అష్టావక్ర మహర్షి - అచ్చంగా తెలుగు
 అష్టావక్ర మహర్షి 
మంత్రాల పూర్ణచంద్రరావు 
       
ఒకప్పుడు ఏకపాదుడు అను బ్రాహ్మణుడు ఉండెను, అతనికి సుజాత అను భార్య ఉండి సకల ఉపచారములు చేయుచుండెను. గృహస్తాశ్రమములో ఉంటూ ఏకపాదుడు  వేదములు అన్నియు ఔపోసన పట్టెను. ఒకనాడు కొందరు వటువులు వచ్చి వేద విద్య నేర్పమని కోరగా, ఇది కూడా ఒక రకమయిన తపముగా తలచి వారి చేత వేదములు వల్లె వేయించు చుండెను.
        ఒక శుభ ముహూర్తమున సుజాత గర్భము ధరించెను. ఏకపాదుడు ఎల్లప్పుడూ వేదములు వల్లె వేయుచుండగా సుజాత గర్భమునందు ఉన్న శిశువుకు కూడా పూర్వజన్మ సుక్రుతమున వేద విద్య అలవడెను. ఒకనాడు గర్భము నుండియే తండ్రికి స్వరము తప్పినది అని చెప్పెను. మరియొక సమయమున నిద్ర, ఆహారములు లేకుండా వారికి అట్లు బోధించుట ఎందుకు, నాకు ఒక్కసారి వినగానే వచ్చినవి కదా వారిని ఎందుకు బాధించు చున్నావు  అని తండ్రిని అడిగెను. దానికి ఏకపాదుడు తనకు పుట్టబోయే బిడ్డ గొప్ప మహిమ కలవాడు అని సంతోషించెను. కానీ ఇంత బాల్యములోనే తండ్రి తప్పు దిద్దుట, అధ్యయము గూర్చి మాటలాడుట తప్పుగా తలచి అతనిని శిక్షించుట తప్పు కాదు అని తలచి అష్ట వంకరలతో జన్మించుము అని శపించెను 
       ఒకనాడు ఏకపాదుడు ధనము కొఱకు జనక మహారాజు వద్దకు వెళ్లి ధనము అడుగగా అప్పుడు ఆయన వరుణ కుమారుడగు వంది తో వాదించి గెలిచిన నా  మొత్తము ధనము ఇచ్చెదను, ఓడిపోయిన నీటి యందు బందీగా  ఉండవలెను అని షరతు పెట్టెను. ఏకపాదుడు సరే అని వందు నతో వాదమునకు దిగి దురదృష్టము వలన ఓడిపోయి నీటి యందు  బందీగా ఉండెను.
       ఇక్కడ సుజాత పుత్రుని కనెను, తండ్రి శాపవశమున ఎనిమిది వంకరలతో జన్మించెను. అందువలన అష్టావక్రునిగా పిలువబడుచుండెను. చిన్నతనమునుండే అష్టావక్రుడు ఉద్దాలకుని వద్ద విద్యలు నేర్చుకొనెను. ఒక రోజున తల్లి వద్ద తన తండ్రి గురించి తెలుసుకొని జనక చక్రవర్తి  వద్దకు పోయి వంది తో వాదింతును అని చెప్పగా జనకుడు హేళనగా నీ వంటి బాలుర వల్ల కాదు పొమ్మనెను. అయిననూ పట్టువదలలేదు అష్టావక్రుడు. అయితే నీ విద్యా నాకు చూపుమనగా జనకుని ఓడించెను.జనకుడు ఆశ్చర్యము చెంది వంది తో వాదించుటకు ఒప్పుకొని సభ ఏర్పాటు చేసెను,వారిరువురకు వాదోపవాదములు తారాస్థాయికి చేరి వంది ని ఓడించెను.వెంటనే జనకుడు  అష్టావక్రుని అభినందించి ఏమి కావలెనో కోరుకొమ్మనెను. వెంటనే అష్టావక్రుడు జలబందీ అయిన తన తండ్రితో పాటు ఇతర బ్రాహ్మణులను వదలిపెట్టుమని కోరెను.వంది తన తండ్రి అగు వరుణ దేవుని యజ్ఞము కొఱకు మాత్రమే ఆ బ్రాహ్మణులను అచటకు పంపితిమి కానీ వారిని ఏమీ బాధించ లేదు, తీసుకొని పొమ్మనెను.అప్పటినుండి అష్టావక్రుని పేరు అంతటా వ్యాపించెను.
         జనక చక్రవర్తి అష్టావక్రుని, ఏకపాదులను అనేక విధముల పూజించి అష్టావక్రుని నుండి అద్వైత వేదాంతములను నేర్చుకొనెను.అష్టావక్ర జనకుల యీ సంవాదమే అష్టావక్ర సంహిత అయిన అద్వైత వేదాంత రహస్యములను అద్భుతముగా వెల్లడించు చున్నది.తరువాత జనకుడు వారిరువురను ఘనముగా సన్మానించి పంపెను.

          ఏకపాదుడు కుమారుని గొప్పతనమునకు, పితృభక్తికి మెచ్చి కుమారా నీ అంగ వైకల్యమునకు కారణము నేను కావున అది సరిచేయవలసిన బాధ్యత కూడా నాదే , కావున నీవు వెళ్లి సమంగా నది యందు స్నానము చేసిన యెడల నీ అంగ వైకల్యము పోవును, కావున వెళ్లి రమ్ము అని చెప్పెను.అష్టావక్రుడు సరే అని తండ్రి పాదములకు నమస్కరించి వెళ్లి సమంగా నది యందు మునగగా తన అంగవైకల్యము పోయి ఒక సుందర కుమారునిగా మారెను.అంతట తిరిగి వచ్చి తపోవృత్తి యందు నిమగ్నమయ్యెను.
           కొంత కాలము తరువాత ఏకపాదుడు కుమారుని పిలిచి నీవు ఇంక బ్రహ్మచర్యము వదిలి వివాహము చేసుకొని మన వంశమును వృద్ధి చేయుము అని చెప్పెను. అంత అష్టావక్రుడు తనకు తగిన కన్య వదాన్య మహర్షి కుమార్తె అగు సుప్రభ అని తలచి ఆ  మహర్షి వద్దకు వెళ్లి తన గురించి చెప్పుకొని మీ కుమార్తెను వివాహమాడుదును అని పలికెను. వదాన్యుడు  అతని గురించి విని యున్నందున ఇష్టమే కానీ నీవు నేను పేట్టే పరీక్ష కు నిలబడిన యెడల అలాగే చేయుదును అని చెప్పెను.అందులకు అష్టావక్రుడు అంగీకరించి పరీక్షలు తెలుపమనెను.అప్పుడు వదాన్యుడు నీవు ఉత్తరమునకు వెళ్లి కుబేరుని నగరము దాటి హిమాలయములయందు ఉన్న పార్వతీపరమేశ్వరులను పూజించి ఇంకనూ ఉత్తరమునకు వెళ్లి బంగారముతో  నిర్మించబడిన నగరమును పాలించు రమణి ని చూసి ఆమె ఆశీర్వాదము పొంది రావలయును అని చెప్పెను.
              అష్టావక్రుడు సరే అని బయలుదేరి నదులు,పర్వతములు దాటి కుబేర నగరము చేరగా కుబేరుడు స్వాగతము పలికి తన అలకాపురమునకు తీసుకొని వెళ్లి బంగారు మందిరము విడిదిగా ఇచ్చి రంభ మొదలగు వారిని సపర్యలకు నియమించెను. వారు ఇతనిని నృత్య గానములతో మెప్పించ ప్రయత్నించి విఫలురు అయ్యెను.కుబేరుడు అందులకు సంతసించి అష్టావక్రుని పలువిధముల కీర్తించి పంపెను. అష్టావక్రుడు అక్కడినుండి బయలుదేరి హిమాలయములకు పోయి అచటి మహర్షులకు నమస్కరించి వారి ఆశీర్వచనములు తీసుకొని పార్వతీపరమేశ్వరులను, ప్రమధగణములను పలు విధములుగా పూజించి కొంతకాలము అచట గడిపి,ఇంకనూ ఉత్తరమునకు పోగా వదాన్యుడు చెప్పిన బంగారు నగరమున ప్రవేశించెను. అచటి కన్యలు అప్సరసల వలే ఉండి అతనిని మెప్పించ చూడగా అతను వారించి రమణిని చూపుమనెను. వారు తీసుకొని పోయి ఒక సుందరాంగిని చూపిరి. ఆమె అష్టావక్రుని చూసి ఆయన అందమునకు దాసోహమని పరి పరి విధములుగా అతనిని వశ పరచుటకు ప్రయత్నించెను.అష్టావక్రుడు అందుకు తిరస్కరించి స్త్రీలకు స్వతంత్రము లేదు,బాల్యమున తండ్రి,యౌవనమున భర్త, వార్ధక్యమున పుత్రులు రక్షించును. కావున నీవు ఇటుల స్వతంత్రముగా వ్యవహరించ రాదు అని పలికెను.అప్పుడు ఆమె నిజ స్వరూపము చూపి వదాన్యుని కోరిక మేరకు అట్లు ప్రవర్తిన్చితిని, నన్ను క్షమింపుము. నీ కోర్కె తప్పక నెరవేరును. క్షేమముగా వెళ్ళుము అని పలికెను.
          అప్పుడు అష్టావక్రుడు వదాన్యుని వద్దకు తిరిగి రాగా ఆ మహర్షి మెచ్చి తన కుమార్తె అగు సుప్రభను ఇచ్చి ఘనముగా వివాహము జరిపి ఇరువురనూ సాగనంపెను.అష్టావక్రుడు సుప్రభతో కూడి తన తపోవనమునకు తిరిగివచ్చి తపోవృత్తి యందు ఉండెను.
         అష్టావక్ర మహర్షి గృహస్థాశ్రమము ను కూడా చక్కగా నెరవేర్చి ఉత్తములయిన పుత్రులను పొందెను. తరువాత జలమధ్యమున చేరి తపము చేయుచుండెను.అప్పుడు రంభ,ఊర్వశి మొదలగు వారు అచ్చటకు వచ్చెను, వారిని చూసి మీరు ఇప్పుడు ఎందుకు వచ్చినారు అని అడిగెను..అంతట వారు విష్ణుమూర్తి తో సంభోగము కావలెను అని అడిగెను. అష్టావక్రుడు ఆలోచించి ఆయన శ్రీ కృష్ణుని అవతారమునందు మీరు గోపికలుగా పుట్టి మీ కోరిక తీరును అని చెప్పి, ఆయన వెళ్ళుచుండగా వారు నవ్విరి. మీకు ఇంత మేలు చేసిన వాడిని నన్నే చూసి హేళనగా నవ్వెదరా  మీరు శ్రీకృష్ణుని పరోక్షమున బోయవారితో ఘోర అవమానము పొందెదరు అని శపించెను. 
          అష్టావక్ర మహర్షి అనేక సంవత్సరములు తపస్సు చేసి ఒక నాడు శ్రీ కృష్ణుడు రాధ మొదలగు భార్యలతో కూడి బృందావనమున కూర్చుని యుండగా శ్రీ కృష్ణునకు సాష్టాంగ ప్రణామము  చేసి ఈ విధముగా ప్రార్ధించెను.
     సీ II   " ప్రకృతియు మూలంబు బ్రహ్మేశవిష్ణువుల్
                శాఖలు సుర లుపశాఖ లఖిల 
      తపములు పుష్పముల్ విపుల సంసారాది 
                 కంబులు ఫలసమూహంబు  లగుచు 
       దనరు బ్రహ్మాండపాదమున కర్ది నా 
                  ధారుడ  వటు  నిరాదారకుడవు 
         కడిమి  సర్వాధారకుడవు  మహాత్మ :
    సర్వమయుడవు మఱియు స్వేఛ్చామయుడవు 
    ముక్తిమయుడవు నఖిల ముముక్షువులకును
    ముక్తిదాయకుడవు  జగన్మూర్తి  వీవు 
     నీకు నతు  లాచారించెద  నీరజాక్ష "
అని  ప్రార్ధించి అష్టావక్రుడు శ్రీ కృష్ణుని పాదముల మీద పడి ప్రాణములు విడిచెను.వెంటనే ఆతని తేజము గోలోకమునకు వెళ్లి ముక్తి పొందెను. అప్పుడు శ్రీ కృష్ణుడు అతని దేహమునకు స్వయముగా అంత్యక్రియలు చేసి తర్పణములు విడిచెను. ఇది అంతయు చూచి రాధ ఆతని వృత్తాంతము తెలుపుమని కోరెను. 
         అప్పుడు శ్రీ కృష్ణుడు  ఈ మహర్షి  అష్టావక్రుడు అను నా పరమ భక్తుడు.మహా తపశ్శాలి ,  బ్రహ్మ వంశస్థుడు . పూర్వము సృష్టి మొదలు నా నాభి నుండి బ్రహ్మను సృష్టించి విశ్వ సృష్టి చేయుము అని చెప్పగా బ్రహ్మ సనకసనందన సనత్కుమార సనాతనులు అను నలుగురిని సృష్టించి జగత్తును  సృష్టింపు డు అని కోరగా వారు స్త్రీ సంపర్కము ఇష్టపడక నిత్య తపస్సు చేయుచుండిరి.తరువాత వశిష్ట, అంగీరస,మరీచి, ప్రచేతనులు అను నలుగురిని సృష్టించి, వారిని జగత్తు సృష్టించుటకు  నియోగించెను..వారు సమ్మతించి మహా తపస్సంపంన్నులయి వివాహములు చేసుకొని పలువురు పుత్రులను కనెను.అందు ప్రచేతనునకు అసితుడు అను కుమారుడు జన్మించెను,అతడు విష్ణు భక్తితో తపము చేయుచు వివాహితుడయి సంతానము కలుగక ఈశ్వరుని గురించి తపము చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయి రాధా మంత్రము అను శ్లోకమును చెప్పి అంతర్ధానమయ్యెను. అసితుడు ఆ మంత్రము జపించి దేవలుడు అను కుమారుని కనెను.అతను మాలావతి అను రాజకుమర్తెను వివాహము చేసుకొని సంతానము పొందిన తరువాత తీక్షణ మయిన తపస్సు చేయుచుండెను.ఆతని తపస్సు భగ్నము చేయుటకు ఇంద్రుడు రంభను పంపెను.రంభ ఎంత ప్రయత్నించిననూ దేవలుడు చలించలేదు.అందులకు రంభ కోపించి నీవు నన్ను అష్టకష్టాలు పెట్టితివి,కావున నీవు వచ్చేజన్మమున అష్టవంకరలతో జన్మించుము అని శపించెను.కానీ తిరిగి వెళ్ళుచూ దేవలా నిన్ను అనవసరంగా శపించితిని,నీవు అష్టావక్రుడవయి  జన్మించి నీ తండ్రి వలన సుందర రూపము తెచ్చుకొని మహా తపశ్శక్తి కల వాడవు అవుదువు  అని చెప్పి వెడలి పోయెను.అతడే ఏకపాదుడు సుజాతలకు జన్మించి సమంగా నది యందు స్నానము చేసి సుందర రూపము తెచ్చుకొన్న  ఈ అష్టావక్రుడు మహా తపస్సు చేసి నేడు ఇక్కడ ప్రాణములు కోల్పోయినాడు  అని చెప్పి  తన గృహమునకు పోయెను.
       ఇట్లు స్వయముగా శ్రీ కృష్ణుని పాదముల వద్ద ప్రాణములు విడిచిన అష్టావక్ర మహర్షి చాలా విశేషములు కల వాడు.అతడు జనక రాజు తో చేసిన వేదాంత విచారణ అద్వైత వేదాంత సారము అష్టావక్ర సంహిత గా పేరుగాంచినది. ఈ అష్టావక్ర సంహిత నందు ఆత్మజ్ఞానసంకీర్తన, ఆత్మోపదేశము, లయయోగము, జ్ఞానయోగము, నిర్వేదము, ఉపశమము, జ్ఞానము, ఆత్మ సౌఖ్యానుభూతి, శాంతి, తత్వోపదేశము, విశేషోపదేశము, శాంతిశతకము మొదలగునవి ఇరువది అధ్యాయములలో అద్భుతముగా వివరింపబడినవి.ఇటువంటి గ్రంధములు అష్టావక్రమహర్షి చరిత్ర ఆచంద్ర తారార్కము నిలుచునట్లు చేసెను. 

(గమనిక : ఈ శీర్షిక క్రింద నేను వ్రాస్తున్న విషయములు అన్నియు వేరే వేరే పుస్తకముల నుండి సేకరించినవి మాత్రమె, నా స్వంతము గానీ, కల్పితములు గానీ లేవు. కొన్ని గ్రాంధికములో ఉన్న వాటికి సరళమయిన తెలుగులో వ్రాయట మయినది. పాఠకులు గమనించ కోరుచున్నాను.)

No comments:

Post a Comment

Pages