సామాన్యులలో అసమాన్యులు
సి.ఉమాదేవి
మనిషిగా జన్మించడం,మనీషిగా జీవించడం వెనుక మానవ ప్రవర్తనా నియమావళి నిర్దేశించడం రామాయణ,భారత కాలంలోనే కాదు నేటి భారతంలోను సుస్పష్టమే! ఒడిదుడుకుల జీవనయానంలో నిత్యపరుగుల నడుమ తమ జీవితంలో కొంత సమయాన్ని కళాసేవకు లేదా పరులసేవకు వెచ్చిస్తూ, సామాన్యంగా జీవిస్తూ అసమాన్య గౌరవాన్ని పొందడం శ్లాఘనీయం.సినిమా లేదా నాటకం, రంగం ఏదైనా కావచ్చు కాని హాస్యాన్ని పండించి మనసులను రంజింపచేయవచ్చు. గానంతో,నృత్యంతో అలరించవచ్చు.సాటిమనిషి కష్టానికి చేయూతనందించవచ్చు. అయితే అసమాన్యం అని పదిమందిలో గుర్తింపబడటం సామాన్యమేమికాదు.
ఇతరులకంటే భిన్నంగా ఆలోచించి మనిషిగా జన్మించినందుకు ఏదైనా మంచిపని చేసి తద్వారా పదిమందికి ఉపయోగపడటం సామాన్యులను అసమాన్యులను చేస్తుంది.ఇతరులు కూడా ఇదేవిధంగా మనలాగే ప్రవర్తించి తమదైన శైలిలో స్పందించవచ్చు.అయితే మనల్ని మనమే అంచనా వేసుకుని మనలోని శక్తులను బహిర్గతపరచాలి కాని విభిన్న రంగాలలో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నవారితో మనల్ని పోల్చుకుని నిరాశావాదానికి తెరతీయకూడదు.నిన్నటికన్నా నేడు,నేటికన్నా రేపు విభిన్నంగా ఆలోచిస్తూ కార్యదక్షత కలవారమై పదుగురి మంచికై శ్రమపడటం అసమాన్యమే కదా!
అసాధారణ ప్రజ్ఞాపాటవాలకు మన మేధను వేదిక చేసినపుడు మనలో విషయపరిజ్ఞానాన్ని పదేపదే నింపనవసరం లేకుండా ఆజన్మాంతము తగినంత వనరులను ఉత్పత్తి చేస్తూ మన మేధస్సే మనల్ని అసమాన్యులుగా నిలపడంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. ఏపని చేసినా, దీనివల్ల మనిషిగా నేను ఉన్నతినందగలనా,నన్ను నేను మెరుగు పరచుకోగలనా అని తమను తాము ప్రశ్నించుకోవాలి.అప్పుడే మనలోని నేను స్థానంలో మనం మేలుకుంటుంది. విశ్వభాత్రుత్వానికి దారి ఏర్పడుతుంది. అందుకే మనల్ని మనమే హెచ్చరించుకోవాలి.మనం గీసే మానవతా చిత్రాలకు మనమే చిత్రకారులం.ఎవరి చిత్రం వారి మనసుకు ప్రతిబింబమే!వెలుగు పరవాల్సిన చోట నీడను చిత్రించకూడదు.ఆలోచనలకు తోడు అనుభవాలను ఆత్మవిమర్శకు ఔషధంగా స్వీకరిస్తే చెడు ఆలోచననేదే చొరబడని వ్యక్తిత్వం సాధారణవ్యక్తిని అసాధారణ వ్యక్తిగా రూపుదిద్దుతుంది.మనిషిని నిర్వచించేది అతడు నడిచిన దారే! నడిచేదారిలో రాళ్లు,ముళ్లు తొలగిస్తూ తోటివారికి పూలబాట వేసినవారు అసమాన్యులే! ఇతరుల సంపాదనలతో పోల్చుకుని హోదాకు,డబ్బుకు అత్యంత పాధాన్యతనివ్వడంకాక కాక మనలోని మానవత్వానికి పెద్దపీట వేసిననాడు ప్రతి సామాన్యుడు అసమాన్యుడే!
***
ఎంత గొప్పగా చెప్పారండీ..
ReplyDeleteThank you Srilalitha garu.
Delete