"గొల్లకలాపం" వేదాంతం సిద్ధేంద్ర గారితో ముఖాముఖి
భావరాజు పద్మిని
సంప్రదాయ కూచిపూడి భాగవతుల వంశంలో పుట్టి,
ఎం.బి.ఎ చేసినా కూడా, దైవదత్తమైన నాట్యాన్నే వృత్తిగా స్వీకరించి, ‘గొల్లకలాపం’ లో
తనదైన ముద్ర వేసి ముందుకు సాగిపోతున్న కళాకారులు – వేదాంతం సిద్ధేంద్ర గారు.
వీరితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
మీ నాట్యాభ్యాసం ఏ వయసులో మొదలైంది?
నా ఆరవ ఏటనే మొదలయ్యిందండి. నేను కూచిపూడి లోనే
మా నాన్నగారి దగ్గరే అభ్యాసం మొదలుపెట్టి, నేర్చుకున్నాను. ఇప్పటికీ యక్షగానాలలో
ఇతర నృత్యాలలో ఏ సందేహాలు ఉన్నా వారినే అడిగి తెలుసుకుంటూ ఉంటాను.
మీరు వేసిన మొట్టమొదటి పాత్ర ఏమిటి?
ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడిగా చేసాను.
బాలకుడిగా, వినాయకుడిగా ఇలా చిన్న పాత్రలు చేసాను. పార్వతీ కల్యాణం లో శివపార్వతుల
కల్యాణం తర్వాత ‘ఆనందమానంద మాయనే’ అంటూ ఆనందంగా నాట్యం చేసే బాలకుడిగా చేసాను. అలా
7,8 తరగతుల దాకా నేను ప్రహ్లాదుడిగా వేషం వేసాకా, ఆ తర్వాత నుంచి మా
నాన్నగారు నన్ను గొల్లభామగా తీర్చి దిద్దారు. ఇలా తీర్చిదిద్దడం కూడా గమ్మత్తుగా
జరిగింది.
ఒకసారి కూచిపూడి సిద్ధేంద్ర యోగి ఆరాధనోత్సవాలలో నాన్నగారు
నా చేత మొదటిసారి గొల్లభామ వేషం వేయించారు. అప్పట్లో నావద్ద ఆడ వేషం వేసే దుస్తులు
కూడా లేవు. అప్పుడు ఊళ్ళో అర్చకులు ఉంటారు కదా !బాబురావు గారని, వాళ్ళమ్మాయి
దుస్తులు లంగా వోణి అడిగి తెచ్చుకుని, వెయ్యడం జరిగింది. అప్పటినుంచీ , ఇప్పటిదాకా
ఈ కూచిపూడి కళారంగంలో గొల్లకలాపం నేనొక్కడినే వెయ్యడం జరుగుతోంది. ఇప్పటిదాకా నేను
ఇందులో ఒక 50 ప్రదర్శనల దాకా ఇచ్చి ఉంటాను.
గొల్ల కలాపం గురించి మరింత వివరిస్తారా?
కలాపాలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి భామాకలాపం,
రెండవది గొల్లకలాపం. మూడున్నర గంటలపాటు సంభాషణా, డాన్స్ అంతా
పద్యాలు నేర్పేసే, ఈ గొల్లకలాపాన్ని మా వారసత్వంగా నాకు అందించారు.
గొల్ల కలాపం అంటే మొత్తం తత్వానికి సంబంధించింది.
ఇదంతా సైంటిఫిక్ సబ్జెక్టు. కూచిపూడి భాగవతుడైన ఒక బ్రాహ్మణుడికి వీధుల్లో పాలు,
పెరుగు అమ్ముకునే ఒక గొల్లభామ తారసపడుతుంది. ఈమెతో సరదాగా మొదలపెట్టిన సంభాషణ
తత్త్వం వైపు వెళ్తుంది. ఈ గొల్లభామ ఎవరంటే బ్రహ్మ మానస పుత్రుడైన నారదుల వారి
మానస పుత్రిక.
“నీవు బ్రాహ్మణుడ వైతే నీకు శరణు జొచ్చెద... నీ
బ్రహ్మజ్ఞానము తెలుపవయా... బ్రాహ్మణులనగా బ్రహ్మ జ్ఞాన పరాయణులై భావింపరయా “...
అంటూ మీరు నిజమైన బ్రాహ్మణులే అయితే కర్మసోమయాజులు అయ్యి, మానసికయాగము చెయ్యాలి కాని, మీరు చేసేటువంటి
యజ్ఞ యాగాదులతో నిజమైన మోక్షము కలుగదు... అంటూ యజ్ఞ యాగాదుల యొక్క వివరణ అంతా కూడా
తెలుపుతూ మానసిక యాగం నిజమైన యాగము అంటూ తెలుపుతుంది. మనస్సు ద్వారా మనం యజ్ఞం
చేసి, భగవంతుడిని చేరుకోవాలి తప్ప, క్రతువులు మొదలైన వాటి ద్వారా కాదు అని
చెబుతుంది.
అలాగే ‘పిండోత్పత్తి క్రమము’ అంటే జీవుడు తల్లి
కడుపులోకి ఎలా వెళ్తాడు అని ,”ఈ జీవుడు నక్షత్ర రూపమై కొన్నాళ్ళు ఆకాశంలో ఉండి,
పిమ్మట సూర్య కిరణములో కొన్నాళ్ళు ఉండును, అటుపై మంచు కణమై భూమిపై రాలి, సస్య రూపమై, చతుర్విధాన్నములలో చేరి, పురుషుడి
అన్నములో చేరి, చివరకు అతని ద్వారా స్త్రీ నాభి కమలంలో చేరి, ప్రవర్ధమానమగును.ఇది
ఎరుగవయ్యా అయ్యవారూ” అంటూ చెబుతుంది. ఇలా ఇటువంటి సైన్సు అంతా ఇప్పుడు మనం
కనిపెడితే... ఎప్పుడో దీన్ని బ్రహ్మీభూత రామయ్యగారు, పాతకాలంలోనే ఈ సైన్సు
పుట్టకముందే చెప్పారన్నమాట. క్లిష్టమైన వేదాంతాన్ని నాట్యం ద్వారా సామాన్య ప్రజలకు
సులువుగా చెప్పడమే ఈ గొల్ల కలాపంలోని పరమార్ధం.
చివరికి ఈ గొల్ల కలాపాన్ని ఎలా ముగిస్తారు?
చివరికి బ్రాహ్మణుడు “అమ్మా ! ఒక మామూలు గొల్లభామ
ఏమిటి, ఇంత వేదాంతాన్ని బోధించడం ఏమిటి? మిమ్మల్ని చూస్తుంటే, మీ కన్నులు
ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు ఉన్నాయి... “అని అడుగుతాడు.
అప్పుడు గొల్లభామ “అవును స్వామీ ! నేను బ్రహ్మ
మానస పుత్రుడైన
నారదుల వారి మానస పుత్రికను. నేను శ్రీ రాజగోపాల స్వామి వారిని
గురించి ఎదురు చూస్తున్నాను, “ అని చెప్తుంది.
అప్పుడా బ్రాహ్మణుడు “ రాజగోపాల స్వామివారు
ఇందాకే కూచిపూడి అగ్రహారం నుంచి ద్వారకకు వెళ్ళారు. నువ్వు ఆయన్ను అక్కడే కలుసుకో”
అని చెప్తారు. “అలాగా స్వామీ ! నేను ద్వారకకు వెళ్తాను , నీ కడుపు చల్లగుండ” అని
చెప్పి, గొల్లభామ నిష్క్రమిస్తుంది. ఇలా గొల్లభామ పాత్ర మీదే ప్రధానంగా ఈ నాటకం
సాగుతుంది. మొత్తం కలాపం ఇద్దరు ముగ్గురు పాత్రధారులతో ముగుస్తుంది.
ప్రస్తుతం ఈ గొల్లకలాపానికి ఆదరణ ఎలా ఉందంటారు?
గొల్లకలాపానికి ఆదరణ నానాటికీ తగ్గుతోంది. భామాకలాపానికి
లభించిన క్రేజ్ దీనికి లభించలేకపోయింది. క్లిష్టమైన అంశం కావడంతో “అమ్మో” అనేసి,
నేర్చుకోడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం
చెయ్యాలన్నది నా సంకల్పం.
మీ విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది?
చిన్నప్పుడే నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో
వేసెయ్యడం వలన నేను
మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసారా ?
లేదండి, కాంపస్ లోనే ఉద్యోగాలు వచ్చేసినా
వదిలేసాను. “నన్ను ఈ చదువుల వైపు ఎందుకు పంపారు? దీనివల్ల నేను నాట్యం మీద
పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాను” అని మా నాన్నగారిని అడిగేవాడిని. సంప్రదాయ
కుటుంబంలో పుట్టినా ,నాట్యంలో మేము అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళలేక
పొవాడానికి మాకు ఇంగ్లీష్ రాకపోవడము, కమ్యూనికేషన్ స్కిల్ల్స్ లేకపోవడము
కారణమయ్యాయి. అందుకే నాన్నగారు నన్ను బాగా చదివించారు.
కాకపొతే ఇప్పుడు సంప్రదాయ కుటుంబాలలో పుట్టినవారికి
దక్కని ఆదరణ బయటవారికి దక్కుతోంది. ఉదాహరణకు మా నాన్నగారికి సంగీత నాటక అకాడెమి
అవార్డు నిన్నగాక మొన్నొచ్చింది. ఆయన ఎంత గొప్ప కళాకారులు? ‘బయటవాళ్ళకు, మాకూ ఉన్న
తేడా ఏమిటి?’ అని ఆలోచిస్తే బయటవారు నలుగుర్లోకి వెళ్ళిపోయి మాట్లాడెయ్యడం,
ప్రోగ్రాములు తీసుకోవడం, వాగ్ధాటి బాగా ఉండడం వల్ల అన్నింటిలోనూ వారే
రాణిస్తున్నారు. వీటన్నిటి ద్వారా విద్య ప్రాముఖ్యత తెలుస్తుంది.
2010 లో నా ఎం.బి.ఎ అయిపొయింది. అయినా, ఈ ఉద్యోగాల
వైపు మళ్లడానికి నాకు మనస్కరించలేదు. మరి డాన్స్ లో తగినంత ఉపాధి
అవకాశాలు లేవు. అందుకే
స్కూల్స్ లో కొన్నాళ్ళు డాన్స్ టీచర్ గా చేసాను. ఇంట్లోనే నలుగురు పిల్లలకు
చెప్పుకోవడం, ఇన్స్టిట్యూట్ లలో చెప్పుకోడం జరుగుతోంది.ప్రభుత్వ పోస్ట్లు ఉండవు.
కాని, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ విద్యను నేనే కాపాడుకోవాలన్న గురుతర బాధ్యతతో నేను
ఇందులోనే కొనసాగుతున్నాను.
మా నాన్నగారి ఈమెయిలు, ఫేస్బుక్ అన్నీ చూస్తూ
ఉంటాను. ఆయనకు అవార్డు వచ్చినప్పుడు ఆ సెరిమోనీ అంతా నేనే చూసుకుని, బాగా
జరిపించాను. విదేశాలకు వెళ్లి, ప్రమోట్ చెయ్యాలన్నా నేనే చూసుకుంటాను.
మీ స్వంత డాన్స్ స్కూల్ ఉందా? ప్రస్తుతం మీరు ఏమి
చేస్తున్నారు?
నేను డాన్స్ స్కూల్ ఏమీ స్థాపించలేదండి. మా
అన్నయ్య స్కూల్ గాంధి నగర్లో ఉంది. అక్కడికే నేను అడపా దడపా వెళ్లి, పాల్గొంటూ
ఉంటాను. అన్నయ్య స్కూల్ తరఫున ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు నేను వెళ్లి సహకరిస్తూ
ఉంటాను. నాకు డాన్స్, చదువు రెండూ ఉన్నాయి, ఇప్పటికిప్పుడు కావాలన్నా ఎక్కడైనా
ఉద్యోగాలు తెచ్చుకోగలను. కాని నాట్యంలో నాకు లభించే ఆత్మ సంతృప్తి నాకు వేరే
ఎందులోనూ లభించక, ఇందులోనే ఉన్నాను.
ప్రస్తుతం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో డాన్స్ టీచర్
గా చేస్తూ, బంజారా హిల్స్ లో పిల్లలకు క్లాస్సులు చెప్పుకుంటున్నాను. నెలకు 3,4
ప్రోగ్రామ్స్
వస్తూ ఉంటాయి. నాన్నగారు, అన్నయ్య పిల్చినప్పుడు వెళ్లి, ఆర్టిస్ట్
గా వేస్తూ ఉంటాను.
భామాకలాపంలో మా నాన్నగారి లాంటి వారి పక్కన, ఆయన
సత్యభామగా నటిస్తూ ఉన్నప్పుడు, నేను కృష్ణుడి వేషం వెయ్యడంలో ఒక గొప్పదనం ఉంటుంది.
నటనను పీక్స్ కి తీసుకుని వెళ్ళడం ఉంటుంది. అలాగే గొల్లకలాపం వెయ్యడం, శివుడి
వేషం, హిరణ్యకశిపుడి వేషం... ఇలా ఆర్టిస్ట్ గా ఉండడం నాకు ఇష్టం.
ఇప్పటికి దగ్గరదగ్గర ఒక వెయ్యి ప్రోగ్రామ్స్
చేసాను. కూచిపూడి నాట్యోత్సవాలు జరిగినప్పుడు సిలికాన్ ఆంద్రా వారు, ఇతరులు
పిలుస్తూ ఉంటారు. ఒకసారి నరసింహ స్వామిగా స్వైర విహారం చేసాను. అది మర్చిపోలేని
కార్యక్రమం.
మీరు పొందిన అవార్డులు/ప్రశంసల గురించి చెబుతారా?
అసలు దీంట్లో పుట్టి పెరగడమే మాకు ఒక అవార్డు
క్రింద లెక్క . అవార్డులు అంటే చిన్నచిన్నవి చాలా ఉన్నాయి. సంప్రదాయ కళాకారుల్లో
అన్నయ్య తర్వాత నేనే లిస్టు లో ఉన్నాను. తర్వాత నాకూ వచ్చే అవకాశం ఉందని
అంటున్నారు.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
డాన్స్ లో ఎం.ఎ చెయ్యాలని నా కోరిక. అలాగే ఈ
సంప్రదాయ కళను ముందుకు తీసుకువెళ్ళటానికి నావంతు ప్రయత్నం చెయ్యాలన్నది నా
సంకల్పం. ప్రభుత్వాలు, సంస్థలు ముందుకొచ్చి, సాయం అందిస్తే, ఈ కళను విశ్వవ్యాప్తం
చేసేందుకు మరింత అవకాశం ఉంటుందని నా భావన.
సిద్ధేంద్ర గారు మరిన్ని విజయ శిఖరాలను
అధిరోహించాలని మనసారా కోరుకుంటోంది ‘అచ్చంగా తెలుగు.’
సిద్ధేంద్ర గారి గొల్లకలాపాన్ని క్రింది లింక్ లో చూడండి...
No comments:
Post a Comment