శ్రీరామకర్ణామృతం - 21 - అచ్చంగా తెలుగు

శ్రీరామకర్ణామృతం - 21

Share This
 శ్రీ రామకర్ణామృతం -21
                                 డా.బల్లూరి ఉమాదేవి
                                      

101.శ్లో:క్షీరాబ్దౌ శశి శంఖ మౌక్తిక లసద్ద్వీపే సుధర్మాంతర
బిందౌ సార్థ కళాన్వితే పరిలసన్నాగాంతరే సంస్థితమ్
కోటీరాంగద హారకుండల మణిగ్రైవేయ హారోజ్జ్వలం
శ్రీవత్సాంచిత మింద్రనీల సదృశం రామం భజే తారకం.
తెలుగు అనువాద పద్యము:
శా:క్షీరాబ్ధిన్ శశి శంఖ మౌక్తిక లసచ్ఛ్వేతాంతరీపస్థ శృం
 గారౌన్నత్య సుధర్మ మధ్యమున వేడ్కం బిందు వన్వీథి దే
జో రాజత్కళ గల్గి నాదమున దా శోభిల్లి శ్రీవత్స మం
  జీరాంచత్పరికల్పయుక్తుడగు నా శ్రీరాము సేవించెదన్.
భావము:పాలసముద్రమందు చంద్రఖండముల వంటి ముత్యములచే ప్రకాశించుచున్న ద్వీపమందు సుధర్మ యను సభయొక్క మధ్యమందు బిందువునందు సార్థకమైన శోభతో కూడిన ప్రకాశించుచున్న శేషుని యందున్నట్టి కిరీటము,భుజకీర్తులు,కుండలములు రత్నపు కంటె హారములు అనువానిచే ప్రకాశించుచున్నట్టి శ్రీవత్సమను మచ్చతో కూడినట్టి యింద్ర నీలములతో సమానకాంతిగల తారకరాముని సేవించుచున్నాను.
102.శ్లో:సాకేతానల చంద్రభాను విలసచ్ఛిచ్చక్ర బిందుస్థితం
    బాలార్క ద్యుతిభాసురం కరతలే పాశాంకుశౌ బిభ్రతమ్
    బాణం చాపయుతం విశాలనయనం స్మేరాన నాంభోరుహం
   స్త్రీపుం రూపధరం విలాససదనం రామం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:స్థిరసాకేతమునన్ విరోచనవిభాచ్చిచ్ఛక్ర  బిందుస్థితున్
 తరుణార్కోజ్జ్వలు బాణచాప విలసత్పాశాంకుశోద్యత్కరున్
సరసీజేక్షణు మందహాసవదనున్ సస్త్రీపుమాంసాకృతున్
బరు శ్రీరాము విలాస రమ్య సదనున్ భ్రాజిష్ణు కీర్తించెదన్.
భావము:అయోధ్య యందు సూర్యచంద్రాగ్నులచే ప్రకాశించు జ్ఞానచక్రమందలి బిందువునందున్నట్టి లేతసూర్యుని కాంతిచే ప్రకాశించుచున్న చేతియందు పాశము నంకుశమును బాణమును భరించుచున్నట్టి ధనస్సుతో కూడినట్టి విశాలనేత్రములు గలిగినట్టి స్త్రీపురుష రూపమును ధరించినట్టి విలాసములకు స్థానమైన తారక రాముని సేవించుచున్నాను.
103శ్లో:అర్థం రక్తపదాబ్జ నీలరుచిరం చార్ధేందు చూడార్చితం
అర్థం రత్న కరీట కుండల ధరం తాటంక మర్థం ధనుః
శంఖం చక్ర గదాబ్జ సంయుతకరం శ్రేయోమయం వైష్ణవం
పాశంచాంకుశ బాణసంయుతకరం రామం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
చ:ఇరుదెస దామ్రనీలరుచి నింపగు కర్ణిక కుండలంబునన్
బరగి గదాది చక్రధర పాశ శశాంకుశ చాపపాణియై
సురుచిర వైష్ణవాకృతిని శోభిలి శంకర సేవ్యమానమై
నిరుపమమైన తారకము నిర్మలభక్తి భజింతు నెంతయున్.
భావము:ఎర్రని పాదపద్మములు గలిగినట్టి నీలములవలె మనోహరమైనట్టి పదార్థమైనట్టియు ఈశ్వరునిచే పూజింప బడునట్టియు రత్నకిరీటము కుండలములు ధరించు పదార్థమైనట్టి కర్ణభూషణములుగల పదార్థమైనట్టిధనస్సును శంఖమును ధరించునట్టి చక్రగదా పద్మ రేఖలతో కూడిన హస్తములు గల విష్ణుసంబంధియగు పదార్థమైనట్టి పాశమును ధరించినట్టి అంకుశముతో బాణమును కూడిన హస్తములుగల తారకరాముని సేవించుచున్నాను.
104శ్లో:సహస్ర పత్రాంబుజ కర్ణికాంత
ర్జ్యోతిప్రకాశం పరమాదిమూలం
తేజోమయం జన్మజరావిహీనం
శ్రీరాఘవం నిత్యమహం నమామి.
తెలుగు అనువాద పద్యము:
మ:అమలాత్ముల్ మదిగాంచ నెంచిన సహస్రాబజంబునన్
గర్ణిక
 స్థిమితజ్యోతి విభాసితుండు జనివార్దక్యాదిహీనుండు కాం
తిమయుండున్ బరమాదిమూలము శ్రితార్తిఘ్నుండు శ్రీజానకీ
రమణీ యానన పద్మపద్మ సఖుడౌ రాముండు నన్ బ్రోవుతన్.
భావము:సహస్రారపద్మము యొక్క కర్ణికామధ్యమందు తేజోరూపుడైనట్టి యుత్కృష్టుడైనట్టి కారణమునకు కారణమైనట్టి తేజస్స్వరూపుడైనట్టి జన్మము ముదిమి లేనట్టి నిత్యుడైన రాముని నేను నమస్కరించుచున్నాను.
105శ్లో:సకలభువనరత్నం సచ్చిదానందరత్నం
      సకల హృదయరత్నం సూర్యబింబాంత రత్నం
     విమల సుకృతరత్నం వేదవేదాంతరత్నం
 పురహరజపరత్నం పాతుమాం రామరత్నం
ఇక్ష్వాకు వంశార్ణవజాత రత్నం
సీతాంగనాయౌవన భాగ్యరత్నం
వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం
శ్రీరామరత్నం శిరసా నమామి.
తెలుగు అనువాద పద్యము:
చ:శ్లో:భువన పవిత్రరత్నమును భూసుత యౌవన భాగ్యరత్నమున్
రవిఘనబింబ మధ్యగత రత్నము సర్వహృదిస్థ రత్నమున్
భవనుత రత్నమున్ నిగమభాసిత రత్నమమేయ రత్నమున్
బ్రవిమల పుణ్యరత్న మినవంశజ రత్నము నన్ను బ్రోవుతన్.
భావము:సమస్త లోకశ్రేష్ఠుడైనట్టి సత్యజ్ఞానానంద శ్రేష్ఠుడైనట్టి యెల్లవారి హృదయములందు రత్నదీపమైనట్టి  సూర్యబింబమధ్యమందు రత్నమువలె వెలుగుచున్నట్టి నిర్మల పుణ్యములలో శ్రేష్ఠుడైనట్టి వేదవేదాంతములకు రత్నమైనట్టి యీశ్వరుని జపమునకు రత్నమైనట్టి శ్రీరామరత్నము నన్ను రక్షించుగాక.ఇక్ష్వాకు వంశమనెడి సముద్రమందు పుట్టిన రత్నమైనట్టి సీతయొక్క పిన్న వయస్సను భాగ్యమునకు రత్నమైనట్టి వైకుంఠమునకు రత్నమైనట్టి నాభాగ్యమునకు రత్నమైనట్టి శ్రీరామరూపమైన రత్నమును శిరస్సుచేత నమస్కరించుచున్నాను.
106.శ్లో:నిగమ శిశిరరత్నం నిర్మలానందరత్నం
      నిరుపమ గుణరత్నం నాదనాదాంతరత్నం
      దశరథకులరత్నం ద్వాదశాంతస్థ రత్నం
     పశుపతిజపరత్నం పాతుమాం రామరత్నమ్.
   శతమఖనుతరత్నం షోడశాంతస్థరత్నం
    మునిజన జపరత్నం ముఖ్య వైకుంఠ రత్నమ్
   నిరుపమ గుణరత్నంనీరజాంతస్థరత్నం
 పరమ పదవి రత్నంపాతుమాం రామరత్నమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:విమలానందము నిస్సమాన గుణమున్ వేదాంత వాసంబు స
త్కమలాస్థము మోక్షదంబు మునివర్గ స్థాణు జప్యంబు స
త్యము నాదాంతము షోడశాంతగతమున్ దద్ద్వాదశాంతస్థ ర
త్నము విష్ణుస్తుత రామరత్నము నితాంత ప్రేమ నన్ బ్రోవుతన్.
భావము:వేదములకు చల్లని రత్నమైనట్టి స్వచ్ఛమైన యానందము చేత శ్రేష్ఠమైనట్టి సామ్యము లేని గుణములనెడు రత్నములుగలిగినట్టి ప్రణవపాదమధ్యమందు రత్నమైనట్టి దశరథ వంశశ్రేష్ఠుడైనట్టి యీశ్వరుని జపమునకు రత్నమైనట్టి రాముడను రత్నము నను రక్షించు గాక.ఇంద్రునిచేస్తొత్రము
చేయబడువారిలో శ్రేష్ఠుడైనట్టి షోడశదళ  పద్మమందు రత్నమైనట్టి మునుల జపమునకు రత్నమైనట్టి వైకుంఠమందు ముఖ్య రత్నమైనట్టి సామ్యములేని రత్నములవంటి గుణములు కలిగినట్టి హృత్పద్మమందలి రత్నమైనట్టి ఉత్కృష్టపదవియందు రత్నమైన రత్నము వంటి రాముడు నన్ను రక్షించుగాక.
107.శ్లో:సకల సుకృత రత్నం సత్యవాక్యార్థ రత్నం
శమదమ గుణరత్నం శాశ్వతానంద రత్నమ్
ప్రణయ నిలయ రత్నం ప్రస్ఫుట ద్యోతిరత్నం
పరమపదవిరత్నం పాతుమాం రామరత్నమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:సుకృతస్థానము సత్యమున్ బరమునన్ జ్యోతిస్వరూపంబు తా
రక నామంబపవర్గదంబు పరమబ్రహ్మంబు నోంకార నా
మక సుస్థానము సద్గుణాకరము శుంభచ్ఛాశ్వతానంద మ
త్యకలంకంబగు రామరత్నము నితాంత ప్రేమ నన్ బ్రోవుతన్.
భావము:సమస్త పుణ్యములు గలవారిలో శ్రేష్ఠుడైనట్టి సత్యం జ్ఞానమిత్యాది వాక్యార్థములో ప్రధానమైనట్టి శమదమాది గుణములనెడు రత్నములు గలిగినట్టి
శాశ్వతమైన యానందము గలవారిలో శ్రేష్ఠుడైనట్టి ప్రేమకు స్థానమైన రత్నమైనట్టి స్ఫుటముగా ప్రకాశించు రత్నమైనట్టి పరమపదవికి రత్నమైన రామరత్నము నన్ను రక్షించుగాక.
108.శ్లో:నిఖిల నిలయ మంత్రం నిత్యతత్త్వాఖ్య మంత్రం
భవకులహర మంత్రం భూమిజా ప్రాణమంత్రమ్
పవనజ నుత మైత్రం పార్వతీమోక్షమంత్రం
పశుపతి నిజ మంత్రం పాతుమాం రామమంత్రమ్.
తెలుగు అనువాద పద్యము:
చ:సకల నివాసమున్ దురితసంఘ వినాశము పార్వతీసతీ
ప్రకటిత మోక్షదాయకము పావనిభావితమున్ విదేహు భూ
పక తనయాసుమంత్రము గపర్ది శుభాస్పదమున్ మునీంద్ర తా
రకమగు రామమంత్రము నిరంతరమున్ మము బ్రోచు గావుతన్.
భావము:సమస్త మంత్రస్థానముగల మంత్రమైనట్టి నిత్యత్త్వమైనట్టి అనగా మోక్షము నిచ్చు మంత్రము,సంసారమును హరించునట్టి సీతకు ప్రాణమైనట్టి ఆంజనేయునిచేత స్తోత్రము చేయబడునట్టి పార్వతికి మోక్షమిచ్చునట్టి యీశ్వరునికి ముఖ్యమైనట్టి రామమంత్రము నన్ను రక్షించుగాక.
109.శ్లో:ప్రణవనిలయమంత్రం ప్రాణి నిర్వాణమంత్రం
      ప్రకృతి పురుషమంత్రం బ్రహ్మ రుద్రేంద్రమంత్రమ్
     ప్రకట దురిత రాగ ద్వేష నిర్ణాశ మంత్రం
       రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రమ్.
శ్లో:దశరథసుత మంత్రం దైత్యసంహారమంత్రం
   విబుధ వినుతమంత్రం విశ్వవిఖ్యాత మంత్రమ్
   మునిగణ నుత మంత్రం ముక్తిమార్గైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:ప్రకటోంకార నివాసమున్ ద్రుహిణ జంభద్వేషి జప్యంబు తా
   రకమున్ మౌని నుతంబు నాజికుల మంత్రంబాసుర ధ్వంసమున్
  సకలార్యావనమున్ జగత్ప్రకటమున్ సన్ముక్తి మార్గంబు మా
   మక షడ్వర్గహరంబు రామవిలసన్మంత్రంబు నన్ బ్రోవుతన్.
భావము:ఓంకారస్థానమైనట్టి ప్రాణములకు మోక్షమిచ్చునట్టి బ్రకృతి పురుషుల రూపమైనట్టి బ్రహ్మరుద్రేంద్రులకు జపించదగినట్టి అతిశయమైన పాపములను రాగద్వేషములను నశింప చేయునట్టి రామ రామ యను మంత్రము శ్రీరామమూర్తి యొక్క ముఖ్యమంత్రము.దశరథపుత్రుడైన రాముని మంత్రమైనట్టి రాక్షసులను సంహరించునట్టి దేవతలచే స్తోత్రము చేయబడినట్టి లోకమున ప్రసిద్ధమైనట్టి మునిసముదాయముచే స్తోత్రము చేయబడినట్టి మోక్షమార్గమునకు ముఖ్యమైనట్టి రామరామ యను మంత్రము రాముని ముఖ్య మంత్రము.
111.శ్లో:సంసారసాగర భయాపహ విశ్వమంత్రం
      సాక్షాన్ముముక్షు జనసేవిత సిద్ధమంత్రమ్
      సారంగహస్తముఖ హస్తనివాసమంత్రం
       కైవల్యమంత్ర మనిశం భజ రామమంత్రమ్.
శ్లో:జయతు జయతు మంత్రం జన్మ సాఫల్యమంత్రం
   జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రమ్
  సకల నిగమ మంత్రం సర్వశాస్రైక మంత్రం
 రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్
తెలుగు అనువాద పద్యము:
మ:తత సంసార సముద్భవ ప్రబల సంతాప హారంబు సం
    తత సారంగధరాస్య హస్త విలసద్ధామంబు వేదాంత స
    న్నుతమున్ జన్మజరాంత దుఃఖహరమున్ మోక్షాస్పదంబున్ సమా
     శ్రిత సాఫల్యము రామమంత్రము మదిన్ జింతింతు నశ్రాంతమున్.
భావము:సంసార సముద్రము వలన భయమును పోగొట్టు సమస్త మంత్రరూపమైనట్టి మోక్షము నిచ్ఛయించు జనులచేత సేవింపబడు సిద్ధమంత్రమైనట్టి ఈశ్వరుడు మొదలగువారి హస్తముల యందు నివాసముగల మంత్రమైనట్టి మోక్షమంత్రమైన రామమంత్రము నెల్లపుడు సేవింపుము.జన్మసాఫల్యమును చేయునట్టి జన్మము మరణము మొదలగు భేదములుగల కష్టములను గొట్టివేయునట్టి  జన్మము మరణము మొదలగు భేదములుగల కష్టములను గొట్టివేయునట్టి సర్వవేదములలో ప్రధానమంత్రమైనట్టి సర్వశాస్త్రములలో ముఖ్యమైనట్టి రామరామ అనునట్టి రాముని ప్రధాఙ మంత్రము సర్వోత్కృష్టమై యుండుగాక.
112.శ్లో:అజ్ఞాన సంభవ భవాంబుధి బడబాగ్ని
         రవ్యక్త తత్త్వ నికర ప్రణవాధిరూఢః
         సీతాసమేత మనుజేన హృదంతరాళే
        ప్రాణ ప్రయాణ సమయే మమ సన్నిధత్తే
తెలుగు అనువాద పద్యము:
మ:ప్రకట జ్ఞాన భవాంబురాశి బడబప్రాయంబభివ్యక్త మ
త్యకలంకంబు సలక్షణం బవనీజాతయుక్త మవ్యక్తమున్
సకలవ్యాపకమున్ మహాప్ణవ సుస్థానంబు రామాఖ్య తా
రకమున్ మామకదృషటిగోచర మగున్ బ్రాణ ప్రయాణంబునన్.
.
భావము:అజ్ఞానము వలన పుట్టిన సంసారసముద్రమునకు బడబాగ్నియైనట్టి స్ఫుటము గాని తత్త్వముల సముదాయముగల ప్రణవము నధిష్ఠించిన్నట్టి శ్రీరామమూర్తి నాప్రాణములు పోవుసమయమందు సీతాలక్ష్మణ సమేతుండై నాహృదయమందు సన్నిహితుడై యుండుగాక.
మ:శివసామ్యుండగు నాదిశంకరులు మున్ శ్రీరామకర్ణామృతం
    బవనిన్ సంస్కృతమేర్పరించె నది మోక్షాపేక్ష చేకూరు వం
  వరాబ్ధీందు ప్రసిద్ధసిద్ధకవి నే శ్రద్ధన్ దెనింగించి రా
 ఘవ పూదండగ నిచ్చినాడ గొనుమాకల్పంబుగా సత్కృపన్.
మాలిని:హరిపదయుగధారిఈ యార్యచిత్తానుసారీ
            పరమపదవిహారీ భక్త లోకోపకారీ
            శరధి శరధిమిత్రా శత్రుసంఘాత జైత్రా
            సరసిజ దళ నేత్రా సన్ముని స్తోత్రపాత్రా.
మ:ఇది శ్రీరామ పదారవింద మకరందేచ్ఛాత్ము సన్మత్త ష
     ట్పద విజ్ఞాన పదాబ్జరేణు పటల ప్రాప్తోత్తమాంగోల్ల స
       న్ముదితాంతఃకరణుండు సిద్ధకవి మాన్యుండైన రామావనీ
       శ దయాలోకన జెప్పె రెండవది యాశ్వాసం బభీష్టాప్తికిన్.
     
      శ్రీరామకర్ణామృతంలోని ద్వితీయాశ్వాసము సంపూర్ణం.

No comments:

Post a Comment

Pages