గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అఫ్ ఇండియా-దాదాభాయి నౌరోజీ
అంబడిపూడి శ్యామసుందర రావు.
బ్రిటిష్ వారితో జరిపినస్వాతంత్ర సంగ్రామములో పాల్గొన్న మాహానుభావులు ఎందరో కానీ ప్రస్తుతము చాలామందికి అటువంటి మహానుభావుల గురించి తెలియని పరిస్థితి నెలకొన్నది ఎందుకంటే నేటి యువతకు క్రికెటర్ల గురించి సినిమా యాక్టర్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి తప్ప , స్వాతంత్ర సమర యోధులను మరచి పోతున్నారు అటువంటి మరచిపోతున్న స్వాతంత్ర సమర యోధులలో ఒకడు" గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అఫ్ ఇండియా" గా కీర్తించబడిన దాదాభాయి నౌరోజీ ఒకడు అయన గురించి నేటి యువతకు తెలియ జేయాలనేదే ఈ ప్రయత్నము.
సెప్టెంబర్ నాలుగవతేదీన 1825 లో పార్శి ఉన్నత కుటుంబములో దాదాభాయి నౌరోజీ జన్మించాడు. ఈయన బొంబాయి లోని ఎల్ఫిన్ స్టోన్ కాలేజీలో చదివేటప్పుడే అతని తెలివితేటలను గుర్తించిన ఇంగ్లండ్ ప్రొఫెసర్లు "ప్రామిస్ అఫ్ ఇండియా"గా పేర్కొనేవారు. తరువాతి రోజుల్లో ఆ జోస్యము నిజము అయింది. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మూడు సార్లు అద్యక్షుడిగా పని చేసాడు.స్వాతంత్రోద్యమము రోజులలో ఇది ఒక రికార్డ్. 1886లో కలకత్తా సభలకు ,1893లో లాహోర్ సభలకు అధ్యక్షత వహించాడు ఆ తరువాత 1906లో కలకత్తా సభలకు అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అన్న తర్జన భర్జనలలో ఈయన పేరునే ఏకగ్రీవంగా అద్యక్షుడిగా పేర్కొన్నారు.
భారత దేశానికి న్యాయము జరగాలి అన్నఆలోచనతో ఇంగ్లండ్ వెళ్లి అక్కడి ప్రజల మద్దతు కూడగట్టాలని 1886లో నౌరోజీ ఇంగ్లండ్ వెళ్ళాడు అప్పటి నుంచి ఆరేళ్లపాటు బ్రిటిష్ పార్లమెంట్ లో ఫ్రవేశించటానికి శ్రమించాడు. 1892లో అయన శ్రమ ఫలించి బ్రిటిషుహౌస్ కామన్స్ సభకు ఎన్నిక అయినా మొదటి భారతీయుడిగా రికార్డ్ నెలకొల్పాడు సభలో భారత దేశము అనుభవిస్తున్న దరిద్రాన్ని అంకెలతో పూర్తి సంఖ్యలతో బ్రిటిష్ ప్రజల దృష్టికి తేవటంలో సఫలీకృతుడయినాడు. బ్రిటిష్ వారు భారత దేశ సంపదను దోచుకుంటున్నారని తెలియజేసాడు. బ్రిటీష్ అధికారుల స్థానాలలో భారతీయులను అధికారులుగా నియమించాలని వాదించాడు. 1867 వరకు అయన దృష్టి అంతా భారతదేశపు ఆర్ధిక సమస్యలు మీదే ఉండేది.
1855నుండి 1881 మధ్య కాలములో ఈయన ఇంగ్లండ్ ను పలుమార్లు దర్శించి డిశంబర్ 1866లో లండన్ నగరములో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను స్థాపించాడు ఈ సంస్థ ద్వారా తన అభిప్రాయాలను ఇంగిలీషు తెలియజేస్తూ వారిని కూడా చర్చలలో పాల్గొనేటట్లు చేసేవాడు. తాను సమర్పించిన వివరాలద్వారా భారతీయుల తలసరి ఆదాయము (పర్ క్యాపిట ఇన్కమ్) సాలుకు 40 షిల్లింగ్ లేనని అందరికి తెలిసేటట్లు చేశాడు. కామర్స్ అఫ్ ఇండియా అనే పేపర్లో నౌరోజీ భారత దేశము ఇంగ్లండ్ కు ఏటా $12,000,000 పన్నుల రూపములో ఎందుకు చెల్లించాలి అని సూటిగా ప్రశ్నించాడు(ఏ విధమైన అభివృద్ధి లేనప్పుడు) ఈవిధముగా పరాయి పాలన వల్ల భారత దేశము ఇంగ్లండ్ కు ఆదాయ వనరు అని సోదాహరణముగా వివరించాడు. అంతే కాకండా 1876లో బొంబాయి వచ్చి అక్కడి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ శాఖ లో తన పేపర్స్ ను సమర్పించాడు వీటి ఫలితముగా నౌరోజీ, హెచ్.ఎమ్ హిండ్ మన్ అనే ఒక సోషలిస్టు మద్దతు సంపాదించాడు 1880లో కండిషన్ అఫ్ ఇండియా అనే కరపత్రాన్ని ప్రచురించాడు. 1880లో ఇండియన్ ఫెమైన్ (భారతదేశములో కరువు గురించి అద్యాయనము చేయటానికి బ్రిటిష్ ప్రభుత్వము నియమించిన కమీషన్) రిపోర్ట్ ఆధారముగా 1881లో నోరోజి ప్రభుత్వానికి ఒక మెమొరాండం సమర్పించాడు. ఆ మెమోరాండం లో ఇంగిలీషు పాలన్ భారతదేశాన్ని ఏవిధముగా నాశనము చేస్తుందో వివరించాడు.
ఏప్రిల్ 1881లో ఇంగ్లండ్ తన వ్యాపారలను ముగించుకొని భారతదేశానికి వచ్చి "ద వాయిస్ అఫ్ ఇండియా"అనే దిన పత్రికను ప్రారంభించాడు ఈ పత్రిక లో భారతీయుల మనోభావాలను తెలియజేసే ఇతర పత్రికల వార్తలను సేకరించి ప్రచురించటము ద్వారా బ్రిటిష్ పాలకుల దృష్టికి వెళ్లేటట్లు ప్రయత్నము చేసేవాడు. కానీ తన ప్రయత్నాలు ఆర్ధిక ఇబ్బందుల వల్ల పూర్తిగా ఫలితాలను సాధించలేకపోయేవి అందువల్ల తన ప్రయత్నాలకు ధనవంతులైన తన స్నేహితుల సహకారము కోరేవాడు వారిచేత తన పత్రిక ప్రతులను ఎక్కువగా కాంపించి ఆ ప్రతులను బ్రిటిష్ వారికి ఉచితముగా పంచి పెట్టేవాడు, ఆ విధముగా బ్రిటిష్ ప్రజలకు భారతీయుల స్థితిగతులను తెలియజేస్తూ వారి మనోభావాలను బ్రిటిష్ వారికి చేర్చగలిగాడు,
ఈ విధముగా 1886 నుండి 1907 వరకు ఆంటే 21 సంవత్సరాలు నౌరోజీ జీవితములో చాలా ముఖ్యమైన కాలము ఈ సమయములోనే ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించి భారతీయుల దృష్టిలో ఈయన దేశభక్తికి నిలువెత్తు తార్కాణముగాను భారతీయుల అసలు ఆశయాలకు ప్రతిరూపముగా నిలిచాడు.బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయుల ప్రాతినిధ్యము ఏదైనా ఒక ఇంగ్లీష్ నియోజక వర్గము నుండి ఉంటె బావుంటుంది అన్న తలంపు తో నౌరోజీ ప్రయత్నాలు సాగించాడు కానీ సరి అయినా మద్దతు లేకపోవటము వల్ల 1881లో నౌరోజీ భారతదేశానికి తిరిగి వచ్చాడు, మళ్ళా ఈ ఆలోచనతో నౌరోజీ 1886లో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టాడు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రయత్నాలు ఎవరైనా ఇంగ్లండ్ లో ఉండి చేయకపోతే ఫలితాలు సాధించటం కష్టమని నౌరోజీ గట్టిగానమ్మేవాడు పార్లమెంట్ లో ప్రవేశించటం అప్పైకి కుదరకపోయినప్పటికీ ఇంగ్లీష్ ప్రజలను ఉద్దేశిస్తూ తన ఉపన్యాసాల ద్వారా భారతీయుల ఆశలను ఆశయాలను బ్రిటిష్ ప్రజలకు తెలియజేసేవాడు,తన ప్రయత్నాలకు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనేవాడు. తన స్నేహితుడు శ్రేయోభిలాషి అయినా కతీయవార్ సంస్థానాధీశుడి ద్వారా కొంత ఆర్ధిక సహాయాన్ని,మరొక స్నేహితుడైన మలబారి ద్వారా కొంత ఆర్ధిక సహాయాన్ని పొందాడు.ఈ స్నేహితుడు ఆ రోజుల్లోనే నౌరోజీకి పదిహేనువేల రూపాయల ఆర్ధిక సహాయము చేసాడు.
ఇంగ్లండ్ లో తనకు మద్దతు కూడగట్టుకొని ప్రయత్నములో మొదట కొంత అపజయాన్ని పొందాడు తరువాత నెమ్మదిగాప్రత్యర్థుల గౌరవాన్ని మద్దతును పొంది, సెంట్రల్ ఫిన్స్ బరీ నియోజకవర్గాన్ని ఎన్నుకొని నాలుగేళ్లపాటు అక్కడ శ్రమించి 1892లో జరిగిన ఎన్నికలలో చాలా స్వల్ప మెజారిటీ (మూడు ఓట్ల ఆధిక్యము) తో బ్రిటిష్ పార్లమెంట్ లో అడుగు పెట్టాడు ఈయన గెలుపు భారత దేశములో భారతీయులలో ఉత్సాహాన్ని నింపింది. 1893లో ఇండియాకు వచ్చినప్పుడు భారతీయులు ఘన స్వాగతాన్ని పలికారు అదే సమయములోనే లాహోర్ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించాడు.ఈయన కీర్తి పతాక స్థాయికి చేరింది. అక్టోబర్ 7, 1893లో తన ఏకైక కుమారుడిని మృత్యువు తీసుకొని పోయినా మనోధైర్యాన్ని వీడకుండా ప్రజల అభిమానంతో తనకు గలిగిన భాధను దిగమింగి బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా తన సేవలు అందించాడు పార్లమెంట్ సభ్యుడిగా తన పదవీ కాలంలో తన నియోజకవర్గానికి సేవలు అందించటమే కాకుండా భారతదేశానికి ముఖ్యమైన రెండు సదుపాయాలు కల్పించటంలో ముఖ్య పాత్ర వహించాడు. జూన్ 1893లో హౌస్ అఫ్ కామన్స్ లో ఆమోదింప బడిన తీర్మానాన్ని ,లార్డ్ వెల్బీ అధ్యక్షతన గల రాయల్ కమీషన్ తీర్మానాలను పరీశీలించటానికి ఒక కమిటీ ని ఏర్పాటు చేయటంలో సఫలీకృతుడైనాడు ఆ కమిటీలో నౌరోజీ కూడా సభ్యుడుగా ఉన్నాడు ఆ కమిటీ భారతదేశానికి ఇంగ్లాండ్ ప్రభుత్వము చేసే ఖర్చు గురించి విచారించటానికి నియమింపబడింది. కానీ దురదృష్ట వశాత్తు ఆ కమిటీ తెలిపిన విషయాలు వెలుగు చూడలేదు ఎందుకంటే అప్పటి ప్రభుత్వములోనికొంతమంది పెద్దలు ఆ కమిటీ ప్రతిపాదనలను ఆమోదించలేదు.
ఆ తర్వాతి ఐదు సంవత్సరాలు నౌరోజీ ఇంగ్లండ్ లో ఉండి వెల్బి కమీషన్ పనిమీదే బిజీగా ఉన్నాడు మరో ఏడు సంవత్సరాలు ఇంగ్లండ్ లో ఉంది మరో మారు పార్లమెంట్ లోనికి ప్రవేశించటానికి ప్రయత్నాలు చేశాడు. కానీ 1900 సంవత్సరములో జరిగే ఎన్నికలకు అనారోగ్యము వలన పోటీ చేయలేకపోయినాడు . 1906 లో జరిగిన ఎన్నికలలో నార్త్ లంబాత్ నుంచి పోటీచేసి ఓడిపోయినాడు. 1907 లో అయన ఆరోగ్యము బాగా క్షీణించటము వలన భారతదేశానికి తిరిగి వచ్చి శేష జీవితాన్ని మిత్రులు బంధువుల మధ్య గడిపి జూన్ 30,1917లో స్వర్గస్తులైనాడు ఈవిధముగా అయన భారత దేశ అభివృద్ధికి స్వాతంత్రానికి జరిపిన పోరాటము అసంపూర్తిగా ముగిసింది కానీ అయన జరిపిన పోరాటము అయన చూపించిన బాట తర్వాతి రోజులలో చాలా మందికి మార్గ దర్శకము అయింది .
***
No comments:
Post a Comment