పరిస్థితులే కారణమా?
బి.వి.సత్యనగేష్
(ప్రముఖ మానసిక నిపుణులు )
రైలు ప్రయాణం షెడ్యుల్ ప్రకారం జరగట్లేదు. ప్రయాణీకులుగా మనం చేసేదేమీ లేదు.... ప్రయాణం చేయటం తప్ప. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయేం. అనుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం పట్టేలా వుంది. ఎవరికీ వాళ్ళే ట్రాఫిక్ జామ్ ను రోడ్లను తిట్టుకుంటూ కూర్చుంటే ట్రాఫిక్ కదలదు. అలాంటి సమయం కొందరు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పూనుకుంటారు. వీళ్లని “ప్రోయాక్టివ్” వ్యక్తులు అంటారు.
ఉదాహరణకు.... భారీ వర్షం కురుస్తోంది. కాని ఒక వివాహానికి తప్పనిసరిగా హాజరు కావాలి. వర్షాన్ని ఆపలేం. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసినట్లు భారీ వర్షాన్నీ ఆపలేం. ఇటువంటి పరిస్థుతులు మనందరికీ తటస్థపడతాయి. ఇటువంటి సందర్భాలలో కొంతమంది పరిస్థితులను అధిగమించి సమస్యను పరిష్కరించడానికి నడుము బిగిస్తారు. మరి కొంతమంది సాకులు వెతుక్కుంటూ సమస్య నుంచి దూరంగా జరుగుతారు. ఈ రకం మనుషులను ‘రియాక్టివ్’ వ్యక్తులని అంటారు.
ఈ రెండు రకాలైన ‘ప్రోయాక్టివ్’ మరియు ‘రియాక్టివ్’ కోవకు చెందిన వ్యక్తుల ఆలోచనా విధానం ఈ క్రింది విధంగా వుంటుంది.
“వివాహానికి పిలిచినవారు చాలా ముఖ్యులు, ఎంతో అభిమానంతో ఇంటికి వచ్చి మరీ పిలిచేరు. మనం ఎలాంటి అడ్డంకులొచ్చినా తప్పనిసరిగా వెళ్ళాలి” అనుకునే ఆలోచనా ధోరణి వున్నవారు ‘ప్రోయాక్టివ్’.
“నిజమే! వివాహానికి పిలిచినవారు ముఖ్యులే! కానీ, ఈ భారీ వర్షంలో ఎలా వెళ్తాం? తడిచిన బట్టలతో వెళ్తే చులకనగా చూస్తారేమో! ఇలాంటి వాతావరణంలో పెళ్ళికి ఎవ్వరూ రారు. అసలు పెళ్ళివారు కూడా వచ్చేరో లేదో! వెళ్ళకపోయినా పెళ్ళివారు అర్ధం చేసుకుంటారు. ఏదో ఒక కారణం చెప్పొచ్చులే!” అనుకునే ఆలోచనా ధోరణి వున్నవారు “రియాక్టివ్”.
ఇటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ప్రఖ్యాత రచయిత STEPHEN R.COVE ఒక చక్కటి కాన్సప్ట్ ను ప్రాచూర్యంలోకి తీసుకు వచ్చేడు. దీనిని CIRCLE OF CONCERNS & CIRCLE OF INFLUENCE అంటారు. అదేంటో చూద్దాం! ఉదాహరణకు.... వాతావరణం,కాలుష్యం, రవాణాసౌకర్యం, ధరలు, ఉష్ణోగ్రత లాంటివి ప్రతీ మనిషిని ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి. వీటి విషయంలో సగటు మనిషి పెద్దగా చేసేదేమీ వుండదు. కాని వాటి గురించి కనీసం ఆలోచిస్తాడు. ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ కాన్సప్ట్ ను మూడు వృత్తాల సహాయంతో వివరించేడు. అదేంటో చూడడం!
ఒకటవ నంబర్ బొమ్మలో రెండు వృత్తాలున్నాయి. వెలుపలి వృత్తాన్ని “CIRCLE OF CONCERNS” అంటారు. లోపలి వృత్తాన్ని “CIRCLE OF INFLUENCE” అంటారు.
పైన ఉదాహరించిన వర్షంలో వివాహానికి వెళ్ళాలా లేదా?” అనే ఉదాహరణను ఈ కాన్సప్ట్ తో అర్ధం చేసుకుందాం, వివాహానికి వెళ్లాలి అనేది CIRCLE OF CONCERNS వెళ్తామా లేదా అని నిర్ణయించేది CIRCLE OF INFLUENCE.
వర్షాన్ని మనం ఆపలేం. కాని ఆ పరిస్థితిలో వివాహానికి వెళ్ళాలంటే ‘ప్రోయాక్టివ్’ గా ఆలోచించాలి. అంటే పరిస్థితులను మనం ప్రభావితం చేస్తే ‘ప్రోయాక్టివ్’ గా వున్నట్లు, పరిస్థితులకు లొంగిపోయి పరాజితులమైతే ‘రియాక్టివ్’ గా వున్నట్లు, పైన పేర్కొన్న బొమ్మలో బాణం గుర్తులు ఇదే విషయాన్ని తెలియపరుస్తాయి.
ప్రోయాక్టివ్ ఆలోచించే వారు ఈ క్రింది విధంగా ఆలోచిస్తారు. “గొడుగు పట్టుకెళ్ళడం, ఆటోలో కాని, కారులో కాని వెళ్ళడం” లాంటి చర్యలు ప్రోయాక్టివ్ గా ఆలోచించడం వల్ల సాధ్యమౌతుంది. వీరు పరిస్థితులను అధిగమించి రెండవ బొమ్మలో చూపించిన విధంగా లోపలి వృత్తాన్ని పెద్దదిగా చేసుకుంటారు. అంటే పరిస్థితులను ప్రభావితం చెయ్యగలిగే “పరిధి” ని పెంచుకుంటారు.
రియాక్టివ్ గా ఆలోచించేవారు ఈ క్రింది విధంగా ఆలోచిస్తారు. “ఏం పోతాంలే .... ఎవ్వరూ వెళ్లారు” అనుకుంటూ పరిస్థితులకు బలిపశువుగా మారి లోపలి వృత్తాన్ని కుంచించుకుపోయే విధంగా ఆలోచిస్తారు. అంటే మూడవ బొమ్మలో చూపిన విధంగా బయట వృత్తంలో వుండే పరిస్థితులు, లోపలి వృత్తంలోని వ్యక్తి శక్తిని బలహీనం చేస్తాయి.
లోపలి వృత్తం అనబడే “CIRCLE OF INFLUENCE” పరిధి పెరగాలంటే మన మనసులోని భావాలపై యుద్ధం ప్రకటించాలి. మనసులోని మానసిక ముద్రలను సవాలు చెయ్యాలి. ఇదొక నిరంతర ప్రక్రియలా ఆలోచనా సరళిలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే వుండాలి.... అపుడే లోపలి వృత్తం యొక్క పరిధి పెరుగుతుంది. చివరిగా రెండవ బొమ్మలో చూపిన ప్రకారం ప్రోయాక్టివ్ గా మారడానికి దోహదపడుతుంది.
పరిస్థితులకు లొంగిపోకుండా, పరిస్థితులను లొంగదీసుకుంటూ ఆలోచనా సరళిలో మార్పు తీసుకురాగలిగితే మన CIRCLE OF INFLUENCE పరిధి పెరిగి, CIRCLE OF CONCERNS ప్రభావం తగ్గిపోతుంది. ఈ విధంగా ప్రోయాక్టివ్ గా తయారైతే విజేతలవడం ఖాయం. అందుకని పరిస్థితులను తిట్టుకోకుండా.వాటికి బలిపశువుగా అయిపోకుండా, పరిస్థితులను జయిస్తే విజయం మనదే!
No comments:
Post a Comment