సంకె లేక తలఁచిన జాణలకు(అన్నమయ్య కీర్తనకు అర్థ తాత్పర్య విశేషాలు)
డా. తాడేపల్లి పతంజలి
సంకె లేక తలఁచిన జాణలకు
సంకీర్తనమె పో సర్వశాంతి ॥పల్లవి॥
భవహరమగు శ్రీపతి నామమె
జవకట్టి తలఁచితే జన్మశాంతి
తవిలి హరిపూజ తా జేయుటె
కువలయమున నిదిగో గృహశాంతి ॥సంకె॥
అంది ధ్రువవరుదుడ యనినదే
కందువైన సర్వగ్రహశాంతి
యిందురవినయనుని నెరుఁగుటె
చందమైన దిదివో నక్షత్రశాంతి ॥సంకె॥
భావించి యనంతునిఁ బలుకుటే
కావించిన దిదివో కాలశాంతి
శ్రీవెంకటనాథునిఁ జేరుటె
దేవమానవులకును దేహశాంతి
(అధ్యాత్మ సంకీర్తనరేకు: 4-2సంపుటము: 10-20)
పల్లవి తాత్పర్యము
సంకె (= అనుమానము) లేక వేంకటేశుని తలచిన జాణలకు(=నేర్పరులకు)
సంకీర్తనమె పో (=స్తోత్రము, గుణకథనము, స్తవనము. )సర్వశాంతి
1వ చరణము
భవహరమగు ( =సంసార దుఃఖములను పోగొట్టు) శ్రీపతి నామమె(= శ్రీ వేంకటేశ్వరుని పేరే) నిత్య వ్యవహారాలకు జవకట్టి (=జతపరచి) తలఁచితే జన్మకు శాంతి లభిస్తుంది. ఇదిగో ! ఒక మాట చెబుతున్నాను వినండి.తవిలి(= ఆసక్తితో) హరిపూజను చేయుటే కువలయమున (=భూమండలమున) గృహశాంతి
2వ చరణము
పెద్దలు అంది ( = చెప్పిన.) ధ్రువవరుదుడ(=ధ్రువునికి వరములిచ్చినవాడు) అను పేరును పదే పదే మనం అనినదే(= అంటేనే) కందువైన (= కీలకము తెలిసిన) సర్వగ్రహశాంతి (=propitiation of the planets by sacrifices, gifts and ritual.) మనకు కలుగుతుంది.
ఇదివో (=ఇదే కదా !)
యిందురవి నయనుని ( =చంద్రుడు, సూర్యుడు కన్నులుగా కలిగిన వేంకటేశుని) ఎరుఁగుటె(= తెలిసికొనుటే) చందమైనది (= న్యాయమైన) నక్షత్రశాంతి .
3 వచరణము
ఇదిగో జనులారా వినండి.
భావించి (= ఆలోచించి) అనంతుని(= విష్ణుమూర్తిని) పేరు పలుకుటే
కాలశాంతిని కావించినది(=చేస్తుంది)
శ్రీవెంకటనాథుని( =శ్రీ వేంకటేశ్వరుని ) మనసా , వాచా , కర్మణా కొలిచి ఆయనను చేరుటె( = సమీపమునకు చేరుటయే) దేవమానవులకును( =దేవతలకు , మానవులకు ) దేహశాంతి
విశేషాలు
ధ్రువుడు
ధ్రువుడు ఉత్తానపాదునికి సునీతియందు పుట్టిన కొడుకు.
ఒకనాడు ఉత్తానపాదుఁడు సింహాసనముమీఁద కూర్చుండి తన రెండవభార్య అగు సురుచియొక్క బిడ్డను తొడమీద ఉంచికొని ఉండగా ధ్రువుడు చూచి బాల్యచాపల్యముచేత తానును తండ్రితొడ ఎక్కాలనుకొన్నాడు.
సురుచి ఆధ్రువుని అభిప్రాయము ఎఱిఁగి కడు అహంకారముతో తండ్రితొడ ఎక్కవలెను అను ఆసక్తి కలిగితే “నువ్వు ఎందుకు సునీతి కడుపున పుట్టావు?” అని అడిగింది.
ఆమాట ధ్రువుడు విని తన హృదయమునకు అది బాణమువలె నాటగా ఆవృత్తాంతము తల్లికి చెప్పాడు. ఆమె ఆజ్ఞ పొంది నారద మహర్షి యొక్క ఉపదేశముతో మిక్కిలి ఉగ్రమైన తపస్సు చేసి విష్ణువును ప్రత్యక్షముచేసికొని తల్లితో గూడ అత్యున్నతమైన పదమును పొందాడు.
శాంతి నక్షత్రాలు
27 నక్షత్రములకు చేయవలసిన నక్షత్ర శాంతి వివరము లు
నక్షత్రం శాంతి
ఆశ్వని సువర్ణదానం
భరణి దానం లేదు
కృత్తిక అన్న దానం
రోహిణి నవగ్రహ హోమం / నువ్వులదానం
మృగశిర దానం లేదు
ఆరుద్ర దానం లేదు
పునర్వసు దానం లేదు
పుష్యమి గంధపు చెక్క
ఆశ్లేష అన్నదానం
మఖ వెండిగుర్రం
పుబ్బ దానం లేదు
ఉత్తర నువ్వులపాత్ర
హస్త దానం లేదు
చిత్త వస్త్రదానం
స్వాతి దానం లేదు
విశాఖ అన్నదానం
అనురాధ దానం లేదు
జ్యేష్ట గోదానం
మూల ఎనుబోతు
పూర్వాషాడ దానం లేదు
ఉత్తరాషాడ దానం లేదు
శ్రవణం దానం లేదు
ధనిష్ట దానం లేదు
శతభిషం దానం లేదు
పూర్వాభాద్ర దానం లేదు
ఉత్తరాభాద్ర దానం లేదు
రేవతి సువర్ణదానం
కాలశాంతి
మానవ జాతకంలోని జన్మ కుండలిలో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే.. దానిని 'కాలసర్ప యోగం' అంటారు. దీనిలో చాలా రకాలు వున్నాయి. వాటి వాటి స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడింది
కాల సర్ప దోషం ఇవి మొత్తం 12 రకాలు :
అనంత కాల సర్ప యోగము ,
కులిక లేక గుళిక కాల సర్ప యోగము,
వాసుకి కాల సర్ప యోగము,
శంఖ పాల కాల సర్ప యోగము,
పద్మ కాల సర్ప యోగము,
మహా పద్మ కాల సర్ప యోగము,
తక్షక లేక షట్ కాల సర్ప యోగము,
కర్కోటక కాల సర్ప యోగము,
ఘటక లేక పాతక కాల సర్ప యోగము,
శేష నాగ కాల సర్ప యోగము,
కాలసర్ప యోగ ఫలితాలు
జన్మించిన సంతానమునకు బుద్ధి మాంద్యం కలుగట
గర్భం శిశువు మరణించుట ,
వైవాహిక జీవతంలో అసంతృప్తి, భార్తభర్తల మధ్య సమన్వయం లేక పోవుట
మరణించన శిశువును ప్రసవించుట,
గర్భం నిలవక పోవుట,
అంగ వైకల్యంతో సంతానం కలుగుట,
దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడుట, చికిత్స విఫలమై మరణించుట
మొండి పట్టుదలశత్రువు వలన మృతి చెందుట,
మానసిక ప్రశాంత లేక పోవుట ప్రమాదాలు అవమానాలు,
ఇవన్నీ వేంకటేశుని కొలిస్తే నశిస్తాయని శాంతి సమకూరుతుందని అన్నమయ్య ఈ శాంతికీర్తన లో చెప్పాడు. ఆయన మాట విన్నవారికి అంతా శాంతి. అనుమానం లేదు. స్వస్తి.
****
No comments:
Post a Comment