంతవరకూ బెంగుళూరు లోగాని, హైదరాబాదు లోగాని ఉద్యోగించే అబ్బాయినిచ్చి పెళ్ళి చేస్తే బావుంటుందని మా ఆలోచన " నాన్నగారూ మనం ఆ సర్వాంతర్యామిని నమ్ముకున్నాం, మన చేతిలో ఏమీ లేదు. మీరు ఆందోళన పడకండి అనవసరం గా, ఆయనే తీసుకువస్తారు  నాకు మంచి భర్తను " అని అంటూ ఉంటుంది మా అమ్మాయి జనని.
ఒక గంట తరువాత పొందూరు ఖద్దరు పంచె మీద కండువా ధరించి, గుమ్మడి వండు రంగులో వుండే సిద్ధాంతి గారు వచ్చారు. ఆయన వివరించిన ప్రకారం వరుడు విదేశాలలో లక్షలలో జీతం తెచ్చుకుంటూ, ఆ దేశం లో ఉండి పోడానికి ఏ రంగు కార్డ్ కావాలో సదరు కార్డ్  సంపాదించేసి వున్నాడట. కట్నం ప్రసక్తి లేనే లేదుట. అయితే విదేశాలలో ఉద్యోగిస్తున్న తన స్థాయికి తగ్గటుగా వివాహం చేయాలి, అలాగే మిగతా ఏర్పాటు అన్నీ, అమ్మాయి ఉద్యోగం మాని వేసి అతని తో వెళ్ళిపోతే అక్కడే తన కంపెనీ లో ఉద్యోగం ఇప్పించుకుంటాడట. తల్లితండ్రులకు ఏకైక కుమారుడనీ చెప్పారు.
నాలాగే పొడవుగా పొడవు తగ్గ శరీరసౌష్టవం తో కాశి పోసి కట్టుకున్న గద్వాల్ చీర కట్టులో పసుపు పూసుకున్న ముఖంలో రూపాయకానంత కుంకుమబొట్టు  పెట్టుకున్న నా శ్రీమతి వచ్చింది చేతిలో మంచినీళ్ళ గ్లాసుతో " అన్నయ్యగారూ మేము అంతంత పెద్ద సంబంధాలు తూగలేము. మా అమ్మాయి లాగే భారతదేశం లోనే ఉద్యోగం చేసే అబ్బాయిని చూడండి-" అంది. 
" చూడూ మనం ఈ సంబంధం కోరుకోలేదు అదే వచ్చింది. ఒకవేళ దేముడు ఈ సంబంధాన్ని మనకు కామక గా పంపించాడేమో. అలా ఎందుకు అనుకోకూడదు ? మనకు ఉన్నదల్లా ఒక్కతే కూతురు, ఎవరికిస్తాం ? కష్టపడి ఎలాగో పెళ్ళి చేసేస్తే అమ్మాయి గురించి మనం మర్చిపోవచ్చును గదా " అంటున్ననా మాటలకు అడ్డు వచ్చి " చార్లెండి నంబడం. అమ్మాయిని విదేశాలకు పంపేస్తే పిచ్చితల్లిని చూడాలనిపిస్తే, మనం ఉన్నపళంగా విమానాల్లో ఎగిరి వెళ్లగలమా ? ఎప్పడూ మన స్థాయి కి తగిన సంబంధాలు చూసుకోవాలి " అనేసి సిద్ధాంతి గారికి కాఫీ, ఫలహారం తేవడానికి లోపలకు వెళ్ళింది.
వెంటనే సిద్ధాంతిగారు " చూడండి ఆడవాళ్ళ అలాగే అంటారు. కొంచం కష్టపడి వివాహం చేసేశారనుకోండి మీరు మీ అమ్మాయి భవిష్యతు గురించి మర్చిపోవచ్చును. పైగా అబ్బాయికి కట్నం ఆశలేకపోవడం ఎంత అదృష్ట మండీ బాబూ " అంటున్నారు చేతులు అటూ ఇటూ తిప్పతూ, అవును నిజమే. తరువాత కోరికలు పుట్టవచ్చును కదా నేనూ ఆలోచనలో పడ్డాను. ఇంతలో ఫలహారం, కాఫీ వచ్చింది. వాటిని ఆరగించేశాక, పిల్లవాడి వివరాలు అన్నీ ఇచ్చి సిద్ధాంతి గారు తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అన్న చందాన వెళ్ళిపోయారు. 
ఇక నేనూ నా  శ్రీమతి ఈ విదేశీ పెళ్ళికొడుకు తో అమ్మాయి వివాహం ఏ విధంగా, వారి కోరికలకు అనుగుణం గా చేయాలా అనుకుంటూ ఆలోచనల్లో నిమగ్నమైపోయాం. ఆలూ లేదూ  చూలూ లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు గా ఇంకా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూచుకోనైనా లేదు, మాటామంతీ జరగనేలేదు. మనిషి జీవనవిధానం లో చిత్రమైన విశేషాంశం ఏమిటంటే, ఏదైనా ఒక విషయం లో ప్రతిపాదన అతని ముందుకు వస్తే. చకచకా పది సంవత్సరాలు ముందుకీ, వెనక్కి వెళ్ళిపోయి సతమతమైపోతాడు. అయితే ఎలా జరగాల్చింది అలా జరిగిపోతుందన్న సంగతి అతనికి తెలిసినా ఈ జంజాటం తప్పదు. ఎరుగున్న వాళ్ళందరినీ సలహాలు అడగడం, కావలసిన పైకం అప్పు ఎలా తేవాలి? ఎవర్ని అడగాలి ? ఇలాంటివన్నీ శరవేగంతో చేసేస్తుంటే నా శ్రీమతి…
" మీరు అప్పడే హైరానా పడకండి. ముందు అమ్మాయితో వివరంగా మాట్లాడండి. తనకి ఇష్టమో కాదో తెలుసుకోండి " అన్నది. మళ్ళీ నేను భగవద్గీత లోకి వెళ్ళిపోయాను. జ్ఞానయోగం లో కృష్ణభగవానుడు " ఎవరికైనా ఉత్తమ ఫలితములు, మోక్షము గాని కలుగక పోయినచో అది వారి దోషమే. భగవంతునిది కాదు. తెరచాపను పైకి ఎత్తనిచో పడవ నడవదు, భగవదానుగ్రహము అను గాలి సర్వత్రా వీచుచున్ననూ, జనులు తమ హృదయములనే తెరచాపలను దైవోన్ముఖముగా చేసిన గాని జీవిత నౌకలు పురోగమించవు " అని శెలవిచ్చారు. అయితే ఇక్కడ మనం కోరిన కోరిక సమంజసమైనదేనా ? సవ్యమైనదేనా? అని కూడా ఆలోచించుకోవాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మాయికి ఈ విదేశీ సంబంధం శక్తికి మించినదే, నా ఆలోచనలను తెంపుతూ ఫోన్ మోగింది. 
"హలో- వాన్నగారూ నేను ఏమిటి మీరు నన్ను విదేశాలకు పంపేస్తున్నారా ? అమ్మచెప్పింది " 
" ఇంకా ఏమీ అనుకోలేదురా, భేషైన ప్రతిపాదన ఒకటి వచ్చింది. నీకు మెయిల్ లో సమస్తం పంపించాను అన్నీ చూసి నాకు నీ అభిప్రాయం చెప్పాలి-" 
"నాన్నగారూ, నేను అన్నీ చూశాను, అబ్బాయి బాగానే ఉన్నాడు, ఉద్యోగం, కంపెనీ వివరాలు, కుటుంబం అన్నీ బాగానే ఉన్నాయి. అయితే అతని వయసు చెప్పిన దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. అయినా నాన్నగారూ పరుగెత్తుకుంటూ పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది. నాకు ఎందుకో ఈ సంబంధం ఇష్టం లేదు. పైగా మీరు వళ్ళు హూనం చేసుకుని నన్ను చదివించారు ఇంకా మునిగిపోవడం నాకు సుతరామూ అంగీకారం కాదు భగవంతుని దయతో పాటు నా తెలివితేటలు కూడా కలిశాయి కాబట్టి బాగా చదువుకున్నాను, ఉద్యోగం కూడా వచ్చేసింది. తరువాత అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను విదేశాలకు వెళ్ళను. పంచభూతాలూ మనకు ప్రత్యక్షదైవాలు ఎలా కనుపిస్తూన్నాయో, మాతృభూమి, తల్లి, తండ్రి కూడా అలాంటి వారే నని నా నిశ్చిత అభిప్రాయం అందుకని నేను ఈ దైవాలను వదులుకోలేను. నాకు మీరూ అమ్మా ఎప్పడూ అందుబాటులో వండాలి, వదిలేయండి వాన్నగారూ, మీరు కూడా గాయత్రీ జపం చేసుకునేటప్పడు అమ్మను అడగండి ఏమంటుందో ఆమె అనుమతిస్తే చూద్దాం " అనేసి టక్కున ఫోన్ ఆఫ్ చేసేసింది. 
ఉప్పెన వచ్చే ముందు గాలీ, వాన, దుమ్మూ తో ఉక్కిరి బిక్కిరి అయిన వాతావరణం లోంచి, ఒక్కసారి నదీతీరం లో చల్లని సాయంకాలం నిలబడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నంత అనుభూతి నన్ను కమ్ముతుంది. ఒక్కసారిగా నా కన్నతల్లి దూరం ఆలోచిస్తుంది అది జనని కదా.  
వెంటనే " ఏమోయ్ మన పాప ఫోన్ చేసిందే. విదేశీ సంబంధాలు వద్దంటోంది అసలు ఆ ఆలోచన విరమించుకోమంది. ఇప్పడు ఎంతో హాయిగా ఉంది. " అంటోంటే "నేను కూడా చాలా భయపడిపోయాను సుమా అమ్మాయి సుఖపడుతుందని ఇలూ వళ్ళూ ఆస్తీ పాస్తీ తాకట్లు పెట్టేసి మీరు ఎక్కడ ఆగం అయిపోతారో అని ఒక్కటే భయపడిపోయాను సుమండీ. మనల్ని ఆ దేవదేవుడే కాపాడాడు, చిట్టితల్లిని రక్షించాడు " అంటూ చీరచెంగుతో చెమటలు పట్టిన ముఖం తుడుచుకుంటూ నా ఎదురుగా సోపాలో కళ్ళమూసుకుని నిశ్చంతగా కూర్చుండిపోయింది. 
మా దాంపత్యం లో విశేషమేమిటంటే, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నటుగా శ్రీకృష్ణపరమాత్మనా ఆధ్యాత్మిక ఆలోచనలకు అనుగుణంగా భక్తురాలినే ప్రసాదించాడు. 
సామాన్యంగా చాలా కుటుంబాలలో భార్యాభర్తలు ఒకే దారిలో, ఆలోచనల్లో, ఆశయాలలో జతకూడడం చాలా అరుదు కాని మా కాపురం విజయవంతం కావడానికి నా శ్రీమతి భక్తిమార్గమే ముఖ్య కారణం. 
వారానికి సరిపోనంత మంది దేవతలను, దేముళ్ళనూ, ఆరాధిస్తుంది. సోమవారం సూర్యనమస్కారాలు, మంగళవారం అష్టలక్ష్మీ కొలువు. బుధవారం విష్ణు మూర్తి పూజ, గురువారం షిర్డీసాయిబాబా, శుక్రవారం మహాలక్ష్మీ దేవి, దుర్గమ్మా, శనివారం అంతర్జాతీయ ఏడు కొండల వాడు, వీళ్ళందరూ కాకుండా శబరిమలై అయ్యప్ప, శ్రీశైలం మల్లన్న ఐనవిల్లి వినాయకుడు, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాచెలం అప్పన్న. చిన్నతిరుపతి వేంకటేశ్వరుడూ ఇలాగ ఎందరో ? వారానికి నాలుగు రోజులు ఒంటిపూట భోజనం అందరినీ కొలుస్తుంది. వారి ముందు తన కోరికల చిట్టా సమర్పించుకుంటుంది. మా ఇద్దరి దేవతారాధన వలన నా చిన్నారి కుటుంబం సుఖసౌఖ్యాలతో విరాజిల్లుతోందని నా పరిపూర్ణ విశ్వాసం.
సిద్ధాంతి గారికి ఫోన్ చేసి విదేశీ సంబంధాలు వద్దని చెప్పేశాం రోజులు గడుస్తున్నాయి. అమ్మాయికి చదువు పూర్తి కాకుండానే ఉద్యోగం వచ్చేసింది కాబట్టి పెద్దగా వయసు మీరి పోలేదు, ఆమె వివాహానికి తొందర పడడం ఎందుకని మిన్నకున్నాను.
నేను సాయం కాలం ఆఫీసు నుండి వచ్చేక అనుష్ణానం చేసుకున్నాక ప్రతీ రోజూ రాత్రి మాయదారి సీరియల్స్ చూడకుండా వార్తలు తప్పనిసరిగా చూస్తాను శ్రీమతి తో కలిసి, అలాగే ఉదయం తొలి వార్తలు కూడా చూస్తాం. రాత్రి వార్తలు చూస్తున్నాం, సెల్పోను రింగయింది, మా అమ్మాయి ఫోన్. 
"నాన్నగారూ- వెంటనే టివీ పెట్టుకోండి ఎప్పడూ మీరు చూసే వార్తా చానల్ పెట్టండి మంచివార్త తరువాత మాట్లాడతాను " అంది. టివీ లో వార్త" రాజధాని లో రెండో పెళ్ళి చేసుకుంటున్న ప్రబుధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంవత్సరం క్రితం విదేశాలలో తనతో ఉద్యోగం చేస్తున్న యువతితో వివాహం అయింది. వారికి ఒక పాప కూడా అతను మళ్ళీ వివిధ మ్యారేజెస్ బ్యూరోలలో పెళ్ళి ప్రతిపాదనలు ఉంచాడు. మళ్ళీ రాజధాని లో ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటూండగా, విదేశాలనుండి మొదటి భార్య పోలీసులకు ఫోన్  చేయడం తో అతని ఘరానా మోసం బయట పడింది. ఈ మోసగాడు తన కుటుంబం వివరాలు, తన వివరాలు చాలా గొప్పగా చెబుతాడు, ఏ మాత్రం ఎదుటి వారికి అనుమానం రాకుండా ప్రవర్తిస్తాడు. తల్లితండ్రులు ఇతన్ని అదుపు చేయలేక వదిలేశారు. ఆంద్రాలో విదేశీ సంబంధాలంటే మోజు ఉన్న కుటుంబాలవారిని పట్టుకుంటాడు ముఖ్యంగా ఒక్కతే అమ్మాయి ఉన్న కుటుంబాలు ఇతని టార్గెట్ తస్మాత్ జాగ్రత్త... అంటూ అతగాడి ఫోటోలు కూడా చూపించసాగేరు. మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసింది "నాన్న గారూ నాకు ఈమెయిల్ పంపించిన ఫాటో చూడండి అతను ఈ ప్రబుద్దుడే. ఎందుకో నాకు మోసగాడి లా కనుపించాడు, భగవంతుని దయవలన మీరు నా మాటలు విన్నారు. లేకపోతే నేను మూడో భార్యని అయి ఉండేదాన్ని-" అంటోంది. ఒక్కసారిగా నా గొంతులోగుటక పడలేదు. మా ఎదురుగా వున్న టీ పాయ్ మీద వాటర్ బాటిల్ లోని నీళ్ళు తాగి స్థాణువైపోయాను
నా శ్రీమతి నా చేతిలో ఫోను లాక్కుని " అమ్మో అమ్మో ఎంత ప్రమాదం తప్పింది. మీ నాన్నగారు ఎగిరి గెంతులేశారమ్మా నాకు ఎందుకో ఇది మోసమేమో అనిపించింది సుమా, నన్నూ నిన్నూ మన కుటుంబాన్ని ఆ దేవుడే కాపాడేడమ్మా దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పటికీ మనకు అవకారం జరదమ్మా కాని మనుషుల్ని మాత్రం గుడ్డిగా నమ్మనే కూడదమ్మా" అంటూ అపరిమితమైన సంతోషం తో మాట్లాడుతోంది
అవును మనం దేవదేవునికి మనల్ని మనం అంకితం చేసుకుంటే ఆయనే మనల్ని రక్షిస్తాడు, నేను కొంచం స్థిమిత పడుతూ వుంటే
అనన్నాశ్చింతయన్తో మాం 
యే జనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహం-
ఎవరు ఇతర భావములు లేని వారై నన్ను గూర్చి చింతించుచు, ఎడతెగక ధ్యానించుచున్నారో, ఎల్లప్పుడూ నా  యందే నిష్ట గలిగి యుండు అట్టి వారి యోగక్షేమములను నేను వహించుచున్నాను.
అవును ముమ్మాటి కీ నిజం. ఇంతవరకూ నా జీవితం లో ఎన్నో కష్టాలు, నష్టాల నుండి ఆదిదేవుడు కాపాడాడు. సిక్స్ సెన్స్ అని అంటుంటారు చాలా మంది అదేమిటో నాకు తెలియదు గాని, చాలా సందర్భాలలో ఇది వద్దు  అని నాకు మనసు లోంచి సందేశాలు వచ్చాయి. నాకు మనఃపూర్వకంగా ఇష్టం లేకపోతే ఆ పని జోలికి వెళ్ళను. ఎన్నో ఉదంతాలు వున్నాయి కూడా. అలాగే ఇది కూడా. దిక్కులేని వారికి దేముడే దిక్కు అంటే హాస్యం అనుకుంటారు. కానేకాదు. మనుషులందరికీ దేముడే దిక్కు. అయితే ఈ దేముళ్ళలో అనేకమంది, మనుషుల మనసులలో కులమతాలతో, వారి వారి ఆలోచనల్లో శివుడు, విష్ణుమూర్తి, బాబాలు, అల్లా, ఏసుక్రీస్తు, ఎవరు నమ్మిన దేవుడు వారి ఆరాధ్యదైవం వారిని కాపాడుతుంటూనే ఉంటాడు. అయితే ఈ విశ్వాన్ని ఒక సర్వాంతర్యామి మాత్రం అనుక్షణం కాపాడుతూనే ఉంటాడు. మరి ఇంకో వర్గం వుంది, వారికి దేముడూ దెయ్యం వంటి నమ్మకాలు లేనే లేవు మరి వారిని ఎవరు నడిపిస్తున్నారు ? సర్వాంతర్యామే ! ఈ సత్యాన్ని అందరూ అంగీకరించాల్సిందే.
ఒక ఊబి లో ఇరుక్కుపోబోయిన మమ్మల్ని కాపాడిన దేముణ్ని చేతులెత్తి, శిరసువంచి, నమస్కరించాం ఇద్దరమూ- ఇంతలో నా శ్రీమతి భక్తి టీ.వీ మార్చేసింది. " ముందుగా మిమ్మల్ని మీరు పూర్తి గా నమ్ముకోండి, తరువాత భగవంతుని సంపూర్ణంగా ఆరాధించండి. ఎన్నటికీ మీకు ఏ విధమైన అపకారం జరగనే జరగదు. తెలిసిందా అంటున్నారు ఒక స్వామీజీ. అవును నిజమే !
***

No comments:

Post a Comment

Pages