అరవైకి దగ్గరౌతున్న వయసులో కూడా
భమిడిపాటి శాంత కుమారి
అరవైకి దగ్గరౌతున్న వయసులో కూడా,
అన్ని విధాలా అశాంతి ముసురుకుంటున్న ఈ దశలోకూడా,
అతడు ఇంకా ప్రాపంచికాన్ని పట్టుకొని ప్రాకులాడుతూనే ఉన్నాడు,
ఆధ్యాత్మికానికి అల్లంత దూరంలోనే నిలిచిపోతున్నాడు.
సుఖాలనుకున్న వాటిని పొందాలనుకున్న ప్రతి నేపథ్యంలో
దుఃఖాలే పథ్యంగా అతనికి అందుతున్నప్పటికీ అతడి మనసు,
ఇంకా అహాన్ని,ఇహాన్ని వదిలి బయటకు రాలేకపోతోంది.
తాను వడలిపోతూ,తనపైతనకే పట్టు సడలిపోతూఉన్నఅతని తనువు,
అతని వయసుకు తగ్గట్టుగా మనసును పట్టి ఉంచలేకపోతోంది.
కోరికలు అతని కంటిచారికలౌతున్నా,
ప్రలోభాలు అతని ప్రస్తుత మనస్తత్వాన్నిప్రశ్నిస్తున్నా,
అతడు ప్రస్తుతానికి తగ్గట్టుగా మారలేకపోతున్నాడు.
అవమానాలు అతని మానాన్ని నిలదీస్తున్నా,
అపసవ్యాలు అతని అభిజాత్యాన్ని(మంచి నడవడి) వెలివేస్తున్నా,
అతడు వాస్తవాన్ని గుర్తించి దానిని చేరలేకపోతున్నాడు.
విశ్రాంతిని వెక్కిరిస్తూ, ప్రశాంతతను పక్కన పెడుతూ,
ఎండమావుల్లో నీటి బావులకొరకు,
మండే ఎండల్లో వెన్నెల కాంతులకొరకు,
వెర్రివానిలా వెతుకుతూనే ఉన్నాడు.
***
No comments:
Post a Comment