తొలికలవరం - అచ్చంగా తెలుగు
తొలికలవరం
పెమ్మరాజు అశ్విని 

తెల్లవారి ఆరు గంటలు కావొస్తోంది ,గోదావరి ఎక్స్ప్రెస్ నాంపల్లి స్టేషన్ కి చేరుకుంటోంది,గబగబా తమ సామాను మొత్తం బోగి తలుపు దగ్గరికి చేరుస్తున్నారు స్రవంతి మరియు సీత,శరత్ .రోజ్ కలర్ చుడిదార్ లో రెండు జడలతో కలువలాంటి కళ్ళు,సొగసైన రూపం తో అప్పుడే విచ్చిన గులాబీ లాగా ఉంది 18 ఏళ్ల స్రవంతి ,డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు,  రాసి సెలవుల్లో తన మేనమామ ఇంటికి తల్లి సీత తమ్ముడు శరత్ తో వచ్చింది.స్రవంతి వాళ్ళ నాన్న గారికి సెలవు కుదరక పిల్లలకి తల్లి ని తొడిచ్చి పంపి తన బావమరిది రాఘవ కి ఫోన్ చేసి వారికి హైదరాబాద్ లో ఆన్నీ చూపించమని అడిగారు ,సహజంగా చెల్లాయి మేన కోడలు అల్లుడు అంటే చాలా ఆప్యాయత రాఘవ దంపతుల కి.
          అందు నా మొదటి సారి వారు హైదరాబాద్ వచ్చాక వస్తున్నారు దాంతో వాళ్ళు బోలెడు ప్లాన్స్ వేసేసారు .ఆ రోజు పొద్దున్నే రాఘవ తన చెల్లాయి ని పిల్లల్ని తీస్కువచ్చేకి స్టేషన్ కి వచ్చాడు. స్రవంతి శరత్ ఇద్దరు వాళ్ళ మావయ్య ను చూసి ఉత్సాహం గా ఒక్క కేక పెట్టారు,వాళ్ళు చిన్నప్పటి నుంచి మేనమామ కి చేరిక .రాఘవ కూడా పిల్లలతో సమానంగా అల్లరి చేస్తాడు,స్టేషన్ నుంచి క్యాబ్ లో ఇంటికి చేరారు,కే పి హ్ బి కాలనీ లో ఒక మ్ ఐ జి లో వుంటారు రాఘవ వాళ్లు.కాఫీ టిఫిన్ లు అయ్యాక రాఘవ భార్య వసుంధర అన్నది “ఒదిన గారు ఇవాళ్టికి మీరు పిల్లలు విశ్రాంతి తీసుకోండి ,రేపు  మనం హైదరాబాద్ లోకల్ గా ఉన్నవి చూద్దాం,తర్వాత రెండు రోజులు హైదరాబాద్ చుట్టు పక్కల వుండే ప్రదేశాలు చూద్దాం” అంటూ ప్రోగ్రాం చెప్పింది.
         సీత పిల్లలు,అలాగే రాఘవ పిల్లలు చక్కగా కలిసిపోతారు,అందరి లో కి స్రవంతి పెద్దది . అవడానికి 18 ఏళ్ల పిల్ల అయినా స్రవంతి చదువు తో పాటు ఇంటి పనులలో చురుకు గా వుంటుంది, స్రవంతి ని చూసి తెగ ముచ్చట పడేవారు వసుంధర వాళ్ళ అమ్మ గారు కామాక్షి గారు. వసుంధర ఇంటి దగ్గర కాలేజీ లో లెక్చరర్ గా పనిచేసేది,తన అన్నగారు ఉద్యోగ రీత్యా ఉత్తర భారతం లో ఉండడం తో కామాక్షి గారి ఆరోగ్య రీత్యా తనని వసుంధర ఇంట్లో ఉంచారు.
        ఇంత లో ఇంటి ముందు ఆటో ఆగింది  వసుంధర పెద్దఅక్క కొడుకు కిషోర్ వచ్చాడు ,అతడ్ని చూస్తూనే “ఒరేయ్ కిషోర్ ఏమిటీ వింత రాజమండ్రి వదిలి నువ్విలా ఊడి పడ్డవేంటి రా”అంటూ ఆప్యాయంగా అల్లరి పట్టించింది వసుందర. ఇక్కడ వచ్చే వారం కొన్ని ఇంటర్వ్యూ లు ఉన్నాయి ,అందుకే ముందుగా వచ్చాను అన్నాడు కిషోర్. ఏదైతే నేమి నువ్వొచ్చావ్ నాకు భలే ఆనందం గా ఉంది రా లోపలికి అంటూ లోపలికి నడిచింది.వసుంధర వెంట లోపలికి వస్తూ ముద్దబంతి లా ఉన్న స్రవంతి ని చూసి ఒక్కసారిగా అలాగే ఉండిపోయాడు.
       “ఒరేయ్ కిషోర్ తను నా ఆడబిడ్డ కూతురు స్రవంతి వైజాగ్ లో డిగ్రీ చదువుతోంది”అని స్రవంతి వైపు చూసి “వీడు కిషోర్ నా అక్క కొడుకు రాజమండ్రి లో ఉంటాడు కాకినాడ లో ఇంజినీరింగ్ చేసాడు ,ఇప్పుడు జాబ్ ట్రయల్స్ లో వున్నాడు”. స్రవంతి వెంటనే పలకరింపు గా ఒక చిరునవ్వు విసిరింది,ఆ కొంటె చూపుకి చిరునవ్వుకి కిషోర్ కి ఒక్క క్షణం కలవరపాటు కలిగింది.
          ఇంజినీరింగ్ కాలేజీ లో తనకి చాలా మంది అమ్మాయిలు స్నేహితులు గా వున్నారు ,కానీ ఎవర్ని చూసినప్పుడు ఈ కలవరపాటు లేదు.ఈ భావన కొత్తగా హాయిగా ఉంది కిషోర్ కి,కానీ స్రవంతి ఇల్లంతా మిగతా పిల్లల తో గలగల తిరుగుతూ ఆడిస్తోంది. స్రవంతి తమ్ముడు ,రాఘవ పిల్లలు శరణ్య కార్తీక్ లు ఏడు ఎనిమిది క్లాసులో వున్నారు. తనకి ఇంకోసారి స్రవంతి ని చూడాలని మాట్లాడాలని ఆరాటం పెరిగింది .కానీ సందర్భం ఎలా కల్పించాలో తెలియట్లేదు.
          ఇలా తర్జనభర్జనలు పడుతున్నాడు కిషోర్ ఈలోపు వసుంధర “కిషోర్ మేము ఈ వారం హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని చూసేకి ప్లాన్ వేశాం నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మాతో రారా” అంది వసుంధర .కిషోర్ మనసులో ఎగిరి గెంతేశాడు బయటకు అలాగే పిన్ని నాకు హైదరాబాద్ కొత్త కదా ,వస్తాను అని చెప్పేసి తప్పకున్నాడు.
       మర్నాడు ఎలాగయినా స్రవంతి తోఎలా  మాట కలపాలి అని ఆలోచిస్తున్నాడు కిషోర్.ఇంతలో కార్తిక్ వచ్చి అన్నా రేపు మనం టవేర లో వెళతాం కదా పిల్లలందరం వెనకాల సీట్ లో కూర్చుని అల్లరి చేద్దాం అన్నాడు. ఇదే అదను గా కిషోర్ అలాగే రా అంటూ కార్తిక్ తో కలిసి బజార్ లో కి వెళ్ళాడు . 
          మర్నాడు పొద్దున్నే ఆరు గంటలకు ప్రయాణం అనడం తో అందరూ గబగబా తయారు అవుతున్నారు,కిషోర్ కూడా హీరో లాగా స్టైల్ గా తయారయ్యాడు .ఆరడుగుల ఎత్తు తగ్గ శరీర తీరు తో చక్కటి ముఖ కవళికలు నూనూగు మీసకట్టు చక్కటి హెయిర్ స్టైల్ తో కిషోర్ సహజంగా అందగాడు, అందులోనూ స్రవంతి తలపులతో ఇంకాస్త అందంగా కనిపిస్తున్నాడు.
     ఇంతలో బ్రౌన్ కలర్ లాంగ్ స్కర్ట్ మీద క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ చేసిన టాప్ తో వదులుగా జుట్టు ని ఫ్రెంచ్ నాట్ వేసి చక్కగా మ్యాచింగ్ గాజులు జుంకీలు పెట్టుకుంది . ఆ డ్రెస్ లో స్రవంతి సంపంగి పువ్వు లాగా ముద్దు గా ఉంది,కిషోర్ చూపులతో నే బాణాలు వేయడం స్రవంతి దృష్టి లో పడకపోలేదు,అతని చూపుల బాణాలకి స్రవంతి చెంపలు ఎరుపెక్కాయి.
            మొత్తానికి ఎలాగైతే ఏడు గంటలకి ఇంటిల్ల పాది క్యాబ్ ఎక్కారు. మొదట గోల్కొండ ఆ పై సాలార్ జంగ్ మ్యూజియం ,ఆ తరువాత మిగతా ప్రదేశాలు చూడడం ఆ రోజు కి ప్లాన్.ముందుగా అనుకున్నట్లుగా పిల్లలు వెనక సీట్లు లో కూర్చున్నారు .ఎక్కడం తోనే కార్తిక్ శరత్ శరణ్య అంత్యాక్షరి ఆడదాం అని పేచీ పెట్టారు,స్రవంతి ని పాడమని అందరూ అడిగారు “ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో”అంటూ పాడుతుంటే ఈమె రూపమే కాదు కంఠస్వరం కూడా అద్భుతమ్ అనుకున్నాడు కిషోర్, తన చుట్టూ వున్న వారిని మరచి ఆమెని చూస్తూ ఉండిపోయాడు,పాట అవ్వగానే మీ పాట అద్భుతం అంటూ ప్రశంసల జల్లుకురిపించాడు . 
       అలా ఆట సాగుతున్నంత సేపు స్రవంతి తో మాట కలిపే మొదటి అడుగులు వేసాడు ,చివరికి గోల్కొండ చేరాక ఇద్దరు ఇంచుమించు ఒకే ఈడు వారు కావడం తో త్వరగా కలిసిపోయారు కబుర్లలో పడిపోయారు.
       వారిద్దరూ వాళ్ళ చదువు కాలేజీ కబుర్లు కెరీర్ ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటున్నారు ,మాటల మధ్యలో గోల్కొండ  అంతా కలతిరిగారు. స్రవంతి తాను బీకాం చదువుతున్నాని తర్వాత సివిల్స్ కి ప్రిపేర్ కావాలని ,చెప్పింది.తన గురించి అడిగింది గేట్,క్యాట్ రాయడం లేదా అని అడిగి క్యాట్ పాటర్న్ గురించి తనకి తెలిసిన విషయాలు చెప్పింది. “మీ ఇంజినీరింగ్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతోంది అని చెప్పారు మరి కెరీర్ ప్లానింగ్ లో ఎందుకు లేట్ అయింది”.ఇంతలో పెద్దవాళ్ళు పిలవడం తో మళ్ళీ క్యాబ్ ఎక్కారు.
        అప్పటి వరకు తాను ఇంజనీరింగ్ అని చిన్న గర్వం ఉన్న కిషోర్ కి కొంచెం గర్వభంగం అయినట్టైంది.ఈలోపు వారందరు సాలార్ జంగ్ మ్యూజియం చేరుకున్నారు. స్రవంతి కెరీర్ గురించి మాట్లాడితే కొంచెం నొచ్చుకున్నా ఇంతలో తన స్నేహపూర్వక మాట చిలిపి నవ్వు కొంటె చూపు కెకిషోర్ ని నిలవనివట్లేదు.తన నుంచి కొద్దిపాటి దూరాన్ని కూడా సహించలేకపోతున్నాడు.
             అలాగని పెద్దల ఎదుట చొరవ చేయలేడు, అక్కడి చూపుల్తో కొన్ని పాటలతో పాపం  ప్రయత్నిస్తున్నాడు.కొంచెం మ్యూజియం లో కిషోర్ కి అవకాశం చిక్కింది లైన్ లో వెళ్తూ స్రవంతి వెనుకగా నెమ్మదిగా నువ్వంటే నా కిష్టం అంటూ తనకు మాత్రమే వినపడేలా చెప్పాడు. స్రవంతి విని కూడా విననట్టు ఉండిపోయింది
         ఈ పరిణామము మంచిదా కాదా తేలలేదు కిషోర్ కి,వారందరు అటునుంచి బిర్లా మందిర్ ,పబ్లిక్ గార్డెన్స్ చూసి సుమారు ఎనిమిది కి ఇంటికి చేరారు.అందరూ అలసి పోయారు,కామాక్షి గారు పిల్లలు మీరు స్నానాలు చేసి వచ్చే లోపు వండి వారుస్తాను అంటూ వంట గది వైపు నడిచారు,అంత అలసినా పెద్దావిడ లో ని తల్లి మనసు పిల్లల ఆకలి ని ముందే పసిగట్టారు. వసుంధర, సీత,స్రవంతి తలో పని అందుకున్నారు ఒకరు కూర తరిగిస్తే ఇంకొకరు కుక్కర్ పెట్టారు .
     కుక్కర్ పూర్తయి బెండకాయ కూర కొబ్బరి పచ్చడి చేసి చారు పెట్టారు హమ్మయ్య ఇక స్నానం చేద్దాం అనుకుంటుంటే కరెంటు పోయింది ,చీకటి లో కోవత్తి వెలిగించి అందరూ స్నానాలు కనిచ్చారు.ఇంట్లో అందరూ ఎవరి పనిలో వారుంటే స్రవంతి ఫిల్టర్ దగ్గర నీళ్లు పడుతోంది ,ఎదో నీళ్ళు కోసం వంటింట్లోకి వచ్చి కిషోర్ ఆమె చెవి దగ్గర కొచ్చి మెత్తగా ఐ లవ్ యూ అని గొణిగాడు.
         స్రవంతి కి ఒక్కసారి షాక్ తగిలినట్టు స్తంభించి పోయింది,ఎదో తమాషా గా వెంటపడుతున్నాడు అనుకుంది.ఇంత ధైర్యంగా ఐ లవ్ యూ చెప్తాడు అనుకోలేదు.ఎంతైనా ఆడపిల్ల కదా సిగ్గు తో మొహం కంద గడ్డ లాగా మారింది,తన గుండె చప్పుడు తనకే కొత్తగా వినిపిస్తోంది,పెదాలు అదురు తున్నాయ్.అదృష్టవశాత్తూ కరెంట్ లేదు గనుక తన లో ఈ మార్పు ఎవరి కంట పడలేదు.ఇహ అక్కడి నుండి తాను కిషోర్ చూపుకి దొరకకుండా తప్పించుకు తిరిగసాగింది.
      కిషోర్ అయోమయంలో పడి పోయాడు, గట్టిగా అరిచి అల్లరి చేయలేదు అలా అని తన ప్రేమ ని ఒప్పుకున్నట్టు చెప్పలేదు. ఆ రాత్రి అతనికి కంటి మీద కునుకు లేదు,మర్నాడు అందరి కంటే ముందే కామాక్షి వసుంధరా సీత లేచి పులిహోర పెరుగు అన్నం పచ్చడి అన్ని సర్ది పిల్లల్ని లేపి తయారు చేసి మొత్తానికి అందరూ కలిసి యాదగిరిగుట్ట కి బయల్దేరారు.
         ఆ రోజు స్రవంతి పసుపు పచ్చ లంగా మీద ఆకుపచ్చ ని జాకెట్టు ,వోణి వేసుకుని చెవులకి బుట్టలు చేతికి గాజులతో ముద్దుగా చిలక లాగా ముస్తాబు అయింది.కామాక్షి గారు ఈ పిల్లకి నా దిష్టి తగులుతుంది అంటూ మెటికలు విరిచి ముద్దు చేశారు స్రవంతి ని. 
        నిజం చెప్పొద్దూ ఒక్క క్షణం కిషోర్ కి అమ్మమ్మ అంటే ఈర్ష్య పుట్టింది ,తను అలా చేయలేకపోయానే అని.ఇక ఏమైతే గాని అని తెగించి గుడి దగ్గర తనని పక్కకి తీస్కెళ్ళి అడగాలని నిర్ణయించుకున్నాడు.గుళ్లో దర్శనం అయ్యాక స్రవంతి చొరవ గా మావయ్య మీరు ఇక్కడ కూర్చోండి మేము పిల్లలం వెళ్లి ప్రసాదం పట్టుకోస్తాం అలాగే ఫొటోస్ తీసుకుంటాం ,అని చెప్పింది .సరే అని అందరు కూర్చున్నారు,పిల్లలతో పాటు స్రవంతి కిషోర్ వెళ్లారు అందరూ కలిసి సెల్ఫీలు తీసుకున్నారు ,ఇక ఎవరి కి వారు విడిగా ఫోటోలు మొదలు పెట్టారు.
     ఇంతలో స్రవంతి “ కిషోర్ మనం అక్కడ ఫోటో తీసుకుందాం రండి”,అని దూరం గా తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక కిషోర్ మీరు నిన్న చెప్పింది నాకు అర్ధమైంది అయితే నాకు జీవితం లో కొన్ని ఆశయాలు ఉన్నాయి ఐ ఏ యెస్ కావాలని దానికి ప్రయత్నం చేస్తున్నాను,అలాగే నా జీవిత భాగస్వామి ఉన్నతమైన కెరీర్ అలాగే మంచి దృక్పధం ఉన్నవారు కావాలని ఆశ పడుతున్న”. “మరి మీరు కెరీర్ పట్ల ఎలాంటి ఆశయం ఉన్నట్టు నాకు అనిపించలేదు,నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి మీ కెరీర్ ని మీరు మలుచుకునే తీరు మీద నా సమాధానం ఆధారపడుతుంది. ప్రేమ అంటే వ్యాపారం కాదు అనే సినిమా డైలాగ్స్ వినడానికి మాత్రమే బాగుంటాయి”.అని  తన పట్ల ఆరాధన గా చూస్తున్న కిషోర్ వైపు చూసింది.
        కిషోర్ కాసేపటికి నెమ్మదిగా ఇలా అన్నాడు “నిన్ను చూడగానే నేను తొలికలవరానికి లోనయ్యాను, నేను మొదట ఇది ఆకర్షణే అనుకున్నా కానీ నిన్నటి నుంచి నిన్ను గమినిస్తున్నా నీ అందం కన్నా నీ వ్యక్తిత్వమే నన్ను నీ వైపు నడిపింది,నాకు గేట్ ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్ వచ్చింది ఐఐటీ ముంబై లో సీట్ వచ్చింది . కాకపోతే నాలోని లవర్ బాయ్ నిన్ను కాసేపు ఆటపట్టించాడు అంతే,ఇప్పుడు చెప్పండి మేడం గారు అంటూ స్రవంతి కి కన్ను గిటాడు.”ఇప్పుడు కలవరపాటు స్రవంతి వంతైంది.
        వారిద్దరూ వారి ప్రేమ ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పారు, కామాక్షి గారి ఆనందానికి హద్దులు లేవు,అయితే పెద్దలు అందరూ వీరు అనుకున్న చదువు పూర్తయకే పెళ్లి అని ఆంక్ష తో కూడిన ఆకాంక్ష ను వెలిబుచ్చారు. మూడు సంవత్సరాలు లో కిషోర్ ఎంటెక్ చేసి మంచి ఉద్యోగం లో స్థిరపడ్డాడు, ఈలోగా సివిల్స్ లో ఐ ఆర్ యెస్ పోస్ట్ కొట్టింది స్రవంతి. ఇహ అక్కడితో స్రవంతి కిషోర్ ల ప్రేమ పెళ్లిపీటలు ఎక్కింది.
                                పెమ్మరాజు అశ్విని

No comments:

Post a Comment

Pages