బంగారం
లక్ష్మీ రాఘవ
ఎదురొచ్చిన శాంతక్క ను చూసి ఆప్యాయంగా కౌగ లించుకుంది సరళ. ఒక్క క్షణం లో అక్కయ్యలో ఏదో లోపంగా అనిపించింది.
“ఎనాళ్ళకే సరళా” అంటూ నవ్వుతూన్నశాంతక్కని మరోసారి చూస్తూ
“ఆరేళ్ళు అయింది అక్కా! ఎంత సంతోషంగా వుందో “అని అక్క చేతులు పట్టుకుంది సరళ. గల గలా శబ్దం చేసిన గ్లాసు గాజులు తడిమింది.
ఏమిటి అక్కయ్య ఇలా? చేతిలో ఒక్క బంగారు గాజు కూడా లేకుండా?? అక్క మెడలో పరుగులు తీసిన సరళ చూపు వూసురూ అంది.
ఎందుకు ఇంతదీనంగా?? అదీ సొంత బంధువుల పెళ్ళిలో ఇలా బోసిగా????
అక్క నవ్వులో స్వచ్చత మారలేదు!! ఎలా??
“రావే పెళ్లి కూతురు రమ్యను చూద్దూ గానీ” దారితీసింది శాంత క్క.
వచ్చింది పెళ్లి కే అయినా...అందరి పలకరింపులతో వుక్కిరిబిక్కిరి అయినా సరళ మనసును తొలిచేస్తున్న ఆలోచన ఒక్కటే... శాంత క్క ఎందుకిలా అయ్యింది?? ఏమైంది?? ఎవరూ ఎందుకు చెప్పలేదు?
ఆఖరికి అన్నయ్య కూడా చెప్పలేదు.
పెళ్ళిళ్ళు చేసుకున్న తరువాత ఎవరిజీవితాలు వారివే అయినా కుటుంబ బాంధవ్యాలు మారవుకదా!
తను అమెరికా అంత దూరం వెళ్ళినా అందరితో కాంటాక్ట్ పెట్టుకోలేదా?
శాంత క్కను కలిగిన కుటుంబానికే ఇచ్చారు. వాళ్ళ ఆస్తి ఏమయింది? ఏంతో ముఖ్యమైన పెళ్ళికి ఇలా బోసిగా రావాల్సిన కర్మ ఏమిటీ?? బావ గారు కనిపి౦చలేదే? ఎందుకు రాలేదు పెళ్ళికి?....ఇక ఆలోచించలేక పోతూంది సరళ.
భోజనాలైనాక అన్నయ్య రామూర్తి తీరిగ్గా వుంటే చూసి కొంచే౦ దూరంగా లాక్కు పోయి
“అన్నయ్యా శాంతక్క అలా వుందేమిటి?” అని అడిగింది.
“ఎలా వుంది? బాగానే వుంది కదా?”
“బాగుందా?? ఇన్ని నగలతో భారంగా నడిచే శాంతక్క నేనా చూస్తున్నాను? అసలు బావ గారు కూడా కనిపించలేదు. నేను అమెరికానే వెళ్ళాను అన్నయ్యా అంతరక్షానికి కాదు. మీ అందరితో మాట్లాడు తూనే వున్నా ఒక్కరూ చెప్పలేదు...”నిష్టూరంగా అంది సరళ.
“ఓహ్...అదా..ఏమీ కాలేదు. శాంతక్క బాగుంది. బావగారు వాళ్ళ ఫ్రెండు I.C.U. లో వున్నాడని రాలేదు అంతే సరళా....బావ గారు రిటైర్ అయినాక సొంతవూరు చేరారు కదా..నీకూ తెలుసు కదా..”
“అంతేనా? వాళ్ళ పరిస్థితి ఎలావుంది? ఆస్తులు ఏమయ్యాయి?”
“ హాయిగా వున్నారే సరళా, నీవు వర్రీ అయ్యేంత ఏమీ జరగ లేదు...” అని మాట దాటేసాడు రామూర్తి.
పెళ్లి ఇంట్లో శాంతక్క గురించి ఎవరూ మాట్లాడక పోవడం, అంతా సహజంగా వున్నట్టు వుండటం సరళకు అర్థం కాలేదు.
రామూర్తి అన్నయ్య కూతురు రక్షితను తీసుకుని పెళ్లి ఇంటి నుండే బజారుకు వెళ్లి బంగారు షాపు లో ఒక బంగారు గొలుసు, ఒక జత గాజులు కొంది.
ఇక ఎవ్వరినీ ఏమీ అడగ దలచుకోలేదు. శాంతక్క తో బాటు వాళ్ళ వూరికి వెళ్లి సమయం చూసుకుని అక్కకు నగలు ఇవ్వాలి అని డిసైడ్ అయ్యింది. అక్కా బావల పరిస్థితి ఏమిటో తెలిసాక ఇస్తే బాగుంటుంది కదా అనుకుని శాంత క్క తో వాళ్ళ వూరికి బయలుదేరి వెళ్ళింది.
అక్క పెళ్ళికి వచ్చిన టాక్సీ లో నే బయలుదేరారు. డ్రైవరు కుర్రాడు..వూరికి వెళ్లేసరికి చీకటి పడుతుంది. మధ్యలో ఏమైనా జరుగుతే? అక్క అంటే ఏమీ నగలు వేసుకో లేదు.తన వొంటి మీద వున్నాయి కదా? ఈ ఆలోచనలు ఎక్కువ అయ్యేసరికి అక్కను మెల్లిగా అడిగింది..”పరవాలేదా?”అని
“పరవాలేదే సరళా..ఈ అబ్బాయి మనింటి లో పనిచేసిన రామారావు కొడుకే..పోయిన ఏడాది రామారావుకు ఆక్సిడెంట్ అయి పోయాడు. ఈ అబ్బాయి డిగ్రీ చదువుతూ వుండేవాడు. జరగటం కష్టంగా వుందని చెబితే డ్రైవింగు నేర్పించి టాక్సీ నడుపుకో మని ఈ కారు ఇచ్చారు మీ బావ. కొత్త కారు కొన్నాం కదా ఈ కారు మూల పెట్టడం ఎందుకు అని ఇలా ఏర్పాటు చేసారు. మనకు ఎప్పుడు కావాలన్నా వస్తాడు..”
పాత కారు అమ్ముకుంటారు కానీ ఇలా వూరికే ఇచ్చేస్తారా? ?
ఇంతలో అమెరికానుండీ ఫోను వచ్చింది సరళకు. అక్క తో వాళ్ళ వూరికి వేడుతున్నట్టు చెప్పింది భర్త ప్రసాదుకు .
ఇల్లు చేరేసరికి ఏడు గంటలు దాటింది.
బాగా ముసలిగా వున్న ఒకతను గేటు తీసాడు.
“అయ్యగారు ఇంకా రాలేదా??” అని అడిగింది శాంతక్క
“లేదమ్మగారూ” అని శాంతక్క ఇచ్చిన తాళం చెవి అందుకుని తాళం తీసాడు.
టాక్సీ డ్రైవరు సామాన్లు లోపలి తెచ్చాడు.
“సరళా, నీవు ఆ గదిలో నీ సామాన్లు పెట్టించుకుని..స్నానం చేసిరా నేను వంట ప్రయత్నం చేస్తా..” అని గదిని చూపించి తను వంటింట్లోకి దూరింది.
భోజనం చేసాక ఒక ప్లేట్ లో అన్నం, పప్పు వేసి
“ఇదిగో చంద్రయ్యా”అని పిలిస్తే ఇందాక గేటు తీసిన అతడు లోపలి వచ్చి తీసుకెళ్ళాడు.
“ఎవరితను?”
“వాచ్ మాన్ లాగ అనుకో..ఇంటి దగ్గర పడుకుంటాడు”
“అంత ముసలివాడు ఏమి వాచ్ చేస్తాడు?”
“ ఏపనీ చెయ్యలేడు..కొడుకు చూసుకోడు..వొంటరి వాడు..వూరికే డబ్బులిస్తే తీసుకోడు అందుకే ఇంటిదగ్గర వుండమని చెప్పాడు మీ బావ. నెలకి మూడు వేలు ఇస్తాము.”
నెలకి మూడు వేలా??!! ఇలా ఇచ్చేవాళ్ళు కూడా వుంటారా?అనిపించక మానలేదు సరళకు.
మరు రోజు పొద్దున్నే పనిమనిషి గంగ వచ్చి చక చకా పనులు చేసేస్తోంది.ఎనిమిది గంటలకు ఒక అబ్బాయి ఇస్త్రీ బట్టల మూట తెచ్చి పెట్టి
“అమ్మగారూ లేక్కేట్టుకోండి..నేను స్కూలికి వెళుతున్నా..”అని అంటూంటే
“వుండరా గోపీ ..టిఫన్ ఇస్తా” అని ఉప్మా ఒక పేపర్ ప్లేటులో ఇచ్చింది శాంతక్క
పేపరు చదువుతూ గమనిస్తూ వుంది సరళ. వాడు గబా గబా తినేసి “అమ్మా నేను స్కూలికి వెడుతున్నా..”అని కేకేస్తే పెరట్లో వున్న గంగ “సరేరా..”అని సమాధానం ఇచ్చింది...వాడు వేడుతూవుంటే ప్రశ్నార్తకం గా చూస్తూన్న సరళ తో
“వాడు గంగ కొడుకే... వాళ్ళ నాయన ఇస్త్రీ చేస్తే వీడు తెచ్చి ఇస్తాడు. వీడిని చదివిస్తున్నాము..చదువు వద్దని పనులకు పంపుతుంటే మీ బావ కోప్పడి స్కూలులో చేర్పించారు..”
“అవునా??” అంది సరళ,
మధ్యాహ్నం భోజనం వేళకు వచ్చారు శివరాం బావ. సరళ ను చూడగానే
“బాగున్నావా సరళా? పెళ్లి బాగా జరిగిందా?” అని అడిగారు.
లోపల నుండీ వచ్చిన శాంతక్క
“ఎలా వుంది నరసింహం గారికి?”అని అడిగింది.
“రూం కి షిఫ్టు చేసినారు. బాగున్నాడు..”
నరసింహం గారికి హార్టు అటాక్ వచ్చిందట. పిల్లలందరూ అమెరికా లో వుంటారట. ఆయన తమ్ముడు చెన్నై లో వుంటాడట. వెంటనే రాలేక పోయాడని బావగారే అన్నీ చూసుకుంటూన్నారట. ఇంతలా చూసుకునే ఫ్రెండ్ వుండటం ఆయన అదృష్టం!
రెండోరోజు నరసింహం తమ్ముడు వచ్చాడని బావ గారు ఫ్రీ అయి ద్వారకా తిరుమలకు వెడదామని ప్లాన్ చేశారు శాంతా వాళ్ళు.
పొద్దున్నే బయలుదేరిపోయి దారిలో టిఫన్ చేద్దామని అన్నారు.
కో౦చం దూరం వెళ్ళాక రోడ్డు పక్కన “పూర్ణా హోటల్” అన్న బోర్డు వున్న చిన్న రేకుల షెడ్డు దగ్గర ఆపారు.
“రండి సార్ రండి “అని నవ్వ్తతూ ఆహ్వానించాడు ఒక ముసలాయన.. ఓనరు కాబోలు.
“బాగున్నారా? రాము బాగున్నాడా? “అని పలకరిస్తూ లోపలి దారి తీసారు శివరాం.
“రాము బాగున్నాడు సార్...ఈ నెలకు ట్రీట్మెంటు అయిపోతుంది.”
లోపల చిన్నగా వున్నా నీట్ గా వుంది. ఇడ్లీ, వడ తిన్నారు.
కారులో కూర్చున్నాక శాంత చెప్పింది వీళ్ళు పరిచయమై రెండేళ్లు దాటిందిట. ఆ ముసలాయన కొడుకు రాముకు టి.బి. వచ్చిందని తెలిసి సంవత్సరం అయ్యిందట. ట్రీట్మెంటు కోసం బావ డబ్బు సాయం చేస్త్తున్నారట.
అలా ఎవరికైనా ఎలా సాయం చేస్తారు?? అన్నీ ప్రశ్నలే సరళకు.
ద్వారకా తిరుమలలో దర్సనం బాగా అయ్యింది.
తిరుగు ప్రయాణం లో ఒక చోట ఆపాడు శివరాం. అక్కడ బొప్పాయి కాయలు చక చకా తొక్క తీస్తూ ముక్కలు కోస్తున్న అబ్బాయి చేసే పనిని ఆపి కారు దగ్గరికి వచ్చాడు “నమస్తే సార్”అంటూ
“ఏరా రమణా, కాలేజీకి వెళ్లి వచ్చావా? ఎప్పడు స్టార్ట్ అవుతాయి క్లాసులు?” అని అడిగాడు బావ.
“ఇక వారం లో స్టార్ట్ అవుతాయి సార్ “
“రేపు ఒక సారి మీ అమ్మను కలవమని చెప్పు” అని వాడు ఇచ్చిన బొప్పాయి కాయలు తీసుకుని డబ్బు ఇవ్వబోతే “ఒద్దు సార్” అన్నాడు రమణ.
“బతకడం నేర్చుకోరా“ అని బలవంతంగా డబ్బు చేతిలో పెట్టి కారు స్టార్ట్ చేసాడు శివరాం.
రమణ నే చూస్తున్న సరళ తో వాడికి టెన్త్ లో మంచి మార్కులు వచ్చినా వాళ్ళ నాన్న చనిపోవడం తో తండ్రి చేసే వ్యాపారం చేస్తూవుంటే, ఒక సారి బొప్పాయి కోసం ఆపి నప్పుడు తెలిసి మీ బావ కాలేజీ చేరడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ అమ్మ వచ్చిబావతో గొడవ పెట్టుకుందట వాడు చదవడానికి పొతే ఇల్లు గడవదని అప్పటి నుండీ వాళ్ళ అమ్మను పిలిచి నెల నేలా డబ్బులు ఇస్తారట. డిగ్రీ దాక చదివించి ఉద్యోగం వేయిస్తానని చెప్పారట…శాంతక్క మాటలు వినడమే...అంచనాలు వేయలేదిక.
మరో ఐదు కిలో మీటర్ల దూరం వెళ్ళాక ఎదురుగా వచ్చిన టూవీలర్ ను తప్పించబోతూ పక్కన వున్నబురద గుంతలో పడి కొద్దిగా పక్కకు ఒరిగింది కారు. కష్టం మీద కారు నుండీ బయట పడ్డాక జనం చేరుతూ వుండటం తో సరళ ,శాంత లను ఆటో ఎక్కించి ఇంటికి పంపెసారు శివరాం.
ప్రమాదం తప్పినా భయం వేసి వణికిపోయింది సరళ. స్నానం చేస్తే ఫ్రెష్ గా వుంటుందని స్నానం చేసి బయటకు వచ్చింది.
ఇంటి ముందు గలాటా గా వుందనిపిస్తే కిటికీలో తొంగి చూసింది.
ఇంటి ముందు వందమంది దాకా వున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ శివరాం కనిపించారు.
గబగబా శాంతక్క దగ్గరికి పోయి “శాంతక్కా ఏమయింది?అంత మంది వచ్చారు?”
“ఏమీ లేదే ఈయన కారు రోడ్డు పక్కన వాలిపోయి వుండటం చూసి గుర్తు పట్టి ఏమయిందో నని ఇంతమంది వచ్చారు. ఇది మామూలేలే నీవు కాఫీ తీసుకుందూగానీ రా..” అంది శాంత.
ఆరోజు రాత్రి పడుకోబోయే ముందు తన రూం లోకి శాంతను పిలిచి
“శాంతక్కా నిన్ను పెళ్ళిలో బోసిగా చూసి చాలా బాధపడి బంగారు గొలుసు, గాజులు తీసుకుని వచ్చా ..క్షమించు అక్కా...నీ బంగారం కూడా దానం చేసే వుంటారు. అయినా నీ మేడలో బంగారం వేసుకోనక్కరలేదు. బంగారం లాటి మనసున్న బావ గారితో, బంగారం లాటి జీవితం గడుపుతున్నావు..మీరు చేసే సేవ , మీ చుట్టూ మనుష్యులూ అంతా బంగారమే ..నేను గొలుసు తెచ్చినందుకు సిగ్గు పడుతున్నా.. అని శాంతను ఆప్యాయంగా కౌగలించుకుంది సరళ తృప్తిగా...
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
No comments:
Post a Comment