నాతిచరామి - అచ్చంగా తెలుగు
నాతిచరామి
- కిరణ్ కుమార్ సత్యవోలు

ఎ.సి ఉన్న కారణంగా గదిలో చాలా చల్లగా ఉంది. గ్రీన్ కలర్ బెడ్ లైట్ డిమ్ గా వెలుగుతోంది. ఆ దంపతులు ఇద్దరు అప్పటికే సుఖ తీరాలను తాకి అలసి పోయి సేద తీరుతున్నారు. గోడ గడియారం టిక్ టిక్ మంటూ తన పని తానూ చేసుకుపోతోంది. ఆ ఇద్దరు అర్ధ నగ్నంగా ఒకే దుప్పటి కప్పుకుని పడుకున్నారు. ఆమె వీపుకి అతని ఛాతీ తగిలేలా ఆమెను దగ్గరగా హత్తుకుని పడుకుని ఉన్నాడు. ఆమె ప్రశాంతంగానే నిద్రపోతున్నట్టుగానే ఉంది. అతని మనసు మాత్రం నిద్ర పోవడానికి సంసిద్ధంగా లేదు. దారి తెన్నూ లేని ఆలోచనలలో అతని మనసు కొట్టుకుంటోంది. అప్రయత్నంగా ఆమెని ఇంకా దగ్గరగా హత్తుకున్నాడు. ఆమెకు మెలకువ వచ్చింది. ఆ బిగి కౌగిలిలోనే ఉండి అతని వైపు తిరిగింది. ఇరువురి ఊపిరిలు ఊసులు చెప్పుకుంటున్నాయా అన్నట్టుగా ఒకరి శరీరం మరొకరికి శరీరానికి తగిలింది. ఆమె ఉఛ్వాసం అతని నిశ్చ్వాసం. అతని కళ్ళు ఆమెను చాలా ఆరాధనగా చూశాయి. అవి ఏవో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టున్నాయి.  కానీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాయి. ఆమె కళ్ళతోనే 'ఏమైంది' అన్నట్టుగా కనుబొమ్మలు చిన్నగా ఎత్తింది. ఏమి లేదు అన్నట్టుగా చిన్నగా తల అడ్డంగా ఊపి, ముంగుర్లని చెవి వెనక్కి జరిపి ఆమె నుదిటిపై అతని పెదవులను తాకించాడు. ఆమె కళ్ళు పైకి ఎత్తి అతని గడ్డాన్ని చూసింది ఓ క్షణం. అతని గొంతులో చిన్నగా గుటక పడింది. ఆమెను మరింత దగ్గరగా తీసుకుని అతను కళ్ళు మూసుకున్నాడు.

ఆమె మనసులో ఏదో అలజడి. అతని ప్రవర్తన ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు. అతని చూపులో ఎప్పుడు చూడని ఆరాధనని చూసింది. అతని కౌగిలిలో ఇంతకు ముందేరగని ప్రేమని అనుభవించింది. అతని ముద్దులో చెప్పని విషయం ఏదో చెప్పాలని ప్రయత్నించింది.
అతను ఎందుకు అలా చేస్తున్నాడో గ్రహించలేనత చిన్న పిల్ల కాదు. కానీ ఆమె బయటపడటానికి ప్రయత్నించలేదు. అతను కూడా బయట పడటానికి ఇష్టపడలేదు. ఎవరి కారణాలు వారివి. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి.  ఒకరికి తెలియకుండా ఒకరు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారింది.
"తప్పకుండా వెళ్ళాలా?" మనోజ్ ప్రశ్నించాడు.
"వెళ్ళకపోతే ఎలా?" బట్టలు సద్దుకుంటునే లాస్య ప్రశ్న.
"అలా కాదు, అయినా ఇలా ట్రైనింగ్స్ అని, మీటింగ్స్ అని మాటి మాటికి బెంగుళూరు వెళ్ళే బదులు మనమే బెంగుళూరు షిఫ్ట్ అయిపోతే సరిపోతుంది కదా. నీకు కూడా ఈ శ్రమ తగ్గుతుంది" తనకు తోచిన పరిష్కారంతో నెమ్మదిగా చెప్పాడు.
"వద్దు. నెలకో రెండు నెలలకో ఒకసారి వెళ్ళడమే కదా, మహా అయితే మూడు రోజులు. మళ్ళీ వచ్చేస్తాను. దానికోసం సొంత ఇల్లు వదిలేసుకుని అక్కడ అద్దె ఇంటిలో ఉండటం నాకు ఇష్టం లేదు" అంది బాగ్ జిప్ పెడుతూ.
"మ్,, పోనీ ప్రాజెక్ట్ చేంజ్ అవ్వకూడదు? ఇలా ట్రావలింగ్స్ లేని ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిపోవచ్చు కదా" అన్నాడు బాగ్ అందుకుంటూ.
"చూద్దాం !!" అంది. అక్కడితో సంభాషణ తెగిపోయింది. ఆమెను ట్రైన్ ఎక్కించి ఇంటికి చేరుకున్నాడు. కుర్చీలో తల వాల్చి సీలింగ్ వైపు చూసాడు. లక్షన్నర  జీతగాళ్ళు  భార్యాభర్తలు  ఇద్దరు.  ఎంత  ఖర్చు  పెట్టేసిన  ఇంకా బ్యాంకు లో డబ్బు మూలుగుతూనే ఉంటుంది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిచ్చిన కొత్తలో ఇద్దరు వేరు వేరు కంపెనీస్ లో జాబ్స్ తెచ్చుకున్నారు. రెండేళ్ళు పనిచేశాక ఒకే కంపెనీ లో ఉద్యోగానికి ఇద్దరు చేరారు. కధ అక్కడ మొదలైంది. అక్కడ ఆమెతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమెకు ఎక్కువ సంపాదించేవాడు కావాలి, ఎక్కువ ప్రేమించేవాడు కావాలి., ఎక్కువ అర్ధం చేసుకునేవాడు కావాలి. తక్కువగా ప్రశ్నించేవాడు కావాలి. ఆ లక్షణాలు అన్నీ మనోజ్ లో ఉన్నాయి.
ఆమెకు మనోజ్ పరిచయం అయినప్పుడు అతను ఆమెకన్నా ఎక్కువ హోదాలో ఉన్నాడు. ఆమె కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఆమె అడిగినదల్లా కాదనకుండా ఇచ్చే స్థితిలో ఉన్నాడు. ఆమెకు నచ్చినట్టుగా మసులుకున్నాడు. ఆమెకు నచ్చినట్టుగా ఆమెను ఉండనిచ్చేడు. షార్ట్ స్కర్ట్స్ వేసుకున్నా, తోటి ఉద్యోగులతో ఆమె చనువుగా ఉన్నా కార్పొరేట్  కల్చర్ అని సరిపుచ్చుకున్నాడు. తోటి స్నేహితులతో లేట్ నైట్ పార్టీలకు వెళ్లినా ఫ్రెండ్షిప్ హాంగ్ అవుట్ అని చెప్పి సద్దుకుపోయాడు. అతని ప్రేమ విషయం ఆమెతో చెప్పినప్పుడు కూడా ఆమెకు ఏడాది పాటు ఆలోచించుకునే సమయం ఇచ్చాడు. ఈలోపులో అతను తోటి ఉద్యోగి పాత్ర పోషించాలో లేక ప్రేమికుడి పాత్ర పోషించాలో తెలియక సతమతమయ్యాడు. ఏమి చేసినా ఆమెతో పాటు జీవితం పంచుకోవాలనే చేసాడు. ఈ ఏడాదిలో ఆమె అతని స్థాయికి చేరుకుంది. అయినా కొంచెం జీతం తక్కువే. పెద్దలకి చెప్పగానే వాళ్ళు కూడా పెళ్ళికి వెంటనే ఆమోదించారు , కులాలు కలవడంతో వాళ్లకి పెద్ద అడ్డు చెప్పే కారణం దొరకలేదు. ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెండు కారణాలు. ఒకటి, ఆమెకు ఇష్టం లేకుండా అతను ఏమీ చేయడు , ఆమె ముట్టుకోవడం కూడా.. రెండు, ఆమె సంపాదనను అతను అడగడు. దానికి ఆమె స్వేచ్ఛ అని పేరు పెట్టుకుంది. అతను దాన్ని ప్రేమ అని పిలుచుకున్నాడు.
ఇంతలో కూతురు స్నేహ నిద్ర లేచి హాల్ లో కూర్చుని ఉన్న మనోజ్ దగ్గరకు వచ్చి అతని ఒళ్ళో బద్దకంగా పడుకుంది. 
"మార్నింగ్ లేవగానే ఏమి చేయాలి..?" అనడిగాడు.
"దేవుడికి దండం పెట్టుకోవాలి.."
"మరి , దండం పెట్టుకున్నావా?"
"ఊహు..."
"అదిగో దండం పెట్టుకో..." అని దేవుడి కేలండర్ చూపించాడు.
తండ్రి గుండెల మీదే ఉండి దేవుడికి దండం పెట్టుకుంది.
"అమ్మేది నాన్నా?"
"ఆఫీస్ కి వెళ్ళింది.."
"హ్మ్ .... "
"బ్రష్ చేసేసుకో స్కూల్ కి రెడీ అవ్వాలి కదా..."
"ఊహు.. నేను వెళ్ళను."
"అలా అనకూడదు.."
"స్కూల్ వద్దు ,,,"
"శేఖర్  అంకుల్ కొడుకు బన్నీ కూడా నీకు సాయం ఉంటాడుగా ..."
"బన్నీ బ్యాడ్ బాయ్ ,, మొన్న రన్నింగ్ రేస్ లో నన్ను ఓడించేసాడు. "
"కానీ బన్నీ కన్నా నీకే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయిగా. సో నువ్వే గ్రేట్ .."
"బన్నీ గాడిని కొట్టు నాన్నా.."
"సరే,, గెట్ రెడీ , నాన్న కూడా ఆఫీస్ కి వెళ్ళాలి కదా . "
స్నేహని రెడీ చేసి స్కూల్ బాస్ ఎక్కించాడు. శేఖర్ కి ఫోన్ చేసి కొంచెం స్నేహకి  కూడా లంచ్ పంపించమని చెప్పాడు. శేఖర్ అందుకు అంగీకరించాడు. 
సాయంత్రం స్నేహ వచ్చాక తనని ప్లే స్కూల్ కి తీసుకెళ్లి ఆడించాడు. రాత్రి రెస్టారెంట్ లో తినేసి ఇంటికి వచ్చి స్నేహని నిద్ర పుచ్చాడు. 
* * *
బెంగళూర్ ,, 
ఫైవ్ స్టార్ హోటల్.. 
"నువ్వు తొందరగా రెడీ అయితే డిన్నర్ కి వెళ్లొచ్చు.." అన్నాడు దిలీప్.
"సరే,, " ముభావంగా అని స్నానానికి బాత్ రూమ్ లోకి వెళ్ళింది లాస్య. 
ఇద్దరు డిన్నర్ చేసి రూమ్ లోకి వచ్చారు. 
"వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అదోలా ఉన్నావేంటి ?" అనడిగాడు
"ఏమి లేదు,, " అంది.
"కమాన్ లాస్య, ఇలా వచ్చి మూడీగా ఉంటావేంటి ..?" అని దగ్గరకు జరిగాడు,
"కొంచెం తలా నొప్పిగా ఉంది దిలీప్, నాకు రెస్ట్ కావాలి." పడుకోవడానికి సిద్ధపడింది.
"రెస్ట్ తీసుకోవటానికా ఇంత దూరం వచ్చింది?" అని అసహనంగా అడిగాడు.

అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతని మనసు లోపల చిన్న కుదుపు. కోప్పడితే ప్రయోజనం లేదు అని అర్ధమైంది. "నీ ఇష్టం.." అన్నాడు. పడుకుంటూ "నీ హెచ్,వన్ వీసా రైస్ చేసాను." అని చెప్పాడు. ఆమెకు వినిపించినా వినపడనట్టు ఉండిపోయింది. హెచ్.వన్ రైస్ చేస్తాను అన్నప్పుడు ఆమె ఎగిరి గెంతేసింది. ఇప్పుడు చలం లేకుండా పడుకుని ఉండిపోయింది.
ఆమెకు రాత్రి ఎప్పుడో మెలకువ వచ్చింది. ఆమె మీద చేయి వేసుకుని పడుకుని ఉన్నాడు దిలీప్. ఆ చేతిని తీసి బాల్కనీలోకి వెళ్లి నిలబడింది. ఆమె మనసు అంతా వెగటుగా ఉంది. ఆమెకు మదిలో మనోజ్ మెదిలాడు. 
"ఏంటి నిద్రపట్టడం లేదా?" వెనక నుండి దిలీప్ గొంతు.
"లేదు..."
"ఎందుకు?"
"ఐ వాంట్ టు లీవ్..."
"ఏమైంది?"
చాలా సేపు మౌనం తరువాత "నాకు తప్పు చేస్తున్నామని అనిపిస్తోంది." అంది.
"డోంట్ బి సిల్లీ,, మనం ఒకప్పుడు ప్రేమించుకున్నాం"
"అది గతం. ప్రస్తుతం కాదు."
"అంటే? నాకు నీపై ప్రేమ లేదా?"
"ఒకరంటే ఒకరికి అవసరం ఉంది. దానికి ప్రేమ అని ముసుగువేసుకున్నావ్"
"అసలేం జరిగింది..?"
"మనోజ్ నన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నేను అతన్ని మోసం చేస్తున్నానేమో అని గిల్టీగా ఉంది."
"అలాంటివన్నీ పట్టించుకోను లాస్య,, కమ్, లెట్స్ మేక్ లవ్." అన్నాడు నెమ్మదిగా
"ఐ యాం సారీ,,," అంది అతనివైపు కూడా చూడకుండా.
"నీ హెచ్.వన్ వీసా నా చేతుల్లో ఉంది." అన్నాడు గొంతులో స్వరం మారింది.
అతనివైపు చూసింది. 
"నీకు నా శరీరం కావాలా నేను కావాలా?" అని అడిగింది.
"నువ్వు కావాలి.." అన్నాడు.
"సరే లెట్స్ గెట్ మ్యారీడ్" అంది.  ఉలిక్కిపడ్డాడు. 
"నీకు నీ వైఫ్ తో డివోర్స్ కి అప్లై చేయు, నేను డివోర్స్ అప్లై చేస్తాను. ఇలా దొంగ చాటుగా కలవడం కన్నా ఎవ్రి డే ఉయ్ కెన్ మేక్ లవ్ " అంది. దిలీప్ ఒక్క క్షణం టెన్షన్ పడ్డాడు.
"అది కాదు లాస్య,.." అని ఏదో చెప్పబోయాడు.
"ఏం ధైర్యం చాలడం లేదా?" ప్రశ్నించింది.
సమాధానం ఇవ్వలేదు. "మొగుడు అంటే అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో సడన్ గా .." అన్నాడు కొంచెం వెటకారం ధ్వనించేలా.
"హి ఈజ్ గుడ్ ఎట్ బెడ్ దేన్ యు .." అంది. అతని ఈగో బాగా హార్ట్ అయింది. ఆ మాట అతని అహాన్ని అధఃపాతాళంలోకి లాగేసింది. ఒక మగాడికి అంతకంటే అవమానం మరేం ఉండదు. 
"నేను ఏమి చేయాలో అది చేస్తాను." అన్నాడు.
"అన్-అఫీషియల్ గా నేను ఈరోజే జాబ్ రిజైన్ చేసేసాను. రేపు నీకు అఫీషియల్ గా మెయిల్ పెడతాను." అంది. దెబ్బతగిలిన వాడిలా చూసాడు. ఆ రాత్రే ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది.

* * *
టైం రాత్రి రెండు దాటింది.
శేఖర్ మనోజ్ కలిసి అప్పటికే నాలుగు రౌండ్స్ తాగారు.
"ఇంక చాలురా తాగింది " అన్నాడు శేఖర్. 
మనోజ్ అంతగా పట్టించుకోలేదు. మరో గ్లాస్ మందు నోట్లో ఒంపుకున్నాడు.
"ఎంతకాలం ఇలా?" అనడిగాడు శేఖర్
"జరిగినంత కాలం.."
"నీకు కోపం రావడం లేదా?"
"ప్రేమున్న చోట కోపం ఉండదు"
"దీన్ని ప్రేమ అనరు. పిచ్చి అంటారు."
"పేరు ఏమైనా పెట్టుకో,, "
"నీకు నేను అనవసరంగా చెప్పాను."
"నీ బాధ లాస్య అలాంటి పని చేస్తోందని చెప్పినందుకా లేక లాస్య అలాంటిది అని తెలిసి నేను తనని ఏమి చేయనందుకా?" నవ్వాడు.
"నువ్వు ఇలా అయిపోతున్నందుకు,.. తప్పు ఒకరు చేస్తే, శిక్ష ఇంకొకరు అనుభవిస్తున్నందుకు."
"లాస్య మంచిదిరా.. కానీ ఇంకా డబ్బు, పరపతి, అంటూ ఏదో,, అత్యాశ.. నాకు తనంటే కోపం లేదు. జాలి ఉంది. ఎస్, ఐ పిటి హెర్. & ఐ లవ్ హెర్ " అంటూ మత్తుగా తూలిపోయాడు మనోజ్.
* * *
లాస్య బెంగళూర్ వెళ్ళేది ప్రాజెక్టు పని మీద కాదని అసలు విషయం ‘దిలీప్’ అని చెప్పాడు శేఖర్. శేఖర్ మనోజ్ కి ఆప్త మిత్రుడు. శేఖర్ చెప్పిన విషయం ముందు మనోజ్ ని షాక్ కి గురిచేసినా , అతను చెప్పింది నిజమే అని నిర్ధారణకు వచ్చాడు.
"ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు?" అనడిగాడు శేఖర్
"నాకు లాస్య అంటే ఇష్టం. ఇంకా ఎక్కువ ప్రేమని చూపిస్తాను. ." అన్నాడు నిలకడగా
"అంటే,, ఈసారి కూడా వెళ్తే పంపిస్తావా?"
"నాకు తెలుసు అన్న విషయం తనకి తెలియకపోవడం మంచిదని నా ఫీలింగ్."
"అసలు ఎందుకు చేస్తున్నావ్ అని అడిగితె సమస్య తీరిపోతుంది కదా.."
"తీరదు. తరువాత ఆమె ఆ గిల్ట్ తో ఉండలేక, మరొకరి సానుభూతో , జాలో ఓదార్పు అయి మేము విడిపోతే ? అప్పుడు ఏమి చేయలేము. పెళ్లి అయినప్పుడు నాతి చరామి అని ఒట్టేసాను, తాను తప్పు చేస్తే నేను సరిదిద్దాలి. అది తనని నేను ఎంత ప్రేమిస్తున్నానో ఇంకా తెలియాలి. కోప్పడితే విడిపోయేది ఇద్దరు మనుషులు. అదే ప్రేమిస్తే ఒకే పయనం సాగించే రెండు జీవితాలు. పైగా మా జీవితాలు స్నేహ జీవితంతో ముడిపడింది.  " అని చెప్పాడు.

అప్పటి నుండి మనోజ్ , లాస్యాని మరింత అపురూపంగా చూడటం ప్రారంభించాడు. అతనిలో మార్పుని ఆమె నెమ్మదిగా గమనించసాగింది. ఎందుకిలా ఉంటున్నావ్ అని అడిగే ధైర్యం చేయలేకపోయింది. అతను ఇచ్చే సర్ప్రైస్స్ ఆమెకు మరింత నచ్చేవి. ఎందుకివన్నీ అంటే చిన్నగా  నవ్వి  ఉరుకునేవాడు "లవ్ యు లాస్య .. ఇవన్నీ నిన్ను ప్రేమించినపుడు చేయాలనుకున్నాను." అని చెప్పేవాడు. ఆమెకు అర్ధమయ్యేవి కావు. రకరకాల టూర్స్ కి ప్లాన్ చేసాడు. అన్ని చోట్లా తిప్పాడు. దాంపత్యంలో ఉన్న మాధుర్యాన్ని చూపించాడు. ప్రేమ అంటే వర్ణించేది కాదు చూపించేది అని చెప్పాడు. ఆమె అంటే ఎంత ప్రేమ ఉందో అని చాలా రకాలుగా వ్యక్తీకరించాడు. నెమ్మదిగా ఆమెలో ఒక అలజడి మొదలైంది. అంతకంటే గిల్టీ ఫీలింగ్ ఎక్కువ అయింది. తప్పుడు చేస్తున్నానని భావన మరింత పెరిగింది. అయినా ఎక్కడో తాను అనుకున్న గోల్స్ రీచ్ అవనేమో అని ఆ రోజు బెంగళూర్ బయలుదేరింది. కానీ ఆమె మనసు నిండా మనోజ్ ఆక్రమించేసుకున్నాడు. ఆమె గుండెల మీద మనోజ్ కట్టిన తాళి. ఆమె గుండెల్లో అతను చూపిన ప్రేమ. చివరికి తెలివిగా దిలీప్ ని వదిలించుకుని వచ్చేసింది.
* * *
ఫ్లయిట్ మూలాన ఇంకా తెల్లారకుండానే ఇంటికి చేరుకుంది. శేఖర్ మనోజ్ లు మాట్లాడుకోవడం వినేసింది. అక్కడే బయటే కూర్చుని చాలా ఏడ్చింది. తెల్లారింది. శేఖర్ లేచి హ్యాన్గ్ ఓవర్ లో ఉండే లాస్యాని చూసాడు. 
మనోజ్ లేచాడు. హ్యాన్గ్ ఓవర్ తగ్గాక "నీకు నన్ను కొట్టే హక్కు ఉంది. ఇలా చేయద్దు అని తిట్టే హక్కు ఉంది. కానీ ఎందుకిలా చేస్తున్నావ్ అని అడిగే హక్కు ఉంది. ఎందుకు నన్ను అడగలేదు" అని అడిగింది లాస్య.
మనోజ్ మౌనం వహించాడు. 
"చెప్పు, మనోజ్ ఎందుకు అడగలేదు. "
"ఎందుకు అడగాలి?" అని సూటిగా చూసాడు కన్నీళ్లతో. ఆమె కన్నీళ్లతో ఓ క్షణం చూసింది. పరిగెత్తుకుంటూ వచ్చి భర్తను కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. "ఐ యాం సారి మనోజ్,.. రియల్లీ.. నన్ను క్షమించు... " అని ఏడ్చింది. ఎంత సేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాడు.

No comments:

Post a Comment

Pages