నీకు నేనున్నా – 12 - అచ్చంగా తెలుగు
 నీకు నేనున్నా – 12
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com

(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు మనోహర్. అతని అక్క కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి మళ్ళి వస్తానని చెప్పి వెళ్లి, అనుకోకుండా మనోహర్ కి ఆక్సిడెంట్ అయి కోమాలో ఉండిపోతాడు. దానితో అనాధలైన మధురిమ, బాబులను తనతో తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చి, మధురిమకు ఉద్యోగం ఇప్పిస్తాడు దామోదర్ రెడ్డి. మధురిమతో లేడీస్ హాస్టల్ పెట్టిస్తారు చరణ్, విక్రం . హాస్టల్ లో చేరే ఆడపిల్లల విభిన్న మనస్తత్వాలతో కొత్త సవాళ్ళను ఎదుర్కుంటుంది మధురిమ . అందులో వర్ష అనే అమ్మాయి దూకుడుగా ప్రవర్తించి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది .)
నువ్వు వెళ్లకపోతే పోలీసులకి ఫోన్ చేసి పిలుస్తాను. వాళ్లే వచ్చి నిన్నుతీసికెళ్తారు. అప్పడవుతుంది నీకు పెళ్లి" అంటూ రాణాను బెదిరించింది మేడమ్. ఓకె, మేడమ్! నేను వెళ్తాను. పోలీసులకి భయపడి కాదు. మిమ్మల్ని గౌరవించి. మళ్లీ వస్తాను. అప్పుడు మీరే నాకు దాన్నిచ్చి పెళ్లి చెయ్యండి! అదెలా తప్పించుకుంటుందో చూస్తాను" అంటూవేగంగా అక్కడనుండి వెళ్లిపోయాడు రాణా. వెంటనే ఫోన్ చేసి వర్ష తండ్రి హరిని పిలిపించింది హాస్టల్ మేడమ్. హైదరాబాదు నుండి హరి వచ్చి నేరుగా హాస్టల్ మేడమ్ రూంలో కెళ్ళి కూర్చున్నాడు. ఈ హాస్టల్లో మీ అమ్మాయిని ఎందుకు వుంచారండీ?" సూటిగా హరిని అడిగింది మేడమ్. "అదేం ప్రశ్న మేడమ్! అమ్మాయిలను హాస్టల్లలో ఎందుకు వుంచుతాం. చదువుకుంటారని. చదువుకొని, ప్రయోజకులవుతారని" అన్నాడు హరి. "ఆ చదువుకోసం డబ్బుకూడా బాగానే ఖర్చు అవుతుందనుకుంటా" అంటూ అద్దాలను సవరించుకుంటూ హరి ముఖంలోకి చూసింది మేడమ్. “అవును మేడమ్! మా శక్తికొద్దీ ఖర్చుపెడుతూనే వున్నాం. కాలేజీ, హాస్టల్ ఫీజులకి, ఇంకా ఇతర ఖర్చులకి డబ్బులు బాగానే అవుతున్నాయ్!" అన్నాడుహరి. “ఇతర ఖర్చులు అంటే? అడిగింది మేడం హరి ముఖం లోకి డీప్ గా చూస్తూ. చెప్పలేకపోయాడు హరి. ఆమె చూపులకి తడపడ్డాడు. మీరు చెప్పలేరు. అందుకేనండీ పిల్లల్ని బయట వుంచి చదివించే టపుడు పేరంట్స్ పిల్లలకి టచ్లో వుండాలి. వాళ్లు ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో గమనించుకోవాలి” అంది మేడం. ఆమె అలా అనగానే ఫీలయ్యాడు హరి. “మా అమ్మాయి అలాంటిది కాదు మేడం! రోజూ తన సెల్ ఫోన్ లోంచి ఇంటికి ఫోన్ చేసి మాతో మాట్లాడుతూనే వుంటుంది” అన్నాడు హరి. హరి చిన్నచిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ఆయనకు ఒక పనిలో వస్తుంది. ఒక పనిలో పోతుంది. ఆయన చేస్తున్న పనులు అలా వుంటాయి. ఆ పనుల్లో ఎన్నో ఆటుపోట్లు చూశాడు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. "మీ అమ్మాయి మీతో ఏం మాట్లాడుతుందో ఏమోకాని, ముందున్న హాస్టల్ వెకేట్ చేసి నా హాస్టల్లో చేరుతున్నప్పడు మీరెవరూ రాలేదు. మా పేరెంట్స్ తర్వాత వస్తారంది. దీన్నిబట్టి చూస్తే ఆ అమ్మాయి గురించి మీకేమీ తెలియదని పిస్తోంది" అంది హాస్టల్ మేడమ్. తన సెల్కి ఏదో కాల్ వస్తుంటే కట్చేసి హరివైపు చూసింది మేడమ్. "అదేం లేదు మేడమ్! ముందున్న హాస్టల్లో తన ఫ్రెండ్ళెవరూ లేరంది. వాళ్ల క్లాస్మేట్సంతా మీ హాస్టల్లోనే వున్నారంది. మీ హాస్టల్లో వుంటే తన ఫ్రెండ్స్తో కలసి చదువుకోవచ్చంది. కలసి కాలేజీకి వెళ్ళొచ్చుఅంది" అన్నాడు హరి, హాస్టల్ మారేటప్పడు ఇంట్లోవాళ్లకి అలాగే చెప్పింది వర్ష. “అదంతా అబద్దం. ఆ హాస్టల్లో తన ఆటలు సాగవని, వెంటనే హాస్టల్మారింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడికి వచ్చాక మీ అమ్మాయి చాలా బుద్దిగా మారింది. కారణం సాత్విక్ అనే అబ్బాయి. అంతకు ముందు రాణా అనే అబ్బాయితో విచ్చలవిడిగా తిరిగింది. ఆ అబ్బాయి నిన్నటినుండి నా హాస్టల్కి వచ్చి గొడవచేస్తున్నాడు" అంది మేడమ్. షాక్ తిన్నాడు హరి. తప్పు చేసేవాళ్లంటే హరికి నచ్చదు. ముఖ్యంగా ఆడపిల్లలు తప్పు చేస్తే అసలు సహించడు. తప్పులు చేస్తూ బ్రతికే ఆడపిల్లలు అతని దృష్టిలో చచ్చినవాళ్లతో సమానం. షాక్ నుండి తేరుకున్నాడు హరి, కోపంగా మేడమ్ వైపు చూశాడు. "మా పిల్లల్ని మీ దగ్గర వదిలింది ఇలా అబ్బాయిలతో తిరగటానికా? వాళ్లలా తిరుగుతుంటే మీరెలా వూరుకున్నారండీ! అమాత్రం బాధ్యత మీకులేదా? హాస్టల్ నడిపే పద్దతి ఇదేనా? ఎవరెటు పోతున్నారో తెలుసుకోలేనప్పడు ఈ హాస్టల్ ఎందుకండీ మీకు?” అంటూ ఆవేశంగా మేడమ్మీద కోపడ్డాడు. హరి ఎప్పుడైనా అంతే! కోపమొచ్చినా, ఆవేశమొచ్చినా ముందూ, వెనకా ఆలోచించడు. “చూడండి! మిష్టర్! అవకాశం దొరికింది కదాని అరవకండి! కాస్త మీ ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించండి! మీ అమ్మాయి హాస్టల్ నుండి బయటకెళ్ళాక ఎక్కడ తిరిగినా అక్కడకెళ్లి చూడటానికి మేం మీ అమ్మాయికి బాడీగార్డులం కాదు" అంటూ మేడమ్ కూడా హరిమీద కోప్పడింది. బెలూన్లో గాలి తగ్గినట్లు హరిలోని ఆవేశం వెంటనే తగ్గింది. "మీ అమ్మాయి ఇద్దరు బాయ్ఫ్రెండ్స్ని మెయిన్టెయిన్ చేస్తోందట. మీ అమ్మాయిని ముందు కంట్రోల్లో పెట్టుకోండి! లేకుంటే ఆ అబ్బాయిలిద్దరు కొట్టుకు చచ్చేలా వున్నారు" అంది మేడమ్. ఆ మాటలు వినగానే హరి రక్తం సలసల మరిగింది. పట్టరాని ఆవేశంతో ఉగ్రుడయ్యాడు. వర్ష కన్పిస్తే ముక్కలు, ముక్కలుగా నరికెయ్యాలను కున్నాడు. అంతలో తండ్రి వచ్చాడని ఎవరో చెప్పగా విని, మేడమ్ రూంలోకి వెళ్లింది వర్ష. వర్షను చూడగానే మాట్లాడలేదు హరి. వెంటనే వర్ష రెండు చెంపల్ని గట్టిగా వాయించాడు. గొంతుపట్టుకొని గోడకేసి నెట్టి, ఆ గొంతును అలాగే పట్టుకున్నాడు. ఊహించని పరిణామానికి వర్ష కళ్లు తిరిగాయి. ఊపిరాడలేదు. గొంతు నొప్పిగా వుంది. నన్ను వదలండి డాడీ! నన్నెందుకు కొడుతున్నారు?" అంటూ గింజుకొంది వర్ష. “నా పెంపకంలో ఎలాంటి లోపం లేదని గర్వపడ్డాను కదే! చివరకు నువ్వు చేస్తున్నపని ఇదా? నువ్వు బ్రతకటానికి వీల్లేదు. నిన్ను చంపేస్తాను" అంటూ వర్ష గొంతును ఇంకా గట్టిగా బిగించి పట్టుకున్నాడు. “ముందు నన్ను వదలండి! నేనేం చేశాను?" అంటూ తండ్రి చేతిలోంచితన గొంతును విడిపించుకొంది. “ఏం చేశావా? దౌర్భాగ్యపు పనులు చేసిందే కాక మళ్లీ నా నోటితోచెప్పించుకోవాలని వుందా నీకు? కన్న తండ్రినే మోసం చేశావు కదే" అంటూ కోపంగా అరుస్తూ మళ్లీ వర్ష గొంతు పట్టుకోబోయాడు."ఆగండి డాడీ కొట్టటం వచ్చుకదాని అదేపనిగా కొట్టకండి! మీరెందుకు కొడుతున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది" అంటూ మళ్లీ తన గొంతు పట్టుకోబోతున్న తండ్రి చేతిని బలంగా పట్టుకొని ఆపింది వర్ష. హరి కళ్లు నిప్పలు కురుస్తున్నాయి. “ఏమిటి నీకు అర్థమయ్యేది. నీకన్నా నీ కన్నా ఆ యానిమల్స్ నయం. గడ్డి తిన్నా పద్ధతిగా తిరుగుతాయి. నీలాగ సంస్కారం లేని తిరుగుళ్లు తిరగవు" అన్నాడు హరి. "నేనేం పద్ధతి తప్పి తిరగలేదు. సాత్విక్ని ప్రేమించాను. ప్రేమించటం తప్పు కాదు. పద్దతి లేకపోవటం అంతకన్నా కాదు" అంది వర్ష. "మరి ఆ రాణా ఎవడు?" గట్టిగా అరిచాడు హరి. రాణా వెధవ ఫ్రెండ్ కి, లవర్కి తేడా తెలియని ఇడియట్ అలాంటి రాణాలు నాలాంటి అమ్మాయిలకి తగులూనే వుంటారు. అదో పిచ్చిమొక్క నేనే దాన్ని ఏరేస్తాను" అంది వర్ష. ”అబ్బాయిల్నిబంతులనుకుంటున్నావా? ఈజీగా ఆడుకోటానికి వాళ్లు తలచుకుంటే జీవితమనే గ్రౌండ్లో నీ బంతి అడ్రన్ లేకుండా పోతుంది" అన్నాడు హరి. "పోనీయండి! నేను తెగించే వున్నాను" అంది వర్ష. "ఎవరి కోసం ఈ తెగింపు? చదువుకోమని పంపితే, ఏదో యుద్దానికి సిద్ధమైనట్లు తయారయ్యావు. ఇంటికి పద నీ పని చెబుతాను" అన్నాడు హరి. నేను నా ప్రేమ యుద్ధంలో తప్పకుండా గెలుస్తాను. సాత్విక్కి నన్నిచ్చి పెళ్లి చెయ్యండి!" అంది వర్షస్థిరంగా. వర్ష నిర్ణయంలో పర్ఫెక్ట్ నెస్ కన్పించింది. వర్ష తెగింపుకి నిష్కర్తగా మాట్లాడే ఆ మాటతీరుకి మేడమ్ ఆశ్చర్యపోయింది. “చచ్చినా ఈ పెళ్లి చెయ్యను" అన్నాడు హరి. ఎవరు చచ్చేది. నువ్వా? నేనా?" అంది వర్ష ఈసారి స్టన్నయ్యాడు హరి అతనికింక మాటలు రాలేదు. అక్కడో క్షణం కూడా నిలబడకుండా హైదరాబాద్ బస్సు ఎక్కాడు. ****** ఇంటి కెళ్లాక వర్ష మీదున్న కోపాన్ని రోజామణి మీద చూపించాడు హరి భర్తలో అంత కోపాన్ని ఎప్పుడూ చూడని రోజామణి గజగజ వణికిపోయింది. తన బిడ్డను ఏం చేస్తాడోనని హడలిపోతోంది. పెళ్ళైన కొత్తలో రోజామణితో తన సూడెంట్ లైఫ్ గురించి చెబుతూ, మధురిమను చంపేశానని చెప్పాడు హరి. ఆ ఒక్క నిదర్శనం చాలు, ఇలాంటి విషయాల్లో తన భర్త ఎంతటి భయంకరమైన వ్యక్తో తెలియటానికి. కళ్లముందు డిగ్రీ చదువుతున్న దాన్ని తీసికెళ్ళి వరంగల్లో వేశావు అదేమంటే కూతుర్ని ఇంజనీర్నిచెయ్యాలన్నావ్ ఇప్పడు చూడు. ఎలా జరిగిందో? ఇదంతా నీవల్లే జరిగింది. ఇంట్లో ఆడ పెత్తనాలు ఎక్కువయ్యాయి" అంటూ రోజామణిని కొట్టాడు హరి. ఎక్కడ తగులుందో చూడకుండా కొట్టాడు. హరి. అలా కొడుతుంటే వీపు అప్పజెప్పింది రోజామణి ఎప్పడైనా హరి చేతిలో దెబ్బలు తప్పించి కూతుర్ని కడుపులో దాచుకుంటుంది రుద్రాణి. కానీ రుద్రాణి ఇంట్లో లేదు. ఎవరో అడిగారని చీరలు పట్టుకెళ్లి ఇంకారాలేదు. రుద్రాణి పెద్దపెద్ద ఆఫీసర్ల భార్యలకి చీరెలు అమ్ముతుంది. ఒంటరిగా వున్న రోజామణి, హరి దెబ్బల్ని ఇంక తట్టుకోలేక, పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అది విన్న రామకృష్ణ వెంటనే వచ్చి హరిని తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. హరిని కూర్చోబెట్టి ఫ్రిజ్లోంచి వాటర్బాటిల్ తీసి త్రాగమని యిచ్చాడు రామకృష్ణ వాటర్ త్రాగి బాటిల్ రామకృష్ణ చేతికి యిచ్చాడు హరి "ఆడవాళ్లను కొట్టటం మహాపాపంరా హరీ! ఏదైనావుంటే మాటలతో చెప్పాలి కాని ఇలా ఏడిపిస్తే ఇంటికి మంచిది కాదు. వాళ్లను గౌరవంగా చూసుకుంటే దేవుడు మనకు అన్నీ యిస్తాడు" అంటూ హరివైపు చూశాడు రామకృష్ణ. రామకృష్ణతో వరంగల్లో జరిగింది మొత్తం చెప్పాడు హరి. వర్ష రెస్పాన్స్ కూడా చెప్పాడు. "నువ్వు ఏమాత్రం మారలేదు హరీ! మార్పు అనేది మనిషి అవసరంరా! అన్నాడు రామకృష్ణ. “ఇందులో నేను మారవలసింది ఏముంది రామకృష్ణా! ఆడవాళ్లు ఆడవాళ్లులా వుండకుండా, ఇలాంటి పాడుపనులు దేనికి చెప్ప!" అన్నాడు హరి. "ఆడవాళ్లు ఆడవాళ్లలాగే వున్నారు. నువ్వే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. వాళ్లను మన రోజుల్లో ఎలా అర్థం చేసుకునేవాడివో, ఇప్పడు కూడా అలానే అర్థం చేసుకుంటున్నావు" అన్నాడు మృదువుగా రామకృష్ణ. రామకృష్ణ గొంతు సందర్భాన్నిబట్టి ఎంతగట్టిగా వుంటుందో అంత మృదువుగా వుంటుంది. మౌనంగా తలవంచుకున్నాడు హరి. మధురిమను చంపాడని తెలిసి హరితో కొద్దిరోజులు మాట్లాడలేదు రామకృష్ణ ఆ తర్వాత ఆర్థికంగా హరి పడున్న బాధల్ని చూసి ఫ్రెండ్ కదాని చిన్నచిన్న కాంట్రాక్టు పనులు ఇప్పించి ఆదుకున్నాడు. చదువుకుంటున్నప్పటి ఫ్రెండ్స్లో ఈ ఒక్క హరి తప్ప ఇంకెవరూ రామకృష్ణకిటచ్ లో లేరు. నేనెందుకో ఆడవాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటే తట్టుకోలేను రామకృష్ణా! ఇలాంటి పనులు మంచివి కావురా!" అన్నాడు హరి. “మంచిపనని నేను మాత్రం అంటున్నానా? ఒకరి జీవితం వున్నట్టు ఇంకొకరి జీవితం వుండదురా హరీ! అలాగే ఒకరి పరిస్థితులు వున్నట్లు ఇంకొకరి పరిస్థితులు వుండవు. ఒకరి ఆలోచనలు వున్నట్లు ఇంకొకరి ఆలోచనలు వుండవు. కొంతమంది పరిస్థితులకి తగినట్లు నడుచుకుంటారు. అది వాళ్లకి సంతోషాన్ని ఇస్తుంది. కొంతమంది పరిస్థితులకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. అది వాళ్లకి ఆనందాన్నిస్తుంది. ఎవరికి ఎలా ఆనందం అన్పిస్తే అలా చేస్తారు. కానీ ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ల సంతోషాన్ని వదులుకోరు. ఇది నువ్వెందుకు అర్థం చేసుకోవు?" అన్నాడు రామకృష్ణ. “ఏమో రామకృష్ణా! నాకు ఇదంతా అయోమయంగా ఉంది. రోహాను బాగా కొట్టానురా! ఎలా ఉందో ఏమో! ఆవేశం వచ్చినపుడు కొడతాను కాని రోజా అంటే ప్రాణంరా నాకు. రోజా ఎలావుందో వెళ్లి చూస్తాను" అంటూ తన ఇంట్లోకివెళ్లిన హరి వంటగదిలో రుద్రాణి, రోజా మాట్లాడుకునే మాటలు వింటూ అక్కడే ఆగిపోయాడు. "ఈ దెబ్బలేంటే రోజా! అల్లుడు గారు వరంగల్ నుండి వచ్చాడా? పెళ్లి అయ్యి ఇంత కాలమైంది. అల్లుడు గారికి కోపమొచ్చి కొడుతుంటే తప్పించుకోవటం ఇంకెప్పుడు నేర్చుకుంటావే తగ్గిపోతుందిలే ఏడవకు" అంటూ కూతుర్ని దగ్గరకి తీసుకుంది రుద్రాణి. "గొడ్డులా బాదేవాడికిచ్చి పెళ్లిచేసి, మళ్లీ ఓదారుస్తున్నావా?" అంది రోజా కోపంగా "గొడ్డులా బాదేవాడు కాక నువ్వు చేసిన పనికి నీకు సజ్జనుడొస్తాడా? అప్పట్లో వీడేదో తప్పు చేసి పారిపోయి పెళ్లి టైంకు వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే శివశంకర్తో తిరిగి నువ్వు తల్లివి కాబోతున్న విషయం తెలిసుంటే నిన్ను పెళ్లి చేసుకునేవాడు కాదు. నీ ముఖానికి వీడే ఎక్కువ" అంది రుద్రాణి కూతురు వీపుమీద పడ్డ వాతలకి మందు రాస్తూ. నేను శివశంకర్ని ప్రేమించి మంచిపనే చేశాను. నేనేదో ఘరోరం చేసినట్లు శివశంకర్ని తాతయ్యచేత కొట్టించి వూర్లోంచి వెళ్లగొట్టావ్! నువ్వు అప్పడా పని చేయించి వుండకపోతే, మనం బనగానిపల్లెలోనే వుండేవాళ్లం. శివశంకర్ నీ అల్లుడై వుంటే నిన్ను కూర్చోబెట్టి పోషించేవాడు" అంది రోజామణి. శివశంకరంటే రోజామణికి అంత నమ్మకం. "ఆ కులం తక్కువవాడ్ని ఆకాశానికెత్తి మాట్లాడావంటే నేను నీ దగ్గర ఉండను. పారిపోతాను. అంటూ బెదిరించింది రుద్రాణి. రోజామణి మాట్లాడలేదు. మౌనంగా బాధపడ్తోంది దెబ్బల్ని చూసుకుంటూ. 'అల్లుడు ఎందుకు కొట్టాడే రోజా" అంటూ అప్పడే గుర్తొచ్చిన దానిలా అడిగింది రుద్రాణి. కారణం తెలిస్తే ఎవరిదగ్గర తప్పందో తెలిసిపోతుంది రుద్రాణికి. అల్లుడూ, కూతురూ ఆమెకు చేరో కన్ను. ఏ కంట్లో తడి చూసినా బాధపడ్లుంది. “నీ మనవరాలు ఎవర్నో ప్రేమించిందట. అందుకు నన్ను కొట్టాడు” అంది రోజామణి రోషంగా. “సరేలే! తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! అంది కూడా తల్లి దారిలోనే వెళ్తుంది. చేత్తో కొట్టినా, కట్టేసి కొట్టినా దెబ్బలయితే తినాలిగా! దానికింత ఏడుపెందుకు ?” అంటున్న తల్లి మాటల్లోని గూడార్ధం రోహా గుండెల్ని తాకింది.కత్తిని కౌగిలించుకున్నట్లు అన్పిస్తున్న హరితో కాపురం గుర్తొచ్చి రోజా మనసు కళ్ళు మౌనంగా ఏడ్చాయి. “నా బాధ అది కాదమ్మా! కనీసం వర్ష ప్రేమించిన అబ్బాయికి మీకు సరిపొయ్యే కులం వుందో లేదోనని భయంగా వుంది. అదిలా ప్రేమిస్తుందని నాడు తెలిసివుంటే కులం చూసి ప్రేమించమని చెప్పి వుండేదాన్ని. మీ చేతుల్లో పడి దానికి కూడా నా గేటు పడుతుందని బాధగా వుంది” అని దీనంగా అంటున్న రోజా మాటలు రుద్రాణి మనసుకి గురి చూసి తగిలాయి. బాణంలా గుచ్చుకున్నాయి. పూస్తున్న మందుని అలాగే పట్టుకుని కూతురి ముఖంలోకి చూస్తుండిపోయింది. అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటున్న హరికి కాళ్ల క్రింద భూమి కంపించినట్లు అయ్యింది. వింత శిశువుగా భావించి ప్రేమగా ప్రేన్చుకున్న వర్ష తన కూతురు కాదా? ఎంతో నమ్మకంతో తన భార్యగా భావించిన రోజా శివశంకర్ ప్రేయసా? ఇప్పుడు తనేం చేయాలి? అక్కడో క్షణం కూడా నిలబడలేక నిద్రలో నడుస్తున్న వాడిలా బయటకు నడిచాడు హరి. ఇంట్లోకి వెళ్ళిన హరి వెంటనే బయటకు రావటం చూసి ఆశ్చర్యపోతూ పిలిచాడు రామకృష్ణ. హరి పలకలేదు. ఎంత పిలిచినా ఆగలేదు. మళ్ళీ ఏదో జరిగిందని అనుమానం వచ్చింది రామకృష్ణకి. వెంటనే రామకృష్ణ బయటకు వచ్చి వేగంగా అడుగులేస్తూ, హరిని పట్టుకున్నాడు. అప్పటికప్పుడే ఎంతో క్రుంగిపోతూ కన్పించాడు హరి. “ఇంట్లోకి వెళ్లావు కదా! ఇంతలోనే ఏం జరిగింది హరీ అలా వున్నావ్! నిన్ను చూస్తుంటే నీ మనసేం బాగాలేనట్లన్పిస్తుంది. నాతోరా!కొద్దిసేపు నా దగ్గర కూర్చుందువు గాని”అంటూ హరిణి బలవంతంగా లోపలకి తీసికెళ్లి, కూర్చోబెట్టాడు రామకృష్ణ. హరి శ్రేయోభిలాషి రామకృష్ణ. అందుకే రామకృష్ణ మాటనెప్పుడు ధిక్కరించడు హరి. “నాకీ బ్రతుకు వద్దు రామకృష్ణా! నాకు బ్రతకాలని లేదు. నన్ను వెళ్ళనీ” అంటూ లేచాడు హరి. “నీ బ్రతుక్కి ఏమైందిప్పుడు ? కూర్చో హరీ!” అంటూ మళ్ళీ కూర్చోబెట్టాడు రామకృష్ణ. సడన్ గా రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చాడు హరి. ఏడ్పించడం తప్ప ఏడవటం రాణి హరి ఏడుస్తుంటే వింతగా ఉంది రామకృష్ణకి. “ఎందుకేడుస్తున్నావ్ హరీ?” అంటూ ఓదార్పుగా హరి భుజంపై చేయి వేశాడు రామకృష్ణ. కదిలిపోయాడు హరి. “మధురిమను చంపినందుకు ఏడుస్తున్నాను రామకృష్ణా! మధురిమను బలవంతంగా అనుభవించాలని బాధపెట్టినందుకు సిగ్గుతో చచ్చిపోయి ఏడుస్తున్నాను. మధురిమపై నిందమోపి, పెళ్ళి ఆగిపోయేలా చేసినందుకు రోదిస్తున్నాను. ఈ బాధ నన్నింక బ్రతకనియ్యదు. నేను చచ్చిపోతాను రామకృష్ణా!” అంటూ మళ్ళీ భోరున ఏడ్చాడు హరి. ఏడ్చీ ఏడ్చీ రిలాక్స్ అవుతాడని అలాగే వదిలేశాడు రామకృష్ణ. ఎంతసేపు ఏడ్చినా ఆ ఏడుపు ఆగటం లేదు. “ఇప్పుడవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఎందుకు రా హరీ!గతాన్ని మరచిపో” అన్నాడు రామకృష్ణ. “నా గతం అందరిలాంటిది కాదు రామకృష్ణా! నా గతాన్ని చూసి నా వర్తమానం వేలెత్తి చూపుతోంది.భవిష్యత్తు నన్ను భయపెడుతోంది. గతంలో నేను చేసిన పాపాలు ఇప్పడు నాకు శాపాలైనాయి" అన్నాడు కళ్లు తుడుచుకోవటం కూడా మరచిపోయి హరి. హరి చూపులు ఎక్కడో వున్నాయి. హరిలో వచ్చిన ఈ మార్పును నమ్మలేకపోతున్నాడు రామకృష్ణ. వెళ్లటానికి లేచాడు హరి. హరిని అక్కడ నుండి కదలకుండా పట్టి కూర్చోబెట్టాడు రామకృష్ణ. "ఈ స్థితిలో నువ్వు బయటకెళ్లటం మంచిది కాదు. ఇంట్లోకెళ్లు" అన్నాడు రామకృష్ణ హరి ముఖంలోకి చూస్తూ "నేను ఇంట్లోకెళ్తే ఎవర్ని చంపుతానో నాకే తెలియదు. ఇప్పటికే నా ఆవేశం నన్ను పురుగులా తొలిచివేసింది. ఇంకనేను ఎవర్ని చంపదలచుకోలేదు. నన్ను వెళ్లనీ రామకృష్ణా" అన్నాడు అర్ధిస్తున్నట్లుగా హరి. "చంపటం, చావటం తప్ప నీకింకో మాట రాదా? అదే జీవితమా?”అన్నాడు రామకృష్ణ. “ఆ…జీవితం! ఈ జీవితం నాకేమిచ్చిందని నేనీ జీవితాన్ని గౌరవిస్తూ బ్రతకటానికి?" అన్నాడు విరక్తిగా హరి. “చూడు హరీ! జీవితాన్ని అంత తక్కువగా అంచనా వెయ్యకు జీవితమంటే మన ప్రవర్తన, మన చేతలు. అవి మన జీవితానికి ఇండెక్స్ లాంటివి. మన ఇండెక్స్ని మనం చదువుకుంటూ తప్పొప్పల్ని సవరించుకుంటూ బ్రతకటం నేర్చుకోవాలి" అన్నాడు రామకృష్ణ. "ఇంక బ్రతకటం నావల్ల కాదు రామకృష్ణా! నా కుటుంబం గురించి తెలిస్తే మీరంతా ఉమ్మేస్తారు. ఎవరి భార్యలైనా భర్తలతో పిల్లల్ని కంటారు. నా భార్య తన ప్రియుడితో బిడ్డను కన్నది. ఆ బిడ్డే వర్ష ఇన్నాళూ వర్ష నా బిడ్డి అనుకున్నాను. ప్రాణంగా భావించాను. చివరకు.... చివరకు నాకేం మిగలకుండా అయిపోయింది” అంటూ మళ్లీ తన రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చాడు హరి. హరిని చూస్తుంటే బాధగా అన్పించింది రామకృష్ణకు, ఎంతటి కష్టాన్నైనా స్నేహితులు తొలగిస్తారంటారు. కానీ తన స్నేహితునికి వచ్చిన కష్టాన్ని తను ఎలా తొలగించాలి? ఆలోచనలో పడిపోయాడు రామకృష్ణ. “నీ కుటుంబంపై ఉమ్మేసే గట్స్ ఇక్కడెవరికీ లేవు హరి, ఎందుకంటే భార్య చాలా మంచిమనిషి ఏవో చిట్టీలు వేస్తూ అందరిలో గౌరవంగా బ్రతుకుతోంది. మీ అత్తగారు చీరెలమ్ముతూ తన పాటికి తను ఎవరి జోలికి రాదు. ఇక వర్ష పుట్టినప్పటి నుండీ నీకూతురే. ఇప్పడు నువ్వు చెప్పే ఈ కట్టుకథలు ఎవరూ నమ్మరు" అంటూ నచ్చచెప్పాడు రామకృష్ణ. "నువ్వు నన్ను మభ్యపెడున్నావని బాగా తెలుసు. నేను చిన్నపిల్లవాడ్ని కాదు" అన్నాడు హరి, "కన్న ప్రేమకన్నా పెంచిన ప్రేమ గొప్పదిరా! వర్షకిప్పుడు సొంత తండ్రిని చూపించినా ఒప్పకోదు. వర్షకి నీలోనే తండ్రి కన్పిస్తాడు. ఇది మభ్యపెట్టటం కాదు" అన్నాడు హరి. "డైలాగులు నేనుకూడా చెబుతాన్లే రామకృష్ణా! కానీ వాస్తవాలను తట్టుకోవాలంటేనే ఎవరివల్ల కాదు. ఇంతెందుకు ఇది తెలిశాక మీ మిసెస్ రోజాతో ఎప్పటిలా మాట్లాడుతుందా?" అని అడిగాడు హరి. తప్పకుండా మాట్లాడుతుంది. ఎందుకంటే పైకి మోరల్ వ్యాల్యూస్ గురించి మాట్లాడుతూ మానవత్వం లేకుండా బ్రతికేవాళ్లకన్నా రోజా మంచిది. ఎవరి గురించో ఎందుకు నీ గురించే చెప్పుకుందాం. నీకు నచ్చింది నువ్వు చేశావు! నువ్వు చేసిన ప్రతిపని నీకు మంచిగానే అన్పిస్తుంది. అది చూసేవాళ్లకి మంచిగా అన్పించకపోవచ్చు. అలాగని నీకు ఆప్తులమైన మేమంతా నిన్ను ఎవాయిడ్ చేస్తున్నామా చెప్పు" అన్నాడు నెమ్మదిగా రామకృష్ణ. నాతో పోల్చుకుని చూస్తే మీరు మనుషులు కాదు రామకృష్ణా! మనుషుల రూపంలో వున్న మానవతా మూర్తులు"అన్నాడు హరి. నువ్వు కూడా మంచివాడివే హరీ! మంచివాడిగా నిన్ను నువ్వు చూసుకునే అవకాశం దేవుడు నీకు వర్ష రూపంలో యిచ్చాడు. కులం ఏమిటని చూడకుండా ఆ అబ్బాయికి వర్షనిచ్చి పెళ్ళిచేయ్యి” అన్నాడు రామకృష్ణ. ఇక వాళ్ళ గురించి నాముందు మాట్లాడకు రామకృష్ణా! నేను వాళ్లతో కలసి ఉండలేను”అన్నాడు ముఖం అదోలా పెట్టి హరి. "తొందరపడకు హరీ! వాళ్లిద్దరు నీకు రెండు కళ్లు, వాళ్లు లేకుంటే అందుడివైపోతావు. మధురిమను చంపి అప్పడు తప్పుచేశావు. ఇప్పడు భార్యా బిడ్డకి దూరమై ఇంకో తప్పు చెయ్యకు" అన్నాడు రామకృష్ణ. ఆలోచిస్తూ తల వంచుకున్నాడు హరి. "వాళ్లను నువ్వు క్షమిస్తే నిన్ను నువ్వు క్షమించుకున్నట్టే ఇదినీకోఅవకాశం అనుకో. నా మాటవిను" అంటూ భుజం తట్టి చెప్పాడు రామకృష్ణ.తన భుజం మ్మీదున్న రామకృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు హరి. హరి ఆలోచనలిప్పడు మంచిదారిలోకి మళ్లాయి. “అలాగే రామకృష్ణా! నువ్వు చెప్పినట్లే చేస్తాను. రేపే వెళ్లి ఆ అబ్బాయి ఎవరో ఎంక్వయిరీ చేస్తాను. వర్షనిచ్చి పెళ్లి చేస్తాను" అన్నాడు మనస్పూర్తిగా హరి. రామకృష్ణ తృప్తిగా నిటూర్చాడు.
******
(సశేషం)

No comments:

Post a Comment

Pages