దేవీ దశమహావిద్యలు - 2
శ్రీరామభట్ల ఆదిత్య
2. తారా దేవి
తారా దేవీ దశ మహా విద్యలలో రెండవ మహావిద్య. తారామాత స్వరూపం అచ్చం కాళీ మాత లాగానే ఉంటుంది. కానీ కాళీ మాత నలుపు రంగులో ఉంటే తారామాత నీలం రంగులో ఉంటుంది. తారామాత రూపం భయంకరంగా ఉన్నా అమె కారుణ్యమూర్తి.
తరింపజేయు శక్తి తార. కష్టాలు,బాధలు, అజ్ఞానం, పేదరికం, ఆపదలు, భయాలు, తెలివితక్కువ తనం ఇత్యాది ఎటువంటి కష్టం నుంచి అయినా తరింపచేయగల శక్తి స్వరూపిణి తారాదేవి. ముఖ్యంగా ఈ దేవి కృపవల్ల కవిత్వశక్తి, ధారణా శక్తి, జ్ఞాన శక్తి కలుగుతాయి. తరింపచేయడమే తార తత్వం. తారని ఉగ్రతారగా, ఏకజటగా పిలుస్తూ తంత్రంలో కూడా ఉపాసిస్తారు.
తారామాత పుట్టుక గురించి తంత్రంలో ఓ కథ బాగా ప్రచారంలో ఉంది. క్షీరసాగరాన్ని చిలుకుతున్నప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని లోకరక్షణకై లోకనాయకుడైన పరమేశ్వరుడు స్వీకరించాడు. కానీ దాని ప్రభావం నుండి పరమేశ్వరుణ్ణి తప్పించడానికి ఆ జగన్మాత శ్రీ తారాదేవి రూపంలో ప్రత్యక్షమై ఆయనకు తన చనుబాలనిచ్చి ఆ విష ప్రభావాన్ని తగ్గించింది.
బౌద్ధంలో ఈ మాత పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా తాంత్రిక బౌద్ధంలో తారామాత యొక్క ఉపాసనకు చాలా విశిష్టత ఉంది. బౌద్ధంలో ఈ దేవికి సంబంధించిన మంత్రాలన్ని పాళీ భాషలో ఉన్నాయి. టిబెట్, చైనా, థాయిల్యాండ్, జపాన్, మంగొలియా దేశాల్లో ఈ దేవి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ దేవికే 'నీల సరస్వతి' అనే పేరు కూడా ఉంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తారాపీఠ్ గ్రామంలో శ్రీ తారాదేవి యొక్క ఆలయం వున్నది.
No comments:
Post a Comment